ఈ జాడలు, నా గుండె వేసిన వూడలు!

తరం మారి ఆ చేతికర్ర,
నాన్న చేతికొచ్చినా,

అడుగడుగునా తాతయ్య జాడలే.


అవసరం లేదని ఆ కవ్వం
,
అటక మీదకు చేర్చినా,

అమ్మమ్మ చిలికిన వెన్న వాసన వీడలేదే.


ద్వారం పైన తోరణాలు మాసినా,

జూకామల్లెల మాదిరి అవింకా వూగినట్లే,

అవి కట్టిన చేతి గాజులు గల్లుమన్నట్లే.

గడప మీద కుంకుమబొట్టు వెలిసినా,

నిరంతరం వేయిపాదాలు ఆ గడప దాటినట్లే,

ఆ రంగులద్దిన మోవి చిరునగవు మెరుపక్కడే.


ముంగిట్లో ముగ్గు కనుమరుగైనా,

ముగ్గుకర్రతో వయ్యారి వేసిన,

రథం బొమ్మ కదిలినట్లే.


మోడై సగం వంట చెరుకై పోయినా
,
మా వేప కొమ్మ ఆనాడు,

చుక్కలన్నీ దోచుకొచ్చి పూలుచేసి నవ్వినట్లే.


పాయలై విడిపోయి సోయగం లేని ఆ కొలనువంక చూస్తే
,
కార్తీక పున్నమికి అరటిదిన్నెలో దీపాలు వెలుగు చిమ్మినట్లే,

సాగరమంత సాగి ఆలయమే సౌధం చేసుకున్నట్లే.


అన్నిటా ఆ జాడలే, గాఢమైన నీడలే,
ఏ జాడ నేను మరవగలను?
లేదని ఏ జాడకై నేను అన్వేషించను?

నను వీడక నా వెంబడే నడిచే ఈ జాడలు, నా గుండె వేసిన వూడలు
.

36 comments:

  1. ఉష గారు..గుండె వేసిన వూడలు అన్నారు అర్థం కాలేదు..నాకు ఫస్ట్ హాఫ్ లో ఒక సినిమా సెకండ్ హాఫ్ లో మరొక సినిమా చూసినట్టు వుంది ..
    మీరు ఒక్కసారి కూర్చుని రాయలేదనిపిస్తోంది
    విడివిడిగా చదివినప్పుడు చాలా నచ్చాయి..నా అభిరుచి ఇంతే అని వదిలేస్తే నేనేం చెయ్యలేను

    "గడప మీద కుంకుమబొట్టు వెలిసినా,
    నిరంతరం వేయిపాదలు ఆ గడప దాటినట్లే,
    ఆ రంగులద్దిన మోవి చిరునగవు మెరుపక్కడే".
    బాగా నచ్చింది

    మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా అభిమతం కాదు ..నా అభిప్రాయం చెప్పాను క్షమించాలి.

    ReplyDelete
  2. హరే కృష్ణ, మన్నించండి, కాని మీ అభియోగం నిజం కాదు. మొత్తం కవిత ఒకేసారి వ్రాసాను. టపాగా పెట్టటానికి ముందు 15నిమిషాలు అదే పని. నిజానికి ఈ సాయంత్రం జాగింగ్లో వచ్చిన ప్రేరణ ఇది. అది మీ మనసుకి ఆ భావన కలిగించటంలోనూ అసహజత్వం లేదు. అందరం ఒకే భావావేశానికి లోనవం కదా! మీకు విడివిడిగా నచ్చాయి కనుక నా అల్లిక నచ్చకపోయినా ఫర్వాలేదు.

    >> గుండె వేసిన వూడలు
    మఱ్ఱిచెట్టు వూడలు బలంగా భూమిలోకి చొచ్చుకుని పోయుంటాయి గమనించారా? నేను ఆ అర్థంలో వాడాను. గుండెలోని జ్ఞాపకాల్లో ఇవి బలీయమైనవి, మదిలో పదిలంగా జొరబడివున్నాయన్న అర్థం. అందుకే ప్రతి గమనంలో ఆ జాడలు వెదకకనే కళ్ళెదుట వున్నాయని ముందు చెప్పాను.

    "నా అభిరుచి ఇంతే అని వదిలేస్తే నేనేం చెయ్యలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా అభిమతం కాదు ..నా అభిప్రాయం చెప్పాను క్షమించాలి."

    ఒక సద్విమర్శలో భాగం కావివి. ఇకపై వీటికి తావీయకండి.

    ReplyDelete
  3. ఒక్కసారిగా
    అమ్మ మరువం తొ కలిపి కట్టి జడలొ

    తురిమిన కనకాంబరాల మాల
    పరిమళం .కార్థిక చలి లొ
    అమ్మ కొంగు ఆసరా తొ మునకల ..
    తడి హ్రుదిని తట్టాయ్..చాలా బావుంది

    ReplyDelete
  4. పండుగల్లో ఉగాది కొత్తదనం లా చాలా బావుందండోయ్...

    ReplyDelete
  5. sai and chinni, గార్లకి thanks for the compliment. కవిపోషణ అన్నది మన చరిత్రలో పెద్ద పీఠం వేసుకుంది కనుక ఇలా చదివిన వారి ప్రశంసకై కవయిత్రి/కవి మనసు ప్రతీక్షిస్తుందేమో! ;)

    ReplyDelete
  6. రిషి, కదంబపు పరిమళం, కార్తీక మాసం అమ్మతో కలిసివేసే మునక, ఎంత గొప్ప పోలిక! ఓ ప్రక్క మనసు ముదంతో ఉప్పొంగే గోదారే అవుతున్నా, కొండల కోనల కవితల్లలుకునే కృష్ణమ్మ కూడా మరువాన్ని రెండో ప్రక్క నిలువరిస్తుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. పృథ్వీ, ఉగాదితో కొత్తదనంతో పోల్చారు. నిజమే కదా ఏ ఏటికాయేడే క్రొత్త సింగారాలతో వస్తుంది. నాకు ఉగాది పచ్చడి చాలా ఇష్టం. నిజానికి రోజు ముగిసే లోపు ఇప్పుడు పిల్లలు కోక్ తాగినట్లు ఆరారగా కనీసం ఓ ఆరు గ్లాసులైనా ఆరగించేదాన్ని. అందుకే బ్రతుకునా, మానసానా కూడా ఉగాది పోకడలు మెండు.

    ReplyDelete
  8. ఏం చెప్పమంటారండి? ఒక్కసారి అలా వెనక్కి ..బాల్యం లోకి.. వెళ్ళిపోయాను..

    ReplyDelete
  9. మురళీ, నిజమేనండి, బాల్యం మిగిలిన జీవిత క్రియలన్నిటికీ ఉత్ప్రేరకం, ఆ తరగని నిధే అన్నివేళలా నడిపించే అదృశ్యశక్తి.

    ReplyDelete
  10. ఉషా, మీరిలా మమ్మల్ని ఎక్కడికో విసిరేస్తుంటే తిరిగి రావాలనిపించక, రాకుండా ఉండలేక, మనసులో ఎలా ఉందో తెలుసా? అసలు మీకు ఇంత మంచి పదాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి ముందు?

    ReplyDelete
  11. మా తాత చేతికర్ర వాడకపోతేనేమి, తాత స్మ్రుతులు గుర్తు రావా
    నాకు వెన్న నచ్చకపోతేనేమి, మా ఇంట వెన్న తీసిన రోజులు గుర్తు రావా

    Baagaa raasaaru

    ReplyDelete
  12. కొత్తపాళీ గారు, ధన్యవాదాలు.
    సుజాత గారు, నా మనసు మీ మనసు ప్రక్కనే చిక్కడివుంది, ఓ సారి చూడండి. పదాలు అలా పలుకరించిపోతున్నాయండి, చేతికి దొరకవు. కృతజ్ఞతలు. :)
    ప్రదీప్, మీ స్పందన క్లుప్తంగా కానీ స్పష్టంగా తెలిపారు. నెనర్లు. నాకు అపుడే చిలికిన వెన్న చాలా ఇష్టం, అమ్మమ్మ గారి ప్రక్కనే కాచుకు కూర్చునేదాన్ని. ఎన్ని వీశెలు తిన్నానో గుర్తు, లెక్కా లేవు. అందుకే మాది వెన్నంటి మనసట.. హ హ హ్హా..

    ReplyDelete
  13. ఏంటో ఎంత తొందరగా వచ్చి హాజర్ వేపించుకుందామన్నా.. నాకంటే 15 మంది ముందరే వచ్చి సమాధానాలు రాసేసారు ప్చ్..:(

    ReplyDelete
  14. అలాగా, మరి నా హాజరుపట్టికలో మీ పేరు పదోదే, ఈ 15 లెక్క ఎక్కడిదబ్బా? ;)

    ReplyDelete
  15. నేని నిన్నటి పోష్టుకి కామెంటు పెట్టినా
    ప్రతీ పోష్టుకి పెట్టినట్టే....

    వావ్!! నాకు కవిత్వం వచ్చేస్తోందోచ్...

    ReplyDelete
  16. కవితా లక్షణం సహజంగా అందరిలోవుంటుందని నా అనుమానం. అది సరైన అదును చూసి వెలికి వస్తుంది. పోతే బహు బాగుందండి మీ రుబాబు. నా వనం కబ్జా చేసారా ఏమిటీ, భాస్కర్ రామరాజు గారు? ;) రజనీ గారి మార్క్ డైలాగులు వస్తున్నాయి. అలాగే సార్, ఏమంటామిక మావంటి శాంతి కాముకులం. ఇక ప్రతి టపాకి ఓ ఆకు ఎక్కువేసి లెక్క పెడతా. అవును మీరు తాటాకులు లెక్కపెడతం ఎపుడైనా చూసారా? ఇది రామాయణంలో పిడకలవేట వంటి ప్రశ్న లేండి.

    ReplyDelete
  17. ఉష గారు ఎంత హాయిగా ఉంది చదువుతుంటే :)

    ReplyDelete
  18. నేస్తం, చక్కని అనుభూతి, ఇలా చానాళ్ళకి (కారణం తెలిసినా) మీ వ్యాఖ్య చూస్తుంటే, నేను నాటిన విరజాజి తీగె మొదటి మొగ్గ విచ్చినంత ఆహ్లాదం. రాత్రి లాప్ టాప్ నిద్రలోకి వొరిగే వరకు నాతోనే వుంది. కనుక నిద్ర లేవగానే చేతికి తాకింది, unlock చేయగానే మీ వ్యాఖ్య, వాహ్, బాగుంది జీవితం. ఉదయగానం, హృదయతాళం, మా వూరి జీవనం అన్నీ వూపేస్తున్నాయి. నెనర్లు.

    ReplyDelete
  19. ఉష గారు!!
    మీ వ్యాఖ్యలు ప్రతివ్యాఖ్యలు కూడా ఏదో కవిత్వంలా ఉన్నాయేంటి? మరీ ఇంత సాఫ్టా? హృదయతాళం..రాత్రి ల్యాప్ టాప్ పొద్దునే చేతికి చల్లగా ఆర్తిగా తాకింది, నన్ను అన్లాక్ చెయ్యి, అని...
    :):)
    సరే - శాంతి - దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి స్పూర్తితో -
    అసలు శాంతి మాదే! పల్నాడులో ఒక తరం ఆడవాళ్ళకి శాంతి అనే పెట్టారట పేరు.
    నడమంతరపు రాజకీయనాయకులు వినాయకులై,
    కులాల పేరిట అధినాయకులై,
    శాంతిని చెరపట్టి, పేరుమార్చి
    అశాంతి గా, విజయశాంతి గా, డిస్కో శాంతి గా మార్చి,
    మానవ జీవితాల్లోంచి శాంతిని హరించేసారు.
    శాంతికాముకులు పాపం!! ఇంకా శాంతి కనపడ్డంలేదని ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు -
    టీవీల్లో రేడియోల్లో ఏడారైపోతున్న బతుకుబాటల వెంట.


    తాటాకుల లెక్క!! సరే, ముందు మీరు తాటాకు పందిళ్ళు వెయ్యటం చూసారా? పందిరి వేసాక, పందిరిపై బక్కెట్లతో నీళ్ళు జల్లినప్పుడు, పందిరి కింద ఉన్నారా?

    ఏంటో ఈ జీవితం
    చిన్నప్పుడు చుట్టుతా చెట్లే
    అల్లంత ఎత్తు, ఎండని దాచలేని చెట్లు
    సమూహాల్లా, ఆకుపచ్చని ముత్యాల హారాల్లా
    పొలాల వెంబటి బారులు బారులు మైళ్ళు మళ్ళు..

    ఏంటో ఈ జీవితం
    ఇప్పుడూ, చుట్టుతా భవంతులే
    అల్లంత ఎత్తు, చెట్లని హరించిన గర్వంతో
    సిమెంటుతో పొగచూరిన పైకప్పులతో సమూహాల్లా,
    ఊళ్ళు ఊళ్ళు, పట్టణాలూ, నగరాలు
    బారులు బారులు మైళ్ళు మైళ్ళు...
    నోట్ - ఎండని దాచలేని చెట్లు = కొబ్బరి చెట్లు, తాడిచెట్లు లాంటివి...

    ReplyDelete
  20. చాలా బాగుంది ఉష గారు

    ReplyDelete
  21. ఏంటో కవితా గోదాట్లో పడి కూడికలే మర్చిపోయాను :(.. కూడికలు రాక మీ వ్యాఖ్యల నెంబరమ్మ చెప్పింది కాపీ కొట్టాను.

    ReplyDelete
  22. భాస్కర్ రామరాజుగారు, అవునండి అదే నా నైజం. అది సాఫ్టా, స్పందనా తెలియదు ;) మీ పల్నాడు కవిత బాగుంది. జీవితాన్ని కవితలా వర్ణించిన వైనం ఇంకా బాగుంది. అవటానికి గోదావరి జిల్లా అయినా మేము మాచెర్ల నుండి పిడుగురాళ్ళ మధ్య చాలా వూర్లలో నివసించాము. తాటాకు ఒకప్పుడు జీవితంలో పెద్ద భాగం సుమా! తాటాకుబొమ్మల పెళ్ళిళ్ళు చేసాము. తాటాకు పందిరిలోనే పెళ్ళి జరిగింది. ఆ పందిరి గుంజలు పట్టుకుని స్తంభాలాటలు కూడా ఆడాము. చాలా? పొలాల్లో, తోటల్లో తిరిగిన చిన్నతనమే నాదీను. ఆ జీవితం నెమరేసుకుంటూ, ఈ జీవితం సఫలం చేసుకుంటూ ఆ రెండిటి నడుమా తెలియదేదో అనుసంధానం చేస్తూ గడిపేస్తున్నాను. మీ సుదీర్ఘ వ్యాఖ్యకీ, అంత చక్కని కవితా హారానికి నమఃసుమాంజలులు.

    ReplyDelete
  23. హాయ్ హాయ్ రాధిక గారు, ఎంతకాలానికీ పునర్దర్శనం. అయినా మన ఇరువురికీ "తాతయ్య, అమ్మమ్మ" లతో ఏదో తెలియని సంబంధం వున్నట్లుగావుందే? ;) మీ "హేమంతపు ఉదయం" కవితకి నా వ్యాఖ్య "తాతయ్య ప్రక్కన వెచ్చగా తొంగున్న పసిదనం, అమ్మమ్మ చెంగులాగి ఆటాడించిన ఆకతాయితనం" అంటూ వ్రాసాను. ఈ కవిత ఎత్తుగడ కూడా వారిరువురి జ్ఞాపకంతోనే. అపుడూ స్పందించారు, ఇపుడూ ఋజువు చేసారు. ఇకపై మీకెలా వల వేయాలో నాకు తెలిసిపోయిందోచ్! :)

    ReplyDelete
  24. భాస్కర రామి రెడ్డి గారు, ఓహో అన్నారంట, ఇపుడెందుకండీ మీకు మా గోదారి మాటసాయం? మీ కావేరిని తలవక? ;) మీరు నా కన్నా మెరుగండి బాబు, మా ఇంటి ఫోను నుంబరే నాకు గుర్తుకి రాదు సమయానికి. అయినా కాపీ కాట్స్ ఎక్కువకాలం మనలేరు సామీ. అంచేత లెక్కల్లో తప్పులున్నా ఓ కే. నాకు ఆ సబ్జెక్ట్ ప్రాణం అంచేత తప్పు వెంటనే పట్టేసా. అసలీ కవితా వ్యాఖ్యా గమనాన్నే పక్క దారి పట్టించేసా. ;) అవన్నీ సరదా చెణుకులే సుమీ!

    ReplyDelete
  25. ఎవరక్కడ నేను లేకుండా గోదావరి గురించి మాట్లాడుతున్నారు.నానొప్పనంతెఒప్పను.ఈ పాలి ఒగ్గెత్తన్నా సరేనా,అయితే వాకే.
    "అన్నిటా ఆ జాడలే, గాఢమైన నీడలే,
    ఏ జాడ నేను మరవగలను? లేదని ఏ జాడకై నేను అన్వేషించను?"

    అదిరింది కవిత గోదావరి వెల్లువలా...

    ReplyDelete
  26. శ్రీనివాస్ గారు, ఓలమ్మ ఓలమ్మ ఏ మాతంతే ఆ మాతకే ముక్కట్టుకుంతారా, మనం మనం ఓటి గాదేటీ, వాల్లంతా మనోరు కాదేటీ, వొల్లనంతే మావూరుకుంతామేంటి, మాకు వాకే కాదని జగడాలాడమేంటి. హమ్మయ్యా ఎలాగో ఓలాగా ఆ యాస కాస్త అరువు తెచ్చుకున్నాను. మాదీ వేదంలా ఘోషించే అఖండ గోదావరి తీర ప్రాంతమేనండి. గోదాట్లో మునకలేసి ఎదిగిన ప్రాణమే ఇది. మీకు "స్వాగతం దొర ...తేనెలాంటి మనసువున్న తెలుగు నేలకు.. గోదావరి పాదాలకు నీళ్ళివగా పినాకిని పిలిచి నీకు పీఠ వేయగ, కృష్ణవేణీ మెచ్చి కడుపు నింపగా.." గుర్తుందా. రామిరెడ్డి గారికి చురకేసానండి, చిన్ని గారి బ్లాగులో http://himabinduvulu.blogspot.com/2009/05/blog-post_22.html "దోచి అన్ని నీళ్ళు మీ జిల్లాలకు కట్టపెట్టి రతనాల మా రాయలసీమను ( ఆంధ్రా అయినా మమ్మలెవరూ ఆంధ్రా వాసులనరండి )" అని ఉడుక్కున్నారని. (మన)/నాది 'వసుధైక కుంటుంబ నినాదం'. అన్నీ వుట్టుట్టికే, కాస్త సరదా, కాస్త stress relieving technique ;) నా బ్లాగుకు సాదర స్వాగతాంజలులు, మీ అభినందనకి కృతజ్ఞతలు.

    ReplyDelete
  27. ఉషగారు, లాభం లేదండి.

    ఎరక్కపోయి అన్నాను గోదారనీ
    ఇరుక్కు పోయి ఉన్నానూ....

    కావేరమ్మా రావమ్మా ఆ....
    పెన్నమ్మా రా..వ మ్మా ఆ...
    ఈద లేక ఈ దీనుడు ఊ...
    నిండా మునిగి ఉన్నాడూ....

    గోదారి బాసంటూ....
    గొడవ గొడవ చేస్తుంటే...ఆ..
    గుక్క తిప్పుకోలేకున్నానూ...

    టి.జి. వేంకటేష్ ని పిలుస్తా నన్నేమన్నా అంటే :)

    ReplyDelete
  28. సరేనండి, అన్ని తూచ్ తూచ్, అసలే శుక్రవారం, ఇంకా బోలేడు పని శనివారంలోకి జరిగిపోయింది. కనుక సంధి మంత్రం, సమైక్యతావాదం. పైన అదే కదా చెప్పాను. మీరిక వాళ్ళనీ వీళ్ళనీ పిలవకుండా నిశ్చింతగా కాలం గడపండి, మరువానికి మనుగడనీయండి. నేను కూడా ఇంకా తలవని గౌతమి, వృద్ద గోదావరి, పంపా నదులని మీవైపు పంపే ఉద్యమాలు చేస్తా! :) అపుడు

    "मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा
    सुर की नदियाँ हर दिशा से बहते सागर में मिलें

    [తెలుగు] నా స్వరము నీ స్వరము
    సంగమ్మమై, మన స్వరంగా అవతరించే"

    లేదా

    "hogi shanti charon or, hogi shanti charon or,
    hogi shanti charon or, ek din
    Oh, man mein hai visvas, pura hai visvas
    hogi shanti charon or, ek din "
    అంటూ సాహితీ మైత్రి కొనసాగించేద్దాం.

    నెనర్లు.

    ReplyDelete
  29. Oh, man, मे है बिस्बास, पूरा है बिस्बास

    ReplyDelete
  30. భాస్కర్ రామరాజుగారు, అద్గది మరి అసలు సంగతి! అలా కలగాలి విశ్వాసం. ఏకత్వంలో నమ్మకం. :) కృతజ్ఞతలు.

    ReplyDelete
  31. "చుక్కలన్నీ దోచుకొచ్చి పూలుచేసి నవ్వినట్లే".మాటల పోదోట కు మరువపు వనం అద్దిన సొబగులు బాగున్నాయి .అతిరధ మహారధులందరూ దిద్దిన పద వర్ణనలూ బాగున్నాయ్.ఇంక మాట్లాడేందుకు నేనెంత..అమ్మాయ్ ఉష ! అభినందనలతో ..శ్రేయోభిలాషి ...నూతక్కి.

    ReplyDelete