ఇది కథ కాదు: ఇదో అది అంతే!

కనుక అనగనగా అని మొదలు పెట్టను. ఇలాంటివి చదివి మొహం మొత్తినవారు, నాకు పరమరోత అనుకునేవారు కూడా మరి వెనుదిరగండి. ఓ మారు నా వెనకటి ఊసొకటి విని "వూ..[ఊ.. కాదు ;)]" కొడతామనేవారు మాత్రం నాతో పాటు కన్ను కదపండి. కాస్త పోకడలున్నాయని అవటార్ చూసి రాసాననుకున్నా పప్పులో కాలేసినట్లే... ఇది చాలా ఏళ్ళ క్రితం రాసుకున్న జ్ఞాపకం.

విసుగ్గా మాట్లాడే పదాల్లో తరుచుగా నాకు పడ్డ/నేను విన్న పదం.."దున్నపోతు, మాట వినదు." :) అసలు ఆ పుల్లింగపదాన్ని పూబంతివంటి యువతుల మీద ఎందుకు వాడతారో నాకు అర్థమై చావదు. సరే కాస్త చించుకుంటే ఏతావాతా తేలింది (నేనే తేల్చాను) ఏమిటంటే, పురుష ప్రపంచంలోనే మాటవినని నైజం అనాదిగా పాతుకుపోయివున్నదని. ఇక పైచేయి వారి జాతిది కనుక వారి అవలక్షణాన్ని మనపై రుద్దుతారు కనుక అలా పరిపాటైపోయింది. ఇక నాది దున్నపోతు గారి స్త్రీలింగ ప్రాణి గురించి. ఇప్పటికీ ఆలస్యం కాలేదు కనుక రెండో బ్యాచ్ వారు ఇక్కడ బండి దిగేయండి. ఇక జోరు పెరుగుతుంది కనుక మళ్ళా ఆనక చివరి అక్షరం వరకు ఆగలేరు. నేను తోసినా దిగలేరు... ;)

నాకు ఇప్పటికీ ఇష్టమైన స్నాక్ - పాలు, వయసుతో నిమిత్తం లేకుండా నాకు యే రకం శారీరక అస్వస్థత వచ్చినా 'పోతపాలపిల్ల' అన్న కారణం తిరిగి కొత్తగా వెదికిపెట్టిన మా నానమ్మ మాట సాక్షిగా. అసలు మా ఇంట్లో నాన్నగారు పాడి అన్నది మొదలుపెట్టటం నా పాల కొరకేనేమో [అప్పటివారి మాటల్ని బట్టి ఇది నా వూహ]. అవి కూడా ఇంట్లో వ్యక్తులంత ఇదిగా స్థానాన్ని పొందాయి. అలాగే క్రమశిక్షణ విషయంలో నాన్నగారు వాటిని మా మాదిరే లెక్కవేసేవారు.

నాకు అన్నిటికీ పేర్లు పెట్టటం అలవాటు. సన్నజాజి, విరజాజి తీగల్ని గిరిజ, విరిజ, మా పాడిగేదెలకి లక్ష్మి, రంగి ఇలా అన్నమాట. నాకు వాటితో సంభాషించటం అలవాటే. అలా చేయబట్టే మా దొండతీగెకి వేసిన పందిరిగుంజ ములగమాను ఉరఫ్ మున్నీ కూడా చివురేసి నిటారుగా ఎదిగి వేల వేల ములక్కాయలని కాసిందని నా ప్రగాఢనమ్మకం. ఈ మాట చదివిన మరొకరికైనా ఇదే మాదిరి అనుభవం తప్పక వుండితీరుతుంది.

సరే ఇక లక్ష్మి కాలానికి వెళ్తే... నిజంగా బెదురుగొడ్డుకి రూపం ఇస్తే అచ్చంగా ఇలాగే వుంటుంది. దాని కళ్ళనిండా బారుగా సాగిన దాని కొమ్ముల్ని మించి బారుగా సాగే భయం. మా ఇంటికి వచ్చేసరికి నిండు సూడి మీద, రేపో మాపో ఈనటానికి సిద్దంగా ఉంది. నాన్నగారికి కోపం నాగరాజుకున్నంత బుసబుసల పాలపొంగు. ఇక ప్రేమ చూపితే అది నెలరాజు కురిపే కరణామృత వెన్నెలే. అప్పటికి పన్నెండేళ్ళ అనుభవం వున్న నాకే అప్పటికి సరిగ్గా బోధపడని ఆ విషయం, పాపం ఆ పిచ్చి మూగప్రాణికి ఎలా బోధపడుతుంది?

సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవీను, నావి ఆ తర్వాత తెలుసుకుందాం, ఇప్పటికి ఈ కథకానికథలో వీరోయిన్ లక్ష్మి గారే.

రోజూ కొబ్బరినూనె రాయించేవారు రాత్రి పూట. వేడిగా వున్న పూట/దోమలు వున్నాయంటే ఫాన్ పెట్టించేవారు. తెల్లారేసరికి పొరపాట్న అది ఆ ఫాన్ని కింద పడేసినా, వంటినిండా మట్టి/గడ్డీ అంటించుకున్నట్లున్నా దానికో క్లాసు తప్పేది కాదు, దేహశుద్దీ తప్పేది కాదు. ఇంకొంచం వివరం చెప్పనీండి.

దాని గది/షెడ్లో కట్టుగొయ్యి, గడ్డి వేసే ప్రదేశానికి కలిపి ఓ పెద్ద కొయ్యదుంగ అడ్డం పెట్టేవారు. అది గడ్డి తొక్కకుండానన్నమాట ఈ ఏర్పాటు. పొరపాట్న కాలు ఇటుతీసి అటేసి నేమరేసిందంటే దరువులే. అలాగే పాపం, ఇటు చేయాల్సిన ఆ రెండు పనులూ ఆ కర్రకి అవతల చేసినా అదే శిక్ష. ఆపై దాని చెవిలో అరిచి చెప్పేవారు - ఎలా నిలబడాలి, ఏం తినాలి, ఎలా గడ్డి తినాలి, ఎటు తిరిగి మూత్రవిసర్జన చెయ్యాలి అన్నవి. నాకు ఆ షెడ్ పక్కన పందిరిమీద నవ్వే బొడ్డుమల్లి కన్నా మెరిసేనవ్వు ఆయన లక్ష్మికి చెప్పే మాటల వినటం వలనే అలవడింది [కావచ్చు ;)].

విన్నమాట విన్నట్టు వదిలేసేది కాదు కానీ, చాలా చిత్రంగా ప్రవర్తించేది మా లక్ష్మి మేడం. నాన్నగార్ని అటెల్లనిచ్చి కాలు తీసి దర్జాగా గడ్డీమీద నొక్కి పెట్టి నిలబడి మరీ తినేది. ఎందుకే మంచి గొడ్డుకో దెబ్బ అని వినలేదా నేను మొత్తుకున్నా పెద్ద లెక్కచేసేది కాదు. ఆనక నేల మీద పడి అటూ ఇటూ దొర్లేది. అసలలా స్వేఛ్ఛగా బతికేవాటిని ఇళ్ళలో బందీ చేయటం మనిషికి ఎలా తెలిసిందో.

ఒక్కోరోజు దానికి వేసే ఆ లేలేత పచ్చగడ్డి పరకలు మొహం మొత్తేవేమో, సాయంత్రం అలా గాలి పీల్చుకుంటుందనో, కాళ్ళు సాగుతాయనో మా నర్సింహులు [వీడు నా మొక్కల పట్ల కిరాతకంగా ప్రవర్తించినా ఈ జీవి పట్ల సమస్త ప్రపంచంలోని భూతదయ కలిపి కుమ్మరించేవాడు] తిప్పుకుని తీసుకొచ్చే సమయంలో చటుక్కున ఓ కూరగాయ మొక్క కొమ్మనో, నా పూల మొక్క రెమ్మనో తుంచిపారేసేది. ఆ సమయంలో దాని పెద్ద పెద్ద కళ్ళలో అదో ఆనందం.

తిరుగుబాటు బావుటా తాలూకు కళలు కొట్టొచ్చినట్లుకనపడేవి. నాన్నగారి మీద కోపం వస్తే ఆయన ఫొటోనీ గుండుసూదితో పొడిచే చెల్లి పనిని చూసీచూడనట్లు వూరుకున్నట్లే లక్షి గారి చేష్టలు నా వరకే ఆగిపోయేవి. కాన్వంట్ కి మధ్యాహ్నం భోజనం కారేజీ తెచ్చి, నేను తినేదాకా వుండకుండా ఇంటికి పోయి చాయ్ తాగే భాగ్యం ప్రసాదించాను కనుక నర్సింహులు కూడా నాన్నగారికి ఈ అల్లరి/ప్రతిఘటన తెలియనిచ్చేవాడు కాదు.

అతి కొద్ది రోజులకే రాము పుట్టాడు. వాడికి లేత బూడిదరంగు జుట్టు, నల్ల కళ్ళు, కొమ్ములు లేవు కాని గట్టి గుండు. భలే ముద్దుగా వుండేవాడు. నాకు దిగని ఇడ్లీలు లాగిస్తూ, కవ్విస్తే తలపడుతూ, గంతులేస్తూ వాడో కొత్త నేస్తం.

నా పిచ్చిప్రేమకి స్కూల్ నించి వచ్చి, వాళ్ళమ్మ ఇచ్చినవే ఓ కప్పు పాలు పట్టుకుని, వీడి ప్రక్కన కూర్చుని కబుర్లు. నా జుట్టులోంచి వెంట్రుకలు విడతీసి వాటికి వేరుశెనగ గుళ్ళు గుచ్చి, రాము మొహం ముందు తల వూపితే, వాడు ఆ గుళ్ళు లాగటం అదో ఆట మాకు, వెంట్రుకలు తెంపటం కూడా పరిపాటి. నా సంగతి తెలుసు కనుక అమ్మ ఏమీ అనేవారు కాదు. అలా రాముకి మేము కూరని చిరుతిళ్ళు లేవు. అసలు కుక్కపిల్లల్ని ముద్దు చేసేవారు మా దగ్గర శిక్షణ పొందాలి, అంత నిష్ణాతులం మేము [అదే నేను].

అలా మా సరాగాల స్నేహం సాగుతుండగా ఓ సారి నర్సింహులు ఓ వారం పది రోజులు వూరికెళ్ళాల్సివచ్చింది. పాలు తీయటానికి యాదగిరికి పని అప్పజెప్పాడు. లక్ష్మి ససేమిరా ఒప్పుకోలేదు. నాన్నగారు ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేను దాని దగ్గర కూర్చుని తలనిమురుతూ, నా ఒళ్ళో దాని సంకటి గమేళా వుంచుకుని తిననిస్తే వాళ్ళని తాకనిచ్చింది. మధ్యలో యాదగిరి, "పాప, బర్రె తన్నకుండా చూడు తల్లీ!" అని మొరలు. సో, అలా ఆ పదిరోజుల గారాలబుచ్చి మా లచ్చి.

ఇంటిపనికి వచ్చే ప్రభావతికి కవల పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు లక్ష్మి, రాము [ప్చ్.. పేటేంట్ తీసుకోలేదు కనుక అలా అయిపోయింది :) ] తన పాలు సరిపోవటం లేదని తరిపిగేదె పాలు అవసరమని బతిమాలి బామాలి నా లక్ష్మి, రాముల్ని అది కొట్టేసింది. నాకు ఏడ్వటానికి ఓపిక పొయ్యేవరకు ఆ పని చేసాక, సొమ్మసిల్లి, అలిగి అరిచి గీపెట్టి ప్రభావతిని పనిలోంచి తీయించేసాను. కొన్ని రోజుల పాటు లక్ష్మి అలా గుమ్మంలోకి వస్తూనే వుండేది. కాలం వేసే మరపు మందుతో నేనూ కదిలిసాగాను. బహుశా లక్ష్మి కూడా అంతేనేమో! :(

చాలా పాడి పశువులతో అనుబంధం వున్నా కానీ లక్ష్మి గాడి అంత గాఢమైన అనుభవం మిగల్లేదు. సమకాలీన అనుభవం "బిస్ బిస్ మేక" తో. చెప్పాలనిపిస్తే మరెప్పుడైనా..

*********************************************

నాకు మరొక ఆరేళ్ళ అనుభవం వచ్చాక అంటే పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో మేము అద్దెకి వున్న ఇంటివారికి పాలవ్యాపారం. కనుక ఇంటి ముందర, వెనకా కూడా పాడి పశువులు, దూడలు, గడ్డి మేట్లు, కుడితి తొట్లు, ఉలవల ఉడికే వాసనలు. నేను చదివిన ఆ కాలేజీ ఒక పట్టణం కాని పెద్దపల్లె ఆ ఊరులో ఉండేది. నాన్నగారు, నన్నూ నానమ్మని ఆ దూరపు బంధువుల ఇంట్లో పెట్టారు. సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న కాలేజీకి రిక్షాలో వెళ్ళి వచ్చేదాన్ని.

వారి ఇంట్లో దిగిన కొన్ని రోజులకి వాళ్ళ గేదె ఈనింది. ఆ జున్ను అవీ లాగించాక ఆ కొత్త లక్ష్మి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కాకపోతే ఆవిడ బిడ్డ అనసూయ. అదీ ముద్దుగా వుండేది. అలవాటు చొప్పున వస్తూ పోతున్న సమయాల్లో ఏదో ఒక మాట అనేదాన్ని. అనసూయ తోక పట్టుకుని, చెవి పీకో ఆట ఆడేదాన్ని. కాస్త పెద్దయ్యాను, ఇంకా ఎక్కువ చనువు లేదు కనుక కుర్చీలు వేసుకుని కులాసా కబుర్లు చెప్పేంత సీన్ లేకపోయింది. కానీ ఈ కొత్త మేడం నన్ను చూడగానే "దగ్గరకి రా.." అన్నట్లు తలవూపేది. అలాంటప్పుడు అటూ ఇటూ చూసి కాస్త అల్లరిమాట అనేసి పరిగెత్తేదాన్ని.

అలా మా చెలిమి బలపడిందన్న అపోహలో వున్న ఒకానొక మధ్యాహ్నం ఫిజిక్స్ రికార్డ్ ఇంటిలో మర్చిపోయాను. కాలేజికెళ్ళాక గ్రహించి మళ్ళీ ఇంటికి రిక్షాలో పరిగెత్తుకొచ్చాను. ఆ హడావుడిలో మేడం స్వస్థానంలో లేదని చూడలేదు. మళ్ళీ రిక్షా వెదుక్కోవాలి, లేదా పి. టి. ఉష లా పరిగెడతమా అన్న గోలలో పడి, ఇల్లు వదిలి ఆ కంకరమట్టి రోడ్డేక్కగానే ఓ పెద్ద గుండేలవిసేలా రంకె వెనకటి గూడ్స్ రైలింజను కూత కన్నా గట్టిగా చెవుల్లో పడింది. తలెత్తి చూసే సరికి మహా అయితే ఓ ముప్పై సెకన్ల పరుగు దూరాన కొ.ల [కొత్త లక్ష్మి] బుస బుసల తో మా బిస్ బిస్ మేకకి తాత మాదిరిగా ప్రత్యక్షమైంది.

కాస్త సినిమాల అనుభవం తో నాకు అసలు సంగతి అర్థం అయిపోయింది. ఈవిడ ప్రతిఘటనలో విజయశాంతిలా నా మీద ప్రతీకారం తీర్చుకోబోతుంది అని. కాస్త పిరికి గుండె కనుక ఆ మాత్రానికే నా పని అయిపోయింది, నేను స్పృహ తప్పుతుండగా పరిగెట్టుకుంటూ వస్తున్న ఇంటివారి అబ్బాయి నాని , అతనితో రేస్ లో ముందున్న కొ.ల. కనపడ్డారు. సెకనులో అరవంతు జ్ఞాపకం కొ.ల. గారి కొమ్ము నా పొట్టలోకి వత్తిడి తెలిసేలా, నా చేతిలోని రికార్డ్ కి తగలటం. ఆ పుస్తకం ఎందుకలా నలిగిందని లెక్చరర్ గారికి మొరపెట్టుకోవటం మరో బాధ.

స్పృహ వచ్చేసరికి కళ్ళనీళ్ళతో గగ్గోలెత్తుతున్న నానమ్మ, కట్టుగొయ్యికి వేలాడబడి నాని చేతిలో దెబ్బలు తింటూ కొ.ల. పాపం జాలేసి నేనే అడ్డం పడి ఆపాను. నెప్పి ఓర్చుకుని నాకేమీ కాలేదని నటించి కాలేజీకి వెళ్ళిపోయాను.

వెళ్ళేదారిలో మళ్ళీ ఓ నాలుగైదు సార్లు ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళివస్తే కొ.ల. మ్మ గారి పూర్తి మనోగతం అర్థం అయింది. "దగ్గరకి రా..నీ పని చెప్తాను. కుమ్మిపారేస్తా.." అంటే నేను తన బిడ్డని ముద్దులాడేదాన్నిగా, తల్లిగా భయం, ఆందోళన అన్నమాట, నేనేం చేస్తానో అని. అంచేత తన సత్తా ఏమిటో అందాకా సైగల్లో చెప్పేది. ఇవాళకి చేతల్లో చూపించింది.

ఆ సాయంత్రం అందరూ సద్దు మణిగాక మళ్ళీ మేడం గారి దగ్గరకి వెళ్తే ఈ సారి వెనక్కి అడుగేసింది. అంటే నాని గారి కోటా ఇంకా సురసుర మండుతుందనే కదా? "పిచ్చి కాళీ, నేను సాధుజీవినేనమ్మా. నువ్వు, నీ బిడ్డ నాకు నేస్తాలు." అని కాసేపు వెన్ను పామి చెప్పాక, దాని కళ్ళలో బెదురు, కనీకనిపించని కోపం మలిగి, ఆ స్థానే కరుణ, ప్రేమ నిండాయి. ఆ మూగజీవి నా జట్టు కట్టేసింది. కానీ ఆవిడ విశ్వరూపాన్ని చూసాను కనుక కాళీ అనే పిలిచేదాన్ని.

అదన్నమాట. "లక్ష్మి, కాళి, అదే నేను" కథా కమామీషు.

గత మే నెలలో ఒక వ్యాఖ్యలో పరిమళం గారు "సుందరమైన లలితాదేవేనా ...ఈ ఆదిపరా శక్తి అని పించే అమ్మవారిలోని రెండో కోణాన్ని చూసినట్టుంది." అనటం వలన ఓ సారి ఈ ఊసు తారాడివెళ్ళింది. కాకపోతే తను నన్నంటే నేను "కొ.ల -> కాళి" కి అన్వయించాను. ప్రతి మనిషిలోను ఈ అంతర్గత శక్తి వుంటుంది. కనపడని కొమ్ములతో తలపడాల్సిన విషయాలకి సిద్దపడే దమ్మూ వుంటూంది.

ఈ మధ్యన ఒకరు నన్ను "వృషభం" అని ఆట పట్టిస్తే ఈ ఊసు మళ్ళీ 'గాట్టీగా' గుర్తుకొచ్చేసి ఇలా నా బ్లాగుకెక్కేసింది.

ఇక్కడి వరకు చదివినవారు తప్పక మీ మీ అనుభవంతో అన్వయించుకుని వుంటారు. కథలు, ఇలాంటి కథ కాని కథలు, అనుభవాలు ఈ యాంత్రిక జీవితంలో కాసేపు జోకొట్టే లాలిపాటలు. కమ్మని ఆ నిదురలో కాలం కొట్టేసిన క్షణాలని వెనక్కి తెచ్చే వరాలు. బతుకులోని అనుభూతికి ఆసరాలు, ఆలంబనలు. కాదంటారా?

చెలియ మోవిపై విరిసిన మల్లియ!

కనుమాయగ తనువు మరిచిన కాంత,
గాలివాలున కాలుకదిపి నడయాడగ ,
మరుమల్లి కుదురుకి మరణయాతన.

మంచు సెగకి వసివాడింది,
కొమ్మవెన్నూ విలవిల్లాడింది,
పూలదీపం మలిగిపోయింది.

పొడారిన రెమ్మకి కంటితడి జలకాలు,
తడారిన కొమ్మకి వేదన ముడుపులు,
తల్లివేరుకి కలతపడ్ద నెలత వాయనాలు.

మన్నించి మరలివచ్చిందో,
తననొదిలి మనలేననుకున్నదో,
మల్లి మళ్ళీ నవ్వుమొగ్గ తొడిగింది.

వెన్నెలకాంతుల ఆకులతో,
మంచు వన్నెల మొగ్గలతో,
మగువని పిలిచి కన్ను గీటింది.

చిలిపి చివురులు చెలియ మదిలో,
వలపు మొగ్గలు చెలికాని ఒడిలో,
నెచ్చెలి పెదవిపై విరిసిన నవ్వే మల్లియ.


రమణి రంగుమోవి నవ్వులో,
జవరాలి చెక్కిలి చిరుతడిలో,
మెరిసేటి మంచుముత్యం మరెవరని?

మనసు మనసు మనువాడితే,
పూబంతి ఆటకి మాటలు మల్లెలైతే,
ఆ అనురాగం మల్లెపూవంత అపురూపం.


***********************************

మంచుకురిసిన ఓ మునిమాపున ఆదమరిచి నేను చేసిన చిన్న తప్పిదాన్ని మన్నించి, మరణానికి సమీపించినా మోడున దాగిన నా మమత సాక్షిగా మరలా జీవం పోసుకున్న నా మల్లియ అతిశయాన్నిలా నా మాటల్లో...

శ్రుతిలయలు

నిశిరేవులో తలపుల నావలు,
సేద తీరక ఊగే తూగుడుబల్లలు.
ఎంతో దూరం వేకువ తీరం

చమురింకినా కొండెక్కని వత్తులు,
అణగారని కాంతుల ఆశాదీపాలు.
చెప్పలేని భావం చీకటి శోకం

మనుగడ వలువలు చుట్టిన మనసులు,
స్వేఛ్ఛారెక్కలొచ్చిన సీతాకోకచిలుకలు.
ముడిబిగిసిన పాశపు సంకెళ్ళు

దూరాభారపు పయనానికి,
శోకతప్త హృదయానికి,
బాధించిన సమయాన,
తోడైవచ్చిన అనురాగమా!

మోడు మీద జడివాన ఎందుకు?
వేరుకొనలకి పిడికెడు జలం చాలు.
వాడి రాలిన పూలరాశి ఊసులెందుకు?
మొగ్గ తొడిగిన చిరుకొమ్మ గుసగుస చూడు.
జవం, జీవం, వర్ణం, సర్వం నాలోని నీవు కాదా?
జీవనగానానికి మనమేగా శ్రుతిలయలు.

నీ తలపులు

మబ్బులు దాగిన కొలనులో
పక్షిరాకతో చెదిరే చిత్రాలు

విషాదాలు దాచిన కనులలో
ఉల్లాసాన మెరిసే ముత్యాలు

వెన్నెల కురిసిన రేయిలో
ఉన్నపళాన రాలే ఉల్కలు

మల్లియ విరిసిన పొద్దులో
కోపతాపాల వేగే ఊపిర్లు

చీకటివెలుగుల రగిలే మనసులో
సేదతీర్చగ వచ్చే నవనీతాలు

అనుభూతి నర్తించే కలంలో
రంగులసిరా నింపే అనుభవాలు

హృదయం రాసిన లేఖల్లో
నీవు దిద్దించిన అక్షరాలు

అనంత నా జీవితయాత్రలో
నాతో కలిసి నడిచే పాదాలు

పిలుపుగ మారిన నీతో..

సరికావు నీ పిలుపుకి..

పాలకడలిలో అలల వరవడి
నాట్యశాలలో అందెల రవళి
పూజాస్థలిలో గంటల సవ్వడి
పిల్లనమ్రోవిలో కన్నయ ఊపిరి

పిలుపుకి రూపమిస్తే..

చలి చెర వదిలించే
గోరువెచ్చని ఉదయమైంది
చెలి మది కదిలించే
మృధుమధుర గీతమైంది

నీవే లోకమైతే..

పిలుపులో ఒదిగిపోయేందుకు
హృదయాన్ని అర్పించనా..
పిలుపుతో పునర్జీవినయ్యేందుకు
మరణాన్ని వరించనా..

ప్రణవం నీవైతే ..

నీకై జనించే ప్రణయ కావ్యాలు
మన జీవనవేదమంత్రాలు
నిన్నే జపించే శ్వాస నిశ్వాసములు
మన మమతానురాగాలు

అనురాగ సౌధం

పునాది బహుశా యుగాదినాటిది
అనాదిగా అసంపూర్ణం ఆ నిర్మాణం

*******************

మమతల చలువరాళ్ళు పరిచిన మండపం
అనురాగం వెల్ల వేసిన అమరప్రాంగణం

మందిరానికి ప్రవేశం కావాలా?
చూపు మరి..
ప్రేమనిండిన నీ మానసం

హృదయం లోకి తొంగిచూడు
నీ కొరకు తెరిచేవున్నదో ద్వారం

*******************

అణువణువునా యేక తాళం
ప్రేమ పల్లవించు నాగస్వరం

స్వరలహరిలో గళం కలుపుతావా?
ఏది మరి..
సప్తస్వర సమ్మోహన గీతం

జ్ఞాపకాల్లోకి వెళ్ళిచూడు
నిత్యం సాగుతుందో అలాపన

********************

బీట పడిందని ఆందోళన కదు?
చేయి తాకితే అతికిపోయే కలతలివి

జతలయలో పల్లవిస్తావా?
రానీ మరి..
జీవముట్టిపడే కంటి జలధారలు

అనుభూతులు వెదికిచూడు
శాశ్వత బంధానికి చిరునామాలవి

********************

బీడువారిందని వేదన చెందావా?
ఒక విత్తు ఆ క్షేత్రాన నాటి చూడు

వేయిపుట్ల సేద్యం చేస్తావా?
కానీ మరి..
వెంట వున్నారు కోటి సహవాసులు

పుడమి తరిచి చూడు
కనపడతాయి అనేకానేక రంగవల్లులు

********************


నిను నీకు వెదికిపెట్టే వీలుందా?
నీ మనిషిని నువు గుర్తిస్తే చాలు

ప్రేమిక హృదయవైశాల్యమెంత?
పిపాసి వామన పాదమంత

అనురాగ సౌధ కూలీలెవరు?
సమస్త సృష్టిలో ప్రేమికులు వారు

సౌధాన వసించను నీకు తోడు ఎవరు?
మనసున్న మనిషికి మరొకరు ఎందుకు...

ప్రతి హృదయం కావాలి ఓ అనురాగసౌధం
మమతానురాగాలే మనిషి మనుగడకి వేదం

నిరీక్షణ లో

నెలవంకకి కర్రకట్టి చుక్కలన్నీ రాల్చేసా,
నల్లని ఆకాశాన ఊహల రంగవల్లి దిద్దేసా..

రేకు విప్పని మందారపునవ్వు చూసేసా,
ముడుచుకున్న అత్తిపత్తి ముగ్ధ సొగసు కొట్టేసా..

చూరుమూల గూటి గుసగుసలు వినేసా,
చిరుగాలి మువ్వల మోతకి రాగం కట్టేసా..

కరగనన్న కాలానికి నా ఎదురుచూపు సెగలద్దేసా,
నీ పాదాల సవ్వడికి నా గుండె మోత అడ్డు తీసేసా..

ఆవలి తీరాన ఆగిన నావకి అలల వలేసి లాగేసా,
నీవు పెంచిన వనాన నేను కుటీరమొకటి నిర్మించా..

తృటిలో..

కాలపు తుమ్మెద రెక్కల మీద
నా స్మృతి పూమొగ్గ పయనమైపోయింది..

ఊహల కట్టడమెక్కి నాకందనంత ఎత్తున
అనుభూతి శిఖరం అంచున నిలిచింది..

యాత్రకి అంకురం ఎవరి ప్రేరణ?
ఎరుగని అంచున ఎందుకు నాకీ నడక..

రెక్క తొడిగిన మనసు మాట వినేనా,
ఊసుకొక్క క్రోసు గతాన్ని కొలుచుకుంటూ..

తొలి మజిలీలో అతిధినయ్యాను,
నను పిలవని నెలవున నిలిచిపోయాను..

పారిజాతాలు పరిచి, పున్నమి నవ్వులతో,
నను పలకరించింది నా బాల్యం..

నిశీధి నివేదనలు ఎటు మాయమయ్యాయి?

ముందుకు సాగక తప్పని పయనం,
తొందరపడమని మానసం..

జావళీలు పాడి, కన్నియ కలల్లో,
జాడ తెలియక వగచింది నా యవ్వనం..

వెదుకుతున్న స్మృతి ఇక్కడా అగపడదేం?

ఎగిరే పావురం అలిసిన వైనం,
గతం కనరాని అనంతవృత్తం..

ఎగువదిగువల్లో బిగువు సడలిన మానసం,
సరోవరాన అరవిరిసిన బ్రహ్మ కమలం..

కంటి చెలమల్లో తడారని ఆనవాలు,
ఆత్మచూపిన దిక్కున నవ్విన చెలిమి..

పెదవి దాటని మౌనరాగం,
యుగాలు దాచిన అనురాగం..

మమత అందిన అంతరంగం,
కోవెల గంట పాడిన ఓంకారం..

గతమా, గమ్యమా మరిచెను మది,
ఎదురుచూసినది ఆ తోడు కొరకని..

ఆదమరిచినది ఆ ఆలంబనలోనే,
వేదన విడిచినది ఆ చేరువతోనే..

వాస్తవమాగునా వీడిపోక,
గారడి చేయుట విధి పోకడ..

ఊహకి పునాది అనుభూతి,
యోజనాలు తరిగేది లిప్తపాటునే..

తృటిలో చేజారిన క్షణాలు,
మదిలో చెరగని ఆలాపనలు..

కథ: తులసికోట

గోదావరి జిల్లాల్లో ఓ పల్లెటూరు. ఇప్పటికి ముప్పై ఐదేళ్ళ పైనాటి మాట. ఉమ్మడి కుటుంబాలు అపుడపుడే విడిపడుతున్న రోజులు.

సాయంసంధ్య వేళ. చల్లబడ్డ సూర్యకిరణాలు కాస్త ఎరుపుకి తిరిగాయి. పశువుల కాపర్లు గొడ్లని కాలవల్లో కడిగి ఇళ్ళకి మళ్ళిస్తున్నారు. వీధుల్లో కాస్త ఆ సందడి. కొందరు ముందు గుమ్మాలు చిమ్మి సాయంత్రపు ముగ్గు వేస్తున్నారు.

పాలు, పెరుగు, పాత ఆవకాయ పచ్చడి కొనుక్కోను ఇళ్ళ చుట్టూ తిరిగే రోజు కూలీలు, మనవల్ని చంకనేసుకుని పాలబువ్వో, పెరుగన్నమో, చారన్నమో తినిపించేవారు మరి కొందరు. గుమ్మాల్లో అరుగుల మీద దూకుళ్ళాటలు ఆడుతున్న పిల్లలు. కావిళ్ళతో మంచినీరు తెస్తున్నవారు, అలా రకరకాల జన సందోహం.


ఆ వీధి అంతా మండువా ఇళ్ళే. ఒకదాన్ని ఆనుకుని మరొకటి. పెద్ద పెద్ద ఎత్తరుగులు. అటువంటిదే ఆ ఇల్లు. గుమ్మానికి అటూ ఇటూ రెండు వాటాలుగా మేనత్త, మేనమావ సంతానం కి చెందిన చావిడి అది. సూరయ్య గారు వీధరుగు మీద కూర్చుని రామనామ స్మరణలో వున్నారు. ముడతలు పడ్డ మొహం, ఎనభైకి సుమారు వయసు, వయసుని తెలుపుతున్న బలహీనపడ్డ దేహం.

ఎప్పటిమాదిరే వంట పాకలో ఆయన కోడలు కమల అన్నం వార్చుతూ, చుట్టాలు వస్తున్నారని పాలేరు మీద మధ్య మధ్యలో కేకలేస్తూ హడావుడి పడుతూ వుంది. పెరటివైపు ఇంటికి, వంట పాకకీ మధ్యన తులసికోట.

వంట పాక గోడకి మట్టితో అలికి కట్టిన చిన్న అరుగు మీద ప్రత్తి వత్తులకి విడతీస్తూ కూర్చునున్నారు సీతమ్మ గారు. ఆవిడ కట్టుకున్న తెల్లచీరతో పోటీ పడ్డట్టు నెరిసిన జుట్టు. కళ్ళజోడు ఆమె యాభై దాటిన వయసుని తెలుపున్నట్లుగా వుంది. పరీక్షగా వింటే ఆవిడా యేదో స్మరణ చేసున్నట్లు తెలుస్తుంది.

"కమల, ఎందుకే అంత హడావుడి పిచ్చితల్లి. వచ్చేది మాధవ ఒక్కడేగా?" అన్నారు సీతమ్మ గారు చిన్నగా నవ్వుతూ.

మాధవ సీతమ్మ గారి కొడుకు. ఒక నెలగా అన్నగారింట వున్న తల్లిని తీసుకువెళ్ళటానికి ఆ రోజుకి వస్తున్నానని ఉత్తరం రాసాడు. పైగా ఆ మర్నాడు తండ్రి తద్దినం. కాలవ స్నానాలు వుంటాయి. ఊర్లోకి పెద్దగా ప్రయాణసదుపాయం లేదు. మూడు మైళ్ళ అవతల వంతెన మీద బస్సు దిగి, వూర్లోకి రిక్షాలు, బళ్ళు కట్టించుకుని రావాల్సిందే.

"మీరలాగే అంటారు పిన్ని. మా మర్యాదలు మానతామా." గోంగూర పచ్చడికని వేపిన పోపు రోటి దగ్గరకి తెస్తూ అంది కమల.

"నేను పచ్చడి నూరతాను. నువ్వు మిగిలిన పని చూస్కో." అంటూ లేచారావిడ.

"రంగా, కాస్త ఆ మంట ఎగదోసి నీళ్ళు కాగాయేమో చూడరా. పెద్దయ్యగారికి తోడేస్తే మళ్ళీ కాగుంటాయి చుట్టాలొచ్చేసరికి ..." కమల ఈ మాట అంటూ వంట పాకలోకి వెళ్ళింది.

సీతమ్మ గారు కూర్చున్న అరుగు వారగా కోళ్ళ గూడు. పాకకి, ఇంటికి నడుమ ఓ ప్రక్కగా బావి. బావి చాఫ్టాని ఆనుకుని నీళ్ళ తొట్టి. అందులో తేలుతున్న బీరకాయలు, అరటి కాయలు. కూరగాయలు పాడవకుండా అలా దాచేవారు.

పాక వెనగ్గా, మిగిలిన స్థలం అంతా మరీ వరసలు పెట్టి కాదు కానీ, ఓ మల్లె కుదురు, కరివేరు చెట్టు, నిత్యమల్లి మొక్క, నందివర్థనం, మందారం, కర్వేపాకు, నిమ్మ చెట్టు, మునగ చెట్టు, జామ చెట్టు, కనకాంబరాలు.

బావి వెనగ్గా చిన్న కూరమడి. బెండ, మెట్ట వంకాయ మొక్కలు, గోంగూర, తోటకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి మళ్ళు. వంట పాక వెనక నించి పాకిన ఆనప, బీర, దోస పాదులు. పందిరికి పాకించిన దొండ, చిక్కుడు. ఏపుగా ఎదిగిన మొక్కలు, చెట్ల తో పచ్చగా కళకళలాడుతున్న పెరడు. కోటలో గుబురుగా సిరివుట్టిపడుతూ తులసమ్మ.


పచ్చడి నూరుతూ సీతమ్మ స్వగతంగా అనుకుంది ఆయన ఈ లోకం విడిచి అప్పుడే ఇరవై యేళ్ళు గడిచిపోయాయి. తులసమ్మ ఆ ఒక్కరోజే కదా తలవాల్చింది. చేతులో పని సాగుతూనేవుంది మనసు ఆనాటి ఆలోచనల్లోకి సాగిపోతుంది.

*************************************************

సీతమ్మ సూరయ్య గారి మారుటి చెల్లెలు. వారిది తొమ్మిదిమంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ కుటుంబం. తండ్రి అచ్చియ్య గారు. నరసమ్మ గారు, సూరయ్య గారు ఇలా ఏడుగురు తర్వాత వారి తల్లి మరణించాక, రెండో వివాహం ద్వారా మరొక మగ సంతు, సీతమ్మ కలిగారు.

సీతమ్మని ప్రసవిస్తూ ఆవిడా ప్రాణం విడిచింది. అప్పటికే కాపురానికి వచ్చిన పెద్ద కోడలు, సూరయ్య గారి భార్య లక్ష్మీదేవి ఇక ఆ ఇంటికి ఆడ దిక్కు. అచ్చియ్య గారి తల్లి జానకమ్మ పెద్ద దిక్కు. సీత ని ఆవిడే పెంచారు. అచ్చియ్య గారు "బుల్లి" అని ప్రేమగా పిలుచుకునేవారు. అదే పిలుపు యేడుగురు అన్నలు, వదినలదీను.


స్వతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులు. ఖాదీ ఉద్యమం పల్లె పల్లెల్నీ వూపేసిన తరుణం. సీత కి అలా ఖాదీ వస్త్రాలు అలవాటు . తన పదకుండో యేట మేనమావ కొడుకు సూర్యం తో సీత పెళ్ళి జరగ్గానే తండ్రి మంచం పట్టేసాడు. సూరయ్య గారి చేతిలోకి ఇంటి బాధ్యతలు మారాయి.

పదిహేనేళ్ళ సూర్యం ఇంటిపట్టున వుండటం తక్కువ. కళాభిమానం ఎక్కువ. మంచి స్ఫురద్రూపి. ఆరడుల ఎత్తు, ఎత్తుకి తగ్గ మనిషి. ఎర్రటి మనిషి, నల్లటి వుంగరాల జుట్టు. నాటకాల్లో పద్యాలు లీనమైపోయి పాడుతుంటే జనాలు అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవారని సీతకి అన్నలు చెప్తూవుండేవారు. తనంత తను చూసిందెన్నడూ లేదు.


సీతకి పదహారో యేడు నడుస్తుండగా మాధవ కడుపున పడ్డాడు. తను పుట్టింటికి రావటం, స్నేహితునితో కలిసి సినిమాలు తీయటానికి సూర్యం మద్రాసుకి పయనమవటం ఒకసారే జరిగాయి. అంతదూరం సీతని ఒక్కదాన్ని పంపటానికి పెద్దలు ఇష్టపడలేదు.

అప్పటినుండి కుటుంబ బాధ్యత ఒకటొకటిగా వదిలేసాడు. కొంత బావగార్లు, మరికొంత అన్నగార్లు చొరవ చేసుకుని మందలించినా అతనిలో మార్పు రాలేదు. మరో ఐదేళ్ళకి లక్ష్మి పుట్టింది. సూర్యం రాకపోకలు ఎడం పెరుగుతూ వస్తుంది. కాస్త కాస్త పొలం అమ్మటం వరకు అతని ఖర్చులు పెరిగాయి.


మద్రాసులో ధాన్యం వ్యాపారం చేసే తమ వూరి మనిషి ద్వారా సూర్యం తనతో నటిస్తున్న కోమలవల్లిని వివాహం చేసుకున్నాడని విన్నది. అన్నగార్లతో కూడ ఆ మాట ఎత్తలేదు, మౌనంగా పూజలో నిమగ్నమై మనసుని వూరడించుకోవటం తప్ప. వదినలంతా మంచివాళ్ళే కానీ ఇద్దరికి మాత్రం కాస్త నోరు దురుసు. సూర్యం సంగతి తెలిసాక మాటజారారు. లోకువ కట్టారు. అయినా సీత నొచ్చుకోలేదు. భర్త నోట నిజం తెలుసుకోవాలనే ఆగింది.

సూర్యం ఆ మారు వచ్చినపుడు తటపటాయిస్తూ "నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు.." అంటూ ఆగిపోయింది.

"సీత ఇలా దగ్గరగా రా." సూర్యం గొంతులో తొణికిసలాడుతున్న ప్రేమ.

కళ్ళనీళ్ళు నిండిపోయాయి. ఆమెని పొదివి పట్టుకుని "నేను చెప్పేది నెమ్మదిగా విను. ఆ తర్వాత నీ ఇష్టం." అన్నాడు.

"నీకు తెలియందేముంది. నాకు నీవంటే ప్రేమ కి లోటు లేదు. నాటకాల పట్ల అభిమానం, అదే ఇప్పుడు సినిమాల పైకి మళ్ళింది. అది నా బలహీనత కూడ. కోమలి నాకు చిన్నప్పటినుండీ పరిచయం. మా ఇష్టం ప్రేమ అని తెలుసుకునే నాటికి మన వివాహం అయిపోయింది. తను నన్ను నమ్ముకుని మద్రాసుకి వచ్చేసింది. ఎవరి అండదండలూ లేవు. నీకు అంతా వున్నారిక్కడ. నాకు నువ్వు కావాలి. కానీ నా పట్ల పిచ్చిప్రేమ పెంచుకుని వచ్చేసిన ఆ అమాయకురాలినీ వదుకోలేకపోయాను. తనని వివాహమాడాను. నీ దగ్గర దాయాలనుకోలేదు. ముందుగా చెప్తే కోమలిని యేమైనా చేస్తారని భయపడ్డాను. నన్ను క్షమించు సీత. నేను చిక్కుముడిలో వున్నాను. నిన్ను, పిల్లల్ని వదలను. నేను నీ ఒక్కదానికే జవాబుదారీని. ఈ ముడి విప్పే భారం నీదే." అతని మాటల్లో నిజాయితీ.

అలాగే లేచి వెళ్ళి, కాళ్ళు చేతులు కడుక్కుని పూజ గదిలో కూర్చుండిపోయింది. "అమ్మా పార్వతి, నాకేమిటి కర్తవ్యం? నాకెందుకీ పరీక్ష?" సీత కళ్ళలో దైన్యమే కానీ కోపం లేదు. కుటుంబమే లోకం గా పెరిగిన మనిషి. అంత నిస్సహాయస్థితిలోనూ కోమలి ని గూర్చి "ఎవరి అండదండలూ లేవు" అని అతనన్న మాట మరవలేదు.

అలా దాదాపుగా ఓ వారం పది రోజులు అన్నపానాలు మాని విలపించింది. శోకం అణిగింది. ఆలోచన మొదలైంది.

"తనకి ఇద్దరి పిల్లల బాధ్యత వుంది. ఇపుడు అతన్ని బలవంతాన ఇక్కడ ఆపగల శక్తి తనకి లేదు. అలా చేసి అవతల మనిషిని అనాథని చేసి తను బావుకునేదీ లేదు. ఇల్లు వదిలి ఎక్కడికో పోయి బ్రతికే స్వశక్తి తనకి లేదు. ఇది దైవసంకల్పం. తనకొక పరిష్కారం కాలమే చూపాలి. తమ ముగ్గురి జీవితాలు ఈ బంధనంలో చిక్కడిపోయాయి. తను భర్తని ద్వేషించలేదు. అతనికి తన పట్లగల అనురాగంలో యే లోపం లేదు. బాధ్యతని విస్మరించి అలా అభిరుచి లోకాన పడి నడవటం మాత్రం తనని, పిల్లల్ని ఇబ్బంది పాలుచేస్తుంది. ఆ సమస్యకి కోమలి బాధ్యురాలు కాదు. ఇటు తన కుటుంబాన్ని నడపని వ్యక్తి మళ్ళీ ఆమె భారం తను తీసుకోవటం యెంత సబబు. ఈ పరిణామానికి కారణం ప్రేమా? తను దగ్గరగా లేక ఆమె చేరిక వలన జరిగినదా? అసలిక ఈ ఆలోచనల అవసరముందా?" స్వగతంగా ఎన్నిసార్లు ఈ మాటలే తిరగ తిప్పి అనుకుందో అన్నిసార్లు బరువెక్కిన ఆమె హృదయానికే తెలుసు.

సూర్యం ఆ సారి ఓ నెల వరకు వుండిపోయాడు. ఇద్దరి నడుమా ఇక ఆ ప్రసక్తి రాలేదు. కానీ ఆమె అన్నగార్లకి, అతని అన్నగార్లకీ విషయం తెలిసి అతన్ని వెలివేసినంత పని చేసారు. సీత అంత ఉత్తమ ఇల్లాలికి ఈ మనస్తాపం కలిగించిటానికి నీకు మనసెలా వొప్పిందని నిందించారు. సూర్యం మౌనంగా వుండిపోయాడే కానీ ఒక్కమాట తిరిగి అనలేదు.

అతను ప్రయాణమయ్యే నాటికి పంట చేతికొచ్చింది. పెద్దవాళ్ళెవరూ ఒక్క రూక అతనికి అందనీయలేదు. ఆ రోజే అతను వెళ్ళేది. గదిలో దండానికి తగిలించిన లాల్చీ తొడుక్కుని, వెనుదిరిగే సరికి సీత గది తలుపు మూసి దగ్గరకి వచ్చింది.

ముందుకు చాపిన గుప్పిట విప్పి అతని చేతిలో పెడ్తూ "కోమలికి నా కానుగ్గా ఇదివ్వండి." అంది. అవి ఆమె నల్లపూసలు. గొంతులో అదే సౌమ్యత.

"సీత, నీకున్న బంగారం అంతంత మాత్రం. నా సంపాదన ఎటూ లేదు. ఇది ఇలా ఇచ్చేయటం.." అతని మాట పూర్తయేలోగానే సీత వారిస్తూ, "అలా కాదు. నా మనసుకి తోచినదిదే. మీ జీవితాన్ని మా ఇద్దరికీ పంచారు. నాకు కలిగినది తనకి ఇవ్వటం లో తప్పులేదు," తిరిగి తనే పొడిగిస్తూ

"ఇది తప్పో వొప్పో నాకు తెలియదు. నాకు తెలిసిన లోకం చిన్నది. నా వంటి మనిషే తను అన్న భావన అంతే." అంది.

అతని మనసులో ఎక్కడో అప్పుడు కదలాడింది అపరాధబావన. "నన్ను క్షమించు సీత. నేను స్వార్థపరుడిని. తలవంపు పని చేసాను. రేపు కన్నపిల్లలు కూడా అసహ్యించుకుంటారేమో" అన్నాడు.

"అంత దూరం ఆలోచించకండి. ఆ సమయానికి అయ్యేదేదో అవుతుంది." అని "ఇదిగో ఈ నగ అవసరపడవచ్చు. మీకు డబ్బుకి ఇబ్బంది అని తెలుసు." అన్నాక గానీ గమనించలేదు ఆమె మెడలో పసుపుతాడు వుందని. సూత్రాల గొలుసు కూడా అతనికే ఇచ్చేసింది.

"నీకు ఋణపడిపోయాను సీత. ఈ కుటుంబాన్ని పోషించగలనాడే తిరిగి నీ దగ్గరకి తలయెత్తుకుని వస్తాను. అందాక మీ వారి, మా వారి అండదండలు నీకు రక్ష." అంటూ గుమ్మం వదిలాడు.

ఆమె మనసున తుఫాను వెలిసిన ప్రశాంతత. అతను తన దగ్గర యేదీ దాచలేదు. తనకి తోచిన విధంగా తను ముడివిప్పింది. అందరికీ ఆ పైవాడే అండదండ.

ఆ తర్వాత సూర్యం రాకపోకలు వేళ్ల లెక్కన అంతే. పిల్లలిద్దరినీ గుట్టుగా పెంచుకుంటూ, అన్నలు, బావగార్ల అండదండలతో సంసారం లాక్కొస్తుంది. పెద్ద వదిన నయం కాని జబ్బుతో కాలం చేయటం, అన్నయ్య ముగ్గురు పిల్లలకీ తనే పద్ద దిక్కైంది. నిజానికి పెద్ద మేనల్లుడిది దాదాపుగా తన వయసే. ఆ బిడ్డల పోషణలో భర్త ధ్యాస పూర్తిగా మర్చిపోయింది.

మాధవ తెలివైన కుర్రాడు. చదువులో చురుకు ఎక్కువ. ఎండనక, వాననక మూడు మైళ్ళు పడి వెళ్ళి ప్రక్క వూరి బడిలో చదువుకుంటున్నాడు. తండ్రి అంటే గౌరవాభిమానాలు. తల్లి అంటే అమిత ప్రేమ. చెల్లిని "పాప" అంటూ అనురక్తితో చూసుకునేవాడు. చూస్తుండగానే మరో పదేళ్ళు గడిచిపోయాయి. మాధవ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

మాధవ కి ఇరవైవ యేడు నడుస్తుండగా తండ్రి కబురందుకుని వెళ్ళి కలిసి వచ్చాడు. ఆ రాత్రి అన్యమనస్కంగా వున్న కొడుకుని "అబ్బాయ్ మాధవ, ఏమిట్రా అలా వున్నావు?" అని అడిగింది. ఏమీ లేదని మాట తప్పించబోయినా తల్లి వూరుకోలేదు.

"ఇక ఆయన మన మనిషి కాదమ్మా. ఆయనకి మరొక కొడుకు కూడా వున్నాడు. అతన్ని ఆయనే చదివిస్తున్నారు," మాధవ గొంతులో కనీ కనిపించని కోపం. "వచ్చేనెల్లో వస్తారట, నిలదీసి అడుగు." అన్నాడు.

సీత ముందు నివ్వెరపోయింది. తనకి తెలియదు ఈ విషయం. తర్వాత కొడుకు ప్రక్కనే కూర్చుని వెన్ను నిమురుతూ "నువ్వు చాలు నాయన నాకు. ఇక ఈ కుటుంబ భారం నీదే. తండ్రిని తప్పుబట్టబోకు. ఇవన్నీ మన చేతిలోవి కావు. కర్మఫలాలు. ఇన్నాళ్ళు మావయ్యలు మననెంతో ఆదుకున్నారు. ఇకపై నీవు నన్నూ, చెల్లినీ చూసుకోవాలి." అంది. అలా కాసేపు తల్లీబిడ్డా మౌనంలో మునిగి వుండిపోయారు.

మరొక మూడు వారాలకి సూరయ్య గారి పెద్ద కోడలు కమల బలవంతం మీద మూటలతో ఇంటికి వచ్చి చీరలవీ అమ్మే మాణిక్యాలరావు దగ్గర ఐదు రంగు బట్టలు కొని, ఆది జాకెట్టుగా తన ఖాదీ రవిక ఇస్తూ పసుపు బొట్టు అద్ది ఇచ్చింది. పుట్టాక సీత మనసున వున్న ఒకేఒక్క గాఢమైన కోరిక అది. రంగు జాకెట్టు తొడుక్కోవాలని.

ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకుని చివరగా తులసమ్మకి పూజకని పెరట్లోకి వచ్చేసరికి కాస్త తలవాల్చినట్లున్న కొమ్మలు చూసి మనసు కీడు శంకించింది. నీరు పోసి, కోటలో భూసింధూరం నుదుటికి అద్దుకుని అక్కడే కూర్చుండిపోయింది.

ఆ రోజే సూర్యం చనిపోవటం, వూరిలోకి శవాన్ని తేవటం అనువు కాదని దహన సంస్కారాలు మాధవతో అక్కడే పూర్తి చేయించారు. అప్పటికి సీత సూర్యాన్ని చూసి ఐదు సంవత్సరాలు.

అలా సీత రంగుల కల తెల్ల చీరగా ముగిసిపోయింది. ఇరవై ఐదేళ్ళ ఆమె వైవాహిక జీవితం గతానికి చేరిపోయింది. కన్నిటి వరదలో కుంకుమ తుడుచుపోయింది. పదకుండో రోజుకి వచ్చిన కోమలి సూర్యం ఫోటో ఒకటి ఇచ్చి వెళ్ళింది. అందులో సూర్యంకి ఆమె వలన కలిగిన బిడ్డ కూడా వున్నాడు. ఆ పఠాన్ని భద్రంగా దాచుకుంది. మనసులోని అతని రూపు తనేనాడూ మరవలేదు.

తమ్ముడు పోయాక అతని అన్నల్లో కాస్త మార్పు. పొలాల దగ్గర కాస్త స్వార్థాలు చూపారు. వచ్చినంత వాటాతో పెద్ద అన్నయ్యతోనే వుండిపోయింది.

మాధవ ఉద్యోగంలోకి చేరటం, అతని పెళ్ళి అవటం. ఇల్లు, పొలాలు అమ్మేసి చెల్లి కట్నంగా ఇచ్చి మంచి వరునికి ఇచ్చి పెళ్ళి చేసి తల్లిని తన వెంట తీసుకుపోవటం ఆ తర్వాత ఐదేళ్ళలో జరిగిపోయింది.

అంతవరకు వూరి పొలిమేర దాటని చెల్లిని హత్తుకుని సూరయ్య గారు విలపిస్తూనే పంపారు. అప్పటి నుండీ అపుడపుడూ అన్నల దగ్గరకి రావటం జరుగుతూనే వుంది.

*************************************************

వంతెన మీద ఆగిన బస్సు దిగిన మాధవ చెయ్యి పట్టుకుని ఆరేళ్ల భవాని చుట్టూ వింతగా చూస్తూ నడుస్తుంది. పైకి మడిచి రిబ్బన్లు కట్టిన రెండు జడలు. అంబ్రిల్లా మోడల్ గౌన్లో కూడా సన్నగా కనపడుతున్న పిల్ల.

ఒక ఐదు నిమిషాలు చూస్తే తెలిసిపోతుంది, గుక్కతిప్పుకోకుండా ప్రశలేస్తుందని. వంతెన కి కాస్త దిగువగా ఒక సోడాలు, కాస్త చిరుతిళ్ళు అమ్మే బడ్డీ కొట్టు, చిన్న టీ హోటల్, ప్రక్కగా సైకిల్ అద్దెకిచ్చే కొట్టు. అక్కడే ఓ నాలుగైదు గూడు రిక్షాలు, ఒక గుర్రపు బండి వున్నాయి.


"భవానీలు, రిక్షా ఎక్కుతావా? గుర్రం బండి ఎక్కుతావా?" మాధవ మాట పూర్తవకమునుపే "నాన్న గారు, నేను సైకిల్ తొక్కొచ్చా?" అ పిల్ల అడిగిన తీరుకి ముచ్చట వేసింది.

"అది పెద్ద వాళ్ళకమ్మా, నీకు కాళ్ళు అందవు. పోనీ నేను తొక్కనా?" అని అడిగాడు.

"భలే భలే, నేను ముందు ఎక్కుతాను." కేరింతలు కొడుతూ అంది.

సైకిల్ అద్దెకి తీసుకుని, తెలిసిన రిక్షా అతను జోగులుకి తన చేతిలోని బాగ్, పళ్ళ బుట్ట, మర్నాడు తన తండి సంవత్సరీకానికి కావల్సిన సామానులున్న అట్ట పెట్టె, సూరయ్య గారి ఇంటిలో చేర్చమని పురమాయించి, భవానీని ఎత్తుకుని ముందు కడ్డీ మీద కూర్చోబెట్టి నెమ్మదిగా తొక్కటం మొదలు పెట్టాడు. జోగులు వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు, అలవాటైన బాటే కనుక పైగా సవారీ ఎవరూ లేరు.

పొలాల మధ్య వెళ్తున్న కంకర రోడ్డది. కాస్త ఎతుకులు గతుకులు గా వుంది. భవాని కుతూహలంగా పరిసరాలు గమనిస్తూ యేదో ఒకటీ అడుగుతూనే వుంది. మధ్య మధ్యలో సైకిల్ బెల్ "ట్రింగ్ ట్రింగ్.." అని తన నోటితో జతకలిపి మరీ మోగిస్తూ సందడి చేస్తుంది.

కాస్త దూరం వెళ్ళాక, ఒక కాలువ మీదుగా వెళ్తున్న వంతెన మీద ఆపాడు. పిల్లని దించి సైకిల్ కి స్టాండ్ వేసి "అమ్మలు, నీకొక మాట చెప్తాను, గుర్తు పెట్టుకుంటావా?" అని అడిగాడు.

"ఓ ..." కళ్ళు రెండూ గుండ్రం గా తిప్పుతూ, నోరు కూడా సున్నాలా తిప్పి మరీ చెప్పింది.

"ఇదిగో చూసావా, ఈ కాలువ మీద ఓ తెల్ల దొర గూటి పడవలో అలా వెళ్తూ వుండేవాడు. నేను అప్పుడు నీ అంత వుండేవాడివి. అతనిలా దర్జాగా వుండాలనే చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు కూడా చదువుకుంటావా?" అని అడిగాడు.

"ఊహు నేను సీతమ్మామ్మలా పూజలు చేస్తాను. మామ్మకి పార్వతీదేవి కనిపించింది. నేను సరస్వతిని చూస్తాను." అమాయకంగా సమాధానమిచ్చిన కూతుర్ని చూస్తే మాధవకి తను వేసిన ప్రశ్నకి జవాబిచ్చేంత వయసు ఆ పిల్లకి లేదనిపించింది.

"నాన్నగారు, మరి అమ్మమ్మ వూర్లో రైలు బండి ఎక్కిన తెల్లదొర బిళ్ళలిచ్చాడట. అమ్మ చెప్పింది. నీకు ఆ పడవ ఎక్కినవాడు ఇచ్చాడా బిళ్ళలు, బిస్కట్స్?" అని అడిగింది.

"ఇచ్చాడమ్మా అంతకన్నా ఎక్కువే తాయిలం ఇచ్చాడు. అతనిచ్చిన స్ఫూర్తే ఇదిగో ఇలా నన్ను నిలబెట్టింది." యేదో లోకంలో వున్నట్లుగా అన్నాడు.

"నాన్నగారు, నాకు ఆకలి వేస్తుంది. నాకు పాలు కావాలి." కాస్త బిక్క మొహం పెట్టి అడిగింది. అప్పటికి గానీ ప్రయాణం హడావుడిలో పిల్లదానికి సాయంత్రం పాలకి ఎక్కడా ఆగలేదని గుర్తుకువచ్చింది.

"ఇదిగో ఇంకెంత ఇట్టే వెళ్ళిపోతాము." అంటూ పిల్లని ఎక్కించి హడావుడిగా తొక్కటం మొదలు పెట్టాడు.

ఊరి మొదల్లోకి వచ్చేసరికి పూజారి గారు యెదురయ్యారు.

దిగి నమస్కారం చేసి "బాగున్నారా హనుమాళీ గారు?" అని నమ్రతగా అడిగాడు.

ఎదురెండకి కాస్త మొహం చిట్లించి చూస్తూ "నువ్వటయ్యా మాధవ, ఇదేనా రావటం, మీ మావయ్య అన్నారులే ఇవాళ సందె వేళకి వస్తావని. మళ్ళీ పొద్దున్నే గోదావరికి ప్రయాణం కదా?" అంటూ "ఓరోరి ఈ అమ్మడెవరోయ్, నీ కూతురా?" అన్నారు.

"అవునండి, అమ్మకి బాగా అలవాటు. మూడురోజుల్లో తీసుకొస్తానన్నా వినకుండా, మామ్మని చూస్తానని పేచీ పెట్టి వచ్చింది. ఎప్పుడూ తీసుకురాలేదని వెంటబెట్టుకొచ్చాను." అన్నాడు మాధవ.

ఇద్దరు మళ్ళీ ఓ రెండు నిమిషాల పాటు కబుర్లలో పడ్డారు.

భవాని ఆకలి మాట మరిచిపోయి పూజారి గారి వాలకాన్ని కాస్త వింతగా చూస్తుంది. ఎర్ర పట్టు పంచె, చంకలో యేదో మూట, పిలక, జందెం ఇవి కాక ఆయన మాటలు కాస్త సాగదీస్తూండటంతో సగం సగమే అర్థమౌతున్నాయి.

"భవాని, ఈ తాతగారు నిన్ను మామ్మ దగ్గరకి తీసుకు వెళ్తారు. సరేనా?" అంటూ "నేనలా ఓ సారి చెల్లి పొలం చూసి వస్తానండి. దీన్నీ మావయ్య గారి ఇంటి దగ్గర దింపేస్తారా?" అన్నాడు.

"అలాగే నాయన, దానికేం భాగ్యం. పదవే అమ్మడు.." అని ముందుకు కదిలారు.

ఒక నిమిషం వూరుకుంది గానీ, నెమ్మదిగా ప్రశ్నల్లోకి దిగింది.

"తాతగారు, మీకు ఆ పోనీటెయిల్ యెవరు కట్టారు?" అని అడిగింది.

ఆయనకి పెద్దగా అర్థం కాలేదా మాట.

"ఏం చదువుతున్నావు అమ్మడు?" అని అడిగారు.

"నేను సెంట్ జాన్స్ స్కూల్లో యూ కె జీ చదువుతున్నాను. మా టీచర్ రెజీనా." అని చెప్పింది. ఒకటడిగితే అలా పది చెప్పటం అలాగే అలవాటైంది భవానీకి.

అలా కాస్త నడవగానే, ఆయన ఎదురుగ వున్న సందు వైపు చెయ్యి చాపి "ఇదిగో అలా చూడు ఆ దక్షిన దిక్కు ఇల్లు వుందే, అదే మీ నానమ్మ ఇల్లు. వెళ్తావా అమ్మడు. కాళ్ళు పీకుతున్నాయి. పెద్దవాడిని కదా." అన్నారు.

ఆయన చెప్పిన దిక్కు అవీ తెలియలేదు కానీ, తల వూపి "టా.. టా.." అంటూ అటుగా అడుగులేసింది.

ఇంతలో యేమీ తప్పిపోదులే అనుకుంటూ ఆయన ప్రక్క సందు వైపు నడిచారు.

నాలుగడుగులు పడ్డాయో లేదో, వెనగ్గా పెద్ద గొడ్ల మంద వచ్చింది.

బెదిరిన భవాని పరిగెట్టి ఎదురుగా వున్న అరుగు ఎక్కి స్తంభం చాటున దాక్కుంది. అవన్నీ వెళ్ళాక నెమ్మిదిగా దిగి, కాస్త బిక్క మొహం వేసి చుట్టూ చూస్తే తాతగారు చెప్పిన ఇల్లు కనపడలేదు.

అడుగులో అడుగేస్తూ, సన్నగా వెక్కిళ్ళు పెడుతూ, మూడు గుమ్మాలు దాటి, నాలుగో వాకిలి అరుగు మీద వున్న పెద్ద పుస్తకం చదువుతున్న తాతగార్ని చూసి, దగ్గరగా వెళ్ళి, కాస్త పాదాలెత్తి, ఆయన్ని తన బుల్లి చేత్తో తట్టి "తాతగారు, మా సీతమ్మామ్మ వుందా?" అని అడిగింది.

ఓ నిమిషానికి అర్థం ఆ మాట ఆకళింపుకి వచ్చాక, ఆయన కళ్ళ వెంట జర జరా రెండు కన్నీరు జారాయి.

"ఇన్నాళ్ళకి నా బుల్లి ని వెదుక్కుంటూ ఓ చిన్ని తల్లి వచ్చిందా.." అంటూ "బుల్లీ అమ్మాయ్ బుల్లీ ఇలా రామ్మా, చూడు ఎవరొచ్చారో.." అంటూ గుమ్మం లోంచి లోపలికి చూస్తూ కేక పెట్టారు.

గోంగూర పచ్చడి నూరి తీసి కమల కిచ్చి చెయ్యి కడుక్కుని, సన్నజాజి మాల కడుతున్న సీతమ్మ గబగబా గుమ్మంలోకి వచ్చింది. మనవరాలిని చూడగానే కొండంత సంబరం.

"బంగారు తల్లీ యెలా వచ్చావురా? నాన్న యేడి?" అని ఒక్కడుగులో మూడు మెట్లూ దిగి మనవరాలిని అక్కున చేర్చుకుని ముద్దాడి, చంకనేసుకుంది.

"బుల్లే, నాకిక దిగుల్లేదమ్మా. నీ మనవలు వచ్చేసారు నిన్ను వెదుక్కుంటూ, నిన్ను వాళ్ళే చూసుకుంటారిక.." అప్యాయంగా అంటున్న సూరయ్య గారి మాటల్లో ఇంకా ఆ ఆనందం పోలేదు.

మనవరాలిని లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు, చేతులు కడిగి, వేడి పాలు గ్లాసులో పోసి తెచ్చి వూదుతూ, వంటపాక ముందు వేసిన నవారు మంచం మీద కూర్చుని, వొళ్ళో కూర్చోబెట్టుకుని మనవరాలికి తాగిస్తూ ప్రయాణం సంగతి అడిగింది.

అసలు మనవరాలు వస్తుందని మాధవ జాబులో రాయలేదు. సీతమ్మకీ ఆ అనుకోని సంబరం అందులోనూ ఈ మనవరాలు అంటే ప్రాణం. పెద్ద మనవరాలు వాళ్ళ అమ్మమ్మకి చేరిక ఎక్కువ. ఈ పిల్లది పుట్టిన నాటి నుండీ తన ఒడి బిడ్డే.


సీతమ్మ గారికి చిన్నతనం నుండీ ఉపశమనం, మనశ్శాంతి పూజలే. భవాని పుట్టిననాడు పూజలో యేదో అనుభూతికి లోనయ్యారావిడ. అందుకే పట్టుబట్టి ఆ పేరు పెట్టారు. వెంట వెంట తిరిగేది. తల్లికన్నా తన దగ్గరే చేరిక ఎక్కువ.

పాలు గొంతులో నాలుగు గుటకలు పడగానే లేచి, వెనక వీపు మీదకి చేరి మెడ చుట్టూ చేతులు వేసి వెనక్కీ ముందుకీ వూగుతూ.."మామ్మ ఇది మన ఇల్లేనా?" అని అడిగింది.

"మనదేనమ్మా ఆ తాతగారిది. నీకు నాని అన్నయ్య ఎలాగో నాకు ఆ తాత గారు అన్నయ్య." అంది.

గబ గబా మంచం దిగి అలా మొక్కల్లోకి పరిగెత్తి ఓ నూరువరహాల గుత్తి తెంపుకుని తెచ్చింది. సీతమ్మగారిది బారెడు జుట్టు. ముడి పెడితే దోసిట పట్టేంత అయ్యేది. ముడివిప్పేసి, వచ్చిరాని జడ అల్లిక వేయటం మొదలెట్టింది భవాని. ఆ పిల్ల ఆ ఆట ఎప్పుడూ చేసేదే. అంతా అయ్యాక ఆ గుత్తి తలలో గుచ్చబోయింది.

"వద్దురా భవాని." మనవరాలిని వారిస్తూ అన్నారావిడ.

"ఎందుకు వద్దు మామ్మ?" అమాయకంగా అడిగిన అ పిల్లదాని కళ్ళలోకి చూస్తూ "తాత గారు లేరు కదా. అందుకు." అన్నారు.

"ఇక్కడా లేరా. మరి మనూర్లో అడిగితే వూరెల్లారన్నావుగా?" పిల్లదాని కళ్ళలో అపనమ్మకం.

"లేదు తల్లీ, దేముడు వూరికి వెళ్ళిపోయారు." ఆవిడ కళ్ళలో సన్నగా తడి.

సీతమ్మామ్మ ని అడిగే ప్రశ్నల్లో ఎక్కువగా "తాత గారు లేరు" అన్న సమాధానం వస్తుందని ఆ చిన్ని బుర్రకి అపుడపుడే తెలుస్తుంది.

'తను ఆటల్లో కుమారి జట్టు పచ్చీ కొడితే అమ్మాజీ తో ఆడుకుంటుంది కదా. మరి మామ్మ ఇంకో తాతగారిని తెచ్చుకోదా?' లీలగా వచ్చిన ఆ ఆలోచన పిల్ల దృష్టి పాక వెనగ్గా పరిగెడుతున్న ఎర్రావు లేగదూడ మీద పడటంతో అటుగా పరిగెట్టింది.

సన్నగా నిట్టూర్చి తనూ లేచి పిల్లని అనుసరించారు సీతమ్మ గారు. మునుపోసారి ఇలాగే దేముడి కుంకుమ పెడతానని పేచీ పెట్టి యేడ్చింది. ఇంకోసారి వాళ్ళ అమ్మ చీర తెచ్చి కట్టుకోమని మంకుపట్టు పట్టి కోడలు గదిలోంచి లాక్కేళ్ళే వరకూ హఠం వేసింది. ఇంకాస్త వూహ తెలిస్తేనే కానీ ఈ మారాములు మానదు అనుకున్నారావిడ.

ఓ గంటలోనే స్నానం చేయించి కాస్త పప్పుచారన్నం, పెరుగన్నం తినిపించగానే ఆ మంచం మీదనే ఆరుబయట మామ్మని వాటేసుకుని ఆవిడ పాడే పాట వింటూ పడుకుంది. భవాని అడిగడిగి పాడించుకునే ఆ పాట.


"అమ్మగారమ్మేది, ఆ పాల కొండేది, ఆ దొండ పండేది, అప్పుడు కాచిన నెయ్యేది. అమ్మా అమ్మా నిన్నేమన్నారే, కల కల వేగిన గారన్నారా? బుర బుర పొంగిన బూరన్నారా?" అని ఆవిడ అనగానే "నన్ను మా సీతమ్మామ్మకి దేవి ఇచ్చిన భవాని అన్నారు.." అనేది.

మాధవ రావటం, మిగిలిన మావయ్యలు, సంతానం కొందరు చేరటం అంతా కలిసి పిచ్చాపాటీ కబుర్లలో బాగా పొద్దు పొయ్యేవరకు మెలుకువగానే వున్నారు.


*************************************************

మాధవ తెల్లవారు ఝామునే బయలుదేరి వెళ్ళాడు. వెంట అతని పెద్దనాన్న కొడుకు చంద్రం, ఒక మేనమావ ధర్మరాజు వెళ్ళారు. హనుమాళీ గారు కూడ సందు మొగల్లో కలిసారు.

భవాని లేచే సరికి వేడి వేడి ఇడ్లీ వేసిక కమల తినిపించింది. "పద మరి ఇవాళ మీ తాతగారి తద్దినం. తలారా స్నానం చేసి నైవేద్యం పెట్టు." అంది.

అంతా అర్థం కాకపోయినా "తాత గారు" అన్నది గుర్తుపెట్టుకుని, మాట విని బుద్దిగా తయారైంది. కోరా రంగుకి మంకెన పువ్వు రంగు పరికిణీ, చేతులకి గాజులు, మెడలో పద్మం హారం, చెవులకి జూకా బుట్టలు. మనవరాలిని కళ్ళ నిండా చూసుకుని 'ఆయనకి అదృష్టం లేదు. కొడుకు ఎదిగొచ్చేనాటికి పిలుపు వచ్చేసింది. పెళ్ళి, మనవలు అన్నీ తనకి మాత్రం దక్కిన భాగ్యం' అనుకున్నారు.

అటుగా వచ్చిన కమల "నా దిష్టే తగిలేట్లుంది పిన్ని." అంటూ బుగ్గలు పుణికింది. పూల సజ్జతో మొక్కల్లో తిరిగి మందారాలు, నిత్యమల్లి, కరివేరు అవీ కోసుకొచ్చింది.

మామ్మ పక్కన కూర్చుని పూజ గమనిస్తూ ఆవిడ చెప్పినట్లు చేస్తూంది. భవానికి అన్నిటి లోకి తులసమ్మకి నీరు పోయటం, హారతి కి గంట కొట్టటం మహా ప్రీతి. అవి మాత్రం ఎవర్నీ చెయనివ్వదు.


భవానికీ ఐదో యేడు నడుస్తుండగా ప్రసాదం గా పెడుతున్న పటికబెల్లం పలుకులకి ముందే చెయ్యి చాపింది. "దేవికి నైవేద్యం పెట్టాక, మనం తీసుకోవాలమ్మా." అన్నారావిడ.

"మరి నేనే దేవీ ప్రసాదం అన్నావుగా. నేను భవానీని కాదా? నాకిస్తే దేవికి నేనిస్తా" అన్న ఆ చిన్నతల్లి మాటలకి, ఓ క్షణం నివ్వెరపడి 'అమ్మా పార్వతి, నన్ను మన్నించు ఇలా పసిదానితో పలికించావా.' అనుకుని ఆ నాటి నుండి పూలతో పూజే కానీ ఆవిడ ప్రసాదం మానేసారు.

మధ్యాహ్నం మూడు దాటే వేళకి గోదావరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు.

భవానీని చూస్తూ చంద్రం గారి అబ్బాయి అబ్బులు "మామ్మ భవానీకి నీ పోలిక వచ్చింది కదా?" అన్నాడు.

"కాదు మామ్మే నాలాగా వుంది." అని ఆరిందాలా చెప్తున్న భవాని మాటలకి అంతా నవ్వుకున్నారు.

మర్నాటికి తాతగారు చదివే పెద్ద పుస్తకాన్ని భగవధ్గీత అనీ, ఆయన వ్రాసేది రామకోటి అనీ కనుక్కుంది.

మూడోరోజు ప్రయాణమయ్యేనాటికి కమల వండిచ్చిన తొక్కుడు లడ్లు, చక్కిడాలు, కొబ్బరరిశెలు, మినపసున్ని ఇలా అన్నీ కలిపి మళ్ళీ ఐదారు శాల్తీలు అయ్యాయి. అబ్బులు యడ్ల బండి కట్టి వంతెన వరకు దింపాడు.

మాధవ ఆపిన వంతెన చేరగానే "మామ్మ, నాన్నగారికి ఇక్కడే తెల్లదొర తాయిలం ఇచ్చాడట. అందుకే పెద్దచదువులు చదివారట. నాకు నువ్వు తాయిలం ఇవ్వవా నేను సరస్వతి పూజ చేస్తాను." అంది భవాని.

"మాటల మూట ఇది, మామ్మ. వదలాలని లేదు." అంటూ "భవాని ఇక్కడ వుంటావా?" అని అడిగాడు అబ్బులు.

"ఊహూ, మా సీతమ్మామ్మ తాతగారి జట్టు పచ్చి చెప్పిందిగా. నేను కొత్త తాతగారిని తెస్తాను. నేను సరస్వతిని చూసి వస్తాను. అపుడు వస్తాను. నీకు ప్రసాదం ఇస్తాను అన్నయ్యా." అంది ఆ పిల్ల.

అంతా నవ్వుల్లో మునిగిపోయారు కానీ సీతమ్మ గారు ఆ పిల్ల మాటల్లో దృడత్వాన్ని గమనించారు. "ఈ పిల్ల అనుకున్నది సాదిస్తుంది. పట్టుదల ఆ దేవి ఇచ్చే దీవెన కావాలి." అని మనసారా మరోసారి మొక్కుకున్నారు.

"అలాగేలేవే చిన్న సీతమ్మ." అని మాధవ మురిపెంగా అన్నాడు. అప్పటి నుండి కొన్ని వందలసార్లు తన తల్లిని ఆ పిల్లలో చూసాడతను. తన నాయనమ్మ కథల్లో, కబుర్లలో ఎన్నో విషయాలు తెలుసుంటూ, చదువుల్లో, ఆట పాటల్లో రాణిస్తూ ఎదుగుతూంది భవాని. తులసమ్మ పూజలందుకుంటూ పచ్చగా కళకళలాడుతూ ఆ చిన్నారిని దీవిస్తూంది.

*************************************************

చూస్తుండగానే మరో పద్దెనిమిది యేళ్ళు గడిచిపోయాయి. సీతమ్మ గారు పూజల నుండి ధ్యాన మార్గం లోకి వచ్చారు. ఆవిడననుసరించి భవాని కూడా ధ్యానసాధనలోకి మారింది.

ఆవిడ ఓ రోజు తన జీవితం గురించి చెప్పి, తాతగారి చిత్రాన్ని చూపించారు. కోమలి తన తాతగారి వివాహం, వారిని అంగీకరించిన సీత క్షమ, కరుణ ఇవన్నీ ఎలా సాధ్యం? ఇది ప్రేమ చేసే గారడీనా? తన మనిషిని గూర్చిన ఆరాటమా? తన వరకు అనుకుంటే కుంచించుకుపోయే మనసు, తనవారికి అనేసరికి అలా విస్తరిస్తుందా? అందర్నీ కలేసుకుపోయే తత్వాన్ని కలగజేస్తుందా? అనిపించింది.
భవాని జీవితం ఆవిడ జీవితం నుండి యే పోలిక తెచ్చుకోనుందో కాలమే తెలపనుంది. కాలానికి అతీతంగా జీవితాల్లో మార్పు రాని అంశాలెన్నో వున్నాయి. అవి మనసుకి, మమతకి చెందినవి.

భవాని చదువు పూర్తి చేసుకుని, మంచి ఉద్యోగస్తురాలైంది. సీతమ్మ పోలికలు పుణికిపుచ్చుకున్నా ఆధునిక భావాలతో పాటు ఆవిడ నేర్పిన వినయం, పద్దతులు, సాంప్రదాయాలు కూడా అలవరుచుకుంది.

మొదటి జీతం నాటి నుండీ వృద్దాశ్రమాలకి, నిస్సహాయ స్త్రీలకి తన వంతు ఆర్థికసహాయం అందిస్తుంది. పిల్లల్లో చదువుకోవాలన్న ఆసక్తిని కలగజేసే ప్రయత్నాలు, సహాయ కార్యక్రమాలు చేసేది.

సీతమ్మ పంచిన అనురాగమే తన గుండెల నిండా నింపుకుంది. చదువు అవగానే పెళ్ళై ఒక బిడ్డకి తల్లైంది.


పిల్లాణ్ణి చూడటానికి వచ్చిన మేనత్త వొడిలో పడుకోబెట్టి, "మామ్మకి నువ్వైనా చెప్పు అత్తయ్యా? నాతో తీసికెళ్తానంటే రానంటుంది. అమ్మ అశక్తురాలు. మామ్మ వస్తే నాకు తోడుగా వుంటుంది." అంది భవాని.

"బిడ్డ మీద బిడ్డలా నేను వస్తే నీకు ఆటంకమే కానీ ఆసరా ఎక్కడిది తల్లీ.." సీతమ్మ మాట అవక మునుపే "మరదే నిన్ను పనికా తీసుకువెళ్ళేది." చిరుకోపంగా ఆడిగింది.

వెనక్కి తిరిగి వెళ్తున్న మేనకోడల్ని చూస్తూ "అమ్మా ఇది నిజంగా 'చిన్న సీతమ్మే' ఆ వాటం, ఆ జడ అదీ.." అంది మేనత్త.

భవాని స్నానం అయ్యి వచ్చేలోగా సీతమ్మ గారు తన చెవి దుద్దులు తీసి, కడిగించి మనవరాలి చేతిలో పెట్టి "భవానీలు మామ్మ గుర్తుగా పెట్టుకోమ్మా." అన్నారు.

రెండు కళ్ళ నిండా వూరిన కన్నీరు తుడిచే ప్రయత్నం చేయకుండా "మామ్మ నేను నీ బంగారాన్నే ఎప్పటికీను. నీ జీవితమే నాకు కొంగు బంగారం." అంది.

మేనత్త బలవంతంతో ప్రయత్నించినా దుద్దులు పట్టక, ఎదురింటి కస్తూరి అక్క సలహా మేరకి పొగాకు కాడలు పెట్టుకుంది, ఓ వారానికి కాస్త తమ్మి సాగి దుద్దులు పడతాయని.

ఆ సాయంత్రం వచ్చిన బంధువు, వరసకి బావ అయిన గాంధి మేళమాడుతూ "ఏమే చిన్న సీతమ్మ, చెవి వెనకాల పెట్టుకోవాల్సిన ఆ చుట్టలు, చెవిలో పెట్టావేమే. నువ్వూ మీ మామ్మలా తింగర బతుకు బతుకుతావా?" అని నవ్వాడు. అతనికి అలా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట జారటం బాగా అలవాటు.

"లేదు బావ, ఎలాగైనా మా మామ్మ దుద్దులు పట్టించాలని ఈ ప్రయత్నం." అంది చిరునవ్వుతో భవాని.

సీతమ్మ గారి కళ్ళలో తృప్తి, మనసులో ప్రశాంతత. మనవరాలు తన మాదిరి కాదు. మంచి, మన్నన ఎరిగిన పిల్ల, తెలివైనది, తన కాళ్ళ మీద నిలబడ్డ పిల్ల. జీవితానుభవాలు చదివింది. కష్టాలు సుఖాలు చవిచూసినా సమర్థవంతంగా బండి లాగగలదు అనుకున్నారు.

*************************************************

అనుకున్నట్లే సీతమ్మ గారిని వెంట తీసుకుని వెళ్ళింది.

ముని మనవడికి సీతమ్మ గారు మనవరాలికి పాడిన పాట మళ్ళీ పాడుతున్నారు. పనికి తోడుగా వచ్చిన ముత్యాలు కాళ్ళ మీద వేసుకుని నువ్వుల నూనె రాసి కాళ్ళు చేతులు సాగదీస్తుంటే బోసిమొలతో, వేళ్ళు గుప్పిట పెట్టి నోట్లో కుక్కుకుని కిల కిల కేరింతలు కొడుతున్న కొడుకుని మురిపెంగా చూసుకుంటూ, భవాని అప్పటికప్పుడు రాసి, బాణీ కట్టి పాడుతున్న పాట.

మాటా మంతి లేదు,
సిగ్గు ఎగ్గు లేదు,
నోటిలో మాత్రం వేలు,
నవ్వులో మంచి ముత్యాలు,
చెప్పుకు పోతే వేవేలు,
మా చిన్నీ తండ్రికి జేజేలు.

అనుభవం కూడా కొంగు బంగారమే. సీతమ్మ గారి జీవితం, మాధవలో బాధ్యతని పెంచితే, భవానీకి భావికి బాట చూపింది. వారిరువురి జీవితాలు తర్వాతి తరాలకి మార్గదర్శకం. తులసమ్మ కి కుంకుమ పెట్టి, నీరు పోస్తూ నానమ్మ నుదుట కుంకుమ లేని కారణాలు వెదికిన భవాని ఈ నాటికీ తులసిమొక్క పెంచుతూనే వుంది. ఆ మొక్క నాటిన కుండీలోని మట్టిని పవిత్రంగా నుదుట ధరిస్తూనేవుంది.

దర్పణ దర్శనం

మరువం ఉష | దర్పణ దర్శనం

ఉంటాను ఆకాశదీపమై-
ఏ అగాధాల చీకటిలో నువ్వున్నా,
వెలుగుధారనై నీలోకి వర్షిస్తా..

ఎదురొస్తాను మోడునై-
దావాలనమై నీవు రగిలితే,
నాలోకి నిను రప్పిస్తూ..

చేరుకుంటాను మారుతమై-
వడగాడ్పు నిను కమ్మేస్తే,
శీతలపవనమై నిను కాచుకుంటూ..

నిలిచివుంటాను ధరిత్రినై-
వేదన నిను కుదిపేస్తే,
క్షమగా నిను మారుస్తూ..

జాలువారుతాను హిమపాతమై-
భీతి నిను దహిస్తే,
కరుణ సాగరమై నిను కలుపుపోతూ..

ఎగిసివస్తాను ఉప్పెనై-
కంటితడి నీ చూపునాపితే,
గుండె బరువు నేను మోసుకెళ్తూ..

వెదకబోకు ఎక్కడ నేనని-
నీవినా మనలేని నేను,
నీలోని ప్రకృతిగా నేనౌతూ.. 

నీ ముందర కొస్తుంటాను, 
నిను నీకు చూపగ, నను నేను చూసుకుంటూ.
ఈ దర్పణానికి మనమిచ్చిన పేరు "జీవితం"

అక్షరమా నీకు వందనం!

అనుచితపోకడల్లో చిక్కిన అక్షరానికి నా వంతు వందనం సమర్పిస్తూ...
సరస్వతీదేవిని ఒక్కసారి ఇలా అభిషేకించాలని..
మరి నలుగురు పఠిస్తే ఆ తల్లికి సేవ.
*************************
అమృతం సేవించకనే చిరాయువువి

ఆదిపరాశక్తిని నుతించగ కనకధారవి

ఇహము పరము ఎరుక పరచగ పదసోపానివి
ఈశ్వరుని కనులెదుట నిలిపేటి జ్యోతివి

ఉత్తుంగ తరంగమైనా, ఉప్పెనవైనా నీకే చెల్లు
ఊహాతీతలోకాన కదనాశ్వానివి నీవు

ఋషీశ్వరుల తూనిక జార్చిన స్వర్ణాభరణం నీవు

ఎన్నో చరితలు చెప్పినదానవు
ఏ యుగానైనా జాతి మనుగడ నీవు కూర్చేడి భాషే
ఐహిక జీవిత పరమార్థ బోధనకీ నీవె మూలాధారం

ఒద్దిగ్గా నీవమరిన వాక్యం అపురూపం
ఓంకారాన ఒదిగింది, ఓరిమి బోధించినది నీ అల్లికలే
ఔన్నత్యం పదంలోనేనని చూపిందీ నీవే

అందమైన మనసుని పరచగ ఆలంబన నీవే
అచ్చుల్లో, హల్లుల్లో భావావేశాలు పొదగనీ
నీ అమర చిత్రం నను మరోమారు దర్శించనీ

సరిగమల అలరింపుల్లో నర్తించావు
తకధిమితోం పాద కైతల్లో నడయాడావు
సెలయేటి పాటల్లో ఈదులాడావు
సంద్రపు అలలంటి కావ్యాల్లో కదలాడావు

నీ దివ్య తేజసుని మాకు అనునిత్యం ప్రసాదించు
క్షమనొసంగి మనిషి అల్పగుణాన్ని అంతమొందించు
పలుకున, పదమున నిను ధ్యానించు ఇంగితమివ్వు
నాగరికత కి ఆలంబన అక్షరం అని నినదించనీ

విచ్చుకత్తులు రువ్వేటి వికృతభావనల్లో అలిసావా?
మనసుని పొడిచేటి శూలమయ్యానని వగచావా?
అమానుష కలానికి చిక్కానని వణికావా?
నీ స్వేఛ్ఛనదిమేటీ కుయుక్తి నిలబడునా కలకాలం?

కవాటాలకి కళ్ళెం వేయగవారెవరు
గవాక్షాలు మూయగల శక్తులేవి
అక్షరజ్యోతికి చమురులేనిదెక్కడ
కవితామతల్లికి పూజలందనిదెన్నడు?

**********************

బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్
హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజ దార సుతోదర పోషణార్థమై !!
కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భరతీ !!

పదం పర గతమై రాజుల చేతిలో ఇచ్చి తన కూతురు వంటి కావ్య కన్య ను రాజుల చేతిలో పెట్టి డబ్బు తీస్కోవటం ఆ పడుపు కూడు కంటే వ్యవసాయం చేసుకుంటూ వుండటం మేలని పోతన గారి పద్యం.

ఆయనకు ఒక రాత్రి సరస్వతి కనపడి ఏడ్చిందట ఇలా నన్ను ఎందుకు ఇలా అమ్ముకున్తున్నావు అని.

ఎందుకో మనసులో అది తోచింది.

స్నేహమా..

మొదటిసారి నీవు తలుపు తట్టినపుడు,
నా చిరునామా నీకెలా తెలుసునని అడగలేదు, గుర్తుందా?
నను వెదుకుతూ నీవొస్తావని నాకు ముందే తెలుసుగా..

నీ చేయి నా చేయి కలిపి బంధమడిగినపుడు,
మిగిలిన వివరాలేవీ అడగలేదు, అవునంటావా?
అంతకన్నా నీవు మరేమీ కోరవని నాకు ముందే తెలుసుగా..

నా మనోప్రాంగణంలో నీ మాట పారిజాతాలు పరిచినపుడు,
దోసిలొగ్గి పొదివి పట్టుకున్నాను, మర్చిపోయాననవుగా?
అవి నాకోసం జారిన ముత్యాలకోవలని నాకు ముందే తెలుసుగా..

నా కంటినీరు నీ వేలికొసల్లో ఆవిరైనపుడు,
నీకూ వేదన చెలరేగిందని అన్నావు, నిజమేకదూ?
అదే మన జీవననాదమని నాకు ముందే తెలుసుగా..

నా పంటిమెరుపు నీ కనుచూపుల్లో రూపుదిద్దుకున్నపుడు,
నా తనువు మిడిసిపడిందన్నావు, నవ్వేస్తున్నావా?
నీ అత్మీయజలధారల్లో తడుస్తానని నాకు ముందే తెలుసుగా..

ఇన్నీ తెలిసిన నాకు తెలియనిదల్లా ఒకటే, అసలు నీవెవరవని.
అన్నీ అడగక చెప్పే నీకూ తెలియనిదదొకటే అని కల్లో చెప్పావుగా.
మనమీ వూసు కనుక్కోను మరుజన్మలోనూ కలుసుకుందామా?

*************************************
"
ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా. ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా... ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా, నిలువగలన నీపక్కన" అని నాకన్నా ముందు ఘనత చాటుకున్న కవిగారికి మీద కన్నెర్ర చేసుకుని, అయినా నేస్తం వుండాల్సింది నా పక్కన కాదా అని సర్ది చెప్పుకుంటూ...

అమ్మలేనిదెక్కడ?

కొమ్మంటు పూత యేరులై రాలితే,
వేరు పడ్డ తల్లివేరు ఎగిసిపడదా శోకాన?
పూతకొమ్మ పురివిప్పి వాలితే,
ఒడి పంచిన నేలతల్లి మిడిసిపడదా ముదమార!


లేగదూడ పొదుగులోకి రానంటే,
అమ్మవొడి అగ్గికొండ అవదా?
మందవిడిచిన మేకపిల్ల మరలివస్తే,
తల్లి సంబరం అంబరాన ప్రతిధ్వనించదా!

పక్షి గుడ్డు పుట్టలోకి జారిపోతే,
రెక్కవిరిగే వరకు వెదుకులాట ఆగునా?
గూటిలోని కువకువ గుండెకి చేరితే,
అమ్మతనపు కులుకు అవనికి ఓంకారం కాదా..

ఇక పంతులమ్మకి పాఠాలు!

నవ్వులు పంచే పాఠాలు నేర్చుకోవాలనుందా? కాస్త ఇది చదవండి మరి.

జనవరి నెల కాస్త చలికి వణుకుతూ, బుల్లి బుల్లి బన్నీల్లా, టెడ్డీ బేర్ బొమ్మల్లా, పాపం, మానకుండా వచ్చారు అన్ని క్లాసులకీ దాదాపుగా. మానినవాళ్ళ మాటలివి.

"ఏమ్మా ఎందుకు రాలేదురా?"

.. నేను "అదుర్స్" సినిమాకి వెళ్ళాను. [నేను అదిరిపడ్డానని చెప్పాలా?] :)
.. అమ్మ షాపింగ్ లో లేట్ చేసి నా క్లాస్ మిస్ చేసింది
.. నాకు నిద్ర వచ్చింది
.. మా డాడీకి టాటా చెప్పటానికి ఏర్పోర్ట్ కి వెళ్ళాను

మంచి పంతులమ్మని కనుక "దొంగ జ్వరాలు" రావు వీళ్ళకి. :) రావాలనే పరుగులు తీసి వస్తారు. పదిమంది పిల్లకాయలు, ఒక గురువాంటి అని లెక్కలూ వేస్తారు. ;)

ఈ నెల అంతా పదాలు వల్లె వేయటం, వ్రాయటం మీదనే సాధన జరిపాము.

నేను పదాలు ఇలా విడగొట్టి వ్రాయటం నేర్పాను.

౧. ముందుగా రోమనైజ్డ్ పదంగా వ్రాసి విడగొట్టటం.

iTuka -> i|Tu|ka

౨. తర్వాత ఒక్కో అక్షరం కూర్చటం
i = ఇ
Tu = ట + ఉ = టు
ka = క

iTuka = ఇటుక

ఆ పై విధంగా ప్రతి గుణింతానికీ పదాలు, దాదాపుగా అన్ని హల్లులు వాడి నేర్చాము.

మరి రెండు ఉదాహరణలివి.

bhaarya -> bhaa|rya

bhaa = భ + అ = భా

r!ya = ర ++ య = ర్య [వాళ్ళకి గుణింతం కి వత్తుకి తేడా ఇలా నేర్పాను]

bhaarya = భార్య

attammaa -> a|tta|mmaa

a = అ

t!ta = త + త = త్త

m!maa = మ + అ ++ మ = మా ++ మ = మ్మా

attammaa = అత్తమ్మా

నెలాఖరుకి పిల్లల స్థాయి ఇది.

వైష్ణవి, సాహితి, స్నేహ,నేహ, మేఘన, స్ఫూర్తి, అనీష(సంతు): ఈ ఏడుగురు పిల్లలు "అమ్మ మాట చల్లన, ఆవు పాలు తెల్లన..." పాట మొత్తం తెలుగులో వ్రాయగలిగారు.

శ్రీవల్లి, అలేఖ్య, అనూష, అనీష: నలుగురు తేలిక పదాలు వ్రాయగలుగుతున్నారు.

లలిత్, తేజస్, సంహిత్ :
ఈ ముగ్గురు అక్షరాలు వ్రాస్తున్నారు. వీళ్ళు మరీ బుజ్జాయిలు కనుక ఇదే పెద్ద జంప్. మరదే కదా మగపిల్లలు వెనకపడిపోయారు, వెనగ్గా పుట్టారు కాదా మరి. ;)

***************************************
వ్యతిరేక పదాలు : నేను నేర్చిన పాఠాలు

పాత-కొత్త, పెద్ద-చిన్న, పొడుగు-పొట్టి, ఉంది-లేదు, పైన-క్రింద, లోపల-బయట

ఈ వరకు నేను చెప్పి ఇక వాళ్ళని చెప్పమంటే ఇదిగో ;)

పుట్టింది - చచ్చింది [ ఈ మాట కి అంతా నవ్వే సరికి, ఇది ఇదేదో గొప్ప ప్రయోగమనుకుని..]
వచ్చాడు - చచ్చాడు [నేను నవ్వి నవ్వి చచ్చిపోయాను నిజ్జంగా.. ఇది సినిమా పరిజ్ఞామని వేరే చెప్పాలా?]
బతికింది - చచ్చింది [ఆరేళ్ళ సంహిత్ ఈ మాట చెప్పటం వింతే సుమీ!]
అమ్మాయి- అబ్బాయి [ఇదెక్కడి లెక్కబ్బా! ;)]

***************************************

నెమరువేత: పది పదాలు వల్లె వేయించి, తిరిగి చెప్పమన్నాను.

దాదాపుగా అందరికీ ఐదారు పదాల వరకు గుర్తున్నాయి. ఇద్దరు మూడు, మరిద్దరు ఎనిమిది చెప్పారు. ఇది వాళ్ళలో జ్ఞాపకశక్తికి కసరత్తు.

***************************************
జోడు పదాలు : ఇవి వాళ్ళకి తమ చుట్టూ పరిసరాల్లో చూసేవి గొలుసుకట్టుగా రావాలని నేర్పాను.

పిల్లి-ఎలుక; పాలు-పెరుగు; మొక్క-పువ్వు; కాయ-పండు; ఉప్పు-కారం

***************************************

లెక్కలు పెద్దగా చేయలేదు. నూట పదహార్లు, వెయ్యినూట పదహార్లు వంటివి చెప్పుకుని, వందల్లో అంకెల్ని తెలుగులో చెప్పటం ఎలాగో సాధన చేసాం. కొద్దిపాటి కూడికలు కూడా.

***************************************

పాటలు: ఒకటీ అరా పాడినా పైన సాధనకే పెద్దపీఠ ఈ నెల.

త్వరలో ...

ఫిబ్రవరి నెల నుండి అంతా రైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. దాదాపుగా అన్నీ మన రాష్ట్రానికి చెందిన అంశాలే. ప్రదేశాలు, నదులు, వృక్షాలు. వివరాలు వచ్చే నెలాఖరుకు...

వెఱ్ఱి తల్లి లాలి పాట!

ఏడ్వమ్మ ఏడ్వమ్మ బుల్లి మా వల్లి,
ఏడుస్తూ నీవలా నీలాలు కార్చమ్మ.
నీ ఏడ్పునాపంగా
నేనెంతదాననే,
ఆపైన నవ్వంటే నేర్పమంటే నావల్లనవునా చిట్టి తల్లీ ?


నీ కంటి నీలాలు తన దోసిటన పట్టే తోడురావాల..
తన ముత్యాల మూటలు నీ చెవిన పడాల..
నే పాడితే లోకమంత పచ్చనని
నీకనిపించు
పాటగ, బ్రతుకాటగ నోటి మాట ముద్దుకైనా నీకొద్దమ్మ


నీ రూపు, చూపు, మనసు, మమత అన్నీ వెతలంటారు వోర్వలేనోళ్ళు
నీవౌవుతావు సూర్యముఖి, చంద్రముఖి....... నువ్వవ్వాలి ఒక జ్వాలాముఖి
వెనుతిరగని గుండె దిటవు నీవు చూపేటి ప్రగతి మార్గం,
మా అందరి గుండె కోత నీకు చూపించే దిశా నిర్దేశ మవ్వని నా చిట్టితల్లి


పుడుతూనే తల్లివి, బొమ్మల పెళ్ళికి పెద్దవి కదమ్మ
బువ్వలాటలో నీ బుల్లి కడుపొకటే నిండనిది
నీ పేరు ఆడదమ్మ, అయినా అంటారట ఆడబొమ్మ ని
అవునమ్మ మీ అమ్మ వెఱ్ఱిదేనమ్మ, అచ్చంగా వాళ్ళమ్మలాగే


కలకన్నావా, వద్దొద్దమ్మా, రంగు నీ చూపుకంటుతుంది
ఇలమరిచిపోయావా, అసలొద్దమ్మా, కాలం ఆగిపోతుంది
మరిక యేముందంటావా, కొత్త పాట కట్టాల్సివుంది కాదామ్మా?
పాతపాట కొత్తపదాలతో మార్చి కట్టి నీ బిడ్డకి పాడవామ్మా?

పాటంటే పదాలు కాదని, అణువణువున జీవమని ఎలుగెత్తవా?
జ్వలించే కాంతి కిరణం వరించే ధైర్య ధరిత్రి నీ తోడు రాగా
సాగవమ్మా కొత్త దారుల అమ్మలందరికి కొంగ్రొత్త పాటవై
ధరణీ తలాన నూతన రాగమై..నా దీవెనల చలవ తోడుగా..

మరుజన్మ

దప్పికగొన్న జలధార హిమగిరికి వినతి నిచ్చిందనేమో
జలపాతాన్ని ఇముడ్చుకున్న కోన మూతి ముడిచింది
మేటలేసిన కూన మింటి వంక మోర చాపిందనా
అడగక అన్నీ ఇచ్చే నేల తల్లి నెర్రలుగ విచ్చిందనో
పాతాళగంగ వేయి పడగలెత్తి పరుగిడివచ్చింది
ముడుచుకున్న కోన హరితవనాల పక పక లాడింది

జలధార పరవళ్లలో పుష్కరాలొచ్చాయి

ప్రకృతి నైజం నదిని నిలవనీకపోయిందా?
నురగలుగక్కుతూ ఒడ్డుని ఒరుసుకుంది
గట్టులెక్కి తొక్కుడుబిళ్ళలాడింది
పాకుడురాళ్ళెక్కి జారుడుబండ జారింది
తామసికి తలవంచి తన పుటుక మరిచింది

ఉప్పెనై ఎగిసింది, ఉరుకురికి దూకింది

గుండెలవిసే వేగాన వూర్లమీద పడింది
అలిసాక ఆగింది, అదుపు తప్పాననుకుంది
ముంపులోని మాగాణిపైరు చూసి వెరచింది
శవాల గుట్టల దుర్గంధాన్ని పీల్చి వణికింది
బురదమట్టి కాలువల్లో ముక్కలైన తనువున ముగిసింది

గట్టు పక్కన కొండ గుండె పగిలింది

శిలలోని నీరు చితాభస్మానికి గంగ జల్లులై తాకింది
నది కడుపు మళ్ళీ పండింది, శిల ముద్దుబిడ్డైంది
కన్నెగా బతుకు ముగిసి తల్లిగా పుట్టింది
వెనకటి జన్మల పాపపుణ్యాలు సరిలెక్కలయ్యాయి
తృళ్ళింత నడక మందగమనగ మారింది

తడిమిన శిలని అక్కున చేర్చుకు వూయలూపింది
నోరు చాచిన జీవికి రొమ్ము కుడిపి తరించింది
పచ్చిక బైళ్ళలో లేడికూన నెమరువేతైంది
పాలకంకి పైన పిట్టనోటి కూతైంది
మావి చిగురులో లేత మెరుపైంది
మల్లియలో, మరువంలో మంచి గంధమైంది

కలలో కాంచనిది ఇలలో చూసి మురిసింది
మరో జన్మ ఇక వద్దని భూమిసుత నది కదిలింది.

ఆనంద హేల

నేల తోడుకని మొరపెట్టుకుందనా
గడ్డిపోచగ ఓ గుండె పలికింది?

ఎడద పరిచి ఆలాపించిందనా
కన్నయ్య రాధ కనులెదుట నిలిచింది?

నిద్రాణమైన బీజం నిర్వాణం చెందిందా
అనుభూతి అంకురం వటవృక్షమైంది?

మాను జిగురుధారల విలపించిందనా
కొమ్మ చిగురాకులు తొడిగింది?

శిల బీటలిచ్చి తనలోకి చేరిందనా
ఉలి తానై నది గులకరాయిగ మలిచింది?

కడలి ఆటై పోటై తోసుకువచ్చిందా
ఉప్పుటేరుల శోకం వెంటతీసుకుపోను?

ప్రకృతంతా పరుచుకుని ఆనందం నర్తించిందా
అనురాగధారని అక్షరపాదాలుగ మార్చి?