అబల అన్న సమాజాన్ని, ఆమె మాత్రమే మార్చాలి.

ముందు మాట: సున్నిత మనస్కులకి క్షమాపణలు, కటువైన పద ప్రయోగం తప్పనిసరైంది.

నిజమేనా, స్త్రీజాతిని చెరిచారని నేను కన్న కల నిజమేనా?

సజలనయనాన వీక్షించినది-

కలగానే మిగలాలి,
కాలమైనా ఆగిపోవాలి, 

ఆ కలైనా చెరిగిపోవాలి..

ఇంకెంతకాలం ఇలా అని నెలతలైనా గళం విప్పాలి,
సిగ్గులేని సమాజాన్ని నిర్భయంగా నిలదీయాలి.
ఇంద్రాది ఆది దేవతలే స్త్రీలోలులైనా, ఎవరది ఎత్తిచూపింది?


"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః"
అని ఆర్యోక్తి అంటూ ఆడవార్ని భ్రమింపచేసారేమో?


ఆత్మవంచన వదిలి సాంప్రదాయం ఆడదాని గోడు వింటుందా?
ఆమె ఆత్మగౌరవం ఈ విఫలపూజల కన్నా మిన్న అని ఒప్పుకుంటుందా?
తల్లి స్తన్యమీయనంటే ఎన్ని గొంతులు గగ్గోలు పెడతాయో!
తల్లివంటి మగువ చనులు ఎన్ని కనుల వేటకి బలౌతాయి?
'నా మనిషి' ఈమె అంటూ ఆస్తిగా మార్చిన ఈ మగజాతి,
ఆమె ఆస్తి తన ఆలోచన, స్వయంప్రతిపత్తి అంటే అంగీకరిస్తాడా?
పరస్త్రీని మోహించే పురుషుడు 'నాదీ నీదారే'నని భార్య అంటే వూరుకుంటాడా?


జానెడుగుడ్డ తనకికట్టి చిందులువేసే మగాడ్ని వురేయలేదా?
మానభంగం పేరిట మజా చేసేవాడ్ని కొరతవేయలేదా?
'అందం నీద'ని ఒకడికి వేడుక, అందని నాడు వాడిదే వికృతక్రీడ.
'అందం లేద'ని కట్నం బేరమాడినవాడే, చావు చేతికిచ్చి పేరుస్తాడు చితిమంట.
ఈ దుర్నీతిని, దురాగతాన్ని తను ఆపలేననా ఆమె ఆగుతుంది?
ఆది పరాశక్తి తన మూలస్థానం వదిలిరావాలా?
తన అంతర్గతశక్తి నేటి మగువ తానే వెలికితీయలేదా?
తరిమి తరిమి తన శత్రువుని మట్టుబెట్టలేదా?
తన వృత్తీ, ప్రవృత్తీ చాటిచెప్పుకోలేదా? తన మేధస్సు నిరూపించలేదా?


"లోకసమస్తా సుఖినోభవంతు" సఫలమని తను చేసిచూపలేదా?

-అబల అన్న సమాజాన్ని, ఆమె మాత్రమే మార్చాలి

23 comments:

 1. ఈ పితృస్వామ్య లోకంలో ఆడదీ మగాడి దృష్టితో చూసే పోకడ పోనంతవరకూ ఇవింతే. Fundamental గా రావాల్సిన మార్పు రాకుండా చాలా మంది ఔదార్యంగా అడ్డుకుంటున్నారు. అభ్యుదయం,స్త్రీవాదం పేరుతో alternative చెరలు సృష్టిస్తున్నరేతప్ప అవసరమైన "స్వేఛ్ఛని" అందుకోమనట్లేదు. మీ ఆవేదన సహేతుకమే అయినా,మీ భావాల్లోని పితృస్వామ్యాన్ని గ్రహించి బాధపడుతున్నాను.

  ReplyDelete
 2. మీ లోని భావాలని చెప్పారు.. పురుష జాతి అంతా ఒకేలాగా వుండదు..శ్రీకృష్ణుడు ,వివేకానందుడు బోధనలు వింటున్నాం అంటే వాళ్ళు కూడా పురుషులు అని వినడం మానేయలేదు కదా
  ఏ మతమైనా చెప్పేది మంచిగా వుండడం మంచి చెయ్యడం

  ReplyDelete
 3. మహేష్ గారు, "రావాల్సిన మార్పు రాకుండా చాలా మంది ఔదార్యంగా అడ్డుకుంటున్నారు" ఇది నిజమండి. ఆ మందిలో స్త్రీ, పురుష తారతమ్యంలేదు, అంతా పాలుపంచుకుంటున్నారు. ఏ ఒక్కరి వ్రాతలో, పిలుపో మార్పు తేదు, మారాలన్న తృష్ణ ఆ మనిషిలోనే జనించాలి. ఈ సంవేదనలు అభిప్రాయ వ్యక్తికరణలే. మీ అభిప్రాయం పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 4. హరే కృష్ణ, ఇది లోకం తీరుని సాపేక్షంగా యెంచి వ్రాసిన భావం. ఒకజాతి ఎక్కువగా పీడించబడుతుంది. ఇందులో నేను స్పర్శించని పార్శ్వం కూడా వుంది. స్త్రీ పట్ల స్త్రీలే చూపుతున్న వివక్ష. అలాగే పురుషుని పరంగా సమస్యలు, వాటిలో స్త్రీ, పురుష పాత్రల ప్రభావం మరొక కోణం. ఇంకో మాట మతాన్ని విమర్శించటం కూడా నా అభిమతం కాదిక్కడ. సాంప్రదాయం, అభ్యుదయం కూడా అసలు సమస్యని జటిలం చేసాయే కానీ రూపు మాపలేదని మన అందరికీ కనిపించే సత్యం. ఇక మంచి చెడు కూడా మనం నిర్వచించుకునే స్థాయిని బట్టివుంటాయి. చివరిగా, కృష్ణుని గీతాసారం వంట బట్టించుకునే ప్రయత్నంలో వున్నాను. వివేకానందుని సూక్తి "When I ask god for strength,...God gave me nothing I wanted, He gave me everything I needed" ఉదయానే ఒకసారి పఠనం చేయటంతో నా దినచర్య మొదలౌతుంది. that says it all. నెనర్లు.

  ReplyDelete
 5. usha dhummu duliparu.
  chala baaga rasaru.

  ReplyDelete
 6. విజయ్ భాస్కర్, ధన్యవాదాలు. కవితలోని ఆత్మని మీరు కనిపెట్టారు. పైన చెప్పినట్లు ఇవి చాలవు, జాగృతి అసలు వ్యక్తిలో రావాలి.

  ReplyDelete
 7. ఉష,,

  ఇంద్రుది సభలోనే గంధర్వ కన్యలు తమ నాట్యాలతొ అందరిని అలరించేవారంట. అది ఇప్పుదు క్లబ్బులొ క్యాబరేలు, రికార్డింగు డాన్సులకు మూల రూపం కాదా ?? అది తప్పని వేలెత్తి చూపలేదు ఎవ్వరు. ఇది ఎప్పటికీ పురుషాధిక్య ప్రపంచమే. కాని ఈనాటి పురుషులలో మార్పు వస్తుంది. భార్య అభిరుచి, స్వయం ప్రతిపత్తి అని కాకుండా కుటుంబ నిర్వహణలో ఆమెను పాత్రధారిని చేస్తున్నారు. కాని నిజంగా భార్య అభిరుచిని, ఆసక్తిని ప్రోత్సహించేవారు నూటికో , కోటికో ఒక్కరున్నారు. ఫలానా స్త్రీ వేశ్య, వ్యభిచారి అని ఆడదాన్ని వేలెత్తి , విమర్శించే సమాజం ఆమె చేసిన తప్పులో ఎవరో ఒక పురుషుని సమాన భాద్యత ఉంది అన్నమాట తలవను కూడా తలవరు. పైగా అమెను కులట అని అంటారు. కాని ఏ స్త్రీ కూడా మనస్ఫూర్తిగా తన శరీరాన్ని అమ్ముకోదు. ఎక్కువ శాతం తన కుటుంబం, పిల్లల కోసమే ఆ పని చేస్తుంది. అదీ కాక ఎక్కడ పనికెళ్లినా ఎంతో మంది మగాళ్లు ఆమెను ఒక అందమైన ఆటవస్తువుగా వాడుకోవాలని చూస్తారే తప్ప ఆమె ఉద్యోగం చేయడానికి గల కారణం చూడరు. They think women are just available ..

  కాని నేను చెప్పేది ఒక్కటే ,, ఆడవాళ్లకు పురుషులే కాదు, ఆడవాళ్లు కూడా శత్రువులే.. పురుషులు, సమాజం మీద నిందారోపణ కన్నా, మహిళలే తమని తాము ఆడదానిలా , అబలలా కాక ఆదిశక్తిలా మార్చుకోవాలి. అన్యాయం జరిగితే ఎదిరించే ధైర్యం ప్రతి మహిళకు ఉండాలి. ముఖ్యంగా తమ మీద తమకి నమ్మకం, తమలో అంతర్గతంగా ఉన్న అగ్నిపర్వతంలాంటి శక్తిని గుర్తించాలి. అప్పుడు ఎలాంటి సమస్యనైనా చాలా తేలికగా పరిష్కరించగలుగుతుంది. అవసరమైతే చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉంటుంది.

  ReplyDelete
 8. జ్యోతి, మీరన్నా ఆ "భార్య అభిరుచిని, ఆసక్తిని ప్రోత్సహించేవారు" ఒకరిని నేను చూసాను. పరస్పర అవగాహన, సహకారం లేనిదే ఏకపక్షంగా మాత్రం అదీ సాధ్యం కాదు. అలాగే They think women are just available అన్నది ఆఖరుకి ప్రెగ్నెన్సి సమయంలో కూడా చవిచూసిన పీఢకల. సాంప్రదాయం, అభ్యుదయం, సనాతన ధర్మం, ఆధునిక కాలమిస్తున్న స్వేచ్చ, అవకాశం అన్నీ అణుశక్తి మాదిరి ఆచి తూచి తీసుకోవాల్సిన అంశాలు. ఏ ఒక్కటీ చెడ్డ కాదు అలాఅని అన్నీ ఆచరణీయమైన రీతుల్ని అందించవు. మీరు రెండో పేరాలో వ్యక్తపరిచిన అభిప్రాయమే నాదీను. అంత తీవ్రతలో జీవించాల్సిన అవసరం రాకపోయినా ప్రశించి, వాదించి నా అస్థిత్వం నేనే మలుచుకున్నాను. ఓల్గా గారు ఒకసారి ప్రస్తావించినట్లు "నాన్న. అన్న ఇనప రెక్కలు కట్టి, స్వేచ్చనిచ్చాం ఎగిరిపొమ్మన్న" తీరుగా వుండేది జీవితం అది కాస్త సడలింది. అభిప్రాయానికి నెనర్లు. మరిన్ని మనోగతాలు, అభిమతాలు ఇక్కడ పాలుపంచుకుంటే వస్తే చర్చ సఫలం అవుతుంది.

  ReplyDelete
 9. ఏమిటో ...
  ఏ యుగమైనా ఆమె లేకుండా నడిచిందా
  చదువుల తల్లి ఆశీస్సులు లేకుండానే మేధావులయ్యారా
  కైకేయి రామున్ని అడవులకు పంపితేనేమి? రాముని పెంచిన మాతృమూర్తి కాదా..
  సీత లేనిదే రామాయణముందా
  సత్య లేక కృష్ణుడున్నాడా
  రాధ ప్రేమ లేని గోపయ్య లీలలేల
  ఘంటమ్ము చేత బట్టి రామకధను రచించలేదా మొల్ల
  తన గాన మాధుర్యంతో కృష్ణుని తన వద్ద ప్రతిష్టించుకోలేదా మీరా
  ఖడ్గమ్ము చేతబట్టి ముష్కరుల తరమలేదా ఝాన్సీ
  సింహాసనమధిష్టించి రాజ్యమేలలేదా రాణి రుద్రమ
  గగనపు వీధులకెగసి గగనపు మేఘాలలో కలిసినా గగనమంత ఎత్తున ఆత్మవిశ్వాసాన్ని చూపలేదా సునీతా విలియమ్స్
  చూపు లేనిది కళ్ళకే
  వినలేనిది చెవులే
  మనసుతో చూడగలిగేవి, గుండెతో వినగలిగేవీ అనంతమని చూపలేదా హెలెన్ కెల్లర్
  పరిశోధనలకే తన జీవితాన్ని అంకితం చేసిన మేడమ్ క్యూరీ కాదా నేటి ప్రగతికి పునాది రాయి
  తన మమతతో అఖండ ప్రపంచానికే అమ్మ కాలేదా మదర్ థెరెస్సా

  పళ్ళున్న చెట్టుకే దెబ్బలు, సహనమున్నవారినే గేలి చేస్తుంది సమాజం

  (నిజానికి ఈ పోష్టుకు వ్యాఖ్య రాయకూడదనే అనుకున్నాను. కానీ కవితలో తీవ్రత దృష్ట్యా నా అనుభవం తక్కువయినప్పటికీ ఈ వ్యాఖ్య రాస్తున్నా. ఈ వ్యాఖ్యను తొలగించే సర్వ హక్కులూ మీవే సుమా...)

  ReplyDelete
 10. ప్రదీప్, నేనింతవరకు ఏ వ్యాఖ్యనీ తొలగించలేదు. పిన్న వయస్కులైనా అమ్మతనంతో పాటుగా, స్త్రీల శక్తిని గుర్తించి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇది పరస్పర అభిప్రాయ వేదిక. నేను కూడా వ్యాఖ్యల వలన లబ్దిని, వ్యాఖ్యాతల సాంగత్యంలో వికాసాన్ని పొందగలుతున్నాను. అందుకే నా కోసం అని కాక నా ధోరణి కొంచం మార్చాను. గమనించారో లేదో. ఇది ఓ పరిణామక్రమం, నేను అహ్వానించిన మార్పు.

  ఎన్ని పళ్ళు ఇచ్చినా కొంచం చీడ కనపడగనే మొదలుకంటా నరికే సమాజం ఇది. వట్టుపోయిన ఆవుని కబేళాకి తరలించే కృతఘ్నత ఇక్కడ పరిపాటి. పైనవున్న స్పందన-ప్రతిస్పందనల్లో మా మనోభావాలు ప్రతిబింబించాయి. చదివేవుంటారుగా.

  ReplyDelete
 11. ఉష గారు...
  మౌలికం గా ఆడది మగాడు అనే బేధం పోనంత వరకు ఎన్ని వాదాలు వినిపించినా లాభం లేదు... ప్రకృతి శారిరకం గా కొన్ని బేధాలు పెట్టింది అంతకు మించి మిగతావి అన్నీ తర తరాల పితృ/ మాతృ స్వామ్య వ్యవస్తలు కల్పించిన మిథ్ లు అనిపిస్తుంది "ఆడది సహజం గానే జాలి గుణం కలది.. మొగవాడి రక్తం లోనే ఆ అహంకారం వుంది", ఇవి అన్నీ తర తరాల నుంచి పేర్చుకొచ్చిన భావజాలం అనుకుంటా నేనైతే... మీరన్నట్లు "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అంటూ సంస్కృతం లో నోరు ముయించటం.. ఎందుకు మనకు పని లేక పూజలు...... పూజ చెయ్యటానికి మనమేమైనా గుళ్ళో వుత్సవ విగ్రహాలమా?

  ReplyDelete
 12. భావన, మాతృస్వామ్య వ్యవస్థలో పురుషుడు ఇంతగా పీఢించబడ్డాడా? పితృస్వామ్యవ్యవస్థ మాత్రమే ఈ తీరుగా వివక్ష చూపుతుందా? ఏదైనా కానీ, వ్యవస్థలో మార్పే ఎలా సాధ్యం అన్నదానికి నాకు తోచిన సమాధానమే ఈ కవిత. దాని వలన బాధించబడుతున్న స్త్రీ దృక్పథంలోనే ముందు ఆ ప్రయత్నానికి పునాది పడాలి, సంఘటింతగా పునర్నిర్మాణం పూర్తిచేయాలి. అందులో మగాడి సహకారం కూడా కావాలి. ఇది నా అభిప్రాయం. నేను "శత్రువు" అని కవితలో ప్రస్తావించింది దీన్నే - సంఘం/వ్యవస్థ/సాంప్రదాయం. నెనర్లు.

  ReplyDelete
 13. ఉషాగారూ ! ఇన్నాళ్ళూ భావుకత ఉట్టిపడే మీ కవితావేశం చూసి ...ఈ కవిత చూసినపుడు సుందరమైన లలితాదేవేనా ...ఈ ఆదిపరా శక్తి అని పించే అమ్మవారిలోని రెండో కోణాన్ని చూసినట్టుంది .

  ReplyDelete
 14. బయట ఎంతో శక్తివంతంగా, యుక్తివంతంగా ఎదగిన స్త్రీ , ..ఇంట్లో మగవాడి దెగ్గర ఆ గౌరవం పొందటం లో విఫలమౌతుంది.

  మీ వ్యక్తీకరణ చలా బాగుంది అభినందనలు..

  ReplyDelete
 15. "ఆమె ఆత్మ గౌరవం ఈ విఫల పూజల కన్న మిన్న అని ఒప్పుకుంటుందా?"
  ముమ్మాటికి నిజం.ఈ పూజలు వ్రతాలూ అన్ని కూడా మగవాడి(భర్త అనబడేవాడి)ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసమే.
  మహిళల కోసం మహిళలు చేసుకునే వ్రతం ఒక్కటన్నా ఉందేమో చూడండి.
  ఉష గారూ మీకో మనవి.దయచేసి చెరచడం,అనుభవించడం,మానభంగం,లాంటి పదప్రయోగాలు చెయ్యకండి. ఇవన్ని ఘోరమైన లైంగిక అత్యాచారాలే.

  జ్యోతి గారూ మీరు ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులనడం నేను అంగీకరించను.
  పిత్రుస్వామ్య భావజాలమే ఈ నానుడిని పుట్టించి,ప్రచారం చేసి తన పబ్బం గడుపుకుంటోందని అర్ధం చేసుకోవాలి మనం.

  ReplyDelete
 16. ప్రపంచం మొత్తం అసమర్థుడైన (కార్యశూరత లేని) తన భర్తను పొగిడితే స్త్రీ చాలా సంతోషిసిస్తుంది. గర్విస్తుంది.అతని ఎదుగుదల ఆమెకు సంబరమౌతుంది.
  ప్రపంచం మొత్తం ప్రశంసించిన తన భార్య (సమర్థురాలైన) పురుషునికి చేతకానిదిగా కనిపిస్తుంది.అదే భావం ఆమెపై ద్వేషంగా అసూయగా మారుతుంది.
  ఇది సమాజ నైజం.
  నా అంచనా ప్రకారమ్ రాబోయే తరం ఈ ఆధిపత్యపు ధోరణీ ని సహించదు.
  తప్ప క తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంది.
  చాలా బాగా రాశారు.

  ReplyDelete
 17. పరిమళం, అదే మరి స్త్రీ శక్తి. "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిదుర పోకుమా" అన్న పాట మన జాతికి తప్పక వర్తిస్తుంది. మన శక్తిని మనమే వెలికితేవాలి. ఇకపోతే మరీ వేడిగా సాగిన ఈ చర్చలో ఒక చిన్న చెణుకు. అదీ మిరన్న "సుందరమైన లలితాదేవేనా ...ఈ ఆదిపరా శక్తి" అన్న వ్యాఖ్యపై స్పందనగా. ఒకసారి నిండుగా భారీగా వున్న ఒక MLA గారు రివటలా, మా వెంకట రత్నం తాత గారు అనే "దాళవాయ్ చేలో మిడత" లా వున్న నన్ను ఎగాదిగా చూసి "మనందరికీ ఆ సారు (మా నాన్నగారు) అంటే దడ, ఆయనకేమో ఈ పిల్ల అంటే భయమంటా!" అన్న సందర్భం గుర్తుకి వచ్చింది.

  ReplyDelete
 18. సుజ్జీ, తెలుగు/పద్మ కళ గార్లు, మీ అభిప్రాయాల్లో చాలా సామ్యం వుంది. స్వానుభవంలోను, గమనించినంతలోను నేనూ "సమాజ నైజం" చవిచూసాను. రాబోయే తరానికి మనం కాస్త మార్గదర్శకం కావాలన్నదే నా అభిమతం.

  ReplyDelete
 19. సత్యవతి గారు, నేను ఏ పూజలు, వ్రతాలు, నోములూ చేయలేదు మీరన్న కారణంగానే. నేను నా భర్త మాదిరే పెళ్ళైన ఋజువులు చూపను - సూత్రాలు, నల్ల పూసలు, మట్టెలు వంటివి. వాటి కన్నా విలువ మనసులోను, పరస్పర అవగాహన, నమ్మకంలోనూ వుందని నా విశ్వాసం. ఘోరమైన లైంగిక అత్యాచారాల పట్ల తీవ్ర నిరసన తెలపటానికే వాటిని ఎత్తిచూపింది, వాటి పట్ల ఒక స్త్రీ ప్రవర్తన ఎలావుండాలో అని ప్రశ్నించిందీను. అసలు వాటి ప్రసక్తి రాకుండా నా భావంలోని గాఢత తెలుపలేకపోయాను. ఆ మాత్రం పరుష పదప్రయోగం తప్పనిసరైంది. మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 20. ఉష, మీరు అన్నట్లు సంఘటింతగా పునర్నిర్మాణం పూర్తిచేయాలి ఈ వ్యవస్తను, పితృ సామ్యం వద్దు మాతృసామ్యం వద్దు అసలు ఒకరు ఎక్కువ తక్కువ అనే పోలిక లేని సంఘం కావాలి అనిపిస్తుంది నాకు దానికోసం మీరన్నట్లు తప్పనిసరి గా ఈ ప్రస్తుత వ్యవస్త పై తిరుగుబాటు మాత్రం కావాలి. అందులో అనుమానం లేదు... మగవాడు పోషించినా ఆడవాళ్ళూ పిల్లలను పెంచిన vice versa ఐనా రెండు సమానమే అని అందరం మనస్పూర్తి గా అనుకునే కాలం రావాలి అని ఆశిస్తాను నేను దురాశేమో మరి తెలియదు...

  ReplyDelete
 21. ముమ్మాటికీ దురాశ కాదు. ఆ రోజూ సుదూరమూ కాదు. ఆ కార్యాచరణ అసాధ్యం కాదు. మన సామర్ధ్యంలో మనం నమ్మకం వుంచుకుందాం.

  ReplyDelete
 22. @సత్యవతి: పితృస్వామ్య భావజాలాన్ని అత్యంతంగా వ్యాప్తిచేసేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. గృహ(మానసిక శారీర)హింసల్లోఅత్త,ఆడపడుచులు,తోడికోడళ్ళ పాత్రలు జగద్విదితం. ఈ సందర్భంలో ఆడది ఆడదానికి శతృవు అనటంలో మగాడికుట్రకన్నా పితృస్వామ్యాన్ని unconditional గా అంగీకరించి అమలు చేస్తున్న కోట్ల మంది ఆడవారి బలహీనతదని గ్రహించడం అవసరం.

  విలువలు ముఖ్యంగా నైతిక విలువల నేపధ్యంలో ఆడవారు ఆడవారిపై జరిపే మానసిక అత్యాచారం నరనరాలూ పితృస్వామ్య సంస్కృతిని జీర్ణించుకున్న ఆడవారి దౌర్బల్యం కాదంటారా?

  ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులనడం నానుడికాదు. మగాడి కుట్ర అంతకన్నా కాదు. అదొక సామాజిక నిజం. మగాడు తెలివిగా స్త్రీని పితృస్వామ్య ప్రతినిధిగా ఎన్నుకున్నాడు. మగాడి తరఫున పితృస్వామ్యాన్ని వ్యాప్తిచేసే బాధ్యత స్త్రీ ఒక యజ్ఞంలా కొనసాగిస్తోంది. ఈ structural institutional frame work ని గాలికొదిలేసి. దీనిలో మార్పులు తీసురాకుండా మగ బ్యాషింగ్ తో స్త్రీలనుద్ధరించాలనుకోవడం హాస్యాస్పదం.

  స్త్రీవాదం తన మూల ఉద్దేశాలను మరిచి rhetoric లో పబ్బంగడుపుకుటుందనటానికి ఉత్తమ ఉదాహరణ మీ వ్యాఖ్య.

  ReplyDelete
 23. * Dear All ఇక్కడి వ్యాఖ్యానాలు మన వ్యవస్థ పునరుద్దరణకి చాలా ముఖ్యం. ఆశించినట్లే ఈ చర్చలో పాల్గొని, మీ అమూల్యమైన అభిప్రాయాలు పంచుకుని, నా కవితని ఫలవంతం చేసినందుకు ధన్యవాదాలు. పైన అన్ని విలువైన అభిమాతాలు వ్యక్తమయ్యాక ఇక తుదిపలుకు, recap వంటివి అనవసరమయినా కృతజ్ఞత తెలుపుకోవటానికే ఈ వ్యాఖ్య పెడుతున్నాను.

  ReplyDelete