ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి సమరం చేసె ఆకాశం!

నేనొకపరి తలపైకెత్తి చూపులు నిలిపితే దిగంతాల పర్యంతం ఆకాశం
తనొకతే పరుచుకుని పరవశిస్తున్న ఆ పోకడ ఎటులచేయను పరిచయం
ఆకాశం ఎంత విశాలమో ఆమె మనసంత ఉదారం
అవనిపట్ల ఆమె చూపు ఆదరణ ఎంత అనంతం?

దప్పిగొన్నదో, ఆర్తిచెందునో పుడమికెపుడూ పుట్టెడు శోకం
తపనతీరగ వాగులై, వంకలై, నదులుగా ఆమె కన్నీరే తనువంతా
బీటపడే గుండెల్లో అగ్నిగోళాలుంటాయో, ఎగిసిపడే కళ్ళు లావాలై పారుతాయో,
చెప్పలేని బాధలొకపరి ఉప్పెనై పోటెత్తునో, వ్యధలు సుడిగాలై చెలరేగునో
ఆ ఎత్తున వుంది కనుక ఆకసానికి మాత్రమే అన్ని గోచరమౌతాయేమో?

సమరం కావించినట్లే అవని భారం తన మీద వేసుకుంటుంది
మబ్బుతల్లి నీటి బిడ్డలు ఒకటొకటి సైనికులై వరసలు కడతాయి
ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి కెంపురంగులద్దుకుని
ఆకసం అడుగిడదా అంబరమంత విజయసంబరం అందుకోను?

జల్లుజల్లుగ, పరవళ్ళుగా, వురవళ్ళుగా పుడమినంత తడిమి తడిమి
తన తనువంతా చల్లబరిచి, తపనతీర్చి, తాపమణిచి స్తబ్దమౌనా సైన్యం.
వుల్లము ఝల్లన వెల్లువ పొంగగ అవని తిరిగి నవ్వగా, గిరులు తరులు మెరవగా,
తన మనసంతా నిండునేమో వన్నెలు చిమ్ముతూ తాను నవ్వేస్తుంది ఆకాశం.
మునుపొకపరి వేరేతోచిన తానే పరి పరి విధముల నను ముగ్ధని చేయునే ఇలా!

9 comments:

 1. "వురుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి " - అధ్భుతమైన ప్రయోగం
  మబ్బు తల్లి నీటి బిడ్డలే కాదు మాట వినకపోతే బ్రహ్మాస్త్రమంటి పిడుగు బాంబులు కూడా ఉన్నాయి

  ReplyDelete
 2. ఉష గారు.. మీ హోం గ్రౌండ్లో ఆట అదర గొట్టారు.. చాలా బాగుంది.

  ReplyDelete
 3. అ౦దమైన అతివయనీ, అ౦దరాని అ౦దమనీ
  వ౦దలాది వర్ణనలతో అ౦దలాన్ని ఎక్కి౦చావని
  అ౦దుకోవె నా మురిపెము, ఇ౦ద నీకే నా చిరునవ్వని
  అ౦త ప్రేమతో అప్పుడు పలకరిస్తే, అ౦తకాలమా సమాధానానికి?

  ఇద౦డీ ఉషగారూ, మీ అ౦దాల ఆకాశ౦ పరిస్థితి ఇప్పుడు. ఒకప్పుడు మీవైపు చూసి చిరునవ్వు చి౦ది౦చిన ఆకాశ౦, మీ ఆలశ్శ్యానికి బు౦గమూతి పెట్టి౦ది. ఈ కవిత సరిపోదూ, మరొకొన్ని రకాలుగా బ్రతిమలాడుకొమ్మ౦టో౦ది. నమ్మరా, మళ్ళీ చూడ౦డి, తన బు౦గమూతిని మీరు చూస్తారని ఎలా మూతివిరుస్తో౦దో! మీరు పట్టుకోవాలని ఎలా గడ్డ౦ అ౦దిస్తో౦దో!!

  The last stanza sounds as powerful and mind blowing as the thunders in the sky. I loved it explicitly.

  ReplyDelete
 4. మీ కవితాకౌగిలిలో నిజంగా ముగ్దుడనయ్యాను.ఊహాతీరం, కలల ఆకాశం కళ్ళుమూసుకుంటే మౌనంగా మనోహరంగా అనిపించింది కనిపించింది. మీ ప్రయత్నంవెనుకనున్న ఆలోచనలు ఆకట్టుకున్నాయి.చాలా బాగుంది ఉష గారు.

  ReplyDelete
 5. ప్రదీప్, ప్రయోగం నచ్చినందుకు సంతోషం. మీరిస్తే ఆ తీరు వేరు, మీ విస్లేషణ కోసం చూడటం అలవాటైపోయింది. ఇక మీరన్నిది నిజమే, కానీ సౌమ్యురాలను కనుక పిడుగుల వరకు పోలేదు. ఇది శాంతియుత యజ్ఞం.

  ఆత్రేయ గారు, హతోస్మి, మీరూ క్రికెట్ వీరులో వీరాభిమానులోనన్న మాట. విభిన్నమైన వ్యాఖ్యకి సంతోషం.

  ఆనంద్, మీకేమని కృతజ్ఞత తెలుపను. మీదైన బాణిలో నన్ను అభిమానంలో ముంచేసారు. మీ మొదటి పంక్తి "అ౦దమైన లోకమనీ రంగురంగులుంటాయనీ" పాటని గుర్తు చేసింది. మీ వ్యాఖ్య మరో కవితగా మీ బ్లాగులోకి రావాలి. ప్రత్నించండి మరి.

  పృధ్వీ, మీ వూహల్లోని ఆ చిత్రం త్వరలో మీ బ్లాగులో రూపు సంతరించుకుంటుందని అభిలషిస్తున్నాను.


  అందరికీ ధన్యవాదాలు. సమయాభావం వలన వెంటనే వ్యాఖ్య పెట్టలేకపోయాను,మన్నించండి.

  ReplyDelete
 6. వజ్రానికి ఏమైనా దుమ్ము పడితే దాన్ని తుడిచే గుడ్డ ఎలాంటిదో అలాంటివే నా విమర్శలూ...విశ్లేషణలు....

  ReplyDelete
 7. మీవి సద్విమర్శలనే కదా నేను మరింత ఆసక్తిగా వాటికొరకు ఎదురుచూసేదీను. ఇకపోతే మీ విశ్లేషణలో అంత పదునుంది కానీ నాకు మిగిలిన పోలికకి సరితూగే అర్హతలేదు సుమీ, అతిరధ మహారధుల ఎదుట ఒక సామాన్యురాలను.

  ReplyDelete
 8. న్యూటన్ ఏనాడో అన్న ఒక మాట నాకు బాగా ఇష్టం " If I have seen further it is only by standing on the shoulders of Giants. "
  మీకు ఆ మాట గుర్తున్నందుకు ముదావహం.

  మీరు సామాన్యులైతే నాలాంటి వారు అతి సామాన్యుల కిందే లెక్క. ఇక ఆపేద్దాం మన పొగడ్తలు. మీ కలం నుంచి జాలువారే మరిన్ని రచనల కోసం ఎదురు చూస్తూ

  ప్రదీప్

  ReplyDelete
 9. Usha garu,

  Here is something waiting for your comment. Hope I made it good enough, even if not as sweet as yours. Have a look!

  http://ayodhya-anand.blogspot.com/2009/04/blog-post_09.html

  ReplyDelete