కనుక అనగనగా అని మొదలు పెట్టను. ఇలాంటివి చదివి మొహం మొత్తినవారు, నాకు పరమరోత అనుకునేవారు కూడా మరి వెనుదిరగండి. ఓ మారు నా వెనకటి ఊసొకటి విని "వూ..[ఊ.. కాదు ;)]" కొడతామనేవారు మాత్రం నాతో పాటు కన్ను కదపండి. కాస్త పోకడలున్నాయని అవటార్ చూసి రాసాననుకున్నా పప్పులో కాలేసినట్లే... ఇది చాలా ఏళ్ళ క్రితం రాసుకున్న జ్ఞాపకం.
విసుగ్గా మాట్లాడే పదాల్లో తరుచుగా నాకు పడ్డ/నేను విన్న పదం.."దున్నపోతు, మాట వినదు." :) అసలు ఆ పుల్లింగపదాన్ని పూబంతివంటి యువతుల మీద ఎందుకు వాడతారో నాకు అర్థమై చావదు. సరే కాస్త చించుకుంటే ఏతావాతా తేలింది (నేనే తేల్చాను) ఏమిటంటే, పురుష ప్రపంచంలోనే మాటవినని నైజం అనాదిగా పాతుకుపోయివున్నదని. ఇక పైచేయి వారి జాతిది కనుక వారి అవలక్షణాన్ని మనపై రుద్దుతారు కనుక అలా పరిపాటైపోయింది. ఇక నాది దున్నపోతు గారి స్త్రీలింగ ప్రాణి గురించి. ఇప్పటికీ ఆలస్యం కాలేదు కనుక రెండో బ్యాచ్ వారు ఇక్కడ బండి దిగేయండి. ఇక జోరు పెరుగుతుంది కనుక మళ్ళా ఆనక చివరి అక్షరం వరకు ఆగలేరు. నేను తోసినా దిగలేరు... ;)
నాకు ఇప్పటికీ ఇష్టమైన స్నాక్ - పాలు, వయసుతో నిమిత్తం లేకుండా నాకు యే రకం శారీరక అస్వస్థత వచ్చినా 'పోతపాలపిల్ల' అన్న కారణం తిరిగి కొత్తగా వెదికిపెట్టిన మా నానమ్మ మాట సాక్షిగా. అసలు మా ఇంట్లో నాన్నగారు పాడి అన్నది మొదలుపెట్టటం నా పాల కొరకేనేమో [అప్పటివారి మాటల్ని బట్టి ఇది నా వూహ]. అవి కూడా ఇంట్లో వ్యక్తులంత ఇదిగా స్థానాన్ని పొందాయి. అలాగే క్రమశిక్షణ విషయంలో నాన్నగారు వాటిని మా మాదిరే లెక్కవేసేవారు.
నాకు అన్నిటికీ పేర్లు పెట్టటం అలవాటు. సన్నజాజి, విరజాజి తీగల్ని గిరిజ, విరిజ, మా పాడిగేదెలకి లక్ష్మి, రంగి ఇలా అన్నమాట. నాకు వాటితో సంభాషించటం అలవాటే. అలా చేయబట్టే మా దొండతీగెకి వేసిన పందిరిగుంజ ములగమాను ఉరఫ్ మున్నీ కూడా చివురేసి నిటారుగా ఎదిగి వేల వేల ములక్కాయలని కాసిందని నా ప్రగాఢనమ్మకం. ఈ మాట చదివిన మరొకరికైనా ఇదే మాదిరి అనుభవం తప్పక వుండితీరుతుంది.
సరే ఇక లక్ష్మి కాలానికి వెళ్తే... నిజంగా బెదురుగొడ్డుకి రూపం ఇస్తే అచ్చంగా ఇలాగే వుంటుంది. దాని కళ్ళనిండా బారుగా సాగిన దాని కొమ్ముల్ని మించి బారుగా సాగే భయం. మా ఇంటికి వచ్చేసరికి నిండు సూడి మీద, రేపో మాపో ఈనటానికి సిద్దంగా ఉంది. నాన్నగారికి కోపం నాగరాజుకున్నంత బుసబుసల పాలపొంగు. ఇక ప్రేమ చూపితే అది నెలరాజు కురిపే కరణామృత వెన్నెలే. అప్పటికి పన్నెండేళ్ళ అనుభవం వున్న నాకే అప్పటికి సరిగ్గా బోధపడని ఆ విషయం, పాపం ఆ పిచ్చి మూగప్రాణికి ఎలా బోధపడుతుంది?
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవీను, నావి ఆ తర్వాత తెలుసుకుందాం, ఇప్పటికి ఈ కథకానికథలో వీరోయిన్ లక్ష్మి గారే.
రోజూ కొబ్బరినూనె రాయించేవారు రాత్రి పూట. వేడిగా వున్న పూట/దోమలు వున్నాయంటే ఫాన్ పెట్టించేవారు. తెల్లారేసరికి పొరపాట్న అది ఆ ఫాన్ని కింద పడేసినా, వంటినిండా మట్టి/గడ్డీ అంటించుకున్నట్లున్నా దానికో క్లాసు తప్పేది కాదు, దేహశుద్దీ తప్పేది కాదు. ఇంకొంచం వివరం చెప్పనీండి.
దాని గది/షెడ్లో కట్టుగొయ్యి, గడ్డి వేసే ప్రదేశానికి కలిపి ఓ పెద్ద కొయ్యదుంగ అడ్డం పెట్టేవారు. అది గడ్డి తొక్కకుండానన్నమాట ఈ ఏర్పాటు. పొరపాట్న కాలు ఇటుతీసి అటేసి నేమరేసిందంటే దరువులే. అలాగే పాపం, ఇటు చేయాల్సిన ఆ రెండు పనులూ ఆ కర్రకి అవతల చేసినా అదే శిక్ష. ఆపై దాని చెవిలో అరిచి చెప్పేవారు - ఎలా నిలబడాలి, ఏం తినాలి, ఎలా గడ్డి తినాలి, ఎటు తిరిగి మూత్రవిసర్జన చెయ్యాలి అన్నవి. నాకు ఆ షెడ్ పక్కన పందిరిమీద నవ్వే బొడ్డుమల్లి కన్నా మెరిసేనవ్వు ఆయన లక్ష్మికి చెప్పే మాటల వినటం వలనే అలవడింది [కావచ్చు ;)].
విన్నమాట విన్నట్టు వదిలేసేది కాదు కానీ, చాలా చిత్రంగా ప్రవర్తించేది మా లక్ష్మి మేడం. నాన్నగార్ని అటెల్లనిచ్చి కాలు తీసి దర్జాగా గడ్డీమీద నొక్కి పెట్టి నిలబడి మరీ తినేది. ఎందుకే మంచి గొడ్డుకో దెబ్బ అని వినలేదా నేను మొత్తుకున్నా పెద్ద లెక్కచేసేది కాదు. ఆనక నేల మీద పడి అటూ ఇటూ దొర్లేది. అసలలా స్వేఛ్ఛగా బతికేవాటిని ఇళ్ళలో బందీ చేయటం మనిషికి ఎలా తెలిసిందో.
ఒక్కోరోజు దానికి వేసే ఆ లేలేత పచ్చగడ్డి పరకలు మొహం మొత్తేవేమో, సాయంత్రం అలా గాలి పీల్చుకుంటుందనో, కాళ్ళు సాగుతాయనో మా నర్సింహులు [వీడు నా మొక్కల పట్ల కిరాతకంగా ప్రవర్తించినా ఈ జీవి పట్ల సమస్త ప్రపంచంలోని భూతదయ కలిపి కుమ్మరించేవాడు] తిప్పుకుని తీసుకొచ్చే సమయంలో చటుక్కున ఓ కూరగాయ మొక్క కొమ్మనో, నా పూల మొక్క రెమ్మనో తుంచిపారేసేది. ఆ సమయంలో దాని పెద్ద పెద్ద కళ్ళలో అదో ఆనందం.
తిరుగుబాటు బావుటా తాలూకు కళలు కొట్టొచ్చినట్లుకనపడేవి. నాన్నగారి మీద కోపం వస్తే ఆయన ఫొటోనీ గుండుసూదితో పొడిచే చెల్లి పనిని చూసీచూడనట్లు వూరుకున్నట్లే లక్షి గారి చేష్టలు నా వరకే ఆగిపోయేవి. కాన్వంట్ కి మధ్యాహ్నం భోజనం కారేజీ తెచ్చి, నేను తినేదాకా వుండకుండా ఇంటికి పోయి చాయ్ తాగే భాగ్యం ప్రసాదించాను కనుక నర్సింహులు కూడా నాన్నగారికి ఈ అల్లరి/ప్రతిఘటన తెలియనిచ్చేవాడు కాదు.
అతి కొద్ది రోజులకే రాము పుట్టాడు. వాడికి లేత బూడిదరంగు జుట్టు, నల్ల కళ్ళు, కొమ్ములు లేవు కాని గట్టి గుండు. భలే ముద్దుగా వుండేవాడు. నాకు దిగని ఇడ్లీలు లాగిస్తూ, కవ్విస్తే తలపడుతూ, గంతులేస్తూ వాడో కొత్త నేస్తం.
నా పిచ్చిప్రేమకి స్కూల్ నించి వచ్చి, వాళ్ళమ్మ ఇచ్చినవే ఓ కప్పు పాలు పట్టుకుని, వీడి ప్రక్కన కూర్చుని కబుర్లు. నా జుట్టులోంచి వెంట్రుకలు విడతీసి వాటికి వేరుశెనగ గుళ్ళు గుచ్చి, రాము మొహం ముందు తల వూపితే, వాడు ఆ గుళ్ళు లాగటం అదో ఆట మాకు, వెంట్రుకలు తెంపటం కూడా పరిపాటి. నా సంగతి తెలుసు కనుక అమ్మ ఏమీ అనేవారు కాదు. అలా రాముకి మేము కూరని చిరుతిళ్ళు లేవు. అసలు కుక్కపిల్లల్ని ముద్దు చేసేవారు మా దగ్గర శిక్షణ పొందాలి, అంత నిష్ణాతులం మేము [అదే నేను].
అలా మా సరాగాల స్నేహం సాగుతుండగా ఓ సారి నర్సింహులు ఓ వారం పది రోజులు వూరికెళ్ళాల్సివచ్చింది. పాలు తీయటానికి యాదగిరికి పని అప్పజెప్పాడు. లక్ష్మి ససేమిరా ఒప్పుకోలేదు. నాన్నగారు ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేను దాని దగ్గర కూర్చుని తలనిమురుతూ, నా ఒళ్ళో దాని సంకటి గమేళా వుంచుకుని తిననిస్తే వాళ్ళని తాకనిచ్చింది. మధ్యలో యాదగిరి, "పాప, బర్రె తన్నకుండా చూడు తల్లీ!" అని మొరలు. సో, అలా ఆ పదిరోజుల గారాలబుచ్చి మా లచ్చి.
ఇంటిపనికి వచ్చే ప్రభావతికి కవల పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు లక్ష్మి, రాము [ప్చ్.. పేటేంట్ తీసుకోలేదు కనుక అలా అయిపోయింది :) ] తన పాలు సరిపోవటం లేదని తరిపిగేదె పాలు అవసరమని బతిమాలి బామాలి నా లక్ష్మి, రాముల్ని అది కొట్టేసింది. నాకు ఏడ్వటానికి ఓపిక పొయ్యేవరకు ఆ పని చేసాక, సొమ్మసిల్లి, అలిగి అరిచి గీపెట్టి ప్రభావతిని పనిలోంచి తీయించేసాను. కొన్ని రోజుల పాటు లక్ష్మి అలా గుమ్మంలోకి వస్తూనే వుండేది. కాలం వేసే మరపు మందుతో నేనూ కదిలిసాగాను. బహుశా లక్ష్మి కూడా అంతేనేమో! :(
చాలా పాడి పశువులతో అనుబంధం వున్నా కానీ లక్ష్మి గాడి అంత గాఢమైన అనుభవం మిగల్లేదు. సమకాలీన అనుభవం "బిస్ బిస్ మేక" తో. చెప్పాలనిపిస్తే మరెప్పుడైనా..
*********************************************
నాకు మరొక ఆరేళ్ళ అనుభవం వచ్చాక అంటే పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో మేము అద్దెకి వున్న ఇంటివారికి పాలవ్యాపారం. కనుక ఇంటి ముందర, వెనకా కూడా పాడి పశువులు, దూడలు, గడ్డి మేట్లు, కుడితి తొట్లు, ఉలవల ఉడికే వాసనలు. నేను చదివిన ఆ కాలేజీ ఒక పట్టణం కాని పెద్దపల్లె ఆ ఊరులో ఉండేది. నాన్నగారు, నన్నూ నానమ్మని ఆ దూరపు బంధువుల ఇంట్లో పెట్టారు. సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న కాలేజీకి రిక్షాలో వెళ్ళి వచ్చేదాన్ని.
వారి ఇంట్లో దిగిన కొన్ని రోజులకి వాళ్ళ గేదె ఈనింది. ఆ జున్ను అవీ లాగించాక ఆ కొత్త లక్ష్మి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కాకపోతే ఆవిడ బిడ్డ అనసూయ. అదీ ముద్దుగా వుండేది. అలవాటు చొప్పున వస్తూ పోతున్న సమయాల్లో ఏదో ఒక మాట అనేదాన్ని. అనసూయ తోక పట్టుకుని, చెవి పీకో ఆట ఆడేదాన్ని. కాస్త పెద్దయ్యాను, ఇంకా ఎక్కువ చనువు లేదు కనుక కుర్చీలు వేసుకుని కులాసా కబుర్లు చెప్పేంత సీన్ లేకపోయింది. కానీ ఈ కొత్త మేడం నన్ను చూడగానే "దగ్గరకి రా.." అన్నట్లు తలవూపేది. అలాంటప్పుడు అటూ ఇటూ చూసి కాస్త అల్లరిమాట అనేసి పరిగెత్తేదాన్ని.
అలా మా చెలిమి బలపడిందన్న అపోహలో వున్న ఒకానొక మధ్యాహ్నం ఫిజిక్స్ రికార్డ్ ఇంటిలో మర్చిపోయాను. కాలేజికెళ్ళాక గ్రహించి మళ్ళీ ఇంటికి రిక్షాలో పరిగెత్తుకొచ్చాను. ఆ హడావుడిలో మేడం స్వస్థానంలో లేదని చూడలేదు. మళ్ళీ రిక్షా వెదుక్కోవాలి, లేదా పి. టి. ఉష లా పరిగెడతమా అన్న గోలలో పడి, ఇల్లు వదిలి ఆ కంకరమట్టి రోడ్డేక్కగానే ఓ పెద్ద గుండేలవిసేలా రంకె వెనకటి గూడ్స్ రైలింజను కూత కన్నా గట్టిగా చెవుల్లో పడింది. తలెత్తి చూసే సరికి మహా అయితే ఓ ముప్పై సెకన్ల పరుగు దూరాన కొ.ల [కొత్త లక్ష్మి] బుస బుసల తో మా బిస్ బిస్ మేకకి తాత మాదిరిగా ప్రత్యక్షమైంది.
కాస్త సినిమాల అనుభవం తో నాకు అసలు సంగతి అర్థం అయిపోయింది. ఈవిడ ప్రతిఘటనలో విజయశాంతిలా నా మీద ప్రతీకారం తీర్చుకోబోతుంది అని. కాస్త పిరికి గుండె కనుక ఆ మాత్రానికే నా పని అయిపోయింది, నేను స్పృహ తప్పుతుండగా పరిగెట్టుకుంటూ వస్తున్న ఇంటివారి అబ్బాయి నాని , అతనితో రేస్ లో ముందున్న కొ.ల. కనపడ్డారు. సెకనులో అరవంతు జ్ఞాపకం కొ.ల. గారి కొమ్ము నా పొట్టలోకి వత్తిడి తెలిసేలా, నా చేతిలోని రికార్డ్ కి తగలటం. ఆ పుస్తకం ఎందుకలా నలిగిందని లెక్చరర్ గారికి మొరపెట్టుకోవటం మరో బాధ.
స్పృహ వచ్చేసరికి కళ్ళనీళ్ళతో గగ్గోలెత్తుతున్న నానమ్మ, కట్టుగొయ్యికి వేలాడబడి నాని చేతిలో దెబ్బలు తింటూ కొ.ల. పాపం జాలేసి నేనే అడ్డం పడి ఆపాను. నెప్పి ఓర్చుకుని నాకేమీ కాలేదని నటించి కాలేజీకి వెళ్ళిపోయాను.
వెళ్ళేదారిలో మళ్ళీ ఓ నాలుగైదు సార్లు ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళివస్తే కొ.ల. మ్మ గారి పూర్తి మనోగతం అర్థం అయింది. "దగ్గరకి రా..నీ పని చెప్తాను. కుమ్మిపారేస్తా.." అంటే నేను తన బిడ్డని ముద్దులాడేదాన్నిగా, తల్లిగా భయం, ఆందోళన అన్నమాట, నేనేం చేస్తానో అని. అంచేత తన సత్తా ఏమిటో అందాకా సైగల్లో చెప్పేది. ఇవాళకి చేతల్లో చూపించింది.
ఆ సాయంత్రం అందరూ సద్దు మణిగాక మళ్ళీ మేడం గారి దగ్గరకి వెళ్తే ఈ సారి వెనక్కి అడుగేసింది. అంటే నాని గారి కోటా ఇంకా సురసుర మండుతుందనే కదా? "పిచ్చి కాళీ, నేను సాధుజీవినేనమ్మా. నువ్వు, నీ బిడ్డ నాకు నేస్తాలు." అని కాసేపు వెన్ను పామి చెప్పాక, దాని కళ్ళలో బెదురు, కనీకనిపించని కోపం మలిగి, ఆ స్థానే కరుణ, ప్రేమ నిండాయి. ఆ మూగజీవి నా జట్టు కట్టేసింది. కానీ ఆవిడ విశ్వరూపాన్ని చూసాను కనుక కాళీ అనే పిలిచేదాన్ని.
అదన్నమాట. "లక్ష్మి, కాళి, అదే నేను" కథా కమామీషు.
గత మే నెలలో ఒక వ్యాఖ్యలో పరిమళం గారు "సుందరమైన లలితాదేవేనా ...ఈ ఆదిపరా శక్తి అని పించే అమ్మవారిలోని రెండో కోణాన్ని చూసినట్టుంది." అనటం వలన ఓ సారి ఈ ఊసు తారాడివెళ్ళింది. కాకపోతే తను నన్నంటే నేను "కొ.ల -> కాళి" కి అన్వయించాను. ప్రతి మనిషిలోను ఈ అంతర్గత శక్తి వుంటుంది. కనపడని కొమ్ములతో తలపడాల్సిన విషయాలకి సిద్దపడే దమ్మూ వుంటూంది.
ఈ మధ్యన ఒకరు నన్ను "వృషభం" అని ఆట పట్టిస్తే ఈ ఊసు మళ్ళీ 'గాట్టీగా' గుర్తుకొచ్చేసి ఇలా నా బ్లాగుకెక్కేసింది.
ఇక్కడి వరకు చదివినవారు తప్పక మీ మీ అనుభవంతో అన్వయించుకుని వుంటారు. కథలు, ఇలాంటి కథ కాని కథలు, అనుభవాలు ఈ యాంత్రిక జీవితంలో కాసేపు జోకొట్టే లాలిపాటలు. కమ్మని ఆ నిదురలో కాలం కొట్టేసిన క్షణాలని వెనక్కి తెచ్చే వరాలు. బతుకులోని అనుభూతికి ఆసరాలు, ఆలంబనలు. కాదంటారా?