గోదారమ్మ పరవళ్ళు, కృష్ణమ్మ ఉరవళ్ళు అచ్చంగ నావేనమ్మా!

చిన్న మాట: ఉద్యోగరీత్యాగా నాగార్జున సాగర్, ధవళేశ్వరం, భీమవరం, అనంతపురం మొదలుకుని యడ్లపాడు, చీమకుర్తి వంటి చిన్న ప్రాంతాల్లో కూడా నివసించి, నదీ పరివాహిక ప్రాంతాల్లో, నీటికోసం అంగలార్చే జనాల్లోనూ మసలే వైవిధ్యభరిత జీవితాన్ని రుచి చూపిన నాన్నగారికి కృతజ్ఞతలతో... ఈ చిరు కవిత

గోదారమ్మా! మరుమల్లె తోట మారాము చేయక మారాకు వేసినట్లు

ఏడాదికోమారు ఎర్రెర్రని కొత్తనీరు గట్లుతెంపుకుని తోడిపోస్తావు .

ఆనకట్ట కట్టినా, కాలువలుగా నిను చీల్చినా ఆగిందా నీ వేగం.
చెలిమిచేయ నీకెవరు సాటి, కనుకే సాగరసంగమం నీ అమరగానం.

గౌతమి నీలో లీనం, తన తోటి నెచ్చెలులకీ అదే వేదం.

కలిమిలొసగ సరిలేరు నీకు, అందుకే అనుపమానం నీ అనురాగం.

నదీనదాల్లో జాతివజ్రం నీవు, పైరుపచ్చల పరువానివి నీవు.

చిట్టడవుల విడిదిచేయ వెనుదీయవు, కొండాకోనల పరుగిడ అలుపెరగవు.

మునిమాపుల మౌనికవైనా, వేకువవేళల మేలుకొలుపులు పాడినా,

నీకే కాదా తగును, నీ వొడిన మునక నా బ్రతుకు నోచిన భాగ్యమమ్మా.

కృష్ణమ్మా! అలలతో అల్లికలల్లి ఆకాశానికి అందివ్వాలనేనా ఆ ఆత్రం?
ఆవేశం అనంతమై సాగే నీ పయనం అంబుధిరాజ అంతఃపురానికా.

మరి ఉండుండి వచ్చేటి ఆ మేఘరాజు పరుగు నీ ఒడిని చేరటానికేమో!

భాష్యం లేని నీ గీతాలకి వాద్యాలు ఆ దేవదుంధుబులా!

మెరుపునురుగుల ఆణిముత్యాలు అంచలంచలుగా ధరపై ఒలికిస్తూ
ఏమా పరుగు, ఎందుకా బిరబిరలు, ఏమిటా మేనివిరుపులు?

అస్థిరవై, అంచలంచల అనీషవై దరిలేని తీరాలకడుగులేస్తూ
ఏ అదృశ్యప్రియునితోనో గుసగుసల గుంభన నవ్వు లొలికిస్తూ

ఒరవడిలోనూ తడబడుతూ ఏ ఓడిని చేరేవు, ఒక్కసారి గుట్టువిప్పమ్మా.

నిన్నే అనుసరించే నాకు నావాడి జాడ ముందుగా నువ్వే చెప్పమ్మా!

25 comments:

 1. హ్మ్మ్ బాగుంది.చాలా రోజుల తరువాత కొన్ని పాత పదాలు విన్నాను.
  http://parnashaala.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4

  ReplyDelete
 2. గోదారమ్మా!!! నీ పరవళ్ళు అన్నీ ఈ కవితలో చూసానమ్మా!!!

  ReplyDelete
 3. "చెలిమిచేయ నీకెవరు సాటి, కనుకే సాగరసంగమం నీ అమరగానం"
  "ఆవేశం అనంతమై సాగే నీ పయనం అంబుధిరాజ అంతఃపురానికా." ...great

  ReplyDelete
 4. మహేష్, పసితనం, బాల్యం, యవ్వనప్రాయం అన్నీ కృష్ణ, గోదావరి నదులతో అవినాభావసంబంధమైన అనుభవం. నిజానికి కృష్ణమ్మ మీద కవిత చాలా ఏళ్ళ క్రితం వ్రాసుకున్నాను, బహుశా నా మొదటి పది కవితల్లో ఒకటి కావచ్చు. అందుకే గ్రాంథిక భాష ప్రభావం (ఆముక్తమాల్యద, హిమబిందు వంటి రచనలు ఆకళింపు అవకపోయినా తెలుగు తెలుసుకోవాలన్న తపనతో చదివినవి) నా పద ప్రయోగంలో వుంది. ఇక గోదావరి మీద పొడిగింపు నా "ఈ జాడలు, నా గుండె వేసిన వూడలు!" కవిత మీద కురిసిన స్పందన, ప్రతి స్పందనలనుసరించి వెలికి వచ్చింది. మీ అభినందనకు కారణమైన ఈ వివరణ ఇవ్వాలనిపించింది.

  ReplyDelete
 5. పద్మార్పితా, నిన్న రాత్రి ఈ కవిత వ్రాస్తుతున్నంతసేపు "నా వాలు జడ క్రిష్ణవేణి.. నా పూల జడ వెన్నెలా గోదారి, నా వళ్ళు గంగమ్మ పరవళ్ళుగా, నర్తించిన ..." పాట పదే పదే గుర్తుకి వచ్చింది. అచ్చంగా నేనలాగే పెరిగాను. వెన్నెల్లో గోదారిని, వేకువల్లో కృష్ణమ్మనీ కళ్ళనిండా నింపుకుని మరీ..

  ReplyDelete
 6. మురళీ గారు, ఈ కవిత తమకు ఏ తలపుల్ని ఎదలోతుల తవ్వి వెలికి తెచ్చిచ్చిందో నాకు తెలిసిపోయిందిలేండి ;) ఎవరో మీ కిన్నెరసాని అదీ చెప్పరూ ;) నిజం కదా, స్త్రీత్వం మేళవించుకోవటంలో, ప్రేమే ప్రవాహంగా జీవించటంలో నదికీ, ముగ్ధంటి కన్నియకీ ఎవరు సాటి చెప్పండి? ప్రకృతీ, పురుష భావాన్ని నదీ-సాగరాలు చాటిచెప్పుతాయి. ఆ భావనలు ఎన్ని వేల కవితలకైనా అందుతాయా..

  ReplyDelete
 7. అస్థిరవై అంచలంచల అనీషవై దరిలేని తీరాలకు అడుగువేస్తూ .....నాగురించే!...-:)

  ReplyDelete
 8. చిన్నీ, అలాగే మరి, కాకపోతే ఒక షరతు. నాకు కవితలకి ఆర్థ్రత కావాలంటే ఇక మీ చిరునామాకే మేఘసందేశాలు పంపిస్తాను. అచంచల నిరుపమాన భావావేశం మాత్రం నాకు బదులుగ పంపేతీరాలి.

  ReplyDelete
 9. కొత్తపాళీ గారు, ధన్యవాదాలు. మీ వ్యాఖ్యతో నా కవితకి నలుగురిలో మనగలిగే అర్హత వచ్చినంత విలువ. నాకు తెలుగులో కేవలం "తెలుగు" అని మాత్రమే సరిగ్గా వ్రాయటం వచ్చిన సమయంలో మా లలిత మేడం అంటే ఎంత భయం, భక్తీనో ఇదీ అంతే. ఆవిడ నిరాడంబరత, నేర్చుకోవాలన్న తపనని పెంచిన విధానం నా ఈ ప్రహస్తం/కవితాపథానికి నాందీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ పూర్వకంగా మరువపు స్పందన-ప్రతి స్పందనల నేపథ్యాన తెల్పుకుంటున్న మాట ఇది.

  ReplyDelete
 10. మూగమనసులు లో గోదావరి అంత మధురంగా వర్ణించారు

  ReplyDelete
 11. మరి ఉండుండి వచ్చేటి ఆ మేఘరాజు పరుగు నీ ఒడిని చేరటానికేమో!

  ఏమా పరుగు, ఎందుకా బిరబిరలు, ఏమిటా మేనివిరుపులు?
  భాష్యం లేని నీ గీతాలకి వాద్యాలు ఆ దేవదుంధుబులా!

  ఏమని వర్ణించగలను మీ కవిత్వాన్ని ఏమని చేప్పగలను మీ వర్ణన గురించి ఎంత చెప్పినా చెప్పాల్సింది ఎంత మిగిలి వుంటుందో కదా...

  ReplyDelete
 12. హరే కృష్ణ, మూగమనసులే కాదండి, ఏ సినిమాలో గోదావరిని చూసినా "ఉప్పొంగిపోయింది గోదావరి" అన్నది నా తనువులో పునరావృతమౌతుంది. ఇక నిజంగా చెంతగావున్నపుడు నయాగరానే.
  శ్రీ, మీ అభిమానానికి ధన్యవాదాలు. ప్రకృతి, ఆ ప్రకృతిలోని మనిషి నైజం, ఆ పై దైవికం ఈ నా కవితా ప్రహసనం. ప్రయత్నం నాది, సంభవం కర్మఫలానిది.

  ReplyDelete
 13. మిరజరగాలన మీ ఆనతి ....చిత్తం -:)

  ReplyDelete
 14. బాగుంది. కృష్ణానది సాగర్ కి ఇటు ఒకలా, అటు ఒకలా ఉంటుంది. బాగుంది కవిత...

  ReplyDelete
 15. గోదావరి , కృష్ణమ్మ , మీ కవిత ...వెరసి త్రివేణీ సంగమం ...

  ReplyDelete
 16. * చిన్ని, అమ్మమ్మమ్మా ఎంత మాట, అయినా నాది సత్య తీరు అని మీకూ తెలిసిపోయిందేం.
  * సుజ్జి, బాబా గారు, నెనర్లు
  * రామరాజు గారు, నిజమేనండి, ఆ నదిని ఎన్ని రూపాల్లోనో, ఎన్ని తావుల్లోనో, ఎన్ని వేళల్లోనో కాంచాను. పులకరించిపోయాను. జలకాలాడాను, ఈదులాడాను, నావెక్కి లాహిరి గీతాలు ఆలపించాను. అసలలాగే నిల్చుని తన నామమే జపించాను.
  * పరిమళం, మీ మార్క్ వ్యాఖ్య. అమ్మోసి నాకూ వరద పొంగుకొచ్చినంత సంతసం. "చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలై పొంగి, .." గుర్తొస్తుంది.

  ReplyDelete
 17. బాగుంది ఉష, ఎదో ఇంటెర్మీడియెట్ తెలుగు పుస్తకం లో కవితలు చదువుతున్నట్లు వుంది ....... చాలా బాగుంది ఉష... ఎన్నళ్ళయ్యిందో ఈ తెలుగు పదాల ప్రయోగం విని....

  ReplyDelete
 18. భావన, ఇది క్రొత్త తరహా వ్యాఖ్య. ఇంటర్లో తెలుగు చదవలేదు కానీ మా పదోతరగతి తెలుగు సార్ వెంకటరమణ గారు గుర్తొచ్చారు. "వ్రాసుకుంటూ పో తల్లీ! భాష మీద పట్టు అదే వస్తుంది" అనేవారు. గురువు దీవెన ఫలించింది. ఆయన ఎక్కడున్నా మనసులో చేసిన నా పాదాభివందనం అందే తీరుతుంది. అలాగే మా నాన్న గారు, తెలుగు నేర్పాలని, హిందూ పేపరు ఆర్టికిల్స్ తెలుగులోకి, తెలుగువి ఇంగ్లీషులోకి తర్జుమా చేయిస్తూవుండేవారు. ఆ చిన్నతనపు రోజులు కలబోసుకునే అవకాశమిస్తున్న ఈ బ్లాగింగ్ ఒకప్పటి స్టాంప్ కలక్షన్ లా నాకు భలే నచ్చేసిందండి. నెనర్లు.

  ReplyDelete
 19. ఇన్ని మాటల కవులు, అన్ని కవితలల్లుతుంటే,
  ఇన్ని రాగాల నెలవులు, నీకై అంత అనురాగం పాడుతుంటే,
  కోటి దీపాల కాంతి నీ పరవళ్ళ నవ్వుల్లో.
  ఆనాటి కవులతొ పోటి కొత్త చిగుళ్ళ ఈ మరువపు ఈనాటి మాటల్లో.

  మీ ఉనికి సదా నిలువుగాక "కృష్ణాగోదావరీ మధ్య ప్రదేశే" తీరాల్లో!
  మీ పదం సదా కదులుగాక ఆ సాగరసంగమ అమరగానాల్లో!

  ReplyDelete
 20. ముచ్చటైన మీ మాటల అల్లికకు,
  మురిపాన నా ఉల్లము ఝల్లనగా,
  మరువపు కొమ్మ పచ్చగ నవ్వెగా,
  ముదమున నా మది కోయిలై కూజితాలు పాడెనే!!

  ఆనంద్, ఇలా వేసవిలో మల్లెలజల్లు వంటి ప్రశంస కురిపించటం కవితల పట్ల మన కవులకివున్న అభిమానానికి చిహ్నం. ఆనాటి కవుల నీడగానైనా తగని నేను అపుడపుడు వారి చెంతన వున్నట్లు ఇలా పగటి కలలు కనటానికి ఇదే కారణం. నెనర్లు.

  ReplyDelete
 21. పరువాల కృష్ణమ్మ నిండు గోదారితో కలిసి మా పల్లెలకు ఎప్పుడు జీవంపోస్తుందో !

  ReplyDelete
 22. "ఆ రోజెంతో దూరము లేదూ భాస్కరా!" ఆ మంచి తరుణం త్వరలోనే రానున్నదని ఆశిద్దాం. నెహ్రూ గారి కాలంలోనే పునాది పడాల్సిన ఈ నదుల అనుసంధానం కార్యక్రమం జాప్యం వెనుక పెక్కు కారణాలు, రాజకీయ లబ్దులు, ప్రగతి పట్ల అవగాహన లేని సామాన్య జననీకం. "నీచే నాచే ధరచే ..." అన్న రీతిలో మన అభ్యుదయం నత్త నడకకి పలు పీఢనలు/శాపాలు. ఆలస్యంగా నైనా మీ వ్యాఖ్య స్ఫూర్తిగా వెలికి వచ్చిన కవిత చదివినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete