ఏడ్వమ్మ ఏడ్వమ్మ బుల్లి మా వల్లి,
ఏడుస్తూ నీవలా నీలాలు కార్చమ్మ.
నీ ఏడ్పునాపంగా నేనెంతదాననే,
ఆపైన నవ్వంటే నేర్పమంటే నావల్లనవునా చిట్టి తల్లీ ?
నీ కంటి నీలాలు తన దోసిటన పట్టే ఓ తోడురావాల..
తన ముత్యాల మూటలు నీ చెవిన పడాల..
నే పాడితే లోకమంత పచ్చనని నీకనిపించు
పాటగ, బ్రతుకాటగ ఈ నోటి మాట ముద్దుకైనా నీకొద్దమ్మ
నీ రూపు, చూపు, మనసు, మమత అన్నీ వెతలంటారు వోర్వలేనోళ్ళు
నీవౌవుతావు సూర్యముఖి, చంద్రముఖి....... నువ్వవ్వాలి ఒక జ్వాలాముఖి
వెనుతిరగని గుండె దిటవు నీవు చూపేటి ప్రగతి మార్గం,
మా అందరి గుండె కోత నీకు చూపించే దిశా నిర్దేశ మవ్వని నా చిట్టితల్లి
పుడుతూనే తల్లివి, బొమ్మల పెళ్ళికి పెద్దవి కదమ్మ
బువ్వలాటలో నీ బుల్లి కడుపొకటే నిండనిది
నీ పేరు ఆడదమ్మ, అయినా అంటారట ఆడబొమ్మ ని
అవునమ్మ మీ అమ్మ వెఱ్ఱిదేనమ్మ, అచ్చంగా వాళ్ళమ్మలాగే
కలకన్నావా, వద్దొద్దమ్మా, రంగు నీ చూపుకంటుతుంది
ఇలమరిచిపోయావా, అసలొద్దమ్మా, కాలం ఆగిపోతుంది
మరిక యేముందంటావా, కొత్త పాట కట్టాల్సివుంది కాదామ్మా?
పాతపాట కొత్తపదాలతో మార్చి కట్టి నీ బిడ్డకి పాడవామ్మా?
పాటంటే పదాలు కాదని, అణువణువున జీవమని ఎలుగెత్తవా?
జ్వలించే కాంతి కిరణం వరించే ధైర్య ధరిత్రి నీ తోడు రాగా
సాగవమ్మా కొత్త దారుల అమ్మలందరికి కొంగ్రొత్త పాటవై
ధరణీ తలాన నూతన రాగమై..నా దీవెనల చలవ తోడుగా..