ఇంత చెప్పాక ఇక పేరడుగరు మరి!!!


ఉదయం, అపర్ణాహం, సాయం, మునిమాపు, నడిరేయి,
అన్నిటా తనకదే జోరట,

అవేకాక ఇంకేమన్నా వేళ మనం చెప్తే
అపుడూ తను సిద్ధమేనట!

వందనం, అభయం, సామ్యం, ముందుచూపు, నగుమోము
నిక్కచ్చిగ తనస్వంతమేనట,

అవేకాక ఇంకెన్నో గుణగణాలు
తను మనకు చూపి మరీ వల్లెవేయిస్తదట!

నిజం చెప్పాలంటే ఒకింత బిడియమైనా
నాకు ఆ వూసులన్నీ భలే నచ్చుతాయి.

సహజం అని మీకనిపిస్తే నాది కవితౌతది,
కాకుంటే ఇదో ప్రకృతి చేసే మాయౌతది.


వేసవి గాలి వీస్తుంటే సగం గాలి
తాను తాగేసినట్లు ఏం ఎగిసిపోతదో,

వున్నచోటు నుంచి తాను కదలలేనని
తెలిసినా తెగ మిడిసిపడతది.

వానధార ఆ వంకనుండో ఈ వంకనుండో
ఆగీఅగక జారుతుంటే,

తానావంక తిరిగిచూడకనే
కారిన బిందువులన్నీ కలిపేసుకుంటది.

శీతువు లోకాన్ని వడేసిపిండే చలిలో
కప్పేసి, కమ్మేసి దారికాస్తుంటే,

నిమ్మళంగా సర్దుకుంటది చేపా, కప్పా
లోలోన దాచి పైన మంచుగడ్డ అడ్డుపెడతది.


మబ్బులు పట్టే ఆ వొళ్ళు,
కొలిచి చూస్తే ఆమడ కూడా వుండదు.

గట్టులు నాల్గే అయినా,
వచ్చివాలే కొంగలు, బాతులు గుంపులు గుంపులు.

నిత్యం ఏదో ఓ చిత్రం నాకు
తనలో అగుపిస్తూనేవుంటది అదేం చిత్రమో?

సత్యం ఏమిటో తరిచిచూడమని చిత్తం
హెచ్చరిస్తూనేవుంటది ఇదేం విచిత్రమో?

మనం కట్టిన ఈ ఏరు మనకే
ఇంకేవో వూహల మేడలు కడుతుంది,

వైనం విప్పని మరేవో తెలియని శోధన,
బోధన మనకొదిలి పెడతది.


చివుర్ల కాలంలో చెట్టూ చేమలతో
చెలిమి చేసినట్లు చిరుసవ్వడితో ఒకపరి,

పూల మొక్కల వయ్యారాలకి జతగా
హోరుమని అల్లరి చేస్తూ తదుపరి,

ఆకురాలు కాలంలో అయ్యో అని కలకలంగా
కలవరం చూపే ఆ బిత్తరి, బహు నేర్పరి.

శిశిరపు మౌనాన మేఘవన్నె
స్ఫటిక పలకవోలే ఆకసానికి తన తనువునిచ్చి,

నడిచివెళ్ళే పక్షిగుంపుకి పైకెగరమని,
పయనమైపొమ్మని లేఖరాయిస్తది.

ఋతువుమారి తను తిరిగి కరిగి
కొత్త పాఠం చెప్పనున్నట్లుగా అగుపించే
నాఇంటివెనుకున్న ఎంతో దూరం పారలేని నా సెలయేరు.

14 comments:

 1. ఉష గారూ ! బావుందండీ మీ భావుకత .మనసుకి హత్తుకొనేలా .......
  ఇక చివరి పేరా ....superb!!

  ReplyDelete
 2. అదే మరి! సిత్రం గాదేటో ప్రకృతి కాంత మూగ ఊసులు,
  చిత్తమును సేద తీర్చు సుందరాంగి సొగసులు...

  ReplyDelete
 3. పరిమళం గారు, బహు కాల దర్శనం, సంతోషం - రెంటీకీ - ముందుగా తొంగిచూసినందుకు, చదివి ప్రశంసించినందుకూ,

  అశ్వినిశ్రీ గారు, షిత్రాల కతలు ఆమె/ప్రకృతి చేస్తుంటే నేను/ఉష ఈ ఇషిత్రాల కైతలు గిలుకుతుంటాను, మరదే పేద్ద షిత్రాతిషిత్రం! ;)

  ReplyDelete
 4. ఫోటోలు బావున్నాయి గాని ఆ ఫోటోలు తీసిన వారి ఫోటో కూడా మీ బన్నీ పక్కన వుంటే బావుండేది.ఇప్పుడు అర్దమయ్యిన్డి మీకంత అర్దవన్తమైన కవితలకి ప్రేరణ సమయాను కూలంగా కొత్త కొత్త అందాలూ సంతరించుకునే అ నదీమ తల్లే అని .

  ReplyDelete
 5. ధన్యవాదాలు, రవిగారు. అవి తీసింది నేనే. మరువం pic చూసారు కదా మరిక ప్రత్యేకంగా మరో pic of me అవసమంటారా ఈ సంధర్బానికి? ;) I built the house on lake front just to aid/feed my poetic mind/thoughts. I get to see sunrise while enjoying the ever changing nature with such clear cut seasons. Missing in this pic is the RED FOX; it's too fast for my camera to capture it.

  ReplyDelete
 6. చాలా బావుంది. మాయౌతది, పెడతది, వస్తది ఇలాంటి వాడుకల్లో ఒక అమాయకత్వం తోంగి చూసి ఒక ముగ్ధత్వాన్ని చేకూర్చింది. మబ్బులు పట్టే వొళ్ళు అన్న ప్రయోగం బాగుంది. చివరిగా లేకు అనకుండా ఏదన్నా తెలుగు మాట వాడి ఉంటే బాగుండేది.

  ReplyDelete
 7. హమ్మాయా! నా intuition తప్పలేదు సార్, కొత్త పాళీ గారు! సరీగ్గా నేననుకున్న మాటే/సద్విమర్శే విసిరారు. మరిక తమరే ఆ మాటేదో సెలవ్వియండి. సెలయేరు అనుకున్నాను, సరస్సు అనుకున్నాను. ఇంతోటి జానా బెత్తా ముక్క నీటి పాయకి అంత పేరడతావా, ఆయ్ అని మీ బొటివారు చీవాట్లేస్తారేమోనని ఆగిపోయాను ;)

  ReplyDelete
 8. నీ జుట్టులో ఏదో ఆకులాంటిదేదో అంటుకుని ఉందోయ్ అంటే, ఆ చేత్తోటే తీసెయ్యమన్నాట్ట. మీరూ ఆబళ్ళోనే చదువుకున్నారులా ఉంది. :)
  నీళ్ళు రెండు రకాలు .. ప్రవహించేది, ప్రవహించనిది.
  ప్రవహించే రకాలు .. ఏరు, సెలయేరు, వాగు, కాలవ, నది, స్రవంతి .. ఇలాంటివి
  ప్రవహించకుండా స్థిరంగా ఉండేవి .. నుయ్యి, బావి, కుంట, చెరువు, సరసు, సరోవరం ఇలాంటివి.

  ReplyDelete
 9. "వందనం, అభయం, సామ్యం, ముందుచూపు, నగుమోము నిక్కచ్చిగ తనస్వంతమేనట,"
  "మబ్బులు పట్టే ఆ వొళ్ళు, కొలిచి చూస్తే ఆమడ కూడా వుండదు."

  మరోసారి అదరగొట్టేసారు. అంత చక్కని దృశ్యాలు రోజూ చూస్తుంటే మీ కవితా ప్రవాహం ఆనకట్టలు లేని గోదారిలా పొంగదా మరి.

  ReplyDelete
 10. యురెకా... నాకు అర్దం అయిపోయింది ..ఇన్నాళ్ళూ ఈమెకు ఇంత మంచి మంచి కవితలు అలా వరదల్లా ఎలా వచ్చెస్తున్నాయి చెప్మా అనుకునేదాన్ని..ఇంత చక్కని ప్రకృతికాంత ఎదురుగా ఉంటే మరి రావేటి :) మరోసారి అభినందనలు ..ఇంత చక్కని కవిత ను రాసినందుకు

  ReplyDelete
 11. అబ్బో!!!ఎంత బాగా వ్రాసారండి.
  మీ ఉషస్సులోని తేజస్సు కొద్దిగైనా నాకు వస్తుందంటారా!!!

  ReplyDelete
 12. కొత్తపాళీ గారు, మీ ముందు వ్యాఖ్యననుసరించి "సెలయేరు" గా మార్చాక మీ రెండో వ్యాఖ్య అందింది. కృతజ్ఞతలు.

  ప్రదీప్, ధన్యవాదాలు, నిజంగా నా సరస్సు/సెలయేరు మరింత అందంగా అగుపడుతుంది. నిజమే ప్రేరణ అన్నది ప్రకృతినుంచి వచ్చినంతగా మరెక్కడా దొరకదేమో.

  నేస్తం! అవునూ అలా "యురేకా" అని అరిచినపుడు మీరేం చేస్తున్నారు?ఎందుకంటే ఆర్కిమెడిస్ swimming pool లో వుండగా ఆయనకి అసలు సంగతి స్ఫురించిందట మరి. హ హ హ్హా, jokes apart, yep you're very right నా కిటికి ప్రక్కనున్న chase loungeలో పడుకుని ఆ సెలయేటిని చూస్తుంటే ఏవేవో భావనలు కలుగని రోజేలేదింతవరకు. ఇదంతా ప్రకృతి గారడే!

  పద్మార్పిత గారు, ఏంటండి మరీ అంతగా మునగచెట్టు ఎక్కించేస్తునారు, పడేద్దామనే? ;) ఏదో ఆ పైవాడి దయ ఈ కళాహృదయం, ఆ పై మీ బోటివారి ప్రోత్సాహం. అంతే కానీ తేజస్సు అంటూ నన్ను దూరం చేయకండి,మీకు చేరువగా ఇక్కడే వుండనీయండి.

  ReplyDelete
 13. మీ కవితలు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటున్నాయి. తెలుగు మరిచిపోయిన వారు మీ బ్లాగు చదివితే తెలుగు తన్నుకొచ్చేస్తుంది.
  వీలుంటే ఇది చదివి స్పందించండి.
  http://muralidharnamala.wordpress.com/2009/02/15/ఏమయ్యింది-నాకు/

  ReplyDelete
 14. మురళీగారు, ఒక్క మాటతో ఎంత ప్రశంస నింపేసారో. మా సరస్సులా మీ మాటలో ఎన్నో భావాలు! ధన్యవాదాలు. మీ టపాకి వ్యాఖ్య వ్రాసాను. మరోమాట, స్పందన లేనిదే నేను నోటిమాటగా వ్రాయలేను, సో అది స్పందనే మరి.

  ReplyDelete