ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా?

కాలం పరుగెడుతోందా ?
నేనే కాలప్రవాహంలో కొట్టుకొచ్చానా?
నా మనసు నివ్వెరపడింది.

పచ్చల పతకం నిలువు దొపిడీగా మొక్కుకుందేమో
పిచ్చి నా చిట్టి మొక్క అనుకున్నానే
ఆ మొక్కే చిలకలా నవ్వింది
పచ్చనాకు పట్టు పావడతొడుక్కుని.

ఒకటొకటిగా ఆకు రాలుస్తూ
మంచు చీర కప్పమని
కాలాన్ని ప్రార్ధిస్తుందేమోననుకున్నానే,
ఆ మొక్కే గాలికి వయ్యారాలు పోతుంది
హంసకి కులుకులు నేర్పనున్నట్లు.

చిలక ఆ మొక్కపైనే వాలి
తన ముక్కుకి పోటి పూమొగ్గలని ఒప్పేసుకుంది.
పెట్టిలోనున్న పెళ్ళినాటి చిలకపచ్చ
పట్టు చీర కట్టుకోమని కవ్విస్తోంది.

చిలక పలుకులు నేర్చి
మొక్క సింగారాలు అలవరచుకోమని
మది తృళ్ళిపడుతోంది.

కాలం మారింది,
ఎవరో మునుపన్నట్లు
ఋతువు నవ్వేస్తోంది,
నా తనువు తొందరపడుతోంది.

అందుకేనేమో ఆకసాన అదో అందం
గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు
ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు.

మరందుకేనో పరవశాన మదిదీచందం
రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా,
హత్తుకున్న తీపి తలపులు
మరలి మరలి సిగ్గు దొంతరలు
కనుల కప్పేస్తున్నట్లు.

ఎద వీడని మధురిమ
తుమ్మెదని పిలిచే
తుంటరి పూవులోని మకరందమై,
వదలని వలపు నెమరేయగ
మరి రుచిగా, తెరతెరలుగ
మత్తు కమ్మే నెత్తావై
నేనొక చిరు మొగ్గనై
వసంతుని చేత చిక్కిన
వేవేల జీవకోటిలో ఒకరిగా
అనురాగఝురిలో మునిగిపోయా.
ఆనంద జగతిలో కాలు మోపా.

23 comments:

 1. వసంత ఋతువును బాగా ఆస్వాదిస్తున్నట్టున్నారు .కానివ్వండి.

  ReplyDelete
 2. ఉషగారు
  సూపర్! .భావుకత నిండుగా ఉంది.  ఒక చోట అర్థం కాలేదు వివరించ గలరు......

  ఒకటొకటిగా ఆకు రాలుస్తూ
  మంచు చీర కప్పమని
  కాలాన్ని ప్రార్ధిస్తుందేమోననుకున్నానే,
  ఆ మొక్కే గాలికి వయ్యారాలు పోతుంది
  హంసకి కులుకులు నేర్పనున్నట్లు

  ఇక్కడ....ముందు వింటర్ లో పరిస్థితి చెప్పి....అదే మొక్క గాలికి వయ్యారాలు పోతోంది అన్నారు...అక్కడ ఒక ఋతువు నుంచి ఇంకొక దానికి మార్పు చెపుతున్నారు కదా.....సడన్ గా ఈ గాలి ఎక్కడ నుంచి వచ్చింది? అంటే వింటర్ లో గాలి ఉండదనా?........
  ఈ కింది విధంగా....... మీ కవితనే ....విడగొడితే?......కొంచం పాఠకుడికి సులువుగా ఉంటుంది....ఇంకొంచం అందం కూడా వస్తుంది అని నా భావన .......మీరేమంటారు?

  కాలం పరుగెడుతోందా ?
  నేనే కాలప్రవాహంలో కొట్టుకొచ్చానా?
  నా మనసు నివ్వెరపడింది.

  పచ్చల పతకం నిలువు దొపిడీగా మొక్కుకుందేమో
  పిచ్చి నా చిట్టి మొక్క అనుకున్నానే
  ఆ మొక్కే చిలకలా నవ్వింది
  పచ్చనాకు పట్టు పావడతొడుక్కుని.

  ఒకటొకటిగా ఆకు రాలుస్తూ
  మంచు చీర కప్పమని
  కాలాన్ని ప్రార్ధిస్తుందేమోననుకున్నానే,
  ఆ మొక్కే గాలికి వయ్యారాలు పోతుంది
  హంసకి కులుకులు నేర్పనున్నట్లు.

  చిలక ఆ మొక్కపైనే వాలి
  తన ముక్కుకి పోటి పూమొగ్గలని ఒప్పేసుకుంది.
  పెట్టిలోనున్న పెళ్ళినాటి చిలకపచ్చ
  పట్టు చీర కట్టుకోమని కవ్విస్తోంది.

  చిలక పలుకులు నేర్చి
  మొక్క సింగారాలు అలవరచుకోమని
  మది తృళ్ళిపడుతోంది.

  కాలం మారింది,
  ఎవరో మునుపన్నట్లు
  ఋతువు నవ్వేస్తోంది,
  నా తనువు తొందరపడుతోంది.

  అందుకేనేమో ఆకసాన అదో అందం
  గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
  మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు
  ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు.

  మరందుకేనో పరవశాన మదిదీచందం
  రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా,
  హత్తుకున్న తీపి తలపులు
  మరలి మరలి సిగ్గు దొంతరలు
  కనుల కప్పేస్తున్నట్లు.

  ఎద వీడని మధురిమ
  తుమ్మెదని పిలిచే
  తుంటరి పూవులోని మకరందమై,
  వదలని వలపు నెమరేయగ
  మరి రుచిగా, తెరతెరలుగ
  మత్తు కమ్మే నెత్తావై
  నేనొక చిరు మొగ్గనై
  వసంతుని చేత చిక్కిన
  వేవేల జీవకోటిలో ఒకరిగా
  అనురాగఝురిలో మునిగిపోయా.
  ఆనంద జగతిలో కాలు మోపా.
  ఏది ఏమైనా కాని ఒక మంచి కవిత.......నాకు చాల నచ్చింది......నా బ్లాగ్లో పెట్టుకోనా?(www.nemechchinaraatalu.blogspot.com)

  (పూర్తి హక్కులు మీవే :-)

  ReplyDelete
 3. ఉష గారు , టైటిల్ చూడగానే మైకం లో పడిపోయా ...
  తుంటరి వసంతుడు....వలపు వెల్ల....
  మీ పద ప్రయోగం
  శరదృతు వెన్నెల కిరణం !

  ReplyDelete
 4. భావకుడన్ గారి సదభిప్రాయం మేరకు ముందుగా ఇలా వ్రాసిన కవితని ఇపుడు మీరు చూస్తున్న విధంగా మార్చాను. మరెవరికైనా ఇదొక ప్రమాణం కాగలదని వ్యాఖ్యలో వుంచాను.

  ***********************
  కాలం పరుగెడుతోందా, నేనే కాలప్రవాహంలో కొట్టుకొచ్చానా, నా మనసు నివ్వెరపడింది.
  పచ్చల పతకం నిలువు దొపిడీగా మొక్కుకుందేమో పిచ్చి నా చిట్టి మొక్క అనుకున్నానే,
  ఆ మొక్కే చిలకలా నవ్వింది పచ్చనాకు పట్టు పావడతొడుక్కుని.
  ఒకటొకటిగా ఆకు రాలుస్తూ మంచు చీర కప్పమని కాలాన్ని ప్రార్ధిస్తుందేమోననుకున్నానే,
  ఆ మొక్కే గాలికి వయ్యారాలు పోతుంది హంసకి కులుకులు నేర్పనున్నట్లు.
  చిలక ఆ మొక్కపైనే వాలి తన ముక్కుకి పోటి పూమొగ్గలని ఒప్పేసుకుంది.
  పెట్టిలోనున్న పెళ్ళినాటి చిలకపచ్చ పట్టు చీర కట్టుకోమని కవ్విస్తోంది.
  చిలక పలుకులు నేర్చి, మొక్క సింగారాలు అలవరచుకోమని మది తృళ్ళిపడుతోంది.

  కాలం మారింది, ఎవరో మునుపన్నట్లు ఋతువు నవ్వేస్తోంది, నా తనువు తొందరపడుతోంది.
  అందుకేనేమో ఆకసాన అదో అందం, గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
  మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు.
  మరందుకేనో పరవశాన మదిదీచందం, రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా,
  హత్తుకున్న తీపి తలపులు మరలి మరలి సిగ్గు దొంతరలు కనుల కప్పేస్తున్నట్లు.
  ఎద వీడని మధురిమ తుమ్మెదని పిలిచే తుంటరి పూవులోని మకరందమై,
  వదలని వలపు నెమరేయగ మరి రుచిగా, తెరతెరలుగ మత్తు కమ్మే నెత్తావై, నేనొక చిరు మొగ్గనై
  వసంతుని చేత చిక్కిన వేవేల జీవకోటిలో ఒకరిగా అనురాగఝురిలో మునిగిపోయా. ఆనంద జగతిలో కాలు మోపా.

  ReplyDelete
 5. భావకుడన్ గారు, ముందుగా మరువానికొక హోదా కల్పిస్తున్నందుకు మీకు సదా కృతజ్ఞురాలను. మీ బ్లాగ్లో తప్పకుండా పెట్టండి. ఏడాది నిండనున్న మరువానికదొక అనుకోని అపురూపమైన పుట్టినరోజు కానుక అనుకుంటాను.

  అలా సూటిగా, పరోక్షంగా అబినందన తెలిపినందుకు, ఒక భావావేశంలో అలా వ్రాసుకుపోయిన కవితని పాఠకులకు సులువైన విధంగా విడగొట్టినందుకు సంతోషం.

  ఇక మీరడిగిన వివరణ: మా వూర్లో ఋతువుల నడుమ విభజన చాలా స్పష్టంగా గోచరమౌతుంది. చలికాలం కి ముందు ఫాల్లో కొన్ని చెట్లు, మొక్కలు వర్ణాలు మారిన ఆకుల్నో, మరి కొన్ని పచ్చనాకుల్నే అక్టోబరు, నవంబరు మాసాల్లో గాలివాన సమయాల్లో రాల్చేస్తాయి. కాని అంతదాకా ఆకు వస్త్రాల్లో మిడిసిపడ్డట్టుండే అవే డిశంబరునాటికి మౌనంగా ఋషుల మాదిరిగా మోడులై శీతాకాలపు చిక్కని గాలికి [గాఢత వలన గాలి వీచటం తగ్గుతుంది] కదలక మెదలక ధ్యానిస్తున్నట్లు అలా నిలిచుంటాయి. ఇక జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఐసింగ్ రెయిన్ కానీ మంచు కాని కురిసి వాటికి మరో చీర కప్పేస్తాయి. అలా సాగిన కాలం ఏప్రిలు, మే నాటికి ఋతువు మారి వసంతునాగమనంతో లేలేత కిరణాలు మంచుని పారద్రోలాక, అంతదాకా చలికి జడిసి దాక్కున్న గాలి బయటకి వచ్చి తన వంతు ప్రభావం చూపుతుంది. గాలి మీద పోయిన్నెల్లో నేను వ్రాసిన కవిత ఇది. "ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా!" [http://maruvam.blogspot.com/2009/04/blog-post_08.html]. చివుర్ల, పూమొగ్గల కాలమంతా ఆ గాలికి తలవొంచి చెట్లు, మొక్కలు ఎటు వీస్తే అటు వూగుతూ నాట్యాలు చేస్తాయి. జూలై, ఆగష్టు, సెప్టెంబరు మాసాల్లో మటుకు నిండుగా ఫల పుష్పాలతో బంభీరంగా మాకెదురు లేదన్నట్లు నిటారుగా నిలిచివుంటాయి. అదండి వరస క్రమంలో నాలుగు ఋతువుల నా మొక్కలు, చెట్ల పోకడ. ఇకపోతే ఇందులోని ఒకటీ రెండు పంక్తులు దాదాపుగా ఏడాది క్రితం ఇదే మాసంలో వచ్చిన వూహ, ఎందుకో మనసపుడు వెనక్కినెట్టేసింది, తిరిగి తలపుకొచ్చి ఇలా కవితగా వెలికి వచ్చింది. మీరడిగిన ప్రశ్న కారణంగా ఇలా కాలంతో ప్రకృతి మార్పులు తలపోసుకోవటం ఈ వేకువ ఝామున మంచి తృప్తినిచ్చింది. వేవేల ధన్యాభివాదాలు.

  ReplyDelete
 6. భాస్కర రామి రెడ్డి, ఏమండీ తమరు అస్వాదించటం లేదా ఈ ఋతువుని? నిజానికి ఎవరు కాదు చెప్పండి, ఓ మారలా బ్లాగ్లోకంలో సంచరించిరండి, మీలోని భావుకుడు చాలా చక్కని కవితని ఆవిష్కరిస్తాడు. మన విషయంలో అదే జరిగింది ఏదో కొద్దిపాటి స్వానుభవం మినహాయిస్తే. మనసు కదలికకి చిరు స్పందన చాలు కాదండి అదే వెయ్యింతలై వెల్లివిరుస్తుంది. నాకీ కవితాశక్తినిచ్చినందుకు నిత్యం ఆ పరమాత్మునికి నమస్కరించుకుంటాను.

  oremuna గారు, నా బ్లాగుకి సాదర స్వాగతం. మీకు నచ్చినందుకు ముదావహం.

  ReplyDelete
 7. పరిమళం గారు, పైన భాస్కర రామి రెడ్డి గారికి తెలిపినట్లు తమబోటి వారి టపాల ప్రభావం తోనే నాదీ రూపుదిద్దుకుంది. అందుకే ఆ మధ్య ఒకసారి కొత్తపాళీ గారు వసంతాలు, విరహాలు అని వ్యాఖ్యానించినట్లుగా గుర్తు ;) మీ వ్యాఖ్య నా కవితకి సిగమల్లి.

  అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

  ReplyDelete
 8. ఉషగారు టైటిల్ కూడా ఇంత అందం గా పెట్టెస్తే ఇంక కుళ్ళిపోవడం తప్ప ఏం చేయగలను.. అద్భుతం ఇంతకు మించి పదం దొరకడం లేదు నాకు :(

  ReplyDelete
 9. కవితలో మంచి దేహం, కాంతి ఉన్నాయి.

  ReplyDelete
 10. ఉష గారు,

  ముందుగా అడగంగానే అభ్యర్థనను మన్నించినందుకు నెనర్లు.

  ఇన్ని పోకడలా ఋతుగమనంలో? నిజంగా ఋతురాగాలను ఎంత బాగా పట్టారో.....అర్జంటుగా "వాసంత సమీరంలా, నునువెచ్చని గ్రీష్మంలా ...................." పాట వినాలనుంది.....జాలంలో వెతకాలి.....

  భల్ పసందైన వర్ణన చేసినందుకూ, అది కలిగించిన భావానికీ....."కోటి దండాలు, శతకోటి దండాలు." :-)

  ReplyDelete
 11. నేస్తం, ఎంత చుప్పనాతి ప్రశంసండీ, సరీగ్గా అతికింది నా మురిపానికి ;)

  బొల్లోజు బాబా గారు, మీరిచ్చిన సలహాలు పనిచేస్తున్నాయట్లుగావుంది. గురువు గారి మెచ్చుకోలు మాదిరిగా వుంది మీ ప్రశంస.

  భావకుడన్ గారు, మరోమారు ధన్యవాదాలు. "వాసంత సమీరంలా, నునువెచ్చని గ్రీష్మంలా ...................." పాటదొరికితే కాస్త నాకు కూడా తెలిపరచండి.

  అందరకూ ."కోటి దండాలు, శతకోటి దండాలు." :-)

  ReplyDelete
 12. ఉష గారు,
  "గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
  మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు
  ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు" -- ఈ వాక్యాలు భలే ఉన్నాయి.

  ఇక నాది కూడా భావకుడన్ గారి అభిప్రాయమే... మీరు మొదట రాసినప్పుడు అలా పెద్ద వాక్యాలు చూసేసరికి తీరిక ఉన్నప్పుడు చూద్దామని వెళ్ళిపోయా... మళ్ళీ ఈవాళ సరళంగా కనిపించేసరికి అచ్చెరువొంది వాఖ్యలు చూస్తే అర్ధమయ్యింది అసలు కధ.
  కళ్ళు చూపేదంతా అందమూ కాదు. చూడనంత మాత్రాన అందం చెడదు.
  నా భావాలకు విరుద్దంగా ఇలాంటి పనులు చేసినప్పుడు నన్ను చూసి వెక్కిరిస్తుంటాయి. ఈసారి ఆ వెక్కిరింపు మీ కవితద్వారా అందింది. (మీ కవిత ద్వారా అంటే, మీ కవితను చూసాక ఖాళీ ఉన్నప్పుడు వద్దామని వెళ్ళడం అన్నమాట)

  ReplyDelete
 13. ప్రదీప్, మీ వ్యాఖ్యకి అలవడి అదిలేక మనసులో ఏదో వెలితి. ఈ రోజు చాలా సార్లు చూసాను నిజానికి. అంత నిజాయితీగా, నిర్భీతిగా మీ మనసులో మాట పంచుకున్నందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు.

  ReplyDelete
 14. "హ్మ్మ్ బాగుంది." అని అంటే కాస్త తరిచి చూసాక నచ్చిందనాండి అర్థం, మహేష్ గారు? ;)

  ReplyDelete
 15. @ఉష: అలాంటిదే అనుకోవచ్చు. మీ కవితలు చదివి అర్థం చేసుకోవడానికి నాకు సాధారణంకన్నా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకో తెలీదు. తెలుసుకోవాలి.

  ReplyDelete
 16. ఉషగారు, భావకుడన్ గారు,
  ఋతురాగాలు సీరియల్ లోని వాసంత సమీరం లా పాట ఇక్కడ చూడచ్చు.
  http://venusrikanth.blogspot.com/2008/06/blog-post_23.html

  ఇక టపా విషయానికి వస్తే నేస్తం గారు చెప్పినట్లు శీర్షిక తోనే మనసు దోచేసారు. చాలా బాగుంది, మీ వ్యాఖ్యానం చదివాక మరింతగా నచ్చింది.

  ReplyDelete
 17. చాలా సంతోషమండి, వెంటనే విన్నాను.ఆ మధ్య జెమినీ టి వీ వారు మధ్యాహ్నాలు తిరిగి ప్రసారం చేసారు కానీ ఎక్కువగా వినలేకపోయాను. ఈ లింకు ఇక మోగిపోతుంది నా చెవుల్లో.

  నా కవితలకి మీ ఆదరణ పూరిత వ్యాఖ్యలెపుడూ నిండుదనమిస్తాయి. ధన్యవాదాలు.

  ReplyDelete
 18. :) ఈ లింక్ నుండి mp3 డౌన్ లోడ్ చేసుకోవచ్చు చూడండి. క్వాలిటీ అంతే ఉంటుంది కాకపోతే, ఎందుకంటే ఇదే పాటను రికార్డ్ చేసాను.

  http://rapidshare.com/files/230799608/Vaasanta_Sameeram_laa.mp3.html

  ReplyDelete
 19. చిలక పలుకులు నేర్చి
  మొక్క సింగారాలు అలవరచుకోమని
  మది తృళ్ళిపడుతోంది.

  ReplyDelete
 20. This is from Aswinisri. I am only adding just so Maruvam feels comeplete ;)

  "Your “GAALI GOLLOEDU” WAH! KYA EXPRESSION HAI USHAA JII! REALLY, REALLY….. WONDERFUL."

  ReplyDelete
 21. indianyouth, అశ్వినిశ్రీ గార్లకు, ధన్యవాదాలు.

  ReplyDelete