దాటుకుంటూ...

దారి చూసుకునో, వీలు చేసుకునో
వెళ్ళాలి, వెనక్కు మళ్ళాలి, తప్పదు-

బాటలు వేసుకుని, బాసలు దాటుకుని
మమతలకి మనసునొదిలి
మనసైనవారిని మోసుకుంటూ,

దాచిన కన్నీరు దోసిళ్ళలో
గడిపిన క్షణాలు గుప్పిళ్ళలో తప్పవిక.

దాటుకుంటూ, దాటినవి దాచుకుంటూ
వెళ్తుండాలి అటుగా, ఇటుగా, అటోఇటో తెలియని ఎటో-

అందుకే, సందోహంలో ఒక /గతి/తప్పిన మది తారసపడితే
నేస్తమా! ఆశ్రయమో, ఆసరానో అండగా ఇవ్వు

మరి నిన్నూ ఒంటరిని చేసే భావిని నీవు చేరే సరికి
గతపు జ్ఞాపకం తోడై వస్తుంది...
వేదన గిరులు దాటుకుంటూ వెళ్ళటానికి.