జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు?

స్వామీ! నీ నిజరూపమేదని అడగలేననా ఇటుల పరీక్షిస్తున్నావు?
ప్రభు! నీ పాదాలచెంతకైనా చేరలేననా వెతల ముంచేస్తున్నావు?
దేవా! నీ నామస్మరణ మరిచాననా మిగుల నేరమెంచుతున్నావు?
తండ్రీ! నీ పావనచరిత పఠించలేదనా కఠిన శిక్షవేసినావు?

నిరాకారా, గుడిలో, శిలలో నీవుండవు నీవున్న నా గుండే నీ గుడన్నాను.
సమవర్తి, కలిమిలో, లేమిలో కలవన్నాను, కలతనిదురనందూ నిన్నేకన్నాను.
మహనీయ, మదిలో, హృదిలో స్మరించాను, మానవతకి నీవేమూలమన్నాను.
భక్తవత్సల, చెలిమిలో, బలిమిలో కాంచాను, జగమంతా నిన్నేదర్శించాను.

కరుణసాగరా, నీముందు ఒక సింధువునైన కాకపోతినే.
సుగుణశీలా, నీనుంచి ఒక దయాదృక్కునైన పొందనైతినే.
ఉత్తమోత్తమా, నీచెంత ఒక యుగముకైన నిలవనైతినే.
మోహనరూపా, నీయందు ఒక నిమిషమైన చూపునాపనైతినే.

నిర్వాణనాథ, కర్మము త్రుంచవా? సహజమార్గము నందు నను నడుపవా?
చిన్మయరూప, ఙానము, యోగము ఇరుకనులుగ నా దృష్టి లోపం సరిదిద్దవా?
సర్వాత్మక, భవసాగరం లోతు తెలుపవా, నా నావ నీవైపు మరల్చవా?
పరమాత్మ, తుదిశ్వాస నీ ధ్యానమందు ముగించనీవా, కడచూపు నీపైనే నిలుపనీవా?

13 comments:

  1. చాలాబాగా వ్రాశారు .. super

    ReplyDelete
  2. కాదేదీ మీ కవితకనర్హ౦!
    ఆరుబయటకొస్తే ఆకాశమ్మీద కవిత.
    పూలతోటకెళ్తే ఆ వన౦లో ప్రేమికుల ఊహలమీద కవిత.
    చెట్టునీడకొస్తే మావికొమ్మన కూర్చున్న పిట్ట మీద కవిత.
    మ౦చిరోజైతే ప౦డుగ౦టూ మరో కవిత.
    నడత, నవ్వూ, ఊపిరి కవిత.
    ఏమిట౦డీ ఇన్ని అల్లికలూ?

    బహుశా ఇది మీ సహజయోగ సమయాన అనుకు౦టా. ఈసారి ఆధ్యాత్మిక అల్లిక అన్నమాట.

    ReplyDelete
  3. నేను క్రమం తప్పకుండ చూసే బ్లాగుమీది.Template మార్చారుకదా ముందు confuse అయ్యాను.
    "గుడిలో, శిలలో నీవుండవు నీవున్న నా గుండే నీ గుడన్నాను."
    చాలా బాగుందీ మాట

    ReplyDelete
  4. ఉష గారు , ఆధ్యాత్మికతలోనూ అదే తదాత్మ్యత ....బావుందండీ .

    ReplyDelete
  5. నేస్తం, వతనుగా వచ్చారు, వ్యాఖ్యగా గురుతు వదిలారు. కృతజ్ఞురాలను.

    దుర్గేశ్వర గారు, మీ రక్షాయాగ సమయంలో నా టపాని చదివి, అభినందించటమే ఆ దేవదేవుని మహిమగా భావిస్తున్నాను.

    ఆనంద్, మీరన్నది నిజమే, కవితగా వెల్లువైన శోధనో, వేదనో అలా అపుడపుడూ అంతర్లీంగా వుండే శోకం స్వామి కోసం వెలికి వస్తుంది. నిత్యస్మరణ నాకు మామూలే. కవయిత్రుల/కవులకు కలిగిన భాగ్యమిదే కదా!

    విజయమోహన్ గారు, ఆ మాట నేను ఇప్పటికి ఒక శత సహస్రం మార్లు వాడి వుంటాను అందుకే అలవోకగా నా కవితా స్తుతిలో ఇమిడిపోయింది. మీకు నచ్చినందుకు సంతోషం.

    పరిమళం గారు, నిజానికి ఈ విషయంలో నాకు కలిగే తాదాత్మ్యం మాటల్లో వివరించలేను. చాలా అరుదుగా ఇలా వెలికి వస్తుంది, అయినా ఈ మాటలు చాలవు.

    అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి కరుణ, కృపలు మీకు ప్రసాదించాలని మరోమారు ప్రార్ధిస్తూ - మీ మరువం ఉష

    ReplyDelete
  6. :) బాగుంది. ఇప్పుడే చూస్తున్నాను. మీ కవితలు పంచినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. మోహన, నలుగురు మెచ్చిన ఈ స్తుతి ఆ పైవాడికీ నచ్చిందేమో. ఈ మధ్య మనుషుల్లో దేముళ్ళని కాంచిన అనుభవాలున్నాయి. నిరాకారునుకీ మనసు మాత్రం మహా మంచిది. నెనర్లు.

    ReplyDelete
  8. ఆ భగవానునికి తన బిడ్డలను పరీక్షించడం మాత్రమే తెలుసు, మీరన్నట్టుగా శిక్షించడం తెలియదు. మీ ఆరాధనను ఆ పరమాత్ముడు తప్పక ఆలకిస్తాడు. కాని అది మీరు స్వీకరించేందుకు సిద్ధముగా ఉన్నారా??!! ఏ విధంగా సుర్య రష్మి మన గదిలోనికి ప్రవేశించాలంటే, మన గది తలుపులను, కిటికీలను తెరిచి వుంచాలో.... ఆ విధంగానే ఆ భగవంతుడు ఎల్లప్పుడు సిద్ధముగనే ఉంటాడు, ఆయనను ఆహ్వానించి లోనికి తీసుకురావలసినది మాత్రం మనమే.

    ReplyDelete
  9. saipraveen నాది గృహస్థాశ్రమం. దైనందిన జీవితంలోనే తఫస్సు ఇచ్చేంత పరీక్ష, దీక్ష, సాధన, సాఫల్యం వుంటాయని నా విశ్వాసం. దాన్ననుసరించే నా జీవనం. ఇంతవరకు నేనే material riches కొరకు ఆయన్ని వేడలేదు. వున్నవీ నాకేననీ స్వార్థపడలేదు. నాతోవుండి నడిపించే శక్తి మాత్రం ఆయన అంతే. ఇక ఆయన వచ్చేది ఏముంది.. అపుడపుడూ ఇలా విచారించటం మానవపర యోచనలు, శోధనలు. నానమ్మ గీతాపారాయణంతో మొదలైన నా అత్యాత్మిక పయనం సత్సంగ్ వలన సహజ మార్గాన srcm.org సన్మార్గాన్వేషకుల తోడుగా సాగుతుంది. నెనర్లు.

    ReplyDelete
  10. అమ్మా

    ధార్మికులు ధర్మ కార్యక్రమాలను ,ఆలోచనలను పరస్పరం పంచుకోవటం కోసం ఒక వేదికను ఏర్పాటు చేశాము .దానిలోకి మీరు రావాలి .మీలాంటీవారి రాక ఆవేదికకు మరింత శోభనిస్తుంది . మీ మెయిల్ అడ్రస్స్ ఇవ్వగలరు

    durgeswara@gmail.com

    ReplyDelete
  11. దుర్గేశ్వర గారు, రమ్మని ఆహ్వానించి మరీ నాలోని జిజ్ఞాసకి మరో వేదికని పంచారు. ధన్యవాదాలు. నాది కలగలుపు మనసు, కలుపుగోలుతనం. విశదీకరణలకి నాకెంత అర్హతవుందో తెలియదు, కానీ వివరణల పట్ల ఆసక్తివుంది. తప్పక వస్తుంటాను. ఈ రకంగా ఏ జీవితానుభవం రానున్నదో అంతా గురుకృప. నెనర్లు.

    ReplyDelete
  12. ఉషగారు, దుర్గేశ్వర గారు నా సలహా మేరకే మీకు ఆహ్వానం పంపారు. నేను కూడా ఆ వేదికలో నిన్ననే చేరాను. నాకు, మీరు అక్కడ లేని లోటు అగుపించింది. మీ సజ్జన సాంగత్యం, భాషా జ్ఞానం, మొ॥గుణములు ఈ వేదికకు ఉపయోగపడుతుందని నా భావన. నాకున్న చాలా సందేహాలను అక్కడ చర్చకు ఉంచాలని అనుకుంటున్నాను. మీరు అక్కడ నాకు సమాధానాలు అందిస్తారిని భావిస్తున్నాను.

    ReplyDelete