గోదారమ్మ పరవళ్ళు, కృష్ణమ్మ ఉరవళ్ళు అచ్చంగ నావేనమ్మా!

చిన్న మాట: ఉద్యోగరీత్యాగా నాగార్జున సాగర్, ధవళేశ్వరం, భీమవరం, అనంతపురం మొదలుకుని యడ్లపాడు, చీమకుర్తి వంటి చిన్న ప్రాంతాల్లో కూడా నివసించి, నదీ పరివాహిక ప్రాంతాల్లో, నీటికోసం అంగలార్చే జనాల్లోనూ మసలే వైవిధ్యభరిత జీవితాన్ని రుచి చూపిన నాన్నగారికి కృతజ్ఞతలతో... ఈ చిరు కవిత

గోదారమ్మా! మరుమల్లె తోట మారాము చేయక మారాకు వేసినట్లు

ఏడాదికోమారు ఎర్రెర్రని కొత్తనీరు గట్లుతెంపుకుని తోడిపోస్తావు .

ఆనకట్ట కట్టినా, కాలువలుగా నిను చీల్చినా ఆగిందా నీ వేగం.
చెలిమిచేయ నీకెవరు సాటి, కనుకే సాగరసంగమం నీ అమరగానం.

గౌతమి నీలో లీనం, తన తోటి నెచ్చెలులకీ అదే వేదం.

కలిమిలొసగ సరిలేరు నీకు, అందుకే అనుపమానం నీ అనురాగం.

నదీనదాల్లో జాతివజ్రం నీవు, పైరుపచ్చల పరువానివి నీవు.

చిట్టడవుల విడిదిచేయ వెనుదీయవు, కొండాకోనల పరుగిడ అలుపెరగవు.

మునిమాపుల మౌనికవైనా, వేకువవేళల మేలుకొలుపులు పాడినా,

నీకే కాదా తగును, నీ వొడిన మునక నా బ్రతుకు నోచిన భాగ్యమమ్మా.

కృష్ణమ్మా! అలలతో అల్లికలల్లి ఆకాశానికి అందివ్వాలనేనా ఆ ఆత్రం?
ఆవేశం అనంతమై సాగే నీ పయనం అంబుధిరాజ అంతఃపురానికా.

మరి ఉండుండి వచ్చేటి ఆ మేఘరాజు పరుగు నీ ఒడిని చేరటానికేమో!

భాష్యం లేని నీ గీతాలకి వాద్యాలు ఆ దేవదుంధుబులా!

మెరుపునురుగుల ఆణిముత్యాలు అంచలంచలుగా ధరపై ఒలికిస్తూ
ఏమా పరుగు, ఎందుకా బిరబిరలు, ఏమిటా మేనివిరుపులు?

అస్థిరవై, అంచలంచల అనీషవై దరిలేని తీరాలకడుగులేస్తూ
ఏ అదృశ్యప్రియునితోనో గుసగుసల గుంభన నవ్వు లొలికిస్తూ

ఒరవడిలోనూ తడబడుతూ ఏ ఓడిని చేరేవు, ఒక్కసారి గుట్టువిప్పమ్మా.

నిన్నే అనుసరించే నాకు నావాడి జాడ ముందుగా నువ్వే చెప్పమ్మా!

అబల అన్న సమాజాన్ని, ఆమె మాత్రమే మార్చాలి.

ముందు మాట: సున్నిత మనస్కులకి క్షమాపణలు, కటువైన పద ప్రయోగం తప్పనిసరైంది.

నిజమేనా, స్త్రీజాతిని చెరిచారని నేను కన్న కల నిజమేనా?

సజలనయనాన వీక్షించినది-

కలగానే మిగలాలి,
కాలమైనా ఆగిపోవాలి, 

ఆ కలైనా చెరిగిపోవాలి..

ఇంకెంతకాలం ఇలా అని నెలతలైనా గళం విప్పాలి,
సిగ్గులేని సమాజాన్ని నిర్భయంగా నిలదీయాలి.
ఇంద్రాది ఆది దేవతలే స్త్రీలోలులైనా, ఎవరది ఎత్తిచూపింది?


"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః"
అని ఆర్యోక్తి అంటూ ఆడవార్ని భ్రమింపచేసారేమో?


ఆత్మవంచన వదిలి సాంప్రదాయం ఆడదాని గోడు వింటుందా?
ఆమె ఆత్మగౌరవం ఈ విఫలపూజల కన్నా మిన్న అని ఒప్పుకుంటుందా?
తల్లి స్తన్యమీయనంటే ఎన్ని గొంతులు గగ్గోలు పెడతాయో!
తల్లివంటి మగువ చనులు ఎన్ని కనుల వేటకి బలౌతాయి?
'నా మనిషి' ఈమె అంటూ ఆస్తిగా మార్చిన ఈ మగజాతి,
ఆమె ఆస్తి తన ఆలోచన, స్వయంప్రతిపత్తి అంటే అంగీకరిస్తాడా?
పరస్త్రీని మోహించే పురుషుడు 'నాదీ నీదారే'నని భార్య అంటే వూరుకుంటాడా?


జానెడుగుడ్డ తనకికట్టి చిందులువేసే మగాడ్ని వురేయలేదా?
మానభంగం పేరిట మజా చేసేవాడ్ని కొరతవేయలేదా?
'అందం నీద'ని ఒకడికి వేడుక, అందని నాడు వాడిదే వికృతక్రీడ.
'అందం లేద'ని కట్నం బేరమాడినవాడే, చావు చేతికిచ్చి పేరుస్తాడు చితిమంట.
ఈ దుర్నీతిని, దురాగతాన్ని తను ఆపలేననా ఆమె ఆగుతుంది?
ఆది పరాశక్తి తన మూలస్థానం వదిలిరావాలా?
తన అంతర్గతశక్తి నేటి మగువ తానే వెలికితీయలేదా?
తరిమి తరిమి తన శత్రువుని మట్టుబెట్టలేదా?
తన వృత్తీ, ప్రవృత్తీ చాటిచెప్పుకోలేదా? తన మేధస్సు నిరూపించలేదా?


"లోకసమస్తా సుఖినోభవంతు" సఫలమని తను చేసిచూపలేదా?

-అబల అన్న సమాజాన్ని, ఆమె మాత్రమే మార్చాలి

ఈ జాడలు, నా గుండె వేసిన వూడలు!

తరం మారి ఆ చేతికర్ర,
నాన్న చేతికొచ్చినా,

అడుగడుగునా తాతయ్య జాడలే.


అవసరం లేదని ఆ కవ్వం
,
అటక మీదకు చేర్చినా,

అమ్మమ్మ చిలికిన వెన్న వాసన వీడలేదే.


ద్వారం పైన తోరణాలు మాసినా,

జూకామల్లెల మాదిరి అవింకా వూగినట్లే,

అవి కట్టిన చేతి గాజులు గల్లుమన్నట్లే.

గడప మీద కుంకుమబొట్టు వెలిసినా,

నిరంతరం వేయిపాదాలు ఆ గడప దాటినట్లే,

ఆ రంగులద్దిన మోవి చిరునగవు మెరుపక్కడే.


ముంగిట్లో ముగ్గు కనుమరుగైనా,

ముగ్గుకర్రతో వయ్యారి వేసిన,

రథం బొమ్మ కదిలినట్లే.


మోడై సగం వంట చెరుకై పోయినా
,
మా వేప కొమ్మ ఆనాడు,

చుక్కలన్నీ దోచుకొచ్చి పూలుచేసి నవ్వినట్లే.


పాయలై విడిపోయి సోయగం లేని ఆ కొలనువంక చూస్తే
,
కార్తీక పున్నమికి అరటిదిన్నెలో దీపాలు వెలుగు చిమ్మినట్లే,

సాగరమంత సాగి ఆలయమే సౌధం చేసుకున్నట్లే.


అన్నిటా ఆ జాడలే, గాఢమైన నీడలే,
ఏ జాడ నేను మరవగలను?
లేదని ఏ జాడకై నేను అన్వేషించను?

నను వీడక నా వెంబడే నడిచే ఈ జాడలు, నా గుండె వేసిన వూడలు
.

మనసు ఖాళీ చేసానెందుకు?

ఎందుకు జార్చుకున్నాను,
మనసులోని భావాలు నాలోనే దాచుకోక?
ఎవరు దాచుకున్నారు,
మరపురాని అనుభూతిగ ఎదలోపల పదిలంగా?

కొలమానం లేని, రాసిగల అక్షరాల రాశులు,
ఎవరికి లెక్కలెంచక పంచేసాను?
వెలకట్టలేని, వాసినందూ సాటిలేని కమ్మని కావ్యాలు,
ఎందుకు ఎడతెరిపిలేకుండా లిఖించేసాను?

వెలికి వచ్చినవి తిరిగి నాలోకి ఇముడ్చుకోవాలని,
వెదికి వెదికి వేసారినా జాడ తెలియకున్నదేమి?
ఉబికి వొలికి నన్ను వదిలిపోయాయేమి స్పందనలు!
వెలితి పడిన మనసు ఉసూరురంటోందేల రేయీపగలు?

నాడు ఊగిసలాడి, వేగిరపడి తృళ్ళిపడిన ఉవ్విళ్ళు,
నన్ను నేనే దోచుకుని వేడుకచూసిన సందళ్ళు.
నేడు సత్తువలేక, సాగిలపడి నిట్టూరుస్తున్న సవ్వళ్ళు,
నన్ను నేనే మరిచిన ఈ నిశీధి పయనంలో కీచురాళ్ళు.

ఆకలికి ఇంకా ఆకలి తీరలేదు

ఆకలి కూడా ఆవురావురంటోంది.
అందినవన్నీ ఆబగా కతుకుతుంది.
ఆరనిమంటగా వెలుగుతూనేవుంది.
పేదయువత భవితని మింగుతూవుంది.

ఆకలని వ్రాయను డు ము వు ల విభక్తులక్కరలేదు.
ఆకలి ఆక్రందనకి శృతిలయలవసరంలేదు.
గాలికి మల్లే కంటికి ఆనదు, జఠరాగ్నికి మాత్రం తానే ఆజ్యం.
వయోబేధమెరుగదు, రుచీ శుచి చూడనీయదు.

పూరిగుడెశలోనే విడిది చేస్తుంది.
రత్నాలు కొనగల వాడింట నిలవనంటుంది.
గంజి అరుదైన వాడిని వదలక వెన్నంటివుంటుంది.
కాలే కడుపుల కన్నీటి జలకాలాడుతుంది.


ఆకలి ఎరుగని ఆసామి కళ్ళకి మరో ఆకలి,
అది తీర్చను ఆకలిగొన్న మరో బక్కప్రాణి కాదా బలి?
అక్షరజ్యోతి వెలిగించని జాతి అధోగతా ఇది?
ఆకలిని అమరురాల్ని చేసిన జనతదా ఈ దుస్థితి?

కూడి మనం చేయలేమా ఏదో ఒక నిస్వార్థ కార్యం?
కల్పించలేమా ఒక్కరినీ ఆకలి బారిన పడనీయని సౌకర్యం?
ముందంజవేసిన మనకొందరిదైనా కాదా ఈ కర్తవ్యం?
ఇవి నెరవేరేవరకు ప్రగతికి దూరం కాదా ఈ ఆకలి రాజ్యం?

మరో ప్రయత్నం!

రాధామాధవీయం మన ప్రణయం
అని అనుకున్నామనా, నను సత్య ఆవహించింది?
సత్యాపతి! నను మీరకని పలికించింది?

ఒకరికొకరం వరాలమనుకున్నామనా,
అసలు ఎవరికెవరం అని మీమాంస కలిగింది?
విధికి నన్ను వదిలి నీ విధులకు నీవు తరలిపోయింది?

ధీరోదాత్తనై నిను వరిస్తా అన్నావనా,
అభిసారికనై నీకై నిరీక్షిస్తానన్న నేను,
ఖండితనై నా ప్రాంగణం నుండి నిను వెలివేసింది?

ఆనందం అతిధి, మనకు బాధ సహచరి తలంచామనా,
అతిథివోలే నిష్క్రమించి ఆనందానికి నను పరాయిని చేసావు?
బాధ మాత్రం నా చితిలోనూ సహగమనం చేసిందందుకేనా?

అసలీ ఉపమానాలు, ఉత్కర్షలు, తలంపులు లేని లోకం వెదుక్కుందామా?
నన్ను నీకు, నిన్ను నాకు పెనవేసి వుంచే బంధం వేసుకుందామా?
మనకు, మనలోకానికి, ఆ బంధానికీ ఒకటే పేరు పెడదామా "ప్రేమ" అని?

ఎన్నిసార్లు?

జననం ఒకసారే, మరణమూ ఒకసారే.
ఒకటి వదిలిపోతుంది, ఒకటి వెంటపెట్టుకుపోతుంది.
చలనం ఆగదే, పయనమూ ఆగకూడదే.
ఇది స్తంభించింది అది స్తబ్దమైపోయింది.

ఎన్నిసార్లు మరణించి మళ్ళీ పుట్టాను?
ఎన్నిసార్లు సంచలించి ప్రవహించాను?

వాస్తవానికి నాకు అందని నువ్వు,
కలల ఎడారిలోనూ ఎండమావివేనని,
ఆ దాహార్తిలో అక్కడే ముగిసిపోయాను,
సైకత రూపాన్నై మళ్ళీ ప్రాణం పోసుకున్నాను.

వూహల్లో నను వదలని నీవు,
శరత్ ఋతువులో నీహరికవేమోనని,
ఆ నిరాశలో ముందే కనుమూసేసాను.
ప్రత్యుష కిరణమై ఉనికి తెచ్చుకున్నాను.

మమతావేశంలో నన్ను మించిన నువ్వు,
జ్వాలాముఖివై లావాలా కరిగిపోతే,
చితిమంటగ నిన్నే చేసి నేకాలిపోయాను.
శిలాజాల్లోనుండి కదలి లేచివచ్చాను.

ఇన్ని మరణాల్లో నను తిరిగి పుట్టించిన సంజీవని,
ప్రేమ ఇక సెలవని నేడు మరణించింది.
ఎన్నోసార్లు నీకై చచ్చి బ్రతికిన నేను ఇక చాలని,
ఈ ఒక్కసారికీ నిన్నే చంపేసాను.

అలవాటు, బలహీనత, వ్యసనం?

మూడిటికీ నిర్వచనాల్లో ఎంత విబేధం వుందని కనుక్కోవాలని అడుగుతున్నాను.

అలవాటు - సాధారణంగా ఇతరుల్ని బాధించకపోవచ్చు. ఇవి మారే తీరువుంది.
బలహీనత - అదివున్న వ్యక్తికే నచ్చపోవచ్చు. ఎదుటివారికీ నచ్చకపోవచ్చు. కానీ దాన్ని తొలగించుకోలేకపోవచ్చు.
వ్యసనం - మొదట్లో ఆనందాన్ని ఇస్తుందేమో కానీ పోగా పోగా నలిబిలిచేస్తుంది.

ఇవి సూక్షంగా వీటిపట్ల నా అభిప్రాయం.

ఇపుడు నేను వేసుకుంటున్న ప్రశ్న, అలవాటు [ఉదాహరణకి చిన్నపుడు పుల్లటి పెరుగే తినే నేను ఇపుడు వాసన కూడా భరించలేను, నా ఇష్టం/అలవాటు ఎపుడు మారిందో కూడా గుర్తు లేదు] మన మనస్తత్వాన్ని బట్టి మారుతుందా? లేక మనం మన్నించేవారో, మన మనసుపడ్డ వారి వలనో మార్చుకుంటామా? వారికనుగుణంగా మనని మనం వత్తిడీ లేకుండానే వారికి నచ్చే రీతిలో మారిపోతామా? మార్పుని మనకు మనమే ఆహ్వానిస్తామా లేక మనం అప్రమేయంగా మారతామా?

బలహీనత - కొన్ని మనకి నచ్చి చేస్తాము, కొన్ని ఎదుటివారికి నచ్చవని తెలిసీ చేస్తాము. మరి కొన్ని మనకు నచ్చక పోయినా మనకు నచ్చే వారిని మెప్పించటానికి చేస్తాము.

కనుక అలవాటు, బలహీనత - వీటిల్లో ఏది త్వరగా వదులుతుంది. అసలు వదిలించుకోలేని అలవాటే బలహీనతగా పరిణమిస్తుందేమో.

ఇక వ్యసనం - దుర్వ్యసనం వదిలేస్తే, అసలు వ్యసనం కూడా వక్రించిన అలవాటేనా - ఒకర్ని బాధించటం కూడా వ్యసనమేనా? అందులో ఆనందం వున్నా లేకున్నా పొరబాటుగా ముదిరిన బలహీనతే వ్యసనమా.

కవితలు వదిలి వచన వేదనలు ఏమిటా అంటారా? మునుపు కన్నా సామీప్యంగా విపులంగా కొంతమందిని గమనించటం మొదలుపెట్టాక, నన్ను బాధిస్తున్న కారణాలకి మూలం మూడేనని అనిపించి, మిగిలిన వారి అభిప్రాయాలు, అనుభవాలు తెలుకుందామని ఇదో ప్రయత్నం.

బ్రతుకాటలు

అందరూ ఆడేది అదే కదా అమ్మతో దోబూచులు, నేనూ అంతే.
ఆపై దొంగాటలు, తొక్కుడు బిళ్ళ, వెన్నెల్లో వెన్నముద్దలూను
ఇంకెన్ని వినోదాలో వింత వింతలుగా విరామంలేకుండా.
అపుడాడింది నేను, ఇపుడు ఆడించబడుతుంది నేనే.
ఆ ఆటలే నా బ్రతుక్కిచ్చాయి ఓ ఆకళింపు. అలుపెరుగని ఆటగత్తెను నేను.

ఇసుకలో గూళ్ళు, ఎన్నెన్ని కట్టానో.
ఎంత పొందిగ్గా తీర్చిదిద్దానో.
ఇపుడు కట్టుకుంది ఒకటే గూడు.
ఎంత తరిచినా ఇంకేదో మిగిలేవుంది,
గూడు పేర్చుకుంటూ ఆట కాని ఆట నడుస్తూనేవుంది.

పేక మేడలు, పడినవెన్నో, పేర్చినవన్ని.
ఆశల గాలిమేడలు అందుకే కడుతుంటాను.
ఆ సౌధాలకి అడియాసల పునాదులు పదివేలు.
కూలినా, మళ్ళీ పేర్చేందుకు పట్టదు మూన్నాళ్ళు
బ్రతుకంతా ఆశనిరాశల నిర్మాణాలే, నిర్వాణాలే.

రధం ముగ్గు, విమానమంత రధం ఎన్ని వీధుల్లో వేసాను!
ఇపుడూ వూహల్లో పుష్పకమంత నా రధం పూలతేరంత అందం
రాణి నేనే, రారాజ్ఞి నేనే, సారధీ నేనే, సమాయత్తమూ నాదే.
వినువీధుల విహరించినా, ఏ వూరు వాడల వెళ్ళివచ్చినా.
ఆగని ఆ పయనాలే నా వాస్తవ వాహనానికి ఇంధనాలు.

స్తంభాలాట, నలుగురం ఆడినా నే ఓడిందెన్నడటా?
విజేతననా, విధి చేత చిక్కాననా ఇంకా సాగుతుందది?
కాలం, దైవం, విధి, నేను, తను - అ తనకి రూపాలు పెక్కు.
కాలాతీతమైతే, కరిగిన కలల్లో తనకి నాకు నిట్టూర్పువేదం.
దైవం అనుకూలిస్తే, తనకి నాకు ఆనందసంభ్రమం.


ముగింపు లేని ఇవన్నీ, నిర్ణేతలే లేని నా బ్రతుకాటలు.

చుప్పనాతి వసంతుడు వీడివెళ్ళనంటే, ఈ కథ ఇంతే మరి!

ముందుగా ఇది చదివిరండిక్కడకి ప్లీజ్
*******************************
కవి కానంటివి,

కానీ నా కవితవి నీవే.
మహిమాన్వితుడిని కానంటివి,
కానీ నా భవిత నీవే.

మనసు పడ్డానంటిని,
మరి నీ మమత పంచింది నాకే.
వలపు నీకేనంటిని,
కనుక నీ తనువు పానుపయింది నాకే.

ఎవరు ఏమంటారన్నది,
వలదు మనకు ఆ చింత,
ప్రకృతి మన పరమన్నది,
వసంతుని సాక్షిగా ఓ వింత!

మనం ఒకరికొకరం వరాలం.
తరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది.

కమనీయ కావ్యం, మనిషి జీవితం!

మళ్ళీ తెల్లారింది, తేదీని మార్చమంది.
రోజు నియమాలు వతనుగా నడిచిపోతున్నాయి.
మనసు చింత కొత్త రూపు తెచ్చుకుంది.
బ్రతుకు పయనం ఆపలేనని సాగుతుంది.

అన్నీ తెలిసినా, నిన్న వాన వెలిసిపోయిందని బెంగ,
నేడు వాన కురుస్తోందని కలత, మదికి ఇదో సరదా.
ఎండ బాధ వద్దనో, చలి బారిన పడననో,
ఒకదానివెంట ఒకటి యోచనాసుడులు, వృధా అలజడులు.

జీవితపు మఱ్ఱికి మరో గతపు వూడ వేసింది.

ఈ చెట్టుకి అనునిత్యం ఆరు ఋతువుల సంగమమే.
నిమిషాలు రాల్చుకుంటూ, కొత్త చివురు వేసుకుంటూ,
గెలుపు పూలు విప్పారిస్తూ, తృప్తి ఫలాలు పండించుకుంటూ.

ఆశో, ఆశయమో ముందుకు నడిపించటానికి వూపిరి.
మార్గాన్వేషనో, మార్గదర్శకత్వమో వుందొక స్ఫూర్తి.
ఆనందశిఖరాన్ని చేరను అలుపు అదుపు ఎరుగక సాగే యాత్ర.
బ్రతుకంతా పునరావృతమైనా ఇది కాదా సంపూర్ణ సజీవచిత్రం?

కాలంతో గానాలు, గాయాల్లో ఉపశమనాలు,
ప్రకృతిలో అందాలు, సహచరులతో అనుభూతులు,
అన్నీ కలిపిన పూదండకి దారం జీవన సారం, ఆ అల్లిక ముడికో వైనం.
ఆ కదంబమే కదా సరాగ సుధా భరితం? ఓ కమనీయ కావ్య పఠనం?

తల ఒకటి, తలా ఒకటి!

తల ఒకటా, ఆ తలకి పట్టిన తిప్పలే నూటొకటి.
తలతిక్క అన్నవాడిని తన్నానని తలకి బొప్పి.
తలనెప్పి తెస్తున్నానని తిరిగి తలవాచేట్టు చీవాట్లు.
తలబిరుసు ఎక్కువని తలా ఒక మాట.

తలవంచు అని ఒకరు, తలదించు అని మరొకరు,
తలలోని యోచన తర్కమంటే తగదండి తమకు!
కనుక నా తల వెతలు తలవటమే ఓ తప్పు.
తలెత్తుకు తిరిగినందుకు మాత్రం నాకన్నీ ఒప్పు.

ముందే తెలిసిన ముగింపు!

అవును నువ్వు నా కోసమే వచ్చేస్తావు.
వాస్తవంగా నా ఎదుటికొచ్చి నిలబడతావు.
వూహల్నించి వూసుల్లోకి దూకేస్తాను.
ఏకాంతాన్ని సెలవుతీసుకోమని సాగనంపుతాను.

వెన్నెల్లో వేచానని వేయిమార్లు చెప్పేస్తాను.
వేకువల్లో వగచానని వెక్కిళ్ళతో తెలిపేస్తాను.
వెక్కిరింతగా నువ్వు నవ్వేస్తావని ముందే గిల్లేస్తాను.
వెనకెనకనక్కి నా కళ్ళు మూస్తావని వున్నచోటే నిలబడిపోతాను.

మనం విడిచి వచ్చిన బాల్యం, ఓమారు వెనక్కి తెచ్చుకుంటాము.
మనల్ని వీడి వెళ్ళిన యవ్వనం, పలుమార్లు గుర్తు చేసుకుంటాము.
చేతిలో చేయి వేసుకుని కలిసేవుందామని, నిదురలో కలకంటాము.
అవునూ, పాతకథే తిరిగి ఎన్ని వైనాలుగా కవితలల్లుకుంటాము?

మనవి: దీనితో పాటుగా ముందు రెండు కవితలు కలుపుకుని, ఈ మూడు నా స్వానుభవం నుండి వ్రాసుకున్నవి. విడదీసికాక కలిపి చదివితే, ఏ కనులకైనా ప్రేమ, ఎడబాటు, కలయికల్లోని అలౌకికానుభూతి గోచరిస్తుందని నా అభిప్రాయం.

నిరీక్షణ

ఇదేమి సవ్వడి?
నా గుండె సడిలో రాగాలే.
ఇదేమి తాకిడీ?
నా మేని విరుపులో వయ్యారాలే.

నాలో అదేమో అలజడి?
రానున్నది తానే కదా!
నాలో అదేమో ఒరవడి?
విరహాన వేగిన తనువనా!

తనకోసమె కల కన్నానా?
కలలో తననే కలవరించానా?
కలలో తనని వరించానా?
కల కరిగిపోతుందని కలత చెందానా?

ఉదయానికి వీడుకోలు పలికానెందుకు?
రాత్రినీ ఆగొద్దని వేడుకున్నానెందుకు?
ఒక రోజు గడిచిందని నిట్టూర్పు విడిచానెందుకు?
నిరీక్షణా ప్రేమేనని నలుదిక్కుల చాటేందుకే!

ఏది అందమైన అబద్దం?

ఈ మాపున ఎటు చూసినా నీ వూసులే దోగాడుతున్నాయేమి?
నా పడిగాపుల్లో నీ చూపులే వెంటాడుతున్నాయేమి?
నేను చెప్పాలనుకున్న వూసులు ఎలా మరిచాను?
నీనుంచి మరల్చాలనుకున్న నా చూపులు ఎక్కడ బందీ అయినాయి?
నా వూసులు నీ మది కారడవిలో తప్పిపోయాయంటావా?
నా చూపులు నీ మోమున నగవుకి మైమరచుంటాయంటావా?

మొన్న నీ కళ్ళతో కలిపిన నా కళ్ళు
నిను చూడక నేనుండలేనని చెప్పలేదా?
నిన్న నీ అడుగుల్లో అడుగేసిన నా కాళ్ళు
నిను చేరక ఆగలేనని తెలుపలేదా?
నేడు విరహంలో కుములుతానని నువ్వెందుకు చెప్పలేదు?
రేపు వేదనలో మునగనున్నానని నాకెందుకు తెలుపలేదు?

నీ ప్రేమకై ఓ యుగం వేచానని చెప్పానే?
నా అధిపతి నీవని సమ్మతించానే?
నిను వీడి మనలేనని ముందరే మనసు విప్పానే?
ధీరోదాత్తవై నన్నేలుకోమని రాయబారమంపానే?
అయినా నీ జాడ తెలుపవంటే నా వూసులే అందమైన అబద్దాలా?
లేక నీవే ఒక అందమైన అబద్దానివా?

మరువం జన్మదినం - సాహితీమిత్రులందరికీ శతసహస్రకోటి ధన్యాభివందనాలతో ...

మరువం తొలివార్షికోత్సవానికి విచ్చేసిన సాహితీ మిత్రులకు స్వాగతం. నా మానస పుత్రిక మరువానికి ఇది తొలి పుట్టిన రోజు వేడుక. ఏడాది పొడుగునా సాగిన ఘనసంబరాలు మీ రాకపోకలు. పునశ్చరణగా ఓ చిరు యత్నం.


వాడినా వాసన వీడని మరువం .. అంటూ దాదాపు 15 సంవత్సరాలు వదిలేసిన లేఖిని చేత పట్టి వ్రాసిన తొలి పలుకుకి,
"మీలో తిరిగి మేల్కొన్న తృష్ట ద్విగుణీకృతోత్సాహంతో పుంజుకుని, మీమరువంపు మొలక కన్నులపండువుగా నందనవనం కాగలదని ఆశిస్తూ.."
అని వెన్ను తట్టిన మాలతిగారు, తిరిగి నా మూడో టపాకి
"ఎదురుగా వుండి గుక్కతిప్పుకోకుండా చెప్పున అనుభూతి కలిగిందండీ ఒక్కవాక్యమూను. మీరు మొదలుపెట్టడమే తరువాయి. కధలో, కబుర్లో ఏవి అనుకుంటే అవి రాసేయండి."
అని ప్రశంసించటంతో, ముందుగా వచనం వైపు దృష్టి పెడదామనుకున్నాను.

అలాగే రెండో టపాకి కొత్త పాళీ గారు, బొల్లోజు బాబా గారు వ్యాఖ్యలు వ్రాయటం మరిన్ని రచనలు చేయాలన్న తపనని పెంచింది.

తిరిగి స్థబ్దత, ఎన్నో ఏళ్ళుగా పేరుకున్న నైరాశ్యం ఒక్క రోజులో పోదని మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. తిరిగి డిశంబరులో నా కలం కవితా పుంతలు తొక్కే వరకు ఆ మధ్యకాలంలో నా నేస్తం ఇచ్చిన చేయూత అంతా ఇంతా కాదు.

కానీ, చదువరుల ఆదరణ, ప్రోత్సాహం, వ్యాఖ్యానం నాలో జ్వలించే కవితా జ్యోతికి తైలం వంటివి. వారు లేని మరువం ఇంత విరివిగా ఎదిగేది కాదు.

అందరినీ పేరు పేరునా తలవలేకపోతున్నాను, మన్నించండి, కానీ తరచుగా తొంగిచూసి నా సాహితీయానంలో సహచరులై, ప్రతి మజిలీలో ఒకరిగా కలుస్తూ వచ్చిన మరి కొందరు - జన్య, ఆత్రేయ, పృథ్వి, రాఘవ, మహేష్, ప్రతాప్, చిలమకూరు విజయమోహన్, దుర్గేశ్వర, జ్యోతి, సుజాత, లలిత, నేస్తం, పరిమళం, మధురవాణి, సుజ్జీ, వేణు శ్రీకాంత్, రవిగారు, మురళి, MURALI, దిలీప్, ఆనంద్, ప్రదీప్, భాస్కర రామి రెడ్డి, ఈగ హనుమాన్, భావకుడన్, చిన్ని, భవాని, పద్మార్పిత, అశ్వినిశ్రీ ...............

అలాగే తమదంటూ ఓ ముద్రతో తమ వ్యాఖ్యలతో నా కవితలకి మరింత జీవం పోసిన వారు మరి కొందరు.

ప్రతి ఒక్కరు - శీర్షిక పెట్టాలని లేదు నా స్వగతం అందరి మనోభావాల్లోని ఏదో ఒక భావసారూప్యతని వెలికి తెచ్చింది. పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో స్వగతాలు స్వ గతాలు: విభాగంలో ఈ కవితకి స్థానం దక్కింది.

ఎవరిని వదలను? - ఈ శీర్షిక మీరే పెట్టాలి నాపై నాకు నమ్మికని నిలిపిన రచన ఇది. కాని కొసమెరుపు మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ వ్యాఖ్య -
"అలనాడు శంకరుడు తన సతి గౌరి మరణించాక, విలయం సృష్టించాడట. అటు పిమ్మట పార్వతిగా జన్మించి శంకరుని చేరిందట. ఆ పార్వతి ఏమి కోరిందా అనుకుంటున్నా ఇన్నాళ్ళు. ఇలా కోరి చేరిందన్నమాట ఆ శంకరుని."
అలాగే నిషిగంధ, శివ, రాధిక వంటివారి చేత వ్యాఖ్యానం చేయించిన ఏకైక రచన ఇది.

చిలమకూరు విజయమోహన్ - నేను క్రమం తప్పకుండ చూసే బ్లాగుమీది.

బుసాని పృథ్వీరాజు వర్మ - అంబరచిత్రం :-
"నా కంటికి ఓ చక్కని దృశ్యాన్ని చూపారు."
ఆయన చిత్రాలకి నేను కవితలు వ్రాయటానికి ఇది ఆరంభం.

కొత్తపాళీ గారు - ఈ సిగ లెక్కెక్కడ తప్పుతోందబ్బా? :-
"చాలా బాగా రాశారు. ఈ మధ్య కాలంలో మన బ్లాగుల్లో ఈ మాత్రం పట్టున్న రచన చదవలా."
పట్టున్న రచన చేయాలన్న పట్టుదల వచ్చిందీ మాటతో.

బొల్లోజు బాబా - మంచు పూల పేరంటం :-
"ఆకాశపు సంబరాలు అన్న ఊహే హృద్యంగా ఉంది. మీ పదచిత్రాల సొబగు కూడా అందంగా అమరింది."
నా పదాల్లోని అందాన్ని స్పర్శించినవారు.

ఆత్రేయ - copper bottom heart నా చూడచక్కనమ్మ! :-
"మీ కాపరు బాటము గుండే, ఈ జీవితపు ప్రెషరు కుక్కరులో అమరుతుందా? బ్రతుకు వంట బానే వండుతుందా? ఐతే ఎక్కడ (కను)కొన్నారో చెప్పండి. నాకొకటి బాగా అవసరం.
చాలా బాగుందండి"


రాఘవ - నీవు - నా అలక :-
"ఇది చదివి నాకు దేవులపల్లివారు గురుతుకొచ్చారు...

నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడచిపోకుమా
చెదరిన హృదయము పగులనీకుమా"
ఇంతకన్నా ఏమి కావాలి, ఒకరి మదిలో ఆ మహనీయుని సరసన తృటికాలమైనా నిలవగలగటం.

డా. ఆచార్య ఫణీంద్ర - దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? :-
"’ఉష’ గారికి నమః

ఉ|| మానవ జీవితంబనెడు మాన్య విశేష విచిత్ర చిత్రమే
కానగ దివ్యమైనదని, కాల పథాన దశావతారముల్-
మీనము, కూర్మమాదులును మేళవమై నర జన్మమందునే
లీనమునౌచు తోచునని లీలగ చెప్పిన మీకు వందనాల్! :- "
డా.ఆచార్య ఫణీంద్ర గారు, మీ ఈ పద్యం నా మరువపు వనానికి ఇకపై సంజీవని వంటిది. ఎపుడైనా నా కవితా శక్తి సన్నగిల్లినట్లుంటే ఇదే తారకమంత్రం. నాకీ రోజు పట్టభద్రురాలినైనంత సంతసం, అంబరమంటిన హృదయం అన్న అనుభూతి అమాంతంగా అనుభవమైంది.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) - నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది! :-
"మీ ఆలోచనలు చాలా బాగున్నాయి.వాటిని గేయ కవిత్వం రూపంలో కంటే పద్యకవితా రూపంలోకి మలచగలిగితే శాశ్వతత్వం సంతరించు కుంటాయి. ఎందుకంటే పద్య కవిత్వానికున్న చంధస్సు ఆ గుణాన్ని పెంపొందిస్తుంది. పైగా ధారణ కనువై మనసులో గుర్తుండి పోడానికి వీలు కలుగ జేస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నం ప్రారంభించండి.శుభం భూయాత్."


దిలీప్ - పై కవిత మీద
"ఏంటమ్మా ఇది? ఈ శక్తి ఎలా చేకూరుతుంది? అది వ్యక్తిత్వ మహిమా? లేక సాహిత్య పిపాస వల్లా? ఎక్కడినుండి పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ? ఇంతటి చిక్కని భావాలు"


మహేష్ - నిరీక్షణ - సమర్పణ :-
"మీ కవిత చదివినప్పుడల్లా నాకు తెలిసిన తెలుగు మీద సందేహం వస్తుంది. ఇక కవిత్వమంటారా top class."


వేణూ శ్రీకాంత్ - శృంగార సూరీడు! :-
"చాలా బాగుంది ఉష గారు. ఈ పాట గుర్తొస్తుంది. "గోరు వెచ్చనీ సూరీడమ్మా...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా...
వద్దన్నా రావద్దన్నా గుండెల్లో గుడిశ వేసి అది గుడిగా చేసీ ఆ గుడి లో దాగున్నాడమ్మా.."
ఇదే కాదు ఎన్నో చక్కని పాటల్ని ఆవలీలగా గుర్తుకి తెస్తారీయన.

భాస్కర రామి రెడ్డి ఇంకా తెలియదీ నిర్వచనం! :-
"కవిత చదవగానే కామెంట్ రాయాలనిపించింది. కామెంట్ రాయడానికి ఏదో ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరరణ ఏపాదమో అని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చదివా.. ఏ పాదము తీసి వేసి కవిత చదివినా అసంపూర్తిగా అనిపించింది. అందుకే ఏ పాదానికాపాదమే సరిసాటి."


సుజాత - కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం! :-
"మీకింత చిక్కని భావాలు ఉప్పెనలా ఎలా వస్తాయి? ప్రిపేర్ అయి రాసినట్లు అసలే ఉండదు.ఒక్కోసారి చదివి మూగబోడమే తప్ప తిరిగి ఇది బాగుందని రాయడానికి భాషే దొరకదు నాకు. I'm jealous..! "


ఆనంద్, ప్రదీప్, మధుర, నేస్తం, పరిమళం - ఎంత చెప్పినా వీరిచ్చే ప్రోత్సాహాన్ని సరీగ్గా తెలుపలేను. కృతజ్ఞురాలను అని ఒక మాటగా చెప్పటం తప్ప. మచ్చుకి ఒక్కో వ్యాఖ్య...

ఆనంద్ - మన్నించవా మిత్రమా? :-

"Some emotions never have reasons.
Some relations never have endings.
Some tears are never forgotten.
Some hugs are never felt enough.
Some smiles never have meanings.
Some feelings never need voices."


మధుర వాణి - మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా? :-
"ఉష గారూ, మీ కవితలన్నింటినీ తప్పనిసరిగా పుస్తకం వేయించాలండీ.. ఈ సరికే ఒక పుస్తకానికి సరిపడినన్ని అయ్యే ఉంటాయి కదూ..!"


పరిమళం - ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా? :-
"టైటిల్ చూడగానే మైకం లో పడిపోయా ...
తుంటరి వసంతుడు....వలపు వెల్ల....
మీ పద ప్రయోగం
శరదృతు వెన్నెల కిరణం !"


నేస్తం - పై కవిత మీద
"ఉషగారు టైటిల్ కూడా ఇంత అందం గా పెట్టెస్తే ఇంక కుళ్ళిపోవడం తప్ప ఏం చేయగలను.. అద్భుతం ఇంతకు మించి పదం దొరకడం లేదు నాకు :("
;)

వీరంతా కుమ్మరించిన పాలధారలిక్కడ చూడండి - నేనూ నండూరి ఎంకికేం తీసిపోను...


ఇకపోతే ఇలా మెచ్చుకోళ్ళు, ప్రశంసల వర్షాలే కాక సద్విమర్శలతో నాకు మరింతగా ఎదిగే అవకాశం కల్పించిన వారు కొందరు.

కొత్త పాళీ, బొల్లోజు బాబా గారు - మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా? వ్యాఖ్యల్లో చక్కని వివరణగా వారి అభిప్రాయాలు చూడండి.

"పద్యంలో భావం చాలా బావుంది. మీరేమనుకోనంటే దీన్ని కొంచెం డిసెక్ట్ చేస్తాను. రెందు విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టాలని నా విన్నపం. ఒకటి విషయానికి తగిన క్లుప్తత. రెండోది వాక్య నిర్మాణం. ఈ రెంటి మీదా శ్రద్ధ పెడితే మీ పద్యాలకి అంతస్సౌందర్యమే కాక బాహ్య సౌందర్యం కూడా వస్తుందని నా హామీ :)"


"మీలో అద్భుతమైన కల్పన శక్తి ఉంది. అలవోకగావివిధ భావాల పరంపర మీ కవితలలో తొణికిసలాడుతుంది. సందేహంలేదు మీ కవితలు చదువరి మనో యవనికపై మంచి ఆలోచనలను నాట్యం చేయిస్తాయి.

ఈ క్రింది విషయాలు మిమ్ములను నొప్పిస్తే వాటిని ఇగ్నోర్ చేయండి. ఈ కారణం మన అనుబంధానికి అడ్డంది కాబోదనే ధైర్యం చేస్తున్నాను. ఈ అభిప్రాయాలన్నీ కవిత్వంపైనే కానీ వ్యక్తులపై కాదు.

అభియోగాలు
1. మీకు కలిగిన భావాన్ని మీరు యధాతధంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది కూడా మీరెంచుకొన్న పదాల వల్లకానీ, లేక పదాల కూర్పువల్ల కానీ జరుగుతుంది...."


ప్రదీప్ - కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం! :-
"కోడిగుడ్డుపై ఈకలు అనుకోపోతే ..."
అంటూ సాగిన సుధీర్ఘ చర్చ ఇంకా సశేషంగానేవుంది. కానీ నాకు గుర్తుంది తనకి సమాధానమివ్వాల్సివుందని.

విజయ్ - మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం? :-
"ఉష గారూ! మొదటి 12 లైన్లలో తీసుకున్నంత శ్రద్ధ తరువాత 8 లైన్లలో తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే...
ఈ లైన్లలో పదాలు ఏదో అందం కోసం ప్రయోగించినట్లుగా ఉందే గానీ, అంత భావుకత కనిపించక తేలి పోతున్నాయి.. అలాగే ఒకే అర్ధం వచ్చే పదాలు అదే లైన్లో కనిపిస్తున్నాయి...
"కూర్పు, చేర్పు
కూరిమి, చెలిమి "

నాకు తోచింది చెప్పాను .. అన్యదా భావించకండి...
అలా రాకుండా జాగ్రత్త తీసుకుంటే మరింత బాగుంటాయి మీ కవితలు.
కవిత చాలా బాగుంది. all the best :)"


భావకుడన్ - ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా? :-
"ఈ కింది విధంగా....... మీ కవితనే ....విడగొడితే?......కొంచం పాఠకుడికి సులువుగా ఉంటుంది....ఇంకొంచం అందం కూడా వస్తుంది అని నా భావన "


నల్లమోతు శ్రీధర్ - నీవు - నా అలక :-
"ఉష గారు, మంచి భావుకత. బాగుంది. స్పేసింగ్, bold, italic వంటి ఫార్మేటింగ్ అనుసరించడం వల్ల మీ కవిత మరింత ఆకర్షణీయంగా కన్పిస్తుంది. చూడడానికి మొత్తం ఒక పేరాగా అనిపిస్తోంది. మున్ముందు వీలైతే దీనిపై దృష్టి పెట్టగలరు. మంచి పోస్టులు రాస్తారని ఆశిస్తూ.."
శరత్, జ్యోతి, యోగి :- టెంప్లేటు మార్చమనో, మార్చిపెట్టో, మంచిది వెదికి పెట్టో సహకరించినవారు.


చివరిగా, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నా 64 కవితల్లోకి, ఒక్కగానొక్క వచనం "నారాయణ నారాయణ ఇదీ ఓ కధే" లోకి తొంగిచూస్తే నాకే అబ్బురంగావుంది నా చిరు మొలకని అచ్చంగా నిడదవోలు మాలతి గారన్నట్లు ఇంత నందనవనంగా తీర్చిదిద్దటానికి మీరంతా ఎంతగా సహకరించారో కదాని.

నా వరకు నేను క్రొత్త కోణంలోకి చూసాననిపించినవివి -

copper bottom heart నా చూడచక్కనమ్మ!
చక్రభ్రమణం
శృంగార సూరీడు!
అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట...
లక్ష జన్మల కోటి లేఖల్లో ...
అద్దంలో నా బొమ్మ నవ్వుతుంది! ఎందుకబ్బా?
ఉరుము భేరి మ్రోగించి, మెరుపు దీపాలు వెలిగించి సమరం చేసె ఆకాశం!
ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా!
నేనూ నండూరి ఎంకికేం తీసిపోను...
నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది!
స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులం!!!
ఇంకా తెలియదీ నిర్వచనం!
మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం?
నానమ్మ నవ్వుకి అర్థం మీరైనా చెప్పరా?
ఆ ఒక్కటీ అడక్కు!

ఏడాది నిండుతుందనగా "ఏది ఏమైనా కాని ఒక మంచి కవిత.......నాకు చాల నచ్చింది......నా బ్లాగ్లో పెట్టుకోనా? (www.nemechchinaraatalu.blogspot.com) అంటూ భావకుడన్ గారు బ్లాగ్లోకంలోని మహామహుల రచనల సరసన నా చిరు కవిత ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా? కి స్థానం కల్పించారు. మరువానికదొక అనుకోని అపురూపమైన పుట్టినరోజు కానుక.

సాహితీమిత్రులందరికీ శతసహస్రకోటి ధన్యాభివందనాలతో ...

ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా?

కాలం పరుగెడుతోందా ?
నేనే కాలప్రవాహంలో కొట్టుకొచ్చానా?
నా మనసు నివ్వెరపడింది.

పచ్చల పతకం నిలువు దొపిడీగా మొక్కుకుందేమో
పిచ్చి నా చిట్టి మొక్క అనుకున్నానే
ఆ మొక్కే చిలకలా నవ్వింది
పచ్చనాకు పట్టు పావడతొడుక్కుని.

ఒకటొకటిగా ఆకు రాలుస్తూ
మంచు చీర కప్పమని
కాలాన్ని ప్రార్ధిస్తుందేమోననుకున్నానే,
ఆ మొక్కే గాలికి వయ్యారాలు పోతుంది
హంసకి కులుకులు నేర్పనున్నట్లు.

చిలక ఆ మొక్కపైనే వాలి
తన ముక్కుకి పోటి పూమొగ్గలని ఒప్పేసుకుంది.
పెట్టిలోనున్న పెళ్ళినాటి చిలకపచ్చ
పట్టు చీర కట్టుకోమని కవ్విస్తోంది.

చిలక పలుకులు నేర్చి
మొక్క సింగారాలు అలవరచుకోమని
మది తృళ్ళిపడుతోంది.

కాలం మారింది,
ఎవరో మునుపన్నట్లు
ఋతువు నవ్వేస్తోంది,
నా తనువు తొందరపడుతోంది.

అందుకేనేమో ఆకసాన అదో అందం
గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు
ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు.

మరందుకేనో పరవశాన మదిదీచందం
రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా,
హత్తుకున్న తీపి తలపులు
మరలి మరలి సిగ్గు దొంతరలు
కనుల కప్పేస్తున్నట్లు.

ఎద వీడని మధురిమ
తుమ్మెదని పిలిచే
తుంటరి పూవులోని మకరందమై,
వదలని వలపు నెమరేయగ
మరి రుచిగా, తెరతెరలుగ
మత్తు కమ్మే నెత్తావై
నేనొక చిరు మొగ్గనై
వసంతుని చేత చిక్కిన
వేవేల జీవకోటిలో ఒకరిగా
అనురాగఝురిలో మునిగిపోయా.
ఆనంద జగతిలో కాలు మోపా.

05/02/09: క్లాసు వివరాలు

చాలావరకు పిల్లలు వేర్వేరు కారణాల వలన రాలేకపోయినా, ముదుగా అనుకున్నట్లు పరీక్ష, సమీక్ష చేసాను.

మూడు సంవత్సరాల ఈల, సంహిత్ చెల్లి, అన్ని పాఠాలు వాళ్ళ అన్నతో సమంగా వల్లెవేసి తిరిగి మాకు వినిపించటం నాకు అత్యంత ఆశ్చర్యానందాల్నిచ్చింది.

అలాగే తేజస్ మొదటిసారిగా నేను పాడతాను అని "ఏనుగు ఏనుగు నల్లానా.." అని చక్కగా చెప్పటం కూడా నాకు పిల్లలకి నచ్చే తీరుగా పాఠాలు చెప్తున్నానన్న సంతృప్తినిచ్చింది.

తాబేలు-కుందేలు కథ మళ్ళీ చెప్పుకుని, కాకమ్మ-పిచ్చుకమ్మ కథ చెప్పుకుని, ఆ రెండిటిలోని నీతి సారాంశం తెలుసుకున్నాము.

కాసేపు మా పెరట్లోని చెరువు వొడ్డున గడిపి, చేపలు, కప్ప పిల్లల్ని చూసాము. పక్షులని గుర్తు పట్టాము. ఇంకాసేపు బంతాట ఆడాము. పిల్లలకి ప్రకృతి పట్ల ఆసక్తి, గమనించటం నేర్పే ప్రయత్నమిది. వాళ్ళంతా చిన్ని కళ్ళనిండా సంబరం నింపుకుని, గల గల కాబుర్లు చెప్పటం ఇంకాస్త ఆనందం.

మొత్తంగా తెలుగువెలుగు తన కిరణాలు ప్రసురింపచేస్తుంది. దేశభాషలందు తెలుగు లెస్స.

04/25/09: క్లాసు వివరాలు

హాజరు attaendance తో పాటు మొదలైన చిలిపి అల్లరితో మొదలుపెట్టామీరోజు. లలిత్ ఎంతో ముద్దుగా lolly pop అంటూ తన హాజరు పలకటం బావుంది.

ముందు క్లాసులో ఇచ్చిన హోంవర్క్ అందరివి కనుక్కున్నాను. సాహితి వారాల గురించి చాలా బాగా వ్రాసింది. నేహ చాలా చక్కని చిత్రం తెచ్చింది. అలాగే అందరు పిల్లలు ఆసక్తిగా తమ తమ వర్క్ గురించి చెప్పారు.

నేర్చుకున్న పాఠం: హల్లులు Consonants. ముందుగా పరుషమైనవి harsh sounding క, చ, ట, త, ప లు చెప్పటమైంది. అలాగే అచ్చులు Vowels దిద్దటం నేర్పాను.

నేర్చుకున్న పాట: చుక్ చుక్ రైలు వస్తుంది ..

పైవారం సమీక్ష review మరియు కొద్దిపాటి పరీక్షించటం వుంటుంది.

లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి!

విడివడని మబ్బుచాటునున్నా బాలభానుడు
తన వెలుగు లోకమంతా నింపాలని ఆరాటపడతాడు.
విరిసీ విరియని మొగ్గగానేవున్నా పూలు
తమ పరిమళం లోకమంతా పంచాలని త్వరపడతాయి.
మూసిన గుప్పిళ్ళ పసిపాపడి దశనే మనిషి మాత్రం
లోకాన్ని మొత్తం తన గుప్పిట చిక్కించుకోవాలని కలకంటాడేమో?

మంచిని ఎంచితే ప్రకృతికి మనిషికి ఎందుకు ఇంకెన్నో వైరుధ్యాలిలా!
ఆ ఇరువురు ఒకరీతిగా వుండాలన్న మాటే విస్మరించారా?
ఫలపుష్పాల తరులన్నీ ఒకేతీరున చూపేటి దాతృత్వం,
ధనదాన్యాల తులతూగే గృహస్తుకి ఇసుమంతైనా వుండదు.
నియమానుసారం ఎన్ని యుగాలుగా నిలిచిందో ప్రక్రతి ధర్మం,
సమయానుకూలంగా ఎన్ని రకాలుగా మారుతుంది మనిషి వైనం?

చెడుని వదలక ఆ వంకా ఒకసారి పోలిక వెదికామంటే
ఒకరితో ఒకరు హోరాహోరిగా వైరమాడుతూ సరిపడరా?
గనులు తవ్వి పోస్తూ ఇతను, భుకంపమై జ్వలిస్తూ తాను
పొగలు సెగల పరిశ్రమలు కడుతూ ఇతను, ఉప్పెనల ముంచేస్తూ తాను
అత్యాశ దురాశ ఆక్రమణల ఇతడు, అతివృష్టి అనావృష్టి పోకడల తాను
మారణహోమాలు ఇతనివైతే విలయతాండవాలు ఆమెవి.

ఇది కాదా లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి,
ఎప్పటికి సమకూరేను ఓ శాంతియుత సహగమనం?