ఎన్నిసార్లు?

జననం ఒకసారే, మరణమూ ఒకసారే.
ఒకటి వదిలిపోతుంది, ఒకటి వెంటపెట్టుకుపోతుంది.
చలనం ఆగదే, పయనమూ ఆగకూడదే.
ఇది స్తంభించింది అది స్తబ్దమైపోయింది.

ఎన్నిసార్లు మరణించి మళ్ళీ పుట్టాను?
ఎన్నిసార్లు సంచలించి ప్రవహించాను?

వాస్తవానికి నాకు అందని నువ్వు,
కలల ఎడారిలోనూ ఎండమావివేనని,
ఆ దాహార్తిలో అక్కడే ముగిసిపోయాను,
సైకత రూపాన్నై మళ్ళీ ప్రాణం పోసుకున్నాను.

వూహల్లో నను వదలని నీవు,
శరత్ ఋతువులో నీహరికవేమోనని,
ఆ నిరాశలో ముందే కనుమూసేసాను.
ప్రత్యుష కిరణమై ఉనికి తెచ్చుకున్నాను.

మమతావేశంలో నన్ను మించిన నువ్వు,
జ్వాలాముఖివై లావాలా కరిగిపోతే,
చితిమంటగ నిన్నే చేసి నేకాలిపోయాను.
శిలాజాల్లోనుండి కదలి లేచివచ్చాను.

ఇన్ని మరణాల్లో నను తిరిగి పుట్టించిన సంజీవని,
ప్రేమ ఇక సెలవని నేడు మరణించింది.
ఎన్నోసార్లు నీకై చచ్చి బ్రతికిన నేను ఇక చాలని,
ఈ ఒక్కసారికీ నిన్నే చంపేసాను.

12 comments:

 1. దేహం కంటే ఆత్మ గొప్పది ..దాన్ని పవిత్రం గా వుంచడమే మనిషిగా మన లక్ష్యం

  ReplyDelete
 2. హరే కృష్ణ, మీరన్నది నిజం. ప్రేమ అలౌకికం. అది దైవ సమానం. ఆ ప్రేమే ఈ సమస్త జగతికి మూలం. కానీ మనిషి మనసులో అకారణంగా జనించి, అనూహ్యంగా విరమిస్తుందేమో కొన్నిసార్లు. నేను ఉద్దేశ్యించినది ఈ రెండో కోవకి చెందినదాన్ని. ఏమో అది అజరామరం కనుక అదే మనసులో అంతకన్నా బలీయంగా మళ్ళీ పుట్టొచ్చు. తనని తాను పరిరక్షించుకోగల శక్తి ప్రేమకుంది.

  ReplyDelete
 3. "ఎన్నోసార్లు నీకై చచ్చి బ్రతికిన నేను ఇక చాలని,
  ఈ ఒక్కసారికీ నిన్నే చంపేసాను" wonderful Ushagaaru...

  ReplyDelete
 4. విషాదాంతం చేసారేమిటిలా... అయినా సరే కవిత బాగుంది

  ReplyDelete
 5. హ్మ్.....అన్నీ వసంతాలే కాదు ఋతువుల్లో గ్రీష్మం కూడా ఉంటుంది మరి !

  ReplyDelete
 6. "జననం ఒకసారే, మరణమూ ఒకసారే.
  ఒకటి వదిలిపోతుంది, ఒకటి వెంటపెట్టుకుపోతుంది."
  బాగుంది ఉష గారు. ఒక జీవితం లోనే ఎన్నో జననాలు ఎన్నో మరణాలు... కాని ప్రేమ సత్యం నిత్యం అంటారు కదా...
  "ఇన్ని మరణాల్లో నను తిరిగి పుట్టించిన సంజీవని,
  ప్రేమ ఇక సెలవని నేడు మరణించింది."
  మరణించిందా మీరే చంపేసేరా? తరువాత లైన్ లో అన్నారు కద
  "ఎన్నోసార్లు నీకై చచ్చి బ్రతికిన నేను ఇక చాలని,
  ఈ ఒక్కసారికీ నిన్నే చంపేసాను." అని.
  బాగుంది ఉష..

  ReplyDelete
 7. సుజ్జీ, ధన్యవాదాలు, మీ రాకని తెలిపినందుకు.

  పద్మార్పిత, చివరికి చేసిన సాహసం ఇది. ఫలితం కూడా వండర్ఫుల్గా వస్తే మళ్ళీ మరో కవిత వస్తుంది.

  ప్రదీప్, విషాదం అలా కవితగా ఒలికిపోయింది. కవితనే నేనూ అనుసరించి విషాదంలో మునిగిపోయాను.

  పరిమళం, అవునండి, నా వసంతకేళికి నేనే దిష్టి పెట్టుకున్ననట్లేవుంది. గ్రీష్మం విచిలితనయ్యేంతగా వూపేసింది.

  భావన, అందుకే కదా, ప్రేమ చనిపోదు అన్న సత్యం తెలుసుకున్నాను మళ్ళీ, చంపాననుకున్నది నా అజ్ఞానాన్ని, అసత్యమైన నా భావననీను.

  అందరికీ ధన్యవాదాలు. విషాదం దులిపేసి మళ్ళీ అష్టనాయికగా మరువం మీ ముందుకు వస్తుంది త్వరలో.

  ReplyDelete
 8. ఉష గారూ,

  మీకు ఇన్ని పదాలు అసలు ఎలా పుట్టుకొస్తాయండి? ఆ పదాల కూర్పులో కూడా ఏదో తెలియని విలక్షణత

  కం ||
  సుందర కవితల రాణీ
  మంజుల పదబంధనల సు"మరువపు" వాణీ
  ఎంత తోడినా తరగని
  వెచ్చని కవితల ఊట బావి ఉషా రాణీ !!

  నచేత మళ్ళీ కందం చెప్పించారు... మీ భావుకత నిజంగా తరగనిది.

  ReplyDelete
 9. నచేత = నాచేత :) ఏంటో ఈ ఇంగ్లీష్ లో తెలుగుని తప్పులు లేకుండా రాయాలని ఎంత ప్రయత్నించినా లాభంలేదు ప్త్చ్ :(

  ReplyDelete
 10. భాస్కర రామి రెడ్డి గారు, మీ అభిమానానికి విచలితనయ్యాను, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను . ఇంతకు మించి ఏమీ చెప్పలేను. ఇటువంటి సాహితీ అభిమానం నాకు దక్కించేందుకు నా పదాలే నాకు వరంగా ప్రసాదించిన ఆ దేవదేవునికి వినమ్రంగా మొక్కుకుంటూ, మనమంతా ఇలా కలకాలం సాహితీపయనాలు చేయాలని ఆకాంక్షిస్తూ, ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.

  ఇక ఈ ఇంగ్లీషులో తెలుగు వ్రాయటం నన్నూ పరీక్షిస్తుందండి. ఒక్కోసారి ప్రాణం విసిగి అర్థం చేసుకుంటారులే అని వదిలేస్తాను. ;)

  ReplyDelete
 11. ఉష గారు, మీ వ్యాఖ్య చదవడానికొచ్చి నా వ్యాఖ్యలో తప్పు సరిదిద్దు కుంటున్నాను
  పద్యంలో జగణానికి బదులు రగణము దొర్లింది. అందుకని ఈ మార్పు

  సుందర కవితల రాణీ
  మంజుల పదబం ధనల సు"మరువపు" వాణీ
  ఎంతగ నుడివిన తరగని
  లక్షణ కావ్యక చెలమల ఉషా రాణీ

  ReplyDelete