తృటిలో..

కాలపు తుమ్మెద రెక్కల మీద
నా స్మృతి పూమొగ్గ పయనమైపోయింది..

ఊహల కట్టడమెక్కి నాకందనంత ఎత్తున
అనుభూతి శిఖరం అంచున నిలిచింది..

యాత్రకి అంకురం ఎవరి ప్రేరణ?
ఎరుగని అంచున ఎందుకు నాకీ నడక..

రెక్క తొడిగిన మనసు మాట వినేనా,
ఊసుకొక్క క్రోసు గతాన్ని కొలుచుకుంటూ..

తొలి మజిలీలో అతిధినయ్యాను,
నను పిలవని నెలవున నిలిచిపోయాను..

పారిజాతాలు పరిచి, పున్నమి నవ్వులతో,
నను పలకరించింది నా బాల్యం..

నిశీధి నివేదనలు ఎటు మాయమయ్యాయి?

ముందుకు సాగక తప్పని పయనం,
తొందరపడమని మానసం..

జావళీలు పాడి, కన్నియ కలల్లో,
జాడ తెలియక వగచింది నా యవ్వనం..

వెదుకుతున్న స్మృతి ఇక్కడా అగపడదేం?

ఎగిరే పావురం అలిసిన వైనం,
గతం కనరాని అనంతవృత్తం..

ఎగువదిగువల్లో బిగువు సడలిన మానసం,
సరోవరాన అరవిరిసిన బ్రహ్మ కమలం..

కంటి చెలమల్లో తడారని ఆనవాలు,
ఆత్మచూపిన దిక్కున నవ్విన చెలిమి..

పెదవి దాటని మౌనరాగం,
యుగాలు దాచిన అనురాగం..

మమత అందిన అంతరంగం,
కోవెల గంట పాడిన ఓంకారం..

గతమా, గమ్యమా మరిచెను మది,
ఎదురుచూసినది ఆ తోడు కొరకని..

ఆదమరిచినది ఆ ఆలంబనలోనే,
వేదన విడిచినది ఆ చేరువతోనే..

వాస్తవమాగునా వీడిపోక,
గారడి చేయుట విధి పోకడ..

ఊహకి పునాది అనుభూతి,
యోజనాలు తరిగేది లిప్తపాటునే..

తృటిలో చేజారిన క్షణాలు,
మదిలో చెరగని ఆలాపనలు..