ఆనంద హేల

నేల తోడుకని మొరపెట్టుకుందనా
గడ్డిపోచగ ఓ గుండె పలికింది?

ఎడద పరిచి ఆలాపించిందనా
కన్నయ్య రాధ కనులెదుట నిలిచింది?

నిద్రాణమైన బీజం నిర్వాణం చెందిందా
అనుభూతి అంకురం వటవృక్షమైంది?

మాను జిగురుధారల విలపించిందనా
కొమ్మ చిగురాకులు తొడిగింది?

శిల బీటలిచ్చి తనలోకి చేరిందనా
ఉలి తానై నది గులకరాయిగ మలిచింది?

కడలి ఆటై పోటై తోసుకువచ్చిందా
ఉప్పుటేరుల శోకం వెంటతీసుకుపోను?

ప్రకృతంతా పరుచుకుని ఆనందం నర్తించిందా
అనురాగధారని అక్షరపాదాలుగ మార్చి?

2 comments:

  1. "మాను జిగురుధారల విలపించిందనా
    కొమ్మ చిగురాకులు తొడిగింది?

    శిల బీటలిచ్చి తనలోకి చేరిందనా
    ఉలి తానై నది గులకరాయిగ మలిచింది?"

    ... చాలా బాగుంది.

    ReplyDelete
  2. అక్షరం అక్షరం పద సంకలనమై భావోపెతమై నర్తించిన ఆనంద హేల. చాల బాగుంది ఉషా. ఆశీస్సులతో శ్రేయోభిలాషి ...నూతక్కి

    ReplyDelete