ఆ ఒక్కటీ అడక్కు!

అడగనివన్నీ అపురూపంగా కొని తెచ్చిచ్చిన
నాన్ననేనడిగిన దానికి మాత్రం ఒకటే మాట చెప్పారు "ఆ ఒక్కటీ అడక్కు"
అదలా ఇదిలా అని నేనడగకనే అన్నీ విడమరిచి విప్పిచెప్పిన అమ్మా అంతే
ఆమాట ఎత్తగానే తప్పుకుపోయింది ముందే ఇదేమాట చెప్పి "ఆ ఒక్కటీ అడక్కు"

అడగని ప్రశ్నలన్నిటికీ పిలిచి మరీ సమాధానాలు నేర్పిన అయ్యోరూ
చివరికి నాకు మిగిలిన ఆ ఒక్కదానికీ అదే మాట వదిలారు "ఆ ఒక్కటీ అడక్కు"
మరేం నీకిది తెలుసా అని నన్నడిగి, నాకు తెలిసినవన్నీ తోడేసిన మిగిలినవారంతా
మచ్చుకి నేనడిగిన ఆ ఒక్కదానికీ అదే అనేవారు "ఆ ఒక్కటీ అడక్కు"

అందినవన్నీ అలుసుచేయకు ఆపై మరి ఆశపడకని అదమాయించబోతే
అక్కసుగానో, ఆక్రోశంతోనో నా తనువు వెళ్ళగక్కిన వాక్కదే "ఆ ఒక్కటీ అడక్కు"
తాను వుబలాటపడేది అనువు కాదని తెలిసినా, ఆగనని చేజారనుందని
నేనదుపు చేయబోయిన క్షణం నా మనసు నాకెదురు చెప్పిన మాటదే "ఆ ఒక్కటీ అడక్కు"

ఇన్ని దైవఘటనల మీదటా ఇక నేనేం ఆశించను? మరి నను నీ నెలవుకి కొనిపో ప్రభూ..
నా వేడుకోలు విన్నా నేనింకా మిగిలున్నానంటే వాడిమాటదేనా "ఆ ఒక్కటీ అడక్కు"

చివరికి మిగిలింది ఇదా అని నాలో నేను తలపోసుకుంటే నాకు తోచింది ఒకటే
ఆగండాగండి అదేంటని మీరడగాలనుకునే ప్రశ్నకి నా జవాబొకటే "ఆ ఒక్కటీ అడక్కు"

మన్నించవా మిత్రమా?

కాలం, లోకం, జీవితం మూడు ఉత్పాతాలై,
నను ముప్పిరిగొని,

గాయం, శోకం, నైరాశ్యం ముప్పేటపూని
నన్ను మళ్ళీ మళ్ళీ ఉరితీసాక,

విగతజీవినయ్యాననుకున్నా,
జీవఛ్ఛవాన్ని చేసి ఇటు విసిరాయ్.

వినోదక్రీడకి నేనంతగా నచ్చానని
అన్యాపదేశంగా తెలిపాయ్.


ఈ మజిలీలో నీవున్నావని
కలనైనా వూహించితి కాదు.

నాకలవాటైన వేదనలో,
శంకలో
మునిగిన చూపులో
నీ రూపు సరీగ్గాకాననైతినిన్నాళ్ళూ,
నీ వాక్కునర్థంచేసుకోలేకపోతిపలుమార్లు.

ఎంత చిత్రమీ మన పయనం
కలవనిదిక్కులుగా సాగి కలిసిపోయామీక్షణం.


ఒకమారా తొలి తలపుల్లోకి తొంగిచూసి
ఈ కొన్నీ తిరిగి చెప్పనీ,

నీహారిక నీవనుకుంటే
హిమాలయమై వున్నతశిఖరమై అబ్బురపరిచావ్.

గాలిదుమారమనుకుంటే
నా జీవనవేణువు ప్ర్రాణవాయువుగా నాలో చేరిపోయావ్.

శిలనీవనుకుంటే,
నాచేతికి స్నేహపు ఉలిచ్చి నా నేస్తంగా చెక్కించుకున్నావ్.


మరలిపోనని మనం ఒకటని మరులు గొలిపావ్,
గతపుగరళం చిలికి, నేటి వెన్న చేతిలొ పెట్టావ్.

రాదంటూనే నా జీవితచిత్రానికి మెరుగులుదిద్దావ్,
రంగుల కలలనిచ్చావ్.
రేపుకొరకు చూడమన్నావ్.
సడలిపోని నెనరు నెయ్యం పంచావ్,
నీవినా నేనిక మనలేను,
నీతో కలిసిసాగే ముందొకమాట

కాదనక స్వీకరించు,
బదులుగ ఒక చిరునవ్వు నాకు పంపు
మన్నించవా మిత్రమా?

ఇంత చెప్పాక ఇక పేరడుగరు మరి!!!


ఉదయం, అపర్ణాహం, సాయం, మునిమాపు, నడిరేయి,
అన్నిటా తనకదే జోరట,

అవేకాక ఇంకేమన్నా వేళ మనం చెప్తే
అపుడూ తను సిద్ధమేనట!

వందనం, అభయం, సామ్యం, ముందుచూపు, నగుమోము
నిక్కచ్చిగ తనస్వంతమేనట,

అవేకాక ఇంకెన్నో గుణగణాలు
తను మనకు చూపి మరీ వల్లెవేయిస్తదట!

నిజం చెప్పాలంటే ఒకింత బిడియమైనా
నాకు ఆ వూసులన్నీ భలే నచ్చుతాయి.

సహజం అని మీకనిపిస్తే నాది కవితౌతది,
కాకుంటే ఇదో ప్రకృతి చేసే మాయౌతది.


వేసవి గాలి వీస్తుంటే సగం గాలి
తాను తాగేసినట్లు ఏం ఎగిసిపోతదో,

వున్నచోటు నుంచి తాను కదలలేనని
తెలిసినా తెగ మిడిసిపడతది.

వానధార ఆ వంకనుండో ఈ వంకనుండో
ఆగీఅగక జారుతుంటే,

తానావంక తిరిగిచూడకనే
కారిన బిందువులన్నీ కలిపేసుకుంటది.

శీతువు లోకాన్ని వడేసిపిండే చలిలో
కప్పేసి, కమ్మేసి దారికాస్తుంటే,

నిమ్మళంగా సర్దుకుంటది చేపా, కప్పా
లోలోన దాచి పైన మంచుగడ్డ అడ్డుపెడతది.


మబ్బులు పట్టే ఆ వొళ్ళు,
కొలిచి చూస్తే ఆమడ కూడా వుండదు.

గట్టులు నాల్గే అయినా,
వచ్చివాలే కొంగలు, బాతులు గుంపులు గుంపులు.

నిత్యం ఏదో ఓ చిత్రం నాకు
తనలో అగుపిస్తూనేవుంటది అదేం చిత్రమో?

సత్యం ఏమిటో తరిచిచూడమని చిత్తం
హెచ్చరిస్తూనేవుంటది ఇదేం విచిత్రమో?

మనం కట్టిన ఈ ఏరు మనకే
ఇంకేవో వూహల మేడలు కడుతుంది,

వైనం విప్పని మరేవో తెలియని శోధన,
బోధన మనకొదిలి పెడతది.


చివుర్ల కాలంలో చెట్టూ చేమలతో
చెలిమి చేసినట్లు చిరుసవ్వడితో ఒకపరి,

పూల మొక్కల వయ్యారాలకి జతగా
హోరుమని అల్లరి చేస్తూ తదుపరి,

ఆకురాలు కాలంలో అయ్యో అని కలకలంగా
కలవరం చూపే ఆ బిత్తరి, బహు నేర్పరి.

శిశిరపు మౌనాన మేఘవన్నె
స్ఫటిక పలకవోలే ఆకసానికి తన తనువునిచ్చి,

నడిచివెళ్ళే పక్షిగుంపుకి పైకెగరమని,
పయనమైపొమ్మని లేఖరాయిస్తది.

ఋతువుమారి తను తిరిగి కరిగి
కొత్త పాఠం చెప్పనున్నట్లుగా అగుపించే
నాఇంటివెనుకున్న ఎంతో దూరం పారలేని నా సెలయేరు.

వాస్తవానికి తన పేరే వాస్తవం, తన తీరేమో అమరం!

వాస్తవానికి నిజంగా తన పేరే అది,
అయినా ఇంకొన్ని మాటలు చెప్పాక కానీ మీరొల్లనంటారని,
మాటవరసకి కాక మనసు పెట్టి కాసినన్ని
అనుభవమైన వైనాలు కలిపి మీతో నిజమేననిపిద్దామని ఇలా...

పంచభూతాలతో మరంత సన్నిహితముందేమో!
భూమంత ఓర్పు కావాలి నీకు,
ఆకాశమంత శోధన చేయాలి నీవు,
నీరు కారిపోని జవసత్వం వుండాలి నీకు,
అగ్ని సామ్యమైన వేదన పడాలి నీవు,
గాలి దుమారమంత వేగం నీజీవనపయనమంటూ పోలికలుతెస్తది.

ఋతువులూ తన నేస్తాలేమో!
తను చెప్పిన రీతిలోనే వచ్చిపోతుంటాయి.
సంతసం వసంతంలా ఇట్టేవచ్చి అట్టే జారుకుంటది.
మనస్తాపం గ్రీష్మంలా కాల్చేస్తది.
దుఃఖం వర్ష ఋతువులా గుండె లోగిల్ని వరద పాల్చేస్తది
శరత్, హేమంత శిశిరాలు మిగిలన్నిటా తామున్నాయంటవి.

ఇంద్రచాపం వోలె ఎపుడూ జీవితాన్ని దిద్దమని రంగవల్లిగా,
కాలచక్రం మాదిరి జీవనాన్ని పోల్చమని రంగులరాట్నంగా,
ఆరోప్ర్రాణం తీరున ఆశయాలు, ఆశల్ని అద్దమని తళుకులుగా,
తెలియచెప్పే, మరణం తప్పని నా జన్మలో అనుక్షణం అరుదెంచే అమరం, ఈ "వాస్తవం"