కమనీయ కావ్యం, మనిషి జీవితం!

మళ్ళీ తెల్లారింది, తేదీని మార్చమంది.
రోజు నియమాలు వతనుగా నడిచిపోతున్నాయి.
మనసు చింత కొత్త రూపు తెచ్చుకుంది.
బ్రతుకు పయనం ఆపలేనని సాగుతుంది.

అన్నీ తెలిసినా, నిన్న వాన వెలిసిపోయిందని బెంగ,
నేడు వాన కురుస్తోందని కలత, మదికి ఇదో సరదా.
ఎండ బాధ వద్దనో, చలి బారిన పడననో,
ఒకదానివెంట ఒకటి యోచనాసుడులు, వృధా అలజడులు.

జీవితపు మఱ్ఱికి మరో గతపు వూడ వేసింది.

ఈ చెట్టుకి అనునిత్యం ఆరు ఋతువుల సంగమమే.
నిమిషాలు రాల్చుకుంటూ, కొత్త చివురు వేసుకుంటూ,
గెలుపు పూలు విప్పారిస్తూ, తృప్తి ఫలాలు పండించుకుంటూ.

ఆశో, ఆశయమో ముందుకు నడిపించటానికి వూపిరి.
మార్గాన్వేషనో, మార్గదర్శకత్వమో వుందొక స్ఫూర్తి.
ఆనందశిఖరాన్ని చేరను అలుపు అదుపు ఎరుగక సాగే యాత్ర.
బ్రతుకంతా పునరావృతమైనా ఇది కాదా సంపూర్ణ సజీవచిత్రం?

కాలంతో గానాలు, గాయాల్లో ఉపశమనాలు,
ప్రకృతిలో అందాలు, సహచరులతో అనుభూతులు,
అన్నీ కలిపిన పూదండకి దారం జీవన సారం, ఆ అల్లిక ముడికో వైనం.
ఆ కదంబమే కదా సరాగ సుధా భరితం? ఓ కమనీయ కావ్య పఠనం?

18 comments:

 1. >>>"అన్నీ తెలిసినా, నిన్న వాన వెలిసిపోయిందని బెంగ,
  నేడు వాన కురుస్తోందని కలత, మదికి ఇదో సరదా." సరిగ్గా చెప్పారు

  ReplyDelete
 2. కవితలోని ఆత్మ నచ్చినందుకు ధన్యవాదాలు. పడుతూ, లేస్తూ, పయనిస్తూ గడిపే ఈ జీవితంలోని ఆనందం గురించి ఎంత వ్రాసినా సరిపోదు.

  ReplyDelete
 3. "పూదండకి దారం జీవన సారం"
  నిజంగా కమనీయ కావ్య పఠనమే!

  ReplyDelete
 4. విజయ మోహన్ గారు, పరిమళం ధన్యవాదాలు. జీవితం అలా నిత్య వసంతం కనుకనే ఇంకా ఏవో శుభఘడియలు రానున్నాయన్న ఆశ ముందుకు నడిపిస్తుంది. we all pass through thick and thin with hope.

  ReplyDelete
 5. "జీవితం అలా నిత్య వసంతం కనుకనే ఇంకా ఏవో శుభఘడియలు రానున్నాయన్న ఆశ ముందుకు నడిపిస్తుంది".

  ఉషగారూ, మీ కవిత కన్నా మీ ఈ వ్యాఖ్య నాకు బాగా నచ్చిందండీ.

  ReplyDelete
 6. లాస్య, చక్కని పేరు మీది. తొలిపలుకుకి ధన్యవాదాలు. జీవితం అక్షయంలో ఆశే చివరి మెతుకు. అదే తిరిగి మళ్ళీ పాత్ర నింపుతుంది. ఇలా ఆశావాదిని కనుకనే బడలిక లేకుండా సుదూర తీరాలకి సాగుతున్న బాటసారిని నేను.

  ReplyDelete
 7. hello usha garu mee kavithalu chala chala bagunayi... aa akshralu anni poguchesi meere rasara lekha ala akasam nundi paddaya annattu ga unnayi mee rathalu...nijamga mee prasa, mee alochana chala bagunnayi. inta kammati kavitha chadivina taruvatha manasuki eedho teliyani ahladam. inthati anubhuthi pondhi enni yugalu ayindha anntu ga undhi. meeru rase okkoka kavitha prathi okkariki entho anandani, visranthi istundhi ani bavistu.....


  "ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
  ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో "
  అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..

  ReplyDelete
 8. రామకృష్ణ గారు, మరుపవపు స్వాగతమాల సమర్పించుకుంటూ, మీ ఒక్కొక్క పలుకు భువన విజయంలో పెద్దనామాత్యుని వోలే అస్వాదిస్తూ, ఆ తాదాత్మ్యంలో నన్ను నేను మరిచి చదువుకున్నాను. ఇదంతా భారతీదేవి నా చేత పలికించెడి చిరు పలుకులు. అవి మీవంటి వారి ఔన్నత్యంలో పెద్దరికం సంతరించుకుంటున్నాయి. నేనూ అచ్చంగా మీ మాదిరే "వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ.." చిన్నపుడు భావుకత నిండిన కలల్లో తేలుతూ కదలకుండా కూర్చుంటానని "స్వప్నశిల్పం" అనేవారు. దాన్నుంచే ఈ రాగాలాపనలు పుట్టుకొచ్చాయి, ఇలా నలుగురిని అలరించే స్థాయికి తీసుకొచ్చాయి. "గుర్తుకొస్తున్నాయి.." అన్నట్లు కళ్ళు చెమర్చే అనుభూతిలోకి తోసింది మీ వ్యాఖ్య. వస్తూ వుండండి. విహరించి వెళ్ళండి. నెనర్లు.

  ReplyDelete
 9. Nice. Have u seen it?

  http://thinkquisistor.blogspot.com/2009/01/blog-post.html

  ReplyDelete
 10. గీతాచార్య, ఇపుడే మీ టపా చదివాను. నిజమే మన పరిచయానికి మునుపు మీ బ్లాగు ఒకసారో రెండుసార్లో చూసినా ఇంత లోతుగా వెళ్ళలేదు. మంచి వచన కవితని చదివించారు. నెనర్లు.

  ReplyDelete
 11. " జీవితపు మఱ్ఱికి మరో గతపు వూడ వేసింది.
  ఈ చెట్టుకి అనునిత్యం ఆరు ఋతువుల సంగమమే.
  నిమిషాలు రాల్చుకుంటూ, కొత్త చివురు వేసుకుంటూ,
  గెలుపు పూలు విప్పారిస్తూ, తృప్తి ఫలాలు పండించుకుంటూ ... "

  ఎంత గొప్పగా అన్నారు !
  జీవితాన్ని నాలుగు పంక్తుల్లో కాచి వడబోసారు !
  అభినందన మందారాలు !

  ReplyDelete
 12. డా.ఆచార్య ఫణీంద్ర గారు, ధన్యురాలను. మా నాన్నగారికి నేను చెప్పేవారిలో మీరొకరు. ఆయన నా ఈ పునర్జన్మకి సంతోషించారు. నేనీ రోజు మీ మన్ననలు పొందటం వెనుక ఆదిలో నా నేస్తం ప్రోత్సాహం ఇపుడు మీఅందరి గుర్తింపు కారణం. నాన్నగారికి మీవి కొన్ని కవితలు పంపుతున్నాను.

  ReplyDelete
 13. ఉష గారు, మీ విలువైన అభిప్రాయములకు నా ధన్యవాదములు. మీ బ్లాగులో వ్యాఖ్య చేయాలని ఉంది, కాని కాలం అనుకూలించడం లేదు. సమయం వీలుని బట్టి తప్పక నా వ్యాఖ్యలను ప్రచురిస్తాను.

  ReplyDelete
 14. చాలా బాగుంది కవిత
  బొల్లోజు బాబా

  ReplyDelete
 15. saipraveen మరేమీఇ ఫర్వాలేదు. సమయాభావం నన్నూ నిలవరిస్తుంది తరుచుగా.
  బాబా గారు, ఏమిటండి మూణ్ణెల్లా మీ వ్యాఖ్యకి తీసుకున్న గడువు. అయినా ఆనందం. ఈ ఒక్కసారి కాసింత తాజా టపాకి మరింత తాజా వ్యాఖ్య వ్రాయరూ? నెనర్లు + ధన్యవాదాలు + కృతజ్ఞతలు. భారీ ఆనందానికి అంబారీ మరి.

  ReplyDelete
 16. ఓ కమనీయ కావ్య పఠనం..అవును నిజమే

  ReplyDelete
 17. హరేకృష్ణ, ఈ కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు కానీ "అతడెవరు" race లో వెనకబడిపోతున్నందుకు బాధగావుంది సుమీ! ఇది మూణ్ణెల్ల క్రితంది, ఒకరికి ప్రస్తావించాల్సివచ్చింది. "అతడెవరు" తాజా టపా అదీ కాస్త మథనపడి మధించి వ్రాసినదీను మిత్రమా. అక్కడా ఓ చూపేయండి. నెనర్లు.

  ReplyDelete