ఏది అందమైన అబద్దం?

ఈ మాపున ఎటు చూసినా నీ వూసులే దోగాడుతున్నాయేమి?
నా పడిగాపుల్లో నీ చూపులే వెంటాడుతున్నాయేమి?
నేను చెప్పాలనుకున్న వూసులు ఎలా మరిచాను?
నీనుంచి మరల్చాలనుకున్న నా చూపులు ఎక్కడ బందీ అయినాయి?
నా వూసులు నీ మది కారడవిలో తప్పిపోయాయంటావా?
నా చూపులు నీ మోమున నగవుకి మైమరచుంటాయంటావా?

మొన్న నీ కళ్ళతో కలిపిన నా కళ్ళు
నిను చూడక నేనుండలేనని చెప్పలేదా?
నిన్న నీ అడుగుల్లో అడుగేసిన నా కాళ్ళు
నిను చేరక ఆగలేనని తెలుపలేదా?
నేడు విరహంలో కుములుతానని నువ్వెందుకు చెప్పలేదు?
రేపు వేదనలో మునగనున్నానని నాకెందుకు తెలుపలేదు?

నీ ప్రేమకై ఓ యుగం వేచానని చెప్పానే?
నా అధిపతి నీవని సమ్మతించానే?
నిను వీడి మనలేనని ముందరే మనసు విప్పానే?
ధీరోదాత్తవై నన్నేలుకోమని రాయబారమంపానే?
అయినా నీ జాడ తెలుపవంటే నా వూసులే అందమైన అబద్దాలా?
లేక నీవే ఒక అందమైన అబద్దానివా?

8 comments:

  1. చాలా బాగా రాసారు ఉష గారు

    ReplyDelete
  2. ఎక్కువగా జంటగా కనిపించి అపుడపుడు మాత్రం ఒంటరిగా, మౌనంగా, ముకుళించుకుపోయినట్లు కూర్చునే ఓ గువ్వని చూసాక జంట పక్షి జాడ కోసం తన మనోగతమిలా వుంటుందా అని ఓ చిన్న ప్రయత్నం చేసాను, మరి దానికి నా అతిశయం కలిపేనేమో కూడాను.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. ఆ ప్రియుడు సమాధానం ఇలా ఉంటుందేమో
    "నీ కోసం క్షణమొక యుగమై వేచి చూసానే
    నా చెంతకు చేరి అంతలో
    నేనొక అబద్దమని తలచి దూరమయ్యావు
    అయినా వేచి చూస్తా క్షణమొక యుగంగా ఎన్ని క్షణాలైనా"
    ఇది మీ కవిత చదవగానే నా మనసులో మెదిలిన భావం. అయితే మీ ఆలోచన వేరని మీ వ్యాఖ్య చెబుతోంది.

    విరహంపై మీ కవిత బాగుంది

    ReplyDelete
  4. ప్రదీప్, కొంచం దొరికిపోయినట్లున్నానే? రాని విద్య కదా, అంతగా రాణించలేకపోయాను :( ఏదో ఆ సాకుతో కాస్త వగలు వెలికితెచ్చాను. ఏమైనా ఈ విరహవేదన ద్వైదీ భావనల్లో ముంచేస్తుంది, కాస్త మధురంగా కాస్తా ఆవేదనగా. అందుకేనేమో అష్టనాయికలు ఉదయించింది.

    మీ కొనసాగింపు కాస్త ఊరటనిచ్చింది, తన సమాధానం అదేఅయ్యుంటుందని ఉపశమనమిచ్చింది. ;)

    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మొన్న నీ కళ్ళతో కలిపిన నా కళ్ళు
    నిను చూడక నేనుండలేనని చెప్పలేదా?

    beautiful..!

    ReplyDelete
  6. సుజ్జీ, మీ నెయ్యానికి నెనర్లు. ఒక్కమాటలో చక్కగా చెప్పారు మీ అభిప్రాయం.

    ReplyDelete
  7. అందమైన అబద్దం ....అందంగా ఉందండీ !

    ReplyDelete
  8. అవునండీ, అవి అబద్దాలు అనుకున్నాకనే నాకూ అందంగా కనిపించాయి, అది వాటి సజహ లక్షణం కదా. ఇక అవి నిజం కానవసరమూ లేదు. ;)

    ReplyDelete