అందరూ ఆడేది అదే కదా అమ్మతో దోబూచులు, నేనూ అంతే.
ఆపై దొంగాటలు, తొక్కుడు బిళ్ళ, వెన్నెల్లో వెన్నముద్దలూను
ఇంకెన్ని వినోదాలో వింత వింతలుగా విరామంలేకుండా.
అపుడాడింది నేను, ఇపుడు ఆడించబడుతుంది నేనే.
ఆ ఆటలే నా బ్రతుక్కిచ్చాయి ఓ ఆకళింపు. అలుపెరుగని ఆటగత్తెను నేను.
ఇసుకలో గూళ్ళు, ఎన్నెన్ని కట్టానో.
ఎంత పొందిగ్గా తీర్చిదిద్దానో.
ఇపుడు కట్టుకుంది ఒకటే గూడు.
ఎంత తరిచినా ఇంకేదో మిగిలేవుంది,
గూడు పేర్చుకుంటూ ఆట కాని ఆట నడుస్తూనేవుంది.
పేక మేడలు, పడినవెన్నో, పేర్చినవన్ని.
ఆశల గాలిమేడలు అందుకే కడుతుంటాను.
ఆ సౌధాలకి అడియాసల పునాదులు పదివేలు.
కూలినా, మళ్ళీ పేర్చేందుకు పట్టదు మూన్నాళ్ళు
బ్రతుకంతా ఆశనిరాశల నిర్మాణాలే, నిర్వాణాలే.
రధం ముగ్గు, విమానమంత రధం ఎన్ని వీధుల్లో వేసాను!
ఇపుడూ వూహల్లో పుష్పకమంత నా రధం పూలతేరంత అందం
రాణి నేనే, రారాజ్ఞి నేనే, సారధీ నేనే, సమాయత్తమూ నాదే.
వినువీధుల విహరించినా, ఏ వూరు వాడల వెళ్ళివచ్చినా.
ఆగని ఆ పయనాలే నా వాస్తవ వాహనానికి ఇంధనాలు.
స్తంభాలాట, నలుగురం ఆడినా నే ఓడిందెన్నడటా?
విజేతననా, విధి చేత చిక్కాననా ఇంకా సాగుతుందది?
కాలం, దైవం, విధి, నేను, తను - అ తనకి రూపాలు పెక్కు.
కాలాతీతమైతే, కరిగిన కలల్లో తనకి నాకు నిట్టూర్పువేదం.
దైవం అనుకూలిస్తే, తనకి నాకు ఆనందసంభ్రమం.
ముగింపు లేని ఇవన్నీ, నిర్ణేతలే లేని నా బ్రతుకాటలు.
" బాల్యం బంగారం,
ReplyDeleteబాల్యంలో ఉండే ఉత్సుకత
బాల్యంలోని అమాయకత్వం
ఆ అమాయకత్వపు ముసుగులో మంచితనం
భాద్యతలతో అలసిపోని మనసులు
చిన్ని చిన్ని విజయాలే ప్రపంచాన్ని జయించిన ఆనందాన్నిచ్చే అనుభూతులు "
మరి నడివయసులో
"ఆ ఉత్సుకుతకు సమాధి కట్టే తెచ్చిపెట్టుకునే పెద్దరికం, సమాజపు హోదా
అమాయకత్వపు సున్నితానికి గంభీరపు పొర
భాద్యతలతో అలసిపోయిన మనసులు
ఎంత పెద్ద విజయమైన చిన్నప్పటి విజయపు అనుభూతినిస్తాయా? "
ఉష గారు , నా చిన్ననాటి సంఘటనలన్నీ కళ్ళముందు కొచ్చేశాయ్ . మీ అంత అందంగా రాయలేను గాని లేకపొతే నేనే రాసుకున్నానేమో అనే భ్రమలో పడిపోయేదాన్నే సుమీ !
ReplyDeleteప్రదీప్, బాల్యమెంత అమూల్యం! అందుకేనేమో మూల్యం కడదామన్నా తిరిగి రప్పించలేము. ఇక ఆ అమాయకత్వమే లేకుంటే ఇక శైశవం కూడా సున్నితత్వం వున్నవారికి ఓ శాపమైపోయేది కాదా?
ReplyDeleteపరిమళం, మరువం వంటి ఆ బాల్యం వాడినా మనని వీడని తన పరిమళమే కదా మనని నడిపించే ప్రాణ వాయువు?