నిరాంతకం

పురాతనమే కావచ్చు ఈ చంద్రోదయం
కాస్త వెనుగ్గా రానున్న సూర్యోదయమూ...

చీకటి కమ్మిన హృదయాలు
నీడలో నివృతమైన పరిసరాలు
మరి కాస్త ప్రాచీన ఆచూకీకి
త్రోవ చూపవచ్చు

గమనించాలి, గుర్తించాలి, గమనం సాగించాలి

రిక్త హస్తాలు చాపగానే వెన్నెల నిండినట్లుగా
కనులు తెరవగానే కాంతి చేరినట్లుగా

గాలి, నీరు గలగలలాడుతూ
పూరేకుల్లో,  ఆకుదొన్నెల్లో
మబ్బుగిన్నెల్లో, అలల కుంచెల్లో
కొత్త పరిచయం చేసుకున్నట్లుగా
సరికొత్త పాత చిరునామాలు
గుండె నిండా రాసుకుంటూ ఉంటావు

నడవాలి, నర్తించాలి, ఆంతర్నేత్రం తెరిచి చూడాలి

సనాతనమే కావచ్చు ఆ ఆత్మావలోకనం
అనాది నిధనమనే హితవచనమూ...

తృప్తి, శాంతి పురివిప్పి
చేతనలో, చింతనలో
స్వరంలో, స్పందనలో
నిత్య చలనం గావించినట్లు
సతతం అనునయ స్పర్శనిచ్చే విశ్వజాడలు
ఆత్మ నిండా పరుచుకున్న స్థితిలో ఉంటావు

పయనాలు

పెనుగాలి లా తలపు
చెల్లాచెదురయే ఆకుల్లా ఊహలు
ధ్వనిస్తూన్న దారుల్లోకి
పదేపదే దెస మార్చుతూ
మనసు పరుగులు తీసిన తరుణాన..

నైసర్గిక స్వరూప దర్శనమైంది
లోలోని కాననం కానవచ్చింది

పరిచిత జాడలు
కొన్ని మోడులు
అల్లుకున్న అనుబంధపు లతికలు
ఎరుగని మోహపు పూలు
అలవి కాని తావులీనుతూ

ఇప్పుడక్కడ

చిగురుటాకు మోజుల సవ్వడి
మొగ్గ తొడుగుతున్న సన్ననవ్వుల
ప్రతిధ్వనులు
పరుగు నడకగా మారేటి వేళకి..

కోన దాటి
లోయ దాపున
మాయమైంది
నడిచివచ్చిన దారి

శకలాలుగా ప్రోగు పడిన కలలు
బద్దలువారి బండలైన ఆశలు
మాయ దర్పణమై ఎదుట నిలిచినట్లుగా...

నిశ్శబ్దం రూపు దాల్చి పిలిచినట్లుగా
మార్మికత
ఆజ్యపు ధారకే అణగారిన జ్వాలలా
నిమగ్నత

కదలిక మందగించిన క్షణానికి
కొత్త కుదుపు మొదలౌతుంది
ఝంఝూనిల ప్రభంజనంగా
మారనున్న అనుభవం
బలపడుతూ ఉంటుంది

నాటుకున్న అనుభూతుల
విస్తీర్ణత, ఎల్లలు ఎరగనట్లే
ఎదుగుతుండే
బ్రతుకు వనం లోకి
పయనాలు...!

కాలం లోకి

అప్పుడక్కడ
చీకటి కమ్మి చాలాసేపయింది
నేల కి సమీపంగా
తారకల వంటి మిణుగురులు
నింగిని తాకుతూన్న
మిణుగురుల వంటి నక్షత్రాలు
కంటిలోనూ, కాంతితోనూ చిత్రాలుగా
సర్దుకున్నాయి

ఆమె పెదవి విప్పుకుని
చిన్న నవ్వు మొలిచింది
'మోటబావి గోడలు చీల్చుకున్న పచ్చని మొలకలా'
దృశ్యం, సాదృశ్యం నడుమ
నడయాడే మది ఊసూ పుట్టింది
అంతలో-

ఏదో అసంబద్ధమనిపించింది..

మొలకది జీవితేచ్ఛ, అస్తిత్వ పోరాటం
మిణుగురు ఉనికితో చలిస్తున్న జీవి
రాలినదో, రగులుతున్నదో తెలియని తార
ముఖాన నిరంతరం వేసుకునే ముసుగు, నవ్వు..
సామ్యం లేని సంగతుల
అసహజచిత్ర ప్రదర్శన,
వ్యూహం పన్ని సాగిస్తున్న 
బతుకురణపు అర్థవిహీనత
నశించిపోయాయి

వేకువ కావచ్చింది..

ఆ వేకువని మించిన ఎరుక
మరేదీ కలగలేదు
అయినప్పటికీ
ఆ వెనుగ్గా నిశి కమ్ముతూనే ఉంటుంది

ఇక నుంచి,
ప్రతి అస్తిత్వం అనుపమం
అనునిత్యం అసమానం
సూత్రంగా
నిరాంతకంగా సాగే పయనంలో
ఆమె...!