మనసు ఖాళీ చేసానెందుకు?

ఎందుకు జార్చుకున్నాను,
మనసులోని భావాలు నాలోనే దాచుకోక?
ఎవరు దాచుకున్నారు,
మరపురాని అనుభూతిగ ఎదలోపల పదిలంగా?

కొలమానం లేని, రాసిగల అక్షరాల రాశులు,
ఎవరికి లెక్కలెంచక పంచేసాను?
వెలకట్టలేని, వాసినందూ సాటిలేని కమ్మని కావ్యాలు,
ఎందుకు ఎడతెరిపిలేకుండా లిఖించేసాను?

వెలికి వచ్చినవి తిరిగి నాలోకి ఇముడ్చుకోవాలని,
వెదికి వెదికి వేసారినా జాడ తెలియకున్నదేమి?
ఉబికి వొలికి నన్ను వదిలిపోయాయేమి స్పందనలు!
వెలితి పడిన మనసు ఉసూరురంటోందేల రేయీపగలు?

నాడు ఊగిసలాడి, వేగిరపడి తృళ్ళిపడిన ఉవ్విళ్ళు,
నన్ను నేనే దోచుకుని వేడుకచూసిన సందళ్ళు.
నేడు సత్తువలేక, సాగిలపడి నిట్టూరుస్తున్న సవ్వళ్ళు,
నన్ను నేనే మరిచిన ఈ నిశీధి పయనంలో కీచురాళ్ళు.

27 comments:

 1. మీ భావాలను దాచుకోకుండా ఇలా వ్యక్తీకరించుతున్నారు,మీ మనసులొ మాటను పంచుకొవడం వల్ల గుండెలో భారం తగ్గుతుంది .. పంచుకొనే వాళ్ళు లెకపొతే ఆ నరకప్రాయమైన జీవితం గడపడం ఎంతకష్టమో నాకు తెలుసు..ఒక సందేహం కీచురాల్లు అంటే ఏంటో చెప్పగలరు
  పొస్ట్ బాగా రాసారు మీకు అభినందనలు

  ReplyDelete
 2. మతిమరిచిన మలినాలు మనోగతం తవ్వుతుంటుంటే
  ఎదదోచిన మనోచిత్రం శిరసునిండా సొదరగిలిస్తుంటే
  కంచెలేని కలవరింతల క్షేత్రంలో కళ్లు నీవైచూసాను
  ఇమిడిఫోయిన భావాలు సర్దుకోలేక సమస్యనై నిలిచాను
  దరిచేరలేక జ్ఞాపల అలజడుల్లో ఒంటరిగా ఇలా మిగిలిపోయాను.

  కవితోద్దేశానికి సంబందంలేకుండా ఉన్ననూ హరేకృష్ణ గారన్నట్లు నాకు చేయాలనిపించింది. మీ అంతరార్థం కవితల్లో వ్యకీకరించిన ప్రయత్నం బావుంది.

  ReplyDelete
 3. ఉషగారు నాకు అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది...
  కాని మీరు వ్రాసినంత అందమైన కవిత రూపంలో కాదండి...

  ReplyDelete
 4. "వెదికి వెదికి వేసారినా జాడ తెలియకున్నదేమి?"
  మీ బ్లాగు మిత్రుల హృదయంలోకి తొంగి చూడండి
  తొలకరి చినుకులు నేలనింకి పోయినట్టు
  మీ కావ్యాలు మాఎదలోపల పదిలంగా....

  ReplyDelete
 5. హరేకృష్ణ, పృథ్వీ, పద్మార్పితా, పరిమళం, మీ నెయ్యం నాకు ముదావహం. నెనర్లతో ఒక్కోమాట విడివిడిగా..

  హరేకృష్ణ, మీరన్నట్లు "పంచుకొనే వాళ్ళు లేకపొతే" - అదే నా స్థితి ఇపుడు. ఒకప్పుడు నాకు తోడు నా భావాలే. అలా ఏకాంతంలో అవి, నేను - కాసేపు నెయ్యం, మరి కాసేపు కయ్యం, నాలో నేను, నాతో నేను. ఇపుడేమో మనసులోకి తొంగిచూసుకుంటే అదేదో తప్పుచేసినట్లు తలదించుకుంది. మౌనవ్రతంపట్టింది. అదేదోకోల్పోయిన భావన. అందుకే ఇలా వ్యక్తీకరణ. తన ధోరణిలో ఏవేవో వూహల్లో అది, నా ఒంటరితనంలో నేనూ మిగిలిపోయామనిపించింది. ఎందుకిలా అయిందీ? అని ప్రశ్నింపచేసింది.

  కీచురాళ్ళు అన్నవి ఒకవిధమైన కీటకాలు. రాత్రి పూట వాటి రొద చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కంటికి కనపడవు. వాటి ఉనికి అవిచేసే చప్పుళ్ళే. ఇంకొంచం వివరాలకి http://en.wikipedia.org/wiki/Cricket_(insect) చదవండి. అలాగే "కీచురాళ్ళు" అంటూ ఉష ఉతప్ పాడిన పాట చాలా ఎక్కువగా వినేదాన్ని, మీరూ వినండి http://www.allindiansite.com/home/music/t/f/keechurallu.html

  ReplyDelete
 6. పృథ్వీ, మీరిలా అంతర్లీనంగా దాగిన వ్యధని పంచుకున్నందుకు, మీలో ఆ స్పందన కలుగజేయగలిగినందుకు నా మనసు కుదుటపడింది. పదిలంగా నేను భద్రపరుచుకుంటాను. అంత చిక్కగా కవితాచిత్రం గీయటం, కుంచెతో చిత్రాలు చేయగల మీకే తగింది. మీ చిత్రలేఖనంలో వైవిధ్యమే మీ శైలిలోనూ ప్రతిబింబించింది.

  ReplyDelete
 7. పద్మార్పితా, మీరీ మధ్య వ్రాసిన "ఓ నా కవిత ఎక్కడున్నావమ్మా???" వంటిదే నా ఈ సంవేదన. మనసు ఏదో కొల్పోయినదానిలా నన్ను వీడిపోయిన భావాలు చేజేతులా దూరం చేసుకున్న ఆప్త మిత్రుల్లా తోచాయి. ఆ భావం చాలాసేపు నాతోనే వుండి చివరికి అదీ నన్నిలా వీడిపోయింది, బహుశా బలహీనపడిన నా మనసు ఇలా వ్యకీకరించుకోవటానికి అలవాటు పడిపోయిందేమో. చివరికి వ్యసనమౌతుందా, నాకేమీ మిగుల్చుకోకుండా మరో మనసులో చోటు కోసం వాటిని నానుండి విడదీస్తున్నానా అని సంశయం.

  ReplyDelete
 8. పరిమళం, పైన చెప్పిన - ఈ కవితకి ముందు నాలో కలిగిన సంఘర్షణ, సంవేదన తర్వాత మీ స్పందన నిజంగానే బీడుభూమిలా తోచిన నా మనసుపై తొలకరి జల్లే. గంధాలు వెదజల్లే ఆ భూసింధూరాలు [ప్రదీప్ గారన్నట్లు "మా ఊరి మట్టి వాసన" లా] మీ కవితలంత పరిమళిస్తూ నన్ను చుట్టేసిన భావన, నేస్తమా, ఈ జన్మకిది చాలు. ఈ తృప్తి కొరకు మళ్ళీ మళ్ళీ వెలితి పడతాను, నా మనసున వున్నది తవ్వి, తవ్వి, తోడి పోస్తాను. నీకై ఇలా కొత్త భావాలు నింపుకొస్తాను.

  అందరికీ మరోమారు ధన్యవాదాలు.

  ReplyDelete
 9. మహామహుల వ్యాఖ్యలముందు నేనేమని వ్యాఖ్యానించను.
  నేను కూడా పరిమళం గారు చెప్పినమాటనే చెబుతున్నా.

  ReplyDelete
 10. మీ అభిమానాన్ని సవినయంగా స్వీకరిస్తున్నాను. నిజానికి మీరంతా మహామహులే, బ్లాగ్లోక అధిపతులే. మీ అభిమానమే మనందరి సాహితీ చెలిమిలో చలామణి అయ్యే కానుక. అట్టి కానుక అందుకునే ప్రతివారం అదృష్టవంతులమే.

  ReplyDelete
 11. ఉద్యోగాలతో, సంసారాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న జీవనప్రవాహంలో ఇలాటి నిర్వేదన కూడా వుంటుందనుకోలేదు నేను. కానీ, ఇది కూడా అవసరమే మానసికంగా ఎదగడానికి. ఉషా, చక్కగా చెప్పేరు. అభినందనలు.

  ReplyDelete
 12. నిక్షేపంగా గడపాల్సిన జీవితం అని అంతా అనుకున్నా నిర్వేదం మఠం వేసుకున్న జీవితమండి ఇది. పైన నా భావాలు సమాధానాలుగా వివరించాను. ఇకపోతే ఈ మధ్యనే ప్రమోదం కూడా ఈ వూటబావిలో చోటు చేసుకుంది. ఆ మేళవింపుతోనే మీరన్న మానసిక ఎదుగుదల త్వరితమైంది. మీ వ్యాఖ్యకి, అభినందనకి ధన్యవాదాలు.

  ReplyDelete
 13. కొన్ని ఖర్చు పెడితే తరుగుతాయి. కొన్ని ఖర్చు చేసే కొద్దీ పెరుగుతాయి.
  మనసు లోపలి భావాలు కూడా అంతే. పంచే కొద్దీ పెరుగుతాయి.
  కర్మయోగం పాటిస్తే మీరు రాసిన భాధలుండవు.

  ReplyDelete
 14. మరే! శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని.. ఒక్కోసారి స్వగతాలు, స్కోత్కర్షలు బయటపడుతుంటాయి. మరొకరి మనోగతాలు ఈ విధంగా పంచుకోబడతాయి కదా! నేను సహజమార్గ రాజయోగ అభ్యాసిని. సంస్కారాలు, కర్మని బట్టి, యోగం, దాన్ననుసరిచి ప్రాప్తం వుంటాయి ఆ మార్గం చెప్తుంది. నాకు అనుభవంలోకి వచ్చిందీ అదే. నెనర్లు.

  ReplyDelete
 15. >>బీడుభూమిలా తోచిన నా మనసుపై తొలకరి జల్లు
  ఏంటో ఇలాంటి మాటలు నేనెప్పుడు నేర్చుకుంటానో!! పుచ్!!!

  ReplyDelete
 16. భాస్కర్ రామరాజు గారు, నా జ్ఞాపకశక్తి బాగుండివుంటే ;) ఇది మీ తొలి వ్యాఖ్య మరువపు వనాన [లోగిలిలో నా పేజీలో మీ వ్యాఖ్యలు చూసిన గుర్తు]. కనుక సాదర స్వాగతం. అసలీ టపా వ్రాసింది అందుకేనండి మీరు వ్యక్తం చేసినట్లు స్వగతాలో మనోగతాలో వెలువడతాయనే. వ్రాయండి, వ్రాస్తూ పోతే అవే తడతాయట క్రొత్త పదాలు. :) ధన్యవాదాలతో.

  ReplyDelete
 17. ఎవరు శంఖం.. ఏమి తీర్ధం....నాకు కొంచెం అయోమయంగా ఉంది.
  మీ కవితలే కాదు, మీ వ్యాఖ్యానాలర్ధం చేసుకోవాలన్నా కష్టమే ఒక్కోసారి

  ReplyDelete
 18. క్రమంగా ఒకరి స్పందన ఎలావుంటుందన్నది predictable గా వుంది కనుక మీరు "కర్మయోగం" అనే ప్రస్తావిస్తారనుకున్నాను. అదే జరిగింది. అందుకే అలా చమత్కరించాను. "మీరంటేనే తెలిసింది" అని ఉడికించటం అన్నమాట. ఇది కూడా మన సాహితీమైత్రి మూలంగా ఏర్పడిన చనువు మాత్రమే సుమీ! ఎందుకంటే అంతర్లీనంగా నాదీ అదే నమ్మిక. మీ చిరు ప్రాయానికి కర్మ సిద్ధాంతం అలవడటం విడ్డూరమే. మీరు భలేవారే నేనంత కష్టసాధ్యమైన కవితలు వ్రాయనే?

  ReplyDelete
 19. సంధర్భమో లేక అసంధర్భమో....
  మన పురాణాలలోనూ, గీతలోనూ, అధ్యాత్మిక భోదనలలోనూ జీవితానికి పనికి వచ్చే అనేక విషయాలున్నాయన్నది నా ఉద్దేశ్యం. (వేదాలు చదవలేదు, వాటి గురించి వ్యాఖ్యానించే సామర్ధ్యం లేదు)
  కాకపోతే ప్రస్థుత సమాజంలో అవి కేవలం ముసలివారికే అని ఒక ముద్ర వేసెయ్యడం వల్ల నేను కర్మయోగం గురించి మాట్లాడేసరికి మీరు అలా వ్యాఖ్యానించారనుకుంటున్నాను.
  "జీవితం అంతా అయిపోయాక చావుకు ఎదురు చూసే సమయంలో జీవిత సత్యాలు తెలుసుకుంటే పశ్చాతపమే మిగులుతుంది"

  ఎక్కడో చదివినట్టు "తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత"
  కొండ ఎక్కే పనిలో ఉన్నా, కానీ ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు.

  >> "మీరంటేనే తెలిసింది" అని ఉడికించటం అన్నమాట ....
  కిందటిసారి రాకాసికి ప్రతీకారమనే నేను ముందే అనుకున్నా సుమా....

  ReplyDelete
 20. నా అభిప్రాయంలో ఆధ్యాత్మికతకి [నేను మతపరమైన నమ్మకాల గురించి ప్రస్తావించటం లేదు] వయసుకి సంబంధం లేదండి, నేను ధ్యానం నా 18సం. వయసునుంచే చేస్తున్నాను. అంతకు మునుపే నాన్న గారు, మామ్మ [నానమ్మ] వలన రామాయణ భారతాల విశేషాంశాలు అవగతమైనా కాకున్నా పరిచయం చేయబడ్డాయి. అప్పటినుండి కొంత జిజ్ఞాస కారణంగా నేనూ చదివో, వినో కొంత సముపార్జన చేస్తున్నా ఇంకా ఈ అధ్యాత్మిక పయనంలో ఎన్నో నేర్చుకోవాల్సినవి మిగిలే వున్నాయి. ఇక మీ అభిప్రాయాలు మూడింటికీ నాపరంగా కూడా అదే సమాధానం అవును, అవును, అవును.

  ReplyDelete
 21. >> క్రమంగా ఒకరి స్పందన ఎలావుంటుందన్నది predictable గా వుంది కనుక ...

  నా స్పందన ఎలా వుంటుందో కాస్త చెప్పరూ :)

  ReplyDelete
 22. బళ్ళో గంట కొట్టాక మడత నలగని బట్టలేసుకుని మెల్లగా వచ్చే బుజ్జాయి మాదిరి, ఆలస్యంగానైన వస్తారు, కవిత క్రింద వ్యాఖ్యలన్నీ చదివి ఇలా ఓ చిలిపి ప్రశ్నో, లేదా మెదడుకి మేతగా ఓ నానుడో ఉటంకిస్తారని . . హ హ హ్హా ;)

  ReplyDelete
 23. చంటి పిల్లాడి కి బుజ్జాయి కి తేడా చెప్పగలరు :)

  ReplyDelete
 24. మొత్తానికి మీరంతా కలిసి నా మనసు ఖాళీ లేకుండా నవ్వులు నింపేసారు. నెనర్లు. మీ నవ్వుని బట్టి మీకు సమాధానం తెలిసినట్లేవుంది. బుజ్జి, బుజ్జాయి, చిన్ని, మున్ని, చంటి ఇవన్నీ కాస్త పసితనం వదిలిన చిన్నారులకి పర్యాయపదాలని నా పరిజ్ఞానం ;)

  ReplyDelete
 25. తెలుగు బాషలో నాకు నచ్చని పదం "చిట్టి".. అది మీరు యాదౄచ్చికంగా వాడలేదు ..ధన్యవాదాలు

  ReplyDelete
 26. దాన్నే బహుశా సిక్త్ సెన్స్ అంటారేమోలేండి. హమ్మయా బతికిపోయాను, ;)

  ReplyDelete
 27. హ.. హ ..హ్హ ... బాగా వుంది సిక్త్ సెన్స్ concept..

  ReplyDelete