అక్టోబర్ పాఠాలు

ఈ నెల పిల్లలంతా తిరిగివచ్చారు. ఇప్పుడు మా బళ్ళో పిల్లలు, పంతులమ్మల పేర్లివి. ;)

పంతుళ్ళు-పంతులమ్మలు:

అలేఖ్య
అనీష
అనీష [సంతు]
అనూష
మేఘన
నేహ
వైష్ణవి
స్నేహ
సాహితి
సంహిత్
స్ఫూర్తి
శ్రీవల్లి
లలిత్
తేజస్

పిల్ల:


నేనే ;) - వాళ్ళంతా ఇప్పుడు నాకు పాఠాలు నేర్పేవారే ...

********************************************

ఈ నెల ఎన్నో చేసాం. అన్నీ తెలుపలేనేమో. అయినా చిన్న ప్రయత్నం.

.. మా లేక్ లోని చేపలకి బ్రెడ్ వేయిస్తూ వాళ్ళతో ఆ చుట్టూ పరిసరాల మీద వ్యాఖ్యానం చేయించాను.
ఉదా: చేపకి రొట్టె పెడుతున్నాను; ఇక్కడ పక్షులు వున్నాయి.

.. జంతువులు, పక్షులు పేర్లు నేర్చుకున్నాము

.. ఒక్కొక్కరికి ఒక అంశం ఇచ్చి రెండు నిమిషాల చొప్పున మాట్లాడించటం

.. దసరా పండుగ ఎందుకు చేసుకుంటాం?

.. ఒకరు చేసే మూగ సైగని మరొకరు చూసి అర్థం చెప్పటం.

.. కూరగాయల పేర్లు - వాటితో ఒక కథ - దోసకాయంత దొంగోడు

.. అక్షరాలు వ్రాయటం లోని తేడాలు వివరించాను
ఉదా: ల [ఒకటే గీత], స [రెండు కానీ కలవవు], క [రెండు గీతలు కలిపి వ్రాయటం]

.. పదాలు వాడి నేను చెప్తే వాళ్ళూ కొన్ని గొలుసుకట్టు పదాలు కూర్చటం
ఉదా: చెరువులో చేపలు, మొక్కమీద పువ్వులు

.. ఉచ్చారణ దోషాలు పోవటానికి కష్టమైన పదాల సాధన
ఉదా: [పెళ్ళి, కిళ్ళీ, కొడిగినహళ్ళీ, బిసిభళేబాత్]; [కాకర, కీకర, కీసర, బాసర] ... ఇలా గుక్కతిప్పుకోకుండా వల్లెవేయటం :)

*********************************************
పాట:
.. చిట్టి పొట్టీ మిరియాలు
.. దేవీ స్తోత్రం
.. పిల్లల చేత సినిమా పాటల్లోని పదాలు గుర్తింపచేయటం


సెప్టెంబర్ పాఠాలు

ఈ నెల విశేషం: స్కూల్లో వారికి క్రొత్త తరగతి మొదలుపెట్టినట్లే నేను వారి చేత వ్రాయించటం మొదలు పెట్టాను. :)

అందరికీ చిన్న వైట్ బోర్డ్, ఇరేశబుల్ డ్రై మార్కర్ కానుకగా ఇచ్చాను. అదీకాక వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ చూసి అందరికీ మార్కర్స్ సెట్ ప్రెసెంట్ చేసాను. ఈ చిన్ని చిన్ని సరదాలు వాళ్ళలో నేర్చుకోవాలన్న ఉత్సాహాన్ని పెంచుతాయని నా ఆలోచన.

.. మొదట వాళ్ళతో అచ్చులు వ్రాయించి, ఆ తర్వాత వ్రాయించిన రెండక్షరాల పదాలు మచ్చుక్కి కొన్ని:

అల, తల, వల, కల, జడ, ఆట, పాట, పాలు

.. వత్తులు కలిపి, రెండు అక్షరాల శబ్దాలు కలిపి పదాలు

అక్క, అత్త, అట్ట, నవ్వు, పువ్వు, చిక్కని, నీళ్ళు

****************************************

పాటలు:

.. బుర్రు పిట్ట బుర్రు పిట్ట
.. చిట్టి పొట్టి మిరియాలు
.. ఒప్పులకుప్ప వయ్యారిభామ

వేసవి నెలల పాఠాలు

ఈ వేసవి లో క్లాసులు చాలా ఇర్రెగ్యులర్ గా జరగటం తో వచ్చే యేడు వేసవికి తెలుగు స్కూల్ కి కూడా సెలవలు ప్రకటించాలని నిర్ణయించుకున్నాను.

ఇక్కడ మేము విలైనంతలో నేర్చుకున్న పాఠాలు జతపరుస్తున్నాను. మీ పిల్లల పుస్తకంలో పూర్తి వివరాలు వున్నాయి.


.. అచ్చులు ఉచ్చారణ వచ్చాక హల్లులతో కలిపి గుణింతాలుగా పలకటం.

ఉదాహరణకి అ - క; ఆ - గా; ఇ - సి; ఈ - టీ ఇలాగన్నమాట.
.. పైన శబ్దాలు వాడిన పదాలు

ఉదా: నాకు, నీకు, మేము, మనము, మీరు, వారు, వీరు

.. పదాల్లో వివిధ అర్థాలు

ఉదా: ఇక్కడ - అక్కడ - ఎక్కడ; ఎందుకు - అందుకు; ఇది-అది-ఏది

.. పదాలు వాడకం

ఉదా: నీతో, నాకు, మీ కోసం

.. వాళ్ళు రోజూ గమనించేవి

ఉదా: చంద్రుడు, అమావాస్య, పౌర్ణమి, నెలవంక.

ఇవి నేను బొమ్మలుగా గీసి, వాళ్లతో రంగులు దిద్దించి, పలికించటంతో గుర్తు పెట్టుకునే అవకాశం ఎక్కువ.

.. ప్రకృతి/నేచర్ లో వారు గమనించేవి

ఉదా: భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు, మట్టి, వాతావరణం.

******************************************************

పాటలు:

.. చుక్ చుక్ రైలు
.. కాకి కాకి
.. అమ్మ మాట చల్లన

విశ్వామిత్ర-9

డిశంబరు మాసం. అంతా కాస్త వూపిరి తీసుకుని వేడుకల్లో, విందుల్లో, వినోదాల్లో మునిగి తేలే సెలవు దినాలకి ముందు శుక్రవారం. హెల్ముట్ ఇంటికి క్రిస్మస్ విందుకి ఆహ్వానం.

అంతకు మునుపటేడు వూర్లో లేని కారణంగా వెళ్ళలేదు. ఈ సారి విశ్వ కూడా ఇక్కడే వున్నాడు. తమ నాలుగు టీమ్స్ వరకే కనుక ఆర్.యెస్.వి.పి. వంటి ఫార్మాలిటీస్ లేవు.


"విశ్వ, సాయంత్రం వెళ్తున్నారా అక్కడకి?" అడిగింది మిత్ర. ఇద్దరూ కలిసి మెక్సికన్ రెస్టారంట్కి లంచ్ కి వచ్చారు.

"మీరు?" ఎదురు ప్రశ్న వేసాడు.

"ఇదే మొదలు ఇలా ఎక్కడకీ వెళ్ళలేదు. అందుకని.." ఆగిపోయిందిక ఏమనాలా అని ఆలోచిస్తూ.

"నాదీ అదే పరిస్థితి." చిన్నగా నవ్వాడు.

"సరే ఓ పని చేద్దాం. కలిసివెళ్దాం." చటుక్కున వెలికివచ్చింది మిత్ర నోటి వెంట.

హెల్ముట్ మూడింటికి వెళ్తూ తన క్యూబ్ కి వచ్చి "మీట్రా సీ యు సూన్.." అని చెప్పి మరీ వెళ్ళాడు.

విశ్వని ఏడింటికి తను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పి మిత్ర కూడా నాలుగింటికి ఇంటికి వచ్చేసింది.

*************************************************

వచ్చీ రావటంతోనే వంటగదిలోకి వెళ్ళి కొద్దిగా వుల్లిపాయ పకోడి చేసింది. అలసటగా వున్నా ఆలస్యం అవుతుందేమోనని షవర్ తీసుకుని, చక చకా జుట్టు డ్రై చేసుకుని, వార్డ్ రోబ్ లోంచి డార్క్ గ్రీన్ లాంగ్ ఫ్రాక్ తీసి వేసుకుంది.

ఫెస్టివ్ అకేషన్ కనుక కాస్త లైట్ గా మేకప్ వేసుకుని, పెదాలకి ఎర్రటి లిప్ స్టిక్ వేసుకుందామని సరుగు తీసేసరికి చిన్న గిఫ్ట్ పాక్ కనిపించింది. అది నవీ పంపింది. సోమవారం వచ్చింది. యధాలాపంగా లోపల పెట్టేసింది.

విప్పనే లేదు, ఇంకా నయం, పిచ్చి బంగారం మధ్యలో ఫోన్ చేసివుంటే అలిగేసేది అని అనుకుంటూ విప్పుతుండగా అనుకోని ఆలోచన, విశ్వకి చిన్న కానుక ఇస్తేనో. మళ్ళీ సంశయం. లోపల లేత గులాబీ రంగు ఆస్ట్రేలియన్ కోరల్స్ తో పూలు చెక్కిన చేసిన చిన్న పెండెంట్. మ్యాచింగ్ హ్యాంగింగ్స్.

సన్న గొలుసుకి తగిలించి పెట్టుకుంది. లిప్ స్టిక్ అద్దుకుంటూ తనలో తనే అనుకుంది ఎందుకు తను అలంకరణలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాను అని.


ఆ మధ్య బాగుంది అని తీసుకున్న పెన్ సెట్ గిఫ్ట్ రాప్ తీసి పాక్ చేసింది. టైం ఆరున్నరైపోయింది చూస్తుండగానే. పకోడి బాక్స్ లోకి సర్ది పెట్టుకుని, గబగబా షూస్ వేసుకుని వింటర్ కోట్ విసుగ్గానే తగిలించుకుని, గ్లౌస్, హాండ్ బాగ్, కార్ కీస్ తీసుకుని బయటకి వచ్చింది.

అప్పుడు గుర్తుకు వచ్చింది గిఫ్ట్ లోపలే మర్చిపోయానని. తిరిగి వచ్చేప్పుడు ఇక్కడ ఆపి ఇవ్వొచ్చులే అనుకుంటూ మెట్ల వైపు నడిచింది.


విశ్వ దగ్గరకి వెళ్ళేసరికి స్వీట్స్ బయటనే సిద్దంగా వున్నాడు.

"అయ్యో చలిలో బయటవున్నారా?" నొచ్చుకుంటూ అడిగింది.

"అలా ఏమీ లేదండి. నేను జస్ట్ బయటకి వచ్చాను. అయినా ఇన్ని పొరలు కప్పుకున్నాక ఇంకా చలేమిటి?" సీట్లో కూర్చుని బెల్ట్ పెట్టుకుంటూ అన్నాడు.

మరొక పావు గంటకి హెల్ముట్ ఇంటికి చేరారు. సంతోషంగా ఆహ్వానించాడు. భార్య రాబిన్ ని పరిచయం చేసాడు. అంతా సరదాగా వున్నారు. ఐవన్ భార్య స్వెత్లానా కాస్త యాస కలిసిన ఇంగ్లీష్ లో సన్నగా పలకరించింది. అంతకు మునుపొకసారి కలిసారు.

అందరి చేతిలో ఏదో ఒక డ్రింక్. కోక్ తీసుకుని కొంచం ప్రక్కగా వచ్చి కూర్చుంది. మరొక పది నిమిషాలకి గిల్డా వచ్చింది. తమ టీం కాదు కానీ తమ మధ్య మంచి చనువువుంది.

"మీట్రా, యు లుక్ గొర్జియస్" హత్తుకుని చిన్నగా కిస్ చేస్తూ అంది. "దిస్ ఇజ్ రిచ్" అంటూ పరిచయం చేసింది. ముందు వివాహం లో ఎన్నో బాధలనుభవించి విడాకులతో ముగించి, రిచ్ తో పరిచయం ప్రేమగా మారాక, ఇద్దరూ ఒక అవగాహనకి వచ్చి లివింగ్ టుగెదర్ చేస్తున్నారు.

"వివాహమే మమ్మల్ని కలిపి వుంచుందన్నది వొట్టి కల మాత్రమే. రిచ్ మనసు మంచిది. నాకీ వయసులో కావలసింది మోరల్ సపోర్ట్ మాత్రమే. తనకి పెద్ద కుటుంబం వుంది. పెద్ద వయసులో వున్న మా అమ్మ, టీనేజ్ లో వున్న నా కూతురుకి నేనే అండ. నన్ను నా అవసరాలని తనవిగా చూసుకునే రిచ్ నాకు అండ" అని ఆ మధ్య చెప్పింది.

మరో పది నిమిషాలకి రిచ్ పకోడి తింటూ వచ్చి మిత్ర ప్రక్కన కూర్చున్నాడు. "మీట్రా యూ ఆర్ సో అడోరబుల్" అన్నాడు. "థాంక్స్" అంది.

సంభాషణ ఇంగ్లీష్ లో నడుస్తుంది. డ్రింక్ చేసి వుండటం వలన అంతా ఇన్ హిబిషన్స్ కాస్త సడలించుకుని చనువుగా మాట్లాడుతున్నారు.

"విశ్వ తో డేటింగ్ చేస్తున్నావా?" కన్ను గీటుతూ అడిగింది గిల్డా.

"అదేమీ లేదు. ఇండియాలోనే తెలుసు. అనుకోకుండా మళ్ళీ కలిసాం." అంది మొహమాటంగా.

"హి లైక్స్ యు. ఐ కెన్ టెల్ దట్" అని గిల్డా అంటుండగా విశ్వ ఇటుగా వచ్చాడు.

"మిత్ర, అటు చూడండి." అంటూ కిటికీ ప్రక్కగా తీసుకువెళ్ళాడు.

సన్నగా దూదిపింజెల మాదిరిగా కురుస్తున్న మంచు. ఓ ప్రక్కగా బాక్స్ వుడ్ పొద ప్రక్కన కూర్చున్న బూడిద వన్నె కుందేలు. అలంకరణకి పెట్టిన రంగు రంగు చిన్ని చిన్ని దీపాల కాంతులు. మనసొక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది.

ఇద్దరూ మాటలు మరిచి మైమరిచినట్లుగా అటే చూస్తుండిపోయారు. విశ్వ చూపులు ఏదో లోకాల్లో తిరుగాడుతున్నట్లున్న మిత్ర మీదే నిలిచిపోయాయి. ఆ దుస్తులలో దేవ కన్య లా వుంది. చిన్నప్పుడు చదివిన షార్ట్ స్టొరీస్ వర్ణించే ఫైరీ మాదిరిగా వుంది.

రాబిన్ వచ్చింది. "మీట్రా, నువ్వు వెజిటేరియన్ అటగా. నీ కోసం ఓవెన్లో మష్రూం పై బర్న్ చేస్తున్నాను. స్పినాచ్ రోల్స్ వున్నాయి." అంటూ చెప్పి వెళ్ళింది.

అంతా కొంచం కొంచం పకోడి రుచి చూసి బాగుందని మెచ్చుకున్నారు. వీళ్ళలో ఈ లక్షణం తనకి చాలా ఇష్టం. ఏదైనా క్రొత్తని త్వరగా ఆహ్వానిస్తారు. రుచి కాని, వస్తువు కాని, కనీసం ఒకసారి ప్రయత్నిస్తారు. కాస్త స్పైస్ తగ్గించే చేసింది కూడా.

అలా అలా గంట పైనే కబుర్లు, ఫుడ్ తో గడిచిపోయింది. ముందు ఫార్మల్ లివింగ్ రూ లో దాదాపుగా పదడుగుల పెద్ద క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసి పెట్టారు. రక రకాల అలంకరణలు, క్రింద పాక్ చేసి పెట్టి వున్న కానుకలు.

సినిమాలలో, షాపింగ్ సెంటర్ లో చూడటమే కానీ ఇలా ఇంట్లో పెట్టినది చూడటం ఇదే మొదలు. రాబిన్ ఆ సంగతులు, తన చిన్నప్పటి క్రిస్మస్ వేడుకలు అవీ చెప్తుంటే తెలియకుండానే మనసు దసరా, సంక్రాంతి పండుగ రోజుల్లోకి తొంగిచూసి వచ్చింది.


పదవుతుండగా అందరూ విషెస్ చెప్పుకుంటూ ఒకరొకరుగా ఇళ్ళకు మళ్ళారు.

దార్లో విశ్వాని అడిగి కార్ ఓ ప్రక్కగా తీసి ఆపింది. దిగి రెండు అడుగులు వేసిందో లేదో షూస్ అప్పుడే గట్టి పడుతున్న మంచు మీదగా జారాయి. పట్టు తప్పి పడిపోతున్నాను అనుకుంటుండగా విశ్వ బలంగా వెనకనుండి పట్టుకుని ఆపాడు.

ఇక అడుగు తీసి వేయాలంటే భయం వేసింది. అలాగే నిలబడి కాసేపు వెన్నెలాకాశం మాదిరిగా మెరుస్తున్న ఆ రేయి వెలుగుల్లో తన కంటి వెలుగులు కలిపి నిలిచిపోయింది. విశ్వ చేరువగా వుండటం ఇంకా బాగా అనిపిస్తుంది.


వెనక్కి తిరిగి నడిచేప్పుడు కలుక్కుమన్న నెప్పి. "అమ్మా! " మిత్ర నోటివెంట ఆ సన్నని మాటలోనే బాధ అంతా ధ్వనించింది.

"అయ్యో పాదం బెణికిందేమో" అంటూ "మీరేమీ అనుకోకపోతే.." అని చెయ్యిందించాడు. నిదానంగా అతని ఆసరాతో కార్ దాకా వచ్చింది. అతని స్పర్శలో ఏదో భరోసా. మునుపు మాదిరి బిడియంగా అనిపించలేదు.

"నేను డ్రైవ్ చేస్తాను. మీకు కాలింకా స్ట్రెయిన్ కావచ్చు. " అంటూ తనని అటు ప్రక్కగా నడిపించి డోర్ అతనే తీసి నెమ్మదిగా మిత్ర సర్దుకుని కూర్చున్నాక అటుగా వెళ్ళి కూర్చుని నెమ్మదిగా స్టార్ట్ చేసి ముందుకు కదిపాడు.

మిత్ర ఇంటికి వచ్చాక, లోపలికి అతనే తీసుకువచ్చాడు. ఇబ్బందిగా వుంది. ఇలా అయిందేమిటీ, ప్చ్ తనలో తనే అనుకుంది. సోఫాలో కూర్చున్నాక ఎదురుగా గిఫ్ట్ పాక్ కనపడింది.

"విశ్వ! అది మీకే." అంది.

"మీరూ ఏమీ అనుకోరనే నా నుంచి ఓ చిన్న కానుక." అంటూ చిన్న బాక్స్ ఇచ్చాడు.

అతను ఎలా వెళ్ళాలి అన్న సందేహం. చూస్తుండగానే స్నో జోరుగా పడటంతో ఎటూ కాని టైం లో ఇక డ్రైవింగ్ మంచిది కాదేమో? అనిపించింది. కాబ్స్ కూడా దొరకటం కష్టమే.

తనే చొరవ తీసుకుని "విశ్వ, ఈ రాత్రికి ఇక్కడే వుండండి. ఉదయానికి కాస్త రోడ్స్ క్లియర్ చేస్తారు. అప్పుడు చూద్దాం." అంది.

ఇద్దరికీ నిద్ర రావటం లేదు. ఇద్దరూ జ్యూస్ గ్లాసులు పట్టుకుని మాటలు మొదలు పెట్టారు. ఏవేవో చిన్నప్పటి సంగతుల్లోకి వెళ్ళిపోయింది సంభాషణ.

మిత్ర ముందు తన విషయాలు చెప్పింది. సుమతి గార్ని గురించి మరి మరీ చెప్పింది. విశ్వ ఆసక్తిగా వింటూ కూర్చున్నాడు. నిదానంగా విశ్వ గురించిన మాటల్లోకి సాగింది.

*************************************************

"అనంత వదినకి మీకు అసలు పోలికే లేదు." అంది మిత్ర.

"అవును అక్క మంచి రూపసి" అన్నాడు.

"ఛా నా ఉద్దేశ్యం అది కాదు. తను చాలా చొరవగా వుంటుంది. మీరు చాలా మొహమాటస్తులు" అంది మిత్ర.

"అదా, అవును నిజమే. చిన్నప్పటి నుండి తను చురుకే" అన్నాడు.

కాసేపు ఆగి "మీకో సంగతి చెప్పాలి. నాన్న గారు బాగా చదువుకున్నారు. వ్యవసాయం తన ఆసక్తి వలనే వృత్తిగా చేస్తున్నారు. ఆయన కారణంగానే నాకు చిన్నప్పటి నుండి న్యూస్ పేపర్ చదవటం, అలా అలా జర్నలిజం మీద ఆసక్తి కలిగింది. పుస్తక పఠనం, చిత్రలేఖనం కూడా ఆయన వలనే అలవడ్డాయి. ఆయనే లేకపోతే నా జీవితం అలా అనాధలా..." ఉద్వేగంగా ఆగిపోయాడు. అతని కళ్ళలో చిరు తడి.

మిత్రకి ఒక నిమిషం ఏమీ బోధపడలేదు. "విశ్వ, ఏమిటి మీరు అంటున్నది." నెమ్మదిగా అడిగింది.

"అవును మిత్ర, నాన్నగారికి 'హావ్ వన్ అడాప్ట్ వన్! ' అన్న ఆదర్శం. నన్ను దత్తత తీసుకుని పెంచారు. నాకు ఈ విషయం ఆయన కానీ అమ్మ కానీ చెప్పలేదు. ఎవరో ద్వారా తెలిసింది. నాతో మాట కూడా తీసుకున్నారు. మీ దగ్గర ఎందుకో దాచాలనిపించలేదు." అన్నాడు.

కాసేపు అలాగే మౌనంగా వుండిపోయారు.

మిత్ర తేరుకుని "విశ్వ, నాకు ఇవన్నీ చెప్పారని మీ పట్ల నా ఉద్దేశ్యంలో ఏ మార్పూ రాదు. ఈ మంచు ఎంత అందంగా వుందో, మన చిన్ననాటి అనుభూతులూ అంతే మధురంగా గడిచిపోయాయి. అనుకోకుండా ఆ మాట వచ్చింది అంతే. ఇక ఆ సంగతి నేనూ మర్చిపోతాను. మీ నాన్నగారిని ఒకసారి కలవాలి. ఆయన గురించి విన్నాక అలా అనిపించింది." అంది.

"చిత్రలేఖనం అన్నారు. ఏమైనా మీ వర్క్స్ వుంటే చూపించండి." అంది. కాసేపు నవలల మీద చర్చ. ఇద్దరికీ కలిసిన ఆసక్తి అదొకటని మిత్ర గమనించింది.

టైం చూస్తే ఒంటిగంట దాటిపోయింది.

"కాసేపు పడుకోండి" అంటూ లేచి మిత్ర బెడ్ రూం లోకి నెమ్మదిగా నడిచి అతనికో కంఫర్టర్ ఇచ్చింది. "కాస్త ఇబ్బంది తప్పదు మీకు, అసలే బారు మనిషి మీరు, ఈ సోఫాలో సర్దుకోవాల్సిందే."

ఇద్దరు పడకల మీద ఒడ్డిగిల్లటమే ఇంకా ఆలోచనలు తెగటం లేదు. రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుని, హాట్ పాక్ పెట్టటం తో నెప్పి తగ్గినట్లేవుంది.

అనుకోకుండా ఇలా కలిసి గడపటం అదో అనుభూతి. నెమ్మదిగా అతనిచ్చిన గిఫ్ట్ విప్పింది. క్రిస్టల్ తో చేసిన చిన్న కుందేలు బొమ్మ. భలే ముద్దుగా వుంది.

నిద్ర రానని మొరాయిస్తూనే నెమ్మదిగా వచ్చి చేరింది.

*************************************************

తెల్లవారగానే లేచే మిత్ర కొంచం ఆలస్యంగానే లేచింది. విశ్వ ఇంకా నిద్రలోనే వున్నాడు. ఓ ప్రక్కకి తిరిగి పడుకుని వున్న అతన్ని పరీక్షగా చూసింది. యూనిబ్రో. కనుబొమ్మలు కలిసి వున్నాయి. అప్రయత్నంగా అలా కలిసివున్నవారు సున్నిత మనస్కులు అని ఎక్కడొ చదివిన మాట గుర్తుకు వచ్చింది.

మరొక గంటకి తొమ్మిది అవుతుండగా అతనూ లేచాడు. శనివారం కనుక హడావుడి లేదు. ఇంకాసేపు వుంటే బాగుండునని మిత్రకి అనిపిస్తుంది.

విశ్వలోనూ అదే ఆలోచన. వెళ్ళాలనిలేదు.

"త్వరగా ఏమైనా వండేస్తాను. బ్రంచ్ తీసుకుని వెళ్ళండి." అంటూ కిచెన్ లోకి నడిచింది.

"అవేమీ వద్దు. మీకు కాలికి రెస్ట్ కావాలి. నేను కాసేపట్లో బయల్దేరతాను." మొహమాటంగా అన్నాడు.

రైస్ కడిగి కుక్కర్ లో పెట్టి, రెండు బంగాళదుంపల వేపుడు, కొంచం టమాట పప్పు చేసింది. విశ్వ ముక్కలు కోసి ఇచ్చాడు.

ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ, ఒకరు పాలు ఒకరు కాఫీ తాగుతూ, వంట పూర్తి చేసి, ఫ్రెష్ అప్ అయ్యి, భోజనం తీసుకున్నారు.

మధ్యాహ్నం కాబ్ పిల్చుకుని అతను వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా మనసులో దిగులు. ఏమిటో ఒక్క రోజులో ఇంత సాన్నిహిత్యం అనుకుంది.

*************************************************

మరో నాల్రోజులకి క్రొత్త సంవత్సరం.

విశ్వ కి వ్రాసిన గ్రీటింగ్స్. కాని అవి మరి కొన్ని నెలల వరకు అతనికి చేరనే లేదు.

మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం,
మాకెందుకిక దిగులని.

గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది,
వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.

మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది,
పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.

నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది,
అది చేయనున్న చిలిపి పనులచిట్టా.

ఋతువు కూడా ఒప్పేసుకుంది,
శీతువునంపి వసంతునికి కబురంపుతానని.

నిదురలో, మెలుకువలో, నన్ను మరిచిన మైమరుపులో,
నేను నిన్నే స్మరిస్తున్నాను, ఋతువుల కందని ప్రకృతి ఇది.
[సశేషం]

నీ లెక్కలతో మన లెక్కలు!!!!!

ఇప్పుడు చెప్పుకుందామా
పాఠాలు ఎవరికెన్ని వచ్చాయో?
ఎప్పుడూ నీదేగా పైచెయ్యి
ఒక్కసారికీ నన్ను గెలవనీ!

నీకసలు రేఖాగణితం రాదు
నీవు గీసిన నుదుటి రాతలు
నాకు చూపవందుకనే
పిచ్చి గీతలని కొట్టివేస్తానని కదు?

నున్నని నా అరచేతి నిండా
అడ్డదిడ్డంగా ఏవో గీసిపారేసావు
వున్నవీ లేనివీ కల్పించి చెప్పను
శాస్త్రమొకటి కనిపెట్టమన్నావు, కాదా?

అరిగేలా తిరిగే పాదాల్లో
అక్కడక్కడా వేలి కొసల్లో
శంఖు చక్రాలు లిఖించావు
ఎక్కడాలేని అర్థాలు వెదకమన్నావు, అవునా?

నీవు కేంద్రబిందువునన్నావు
నీ చుట్టూ అనంతవృత్తం
నను గీసుకు రమ్మన్నావు
ఇక్కడే నేను కొత్త పాఠం నీకు చెప్తున్నాను, వింటావా?

అమూర్త భావనవి, బిందువువీ నీవు
నిన్నూ నన్నూ కలిపే రేఖ సరళసమీకరణం,
నువు కేంద్రంగా గీసే వృత్తం అదొక వర్గసమీకరణం
నా మనసే సంకేతంగా ఇది నా బీజగణితం, తెలిసిందా?

నాలోని నిన్ను వెలికి తెచ్చి
వైశ్లేషిక రేఖాగణితం వెచ్చించి
అవురా నా సృష్టి ఇంత చిత్రమాని
నిను నివ్వెర పరిచానా కన్నయ్యా?

**********************
కాస్త పూర్వాపరాలు : వేలినెప్పితో కాస్త చేతికి పని తగ్గి, బుర్రకి పదును పెడదామని అలా అలా చదువుతూ లెక్కలకీ నాకు పరమాత్మునికి కలిపి ఇలా లెక్కకట్టాను. :)

గణితంలో రెండు వేర్వేరు పాయలయిన రేఖాగణితాన్నీ (geometry) బీజగణితాన్నీ (algebra) కలిపి సాధింఛిన దానిని వైశ్లేషిక రేఖాగణితం అంటారు. (దీనికే కో - ఆర్డినేట్ జామెట్రీ అని కూడా పేరు.) రేఖాగణితానికి గ్రీకులూ, బీజగణితానికి మన దేశస్థులూ ఆద్యులు. [రిఫరెన్స్: http://www.eemaata.com/em/issues/200803/1217.html/3/]

గారడీ?

చినుకుల ఆకులు రాల్చనని
మబ్బు చెట్టు నల్లమొహమేస్తే
ఆకుల చినుకులు రాలుస్తూ
చెట్టు రంగులు అద్దుకుంది

చిరుగాలి ఈ వాడల్లోనే
ఇల్లు కట్టుకు స్తంభాలాటలాడుతుంటే
ఏట్లోనీరు ఆ పని నాదని
గట్టు మీద కెక్కి నింగికేసి దూకుతుంది

పగలు చలికి పళ్ళు గిట్టకరుచుకుని
చీకటి గదిలో బందీ అవుతుంటే
రేయి వొళ్ళు విరుచుకుని
వెచ్చని కంబళ్ళలో జాగారం చేస్తుంది

నా చూపులకి అందక తిరుగాడే నీవు
నా నీడనీ వదలక వెంటాడుతున్నావు
ఋతువు మార్పా, నా మది చేయు గారడీనా
ఏదైనా కానీ, మళ్ళీ మళ్ళీ కావాలి నీ ఒడి!

విశ్వామిత్ర-8

వేసవి నుండి ఫాల్ కి ఋతువు మార్పు. అంటే మూణ్ణెల్లు గడిచిపోయాయి. ఇప్పుడు మిత్ర విశ్వ అప్పుడప్పుడు ఫోన్ల మీద మాట్లాడుకునే చనువు పెరిగింది. మిత్ర ప్రాజెక్ట్ పని మీద రెండోసారి విశ్వ ఆఫీసు విజిట్ చేస్తుందిపుడు. మునుపు పరిచయమైనవారే కనుక కొంచం వెసులుబాటు. శివ ఆ సాయంత్రం డిన్నర్ కి వెళ్దామని అడిగాడు.


సాయంత్రం ఆరున్నర సమయం లో వచ్చి తీసుకెళ్ళాడు. దారిలో గుడి దగ్గర ఆపాడు. ముందుగా చెప్పలేదితను అనుకుంది. దర్శనం చేసుకుని వెనక్కి వస్తుండగా ప్రతి సోమవారం అక్కడకి తప్పక వస్తానని చెప్పాడు. దారిలో సంభాషణ ఎక్కువగా అతని పరంగా నడిచింది. ఉదయమే ప్రయాణమై రావటంతో మిత్రకి కాస్త అలసటగా వుంది. మరో పావు గంటలో రెస్టారంట్ కి చేరారు."మిత్ర, ఇలా చనువుగా అడుగుతున్నానని ఏమీ అనుకోరుగా?" సంభాషణలోకి ఉపక్రమిస్తూ అన్నాడు శివ.

"ఏమిటది" అంది మిత్ర మెన్యూ కార్డ్ చూస్తూ.

"మీకింకా పెళ్ళి కాలేదు కదా?" అన్నాడు శివ.

"భలేవారే ఇందులో అనుకునేది ఏముంది, అవును కాలేదు" అంది మిత్ర.

శివ ఏదో అనబోయేంతలో ఆర్డర్ కోసం వెయిట్రెస్ వచ్చింది. "ఇక్కడ చిన్న ఇడ్లి, సాంబార్ మీరు తినాల్సిందే" చనువుగా అంటూ అతను ఆర్డర్ చెప్పటం మొదలు పెట్టాడు.

చేతిలో కార్డ్ ఆమెకి ఇచ్చేసి కుర్చీలో కాస్త వెనగా సర్దుకుని కూర్చుని, చుట్టూ పరికించింది. సోమవారం కనుక చాలా తక్కువమంది వున్నారు. ప్రక్క టేబుల్ మీద చిన్న పాప. నోట్లో పాసిఫయర్ పెట్టుకుని మిత్ర నే చూస్తుంది. చిన్నగా చేయి వూపింది. నోట్లో పాసిఫయర్ తీసి కుడిచేత్తో పట్టుకుని, ఎడం చెయ్యి వూపుతూ నవ్వింది. కుడిబుగ్గ మీద పడ్డ ఆ చొట్ట, మళ్ళీ విశ్వ మీదకి మళ్ళింది ధ్యాస.

'ఏదో ఆలోచనలో పడ్డట్లున్నారు" శివ మాటతో "అదేమీ లేదు, మీరు చెప్తున్నారుగా అని, ఇదిగో ఈ పాప ముద్దుగా వుందని చూస్తున్నాను." అంది.

"మిత్ర, మీరెంత కాలంగా వున్నారిక్కడ?" అడిగాడతను.

"రెండు సంవత్సరాలు దాటింది." అంది.

"నేను వచ్చి ఎనిమిదేళ్ళు అయింది. మాస్టర్స్ ఇక్కడే చేసాను. ఆరేళ్ళుగా ఉద్యోగం. ఇది ఈ కంపనీ నా మూడో ఎంప్లాయర్. అలాగే నాల్గో స్టేట్ ఇది నేను మారటం." అన్నాడు శివ.

"అలాగా అయితే త్వరలో మరో స్టేట్ కి మారతారన్నమాట." అంది నవ్వుతూ మిత్ర.

"అవునండి రెండు విషయాలున్నాయి ఇక చేయాల్సినవి. ఒకటి పెళ్ళి చేసుకోవాలి. రెండు జాబ్ మారాలి." అన్నాడు.

"అరే నేను సరదాగా అన్నాను, మీరు నాల్గో స్టేట్ అన్నారని." అంది మిత్ర.

"అలా కాదండి, హర్ష విశ్వని మానేజర్ ని చేయటం నాకు నచ్చలేదు. నేను సీనియర్ ని కదా." అతని గొంతులో అనీజీనెస్.

చురుగ్గా చూసింది మిత్ర అతని వైపు. "ఈ విషయం ఎందుకు చెప్తున్నారు నాకు" అని అడిగింది.

"నాకు మీరు నచ్చారు. మీకు ఇష్టమైతే మీ పెద్దవారు మా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు" అన్నాడతను "అందుకే నా గురించి వివరాలు ఇస్తున్నాను".

ఏమిటితని ఉద్దేశ్యం. ఇక్కడకి వచ్చి ఉద్యోగం వుంది కనుక, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు కనుక అడిగేయటమే. చిరుకోపంతో ఆమె ముక్కు కాస్త ఎర్రబడింది.

"నాకు గ్రీన్ కార్డ్ వుంది. ఒక్కడినే కొడుకుని. మీ ఆడపిల్లలు ముఖ్యంగా చూసేవి ఇవే కదా?" అతని గొంతులో ఏదో దర్పం.

"శివ, నాకు చాలా అలసటగా వుంది. ఈ సమయంలో ఈ విషయాల గురించి మాట్లాడాలని లేదు." కొంచంగా విసుగు ద్వనించింది ఆమె గొంతులో.

"ష్యూర్, మీరు ఆలోచించుకోండి. కంగారేమీ లేదు. మరో రెండు మూడు నెలల్లో నేను ఉద్యోగం మారిపోతాను. ఈలోగా చెప్తే పెళ్ళి అయ్యాక క్రొత్త ఉద్యోగంలో చేరతాను. నిజానికి చాలా సంబంధాలు వస్తున్నాయట. కాని నేనే ఆపాను." అన్నాడతను.

ఈ సారి పళ్ళ బిగువునా వచ్చింది కోపం. అతని తీరు ఇందాక నుండి చూస్తుంది. తనకి తోచినట్లు చేసేస్తూ, మాట్లాడేస్తూ, ఏమిటితని ఉద్దేశ్యం.

ఇంతలో ఫుడ్ వచ్చింది. తినాలనిలేదు. రూం కి వెళ్ళిపోవాలనివుంది. మర్యాదకి పూర్తి చేసింది. మరొక గంటలో డ్రాప్ చేసివెళ్ళిపోయాడతను.

మనసంతా చికాకు. స్నానం చేసి కాసేపు ద్యానం లో కూర్చుని లేచింది. చాలా డిస్టర్బ్ అయింది తను.

స్త్రీని ఇంకా ఇలా ట్రీట్ చేస్తున్నారా? అతనికి పెళ్ళి ఒక పని. అందుకు కంటికి నదురుగా వున్న తను కావాలి. తనకి అతని ఉద్యోగం, ఆస్తిపాస్తులు తెలిస్తే చాలా? ఇలా అంతులేని ఆలోచనలతో దాదాపు తెల్లారిపోయింది.

************************************************

రెండు మూడు గంటలు కలతనిద్ర తో, మామూలుగా లేచి ఆఫీసుకు వెళ్ళింది. అన్యమనస్కగానే వుంది.


మిత్ర మొహంలో పరధ్యాస విశ్వ గమనిస్తూనే వున్నాడు. మధ్యాహ్నం లంచ్ కి వెళ్దామా అంటే ఆకలిగా లేదు అని తప్పించుకుంది. ఏడింటి వరకు ఆఫీసులోనే వుండిపోయింది.

"రాత్రికి థండర్ స్టోర్మ్ ఫోర్ కాస్ట్ వుంది. మిమ్మల్ని దింపి వెళ్ళనా" విశ్వ మెల్లగా అడిగినా ఏదో ఆత్మీయత ధ్వనించిందా గొంతులో.

"సరే. ఒక పదినిమిషాల్లో వెళ్దాం" అంది మిత్ర.

డ్రైవ్ చేస్తూ, రోడ్డు వైపే చూస్తూ "ఆరోగ్యం బాగుంది కదా? కాస్త అదోలా వున్నారు" అడిగాడు.

"ఊ, అదేమీ లేదు." క్లుప్తంగా అంది.

"ఎక్కడైనా ఆపనా, కాస్త డిన్నర్ తీసుకోండి." అనటంతో "అలాగే, ఎక్కడికైనా ఫర్వాలేదు." అంది.

కార్ వెనక్కి టర్న్ చేసి వెనక్కి తిప్పాడు. మరో పదినిమిషాలకి చిన్న స్నాక్ బార్ వంటి ప్లేస్ కి వెళ్ళారు.

"మీకు రవ్వదోశ ఇష్టం కదా. ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ మసాలా టీ నాకు ఇష్టం." అని చెప్పాడతను.

"ఊ, అదే చెప్పండి." అంది. కౌంటర్ వద్దే ఆర్డర్ ఇస్తూ "మాంగో లస్సీ చెప్పనా?" అడిగాడు విశ్వ.

ఇతనికి ఎలా తెలుసు. ఆమె మనసు చదివినట్లు "విష్ణువాళ్ళ అమ్మగారు అన్నారొకసారి మీకివి ఇష్టమని"
విశ్వ మాటలకి మిత్ర మనసులో ఆశ్చర్యం కలిగింది. అది ఆశ్చర్యమో లేక ఆనందమో తనకే తెలియటం లేదు.

ట్రేలలో సర్దుకుని టేబుల్ వెదుక్కుని కూర్చున్నారు. అతని గొంతులో ఏదో గంభీరత. మంద్రంగా మృదువుగా ఏదో చెప్తున్నాడు.
విశ్వ మాటలకి మిత్ర మనసు తేలిక పడింది.

"విశ్వ, నిన్న శివ నేను డిన్నర్ కి వచ్చాము...తన గురించి మీకు..." అర్థోక్తిలో ఆగింది, చెప్పాలా వద్దా
సంధిగ్దత.

"మంచి టెక్నికల్ స్కిల్స్ వున్నాయతనికి. టీం లో తనే సీనియర్. హర్ష పీపుల్ మానేజ్మెంట్ విషయమై నన్ను మానేజర్ గా నియమించినా అతని నిర్ణయాలకి చాలా విలువ ఇస్తాము." అన్నాడు విశ్వ.

ఎంత భిన్నస్వరం శివ, విశ్వ ఈ ఇద్దరిలోను. పరిచయం తక్కువే అయినా అసూయ బయటపెట్టాడు శివ. శివ గురించి వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు విశ్వ వ్యక్తిత్వానికి ప్రతీక.

వెనక్కి వచ్చే దారిలో వాన మొదలవలేదు కానీ నల్ల మబ్బులు. రాత్రి ఆకాశమైనా ఏదో అందం. ఆపై విశ్వ మాటలకి మనసంతా ఆహ్లాదంగా మారింది. సన్నని సంగీతం, నిద్ర ముంచుకువస్తుంది. కళ్ళు అరమూతలు పడ్డాయి.

"మిత్ర.." నెమ్మదిగా పిలుస్తున్న విశ్వ గొంతుతో ఉలిక్కిపడిలేచింది.

************************************************

రూం కి రాగానే ఐదే ఐదు నిమిషాల్లో నైటీలోకి మారింది.

సందేహం లేదు. తను విశ్వ తో గడిపే సమయాన్ని ఇష్టపడుతుంది.
విశ్వ మాటలకి తన మనసు పురివిప్పి నర్తించింది. ఏదో తెలియని ఆశ్చర్యం, ఎప్పుడూ కలగని ఆనందం అతని వలన కలిగాయి. అతని గురించి తెలుసుకోవాలని మనసు త్వరపడుతుంది.

ఉదయమైనా కూడా వదలని నిద్ర మత్తు.

కాలం మారింది,
ఎవరో మునుపన్నట్లు
ఋతువు నవ్వేస్తోంది,
నా తనువు తొందరపడుతోంది.

అందుకేనేమో ఆకసాన అదో అందం
గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు
ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు.

మరందుకేనో పరవశాన మదిదీచందం
రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా,
హత్తుకున్న తీపి తలపులు
మరలి మరలి సిగ్గు దొంతరలు
కనుల కప్పేస్తున్నట్లు.


నెమ్మదిగా కదులుతూ మిత్ర కలం ఆ పంక్తులు వ్రాస్తున్న సమయానికి విశ్వ చేతిలో కుంచె కూడా కదులుతూ వుంది. పడక మీద అలవోకగా వాలి నిదురలోనున్న రాజకుమారి చిత్రమది. మిత్ర పోలికలు కొట్టొచ్చినట్లు కనపడుతున్న ఆ చిత్రానికి తుది మెరుగులు దిద్ది, వేళ్ళు విరుచుకుంటూ మరోసారి పరిశీలనగా చూసాడు.

మిత్రకి గిఫ్ట్ గా ఇస్తే .... ఆ ఆలోచనకి నవ్వు వచ్చింది. అసలు అంత చనువు తీసుకోగలడా? ఇంకొంచం సమయం కావాలి. తమ మధ్య బంధం బలపడాలి. ఈ స్నేహితం ముందు తమని దగ్గర చేయాలి.

కాఫీ తాగాలనిపించి కిచెన్ వైపు నడిచాడు.


[సశేషం]

చిత్రం!!!!!

నిన్న అనుభవం లోకి వచ్చిన ఒక సంగతికి తోడుగా, ఆత్రేయ గారి సత్యం ఇచ్చిన స్ఫూర్తితో....

పొంగి పొర్లే కన్నీటి ధారల్లో
ఉప్పోంగి వెల్లువయ్యే ఆనందభాష్పాల్లో
నింగి నంటినా నిలవననే ఆశాశిఖరాల్లో
నిబ్బరాన్ని సడలించే సంవేదనల్లో
ఎన్ని జీవిత సత్యాలో!!!!!

అసత్యాలెన్నో వెనుదీసాకా,
మరెన్నో ముసుగులు తొలిగాక,
మిగిలిన ఆ కొద్ది జీవితానా
అన్ని "చిత్రాలు" విచిత్రంగా,
ఆపనలవి కాని చిత్రాలే!!!!!

చెవులారా, కనులారా, మీకూ చెప్పేయనా?

  1. కరణం గారి కొబ్బరి కారం [విన్నది]
  2. పంతులు గారి పడక్కుర్చీ [వున్నది]
  3. సాములోరి పట్టుపంచె [కన్నది]

నా చిన్ని చిన్ని కథల్లో కాదు కాదు నిజ జీవితానుభవాల్లో మీరూ కాసిని నవ్వులు వెదుక్కుని, మరికొన్ని నాకు కొన్ని పంచుతారని...

ఈ మధ్య లాఫింగ్ థెరపీ గురించి చదివి చదివి నాదీ ఓ చిరు ప్రయత్నం :)

కరణం గారి కొబ్బరి కారం

సాక్షాత్తు రామచంద్రుడంటటి దేముడని మంచి పేరున్న మా సర్జన్ మావయ్య చిన్నతనంలో మహా ఆకతాయట. మాంసాహార ప్రీతి, ఆటల ప్రియుడు. ఆయనకి తోడు పెద్ద కరణం [ఎందులో పెద్దో మరి? ] గారబ్బాయి, చిన్న కరణం.

ఆటల్లో పడి ఓ సారి వాళ్ళింటికి వెళ్తే, కరణం గారి భార్య మావయ్యని "నీసు తింటాడు, లోనికి రానీకు" అని అన్నారట. మరి అందుకు ప్రతిజ్ఞ పూనాడేమో!!!!!

అమ్మమ్మ గారు చేసిన కైమా వుండలు మునుపు కన్నా త్వరగా ఖాళీ అవుతున్నాయని వంట చేసే చిన్నాలమ్మ గారిని అడిగితే ఆ "శర్మ గారి పిల్లాడు" సగం తినేస్తున్నాడన్నారట. అర్థం అయిపోయిందా మా మావయ్య నిర్వాకం? కరణం గారి బుడ్డోడికి కి "కొబ్బరి కారం" అని చెప్పి, మీరు లౌజులు [బెల్లం + కొబ్బరి కోరు కలిపి చేసే వుండలు] తిన్నట్లే మేము కొబ్బరి+కారం కలిపిన వుండలు తింటాం అని రుచి చూపించాడన్నమాట. :)

చిన్న కరణం గారు ఇప్పటికీ మా వయ్యారి [పెద్దగా చెప్పనవసరం లేదు] ఇంట్లో అవి వండించుకుంటుంటారట. ఆయనకి వాటిని కొబ్బరికారం అనటమే ఇంకా అలవాటుట.


నిజానికి నన్నూ అలాగే మోసం చేసారు మావయ్య, అమ్మ కలిపి. కోడిగ్రుడ్డు పురటు ఇది "బీరకాయ పాలకూర" అని పెట్టేవారు. నాకు చాలా సంవత్సరాలు నిజం తెలియనీలేదు. కనుక ఆ కరణం గారు, నేను..... మాకు మల్లే ఇంకెందరో.

*** *** *** *** *** ***

పంతులు గారి పడక్కుర్చీ

ఇందులో హీరో మా నానీ గాడు. మా అన్న వాడు. నేను వున్నాను కనుక కాస్త సాగదీస్తాను ఈ కథనం. నా పేరు మార్చి కాసేపు "బుజ్జి" అని పెడదామా?

"బుజ్జీ! చెప్పింది గుర్తుంది కదా?" ఈ మాట నాని ఇప్పటికి చాలా సార్లే అడిగాడు. "ఊ" బుర్ర గబగబా ఆడిస్తూ "భయంగా వుందిరా" అన్నాను.

"అదిగో ఆ పిరికితనమే నాకు చిరాకు", బాలభారతం లో దుర్యోధనుడి పాత్రకి వీడు బాగా సరిపోతాడు. నేనేదో అనబోయేంతలో "పాపగారు అమ్మగారు పిలుత్తున్నారండి" అంటూ వచ్చింది సీతాలు.

చేతిలో పుస్తకాలు అక్కడే చాప మీద పెట్టి, లోపలికి తనవెంట నడిచాను. వెనకనుండి నానీ చప్పట్లు కొట్టి పిలిచి "ష్ గప్ చుప్" అని సైగ చేసాడు.

అమ్మమ్మ గారు పెద్ద లోటా గ్లాసులో పాలతో సిద్దంగా వున్నారు. "రా రా మళ్ళా ఆ పంతులు వస్తే గంట దాకా వదలడు. అర్భకపు పిల్లవి, నీరసపడతావు, తాగేయ్" అని ఇచ్చారు.

"ఇది మెతకే మాట వింటుంది, వాడే తుంటరి" ఈ మాట రోజూ అంటారు. "నువ్వు మా బంగారుకొండవి" అని వాడికీ చెప్తారు. ఆవిడకి మాటకారి అని పేరుట.

వాడు ఫోర్త్, నేను సెకండ్ క్లాస్. నాన్నగారు ఉద్యోగం చేసేచోట ఏదో గొడవలని అమ్మతో పాటుగా ఇక్కడికి పంపేసారు. అమ్మ మళ్ళి వెళ్ళిపోయింది. మేమిక్కడ వుండిపోయాం.

"కాన్వెంట్ చదువులు ఇక్కడ కుదరవు" అన్న అమ్మమ్మ గారు ఓ రోజు వెంకటరత్నం మాష్టారి దగ్గర ట్యూషన్ మొదలుపెట్టించారు. ఆవిడంటే వున్న భయం తో ఏమీ అనలేకపోయాము.

"ఏ ఫర్ యాపిల్" నుండి మొదలు పెట్టి "అకారకారముల ఆ" అంటూ సాగదీస్తూ ఓ గంట బాధపెట్టి ఆయాసపడుతూ వెళ్ళేవారు. హాయిగా పడక్కుర్చిలోకి వాలి కూర్చుని, మమ్మల్ని మాత్రం ఆ గంటా చాప మీద బాసిపెట్ల వేయించి కూర్చోబెట్టేవారు.

ఆయన్ని చూస్తే అమ్మమ్మ గారు మాకు పంపే బియ్యం బస్తా గుర్తొచ్చేది. సోడాబుడ్డి కళ్ళద్దాలు, చేతిలో రూళ్ళకర్రొకటి. ట్యూషన్ మొదలుపెట్టిన రెండో రోజే నానిగాడిని రెండు దరువులు పడ్డాయి.

వాడందుకున్న రాగానికి అమ్మమ్మ గారు వంటింట్లోంచి మజ్జిగ కవ్వంతో సహా వచ్చి "ఏమయ్యా పంతులు, పిల్లలకేదో పాఠాలు చెప్తావని రమ్మంటే ఇలా బాదుతావా? మా ఇళ్ళ సంగతి ఎరగవా?" అని అవేశ పడే సరికి దానికి పనిపడలేదు. కానీ నానీ, అదీ మేనమామ సాలు వచ్చిన మా అన్నీ గాడికి పగ రగలటం మొదలైపోయింది.


ఆయనకి కుక్కలంటే భయమని, దారంటా వాటిని అదిలించటానికే అది పట్టుకొస్తారని, ఆదివారం చర్చికెళ్తూ కూడా మరిచిపోరని సీతాలు కొడుకు వెంకన్న గోళీలాడేప్పుడు నానీకి చెప్పాడట. నానీ గాడి బుర్రలో మాంచి పథకం వచ్చేసింది.

వినగానే "అమ్మో" అన్నాను. "నా మాట వింటే ఆ నెల నా పాకెట్ మనీ నీకే ఇస్తాను" అన్నాడు. కాస్త లొంగాను. జాతి లక్షణం. "అమ్మమ్మ గారికి తెలిస్తే.." నా మాట వెంటే "తెలిస్తే కదా" వాడి గొంతులో ధీమా. నాకు సరదా వేసింది. ఆయనంటే నాకూ కాస్త విసుగ్గానే వుంది. వామనగుంటలు, వైకుంఠపాళీ ఆడే టైం తగ్గిపోయిందని. నానీ నాకు మాష్టార్ని భయపెడతా అని మాత్రం చెప్పాడు.


ఈ రోజే పథకం అమలు. నాకు భయం, కంగారు. జడలు వేయించుకుని, పూలు పెట్టుకుని ముందు వసారాలోకి వస్తూ జిప్సీ గాడి గదిలోకి తొంగి చూసాను. నానీ బిస్కట్స్ తినిపిస్తూ ఏదో చెప్తున్నాడు. వీడు రెండో జిప్సీ. అలా మా ఇంట్లో తరతరాల శునకవంశం వర్దిల్లింది. మన మాటలు చక్కగా అర్థం అవుతాయి.

నా పనల్లా నానీ ఏమి చేసినా చూసి వూరుకోవటం, అమ్మమ్మ గారు అడిగిన దానికి నాకేమీ తెలియదని చెప్పటం. ముందుకి వచ్చేసి చాప మీద కూర్చున్నాను. నానీ వాడివెంట జిప్సీ వచ్చారు. ఆసమయానికి దాన్ని కట్టేసి వుంచటం అలవాటు. అల్సేషియన్ కనుక కాస్త భీకరంగా కూడా వుంటుంది.

"సీతాలు" అంటూ ఆయన రానే వచ్చారు. రైలింజన్ కూతంటి ఆ కేకకి అర్థం నా పాల గ్లాసుకి డబల్ వుండే లోటాలో చిక్కటి కాఫీ తెమ్మని. అమ్మమ్మ పూజలో వుంటారారోజు ఆ టైంకి. సీతాలు ఎందుకో పలకలేదు. ఆయన జిప్సీని చూస్తూనే ఆగి పోయారు.

"సీతాలు" ఈ సారి ఆయనన్నది ప్రక్కనున్న నాకే వినపడలేదు. "రండి మాష్టారు" నాని చాలా మర్యాదగా పిలిచాడు. అడుగులో అడుగేస్తూ వస్తున్న ఆయన చేతిలో కర్ర చూస్తూనే జిప్సీ గాడు గుర్రుమన్నాడు.


"ఆ కర్రనలా పడేయండి" నాని గాడి గొంతులో ఈసారి అధికారం.

నిదానంగా కుర్చిలో సర్దుక్కూర్చోబోయి ఉన్నపళాన లోపలికి కూరుకుపోయారు. ఆ కుర్చీ కర్ర తీసేయటం కూడా నాని పనన్నమాట. ఇంతలో జిప్సీ చెంగున ఎగిరి ఆయన పొట్ట మీదకెక్కి , గుండెల మీద కాళ్ళు పెట్టి కూర్చుంది.

"నానీ, దీన్ని కాస్త దింపు నాయనా!" చాలా దీనంగా అడిగారు. వాడు విననట్లే వూరుకున్నాడు. నాకే జాలేసి జిప్సీ గాడిని దింపి గదిలో పెట్టేసి వచ్చి, ఆయనకి చేయి అందించి లేపాను.

కళ్ళజోడు సర్దుకుంటూ, ఒకటే పరుగు ఆయన. చేతికర్ర కూడా మర్చి పోయారు. అప్పుడు మొదలుపెట్టాం నానీ,నేను నవ్వులు. కుర్చీ సర్దేసి అమ్మమ్మగారి పూజ అయ్యాక "మాష్టారు" రాలేదు అని చెప్పాం.


ఆ రోజు నుండి ఈ రోజు వరకు ట్యూషన్ చెప్పటానికి మాత్రం రాలేదు. అలా ఎలా జరిగిందో తెలియదు కానీ ఆయనకి నేను మంచిదాన్నని మాత్రం నమ్మకం బలపడిపోయింది.

పోయినేడు కూడా "ఉషమ్మ వచ్చిందట" అంటూ వచ్చి పలకరించి వెళ్ళారు. "బుజ్జి బంగారు తల్లి. " :) నానీగాడు మాత్రం నమ్మకద్రోహి. అన్నమాట తప్పాడు. నాకు వాడి పాకెట్ మనీ ఇంతవరకు ఇవ్వలేదు. అదీ మన జాతి లక్షణమే కాదా?


*** *** *** *** *** ***

సాములోరి పట్టుపంచె

మా బిజ్జు గాడు అంటే యువ, మూడో తరం నరసింహనాయుడన్నమాట. ఆయన గారి ఘనకార్యం ఈ మూడో ముచ్చట. పూజలు, ఆచారాలు ఎక్కువగా పాటించే వారొకరు, దేముడుకి దణ్ణం పెట్టుకునే సమయంలో వీడిని విసుక్కున్నారట.

మర్నాడు మాటేసి, [అప్పటికి వీడికి మూడో సంవత్సరం] ఆయన కళ్ళు మూసుకుని నమస్కారం చేసే సమయానికి వంటి మీద పంచె లాక్కుని బయటకి వచ్చేసాడు మా చిన్ని కృష్ణుడు. పాపం ఆయన సిగ్గుతో బిక్కచచ్చిపోయి ఓ పది నిమిషాలకి నిదానంగా "అమ్మాయ్ అమ్మాయ్" అని పిలిచి చెప్పలేక చెప్పలేక చెప్తే, నేను నవ్వీ నవ్వీ నవ్వలేక ఆయన కో తువాలిచ్చి రక్షించాను ద్రౌపదీవస్త్రాపహరణం లో కృష్ణుని మాదిరి. అదీ మా ఇంటి మేనమామ పోలిక.


ఎలావున్నాయీ వూసులు? చేపల వాసన వదిలించుకుందామని కాస్త ఈ నవ్వుల ప్రయత్నం.

నవ్వితే నవ్వండి లేదా మీ దారిన మీరు పొండి.

విశ్వామిత్ర-7

వేసవి రోజులు. ఆదివారం సాయంత్రం. వాతావరణం బాగుంది, అలా కాసేపు తిరిగివస్తే బాగుండునని బయటకి వచ్చింది మిత్ర. కాస్త డ్రైవ్ చేసుకుని వెళ్తే, దగ్గర్లోనే వున్న గార్డెన్ లో తిరిగిరావొచ్చు. కార్ పార్క్ చేసి లోపలకి నడుస్తూ యధాలాపంగా రోడ్ అవతలి వైపు చూసింది. విశ్వ జాగ్ చేస్తూ కనపడ్డాడు. మిత్రని చూడగానే ఆగి చెయ్యి వూపాడు. ఇటుగా రోడ్డు దాటి వచ్చాడు.

"విశ్వ! మీరు ఇక్కడా...ఓ రేపటి నుండి మళ్ళీ ఓ వారం ఇక్కడే కదూ?" అని అడిగింది మిత్ర.

"బాగున్నారా మిత్రా? అవునండి, ఇందాకే రెండు గంటల క్రితం లాండయ్యాను. నేనుండే స్వీట్స్ ఇక్కడికి మైలు లోపే. క్రితం సారి ఐవన్ ఎంగేజ్ చేసిన సాయంత్రం తనతో కలిసి సాకర్ చూడటానికి ఈ గ్రౌండ్స్ కి వచ్చాను. రన్ కి బాగుందీ ట్రాక్ అని ఇలా వచ్చాను" అన్నాడతను.

"నిజమే తను చాలాసార్లు ఇటుగా వచ్చినా ఆ ఆసక్తి లేక ఆ గ్రౌండ్స్ కానీ, బైక్/వాక్ ట్రాక్ కానీ గమనించనేలేదు. ఇప్పుడు కూడా ఏదో గేమ్ జరుగుతున్నట్లుంది" స్వగతంగా అనుకుంది.

"మీకు అభ్యంతరం లేకపోతే మీతో కలిసి వాక్ చేయొచ్చా?" మర్యాదపూర్వకంగా అడిగాడు.

"తప్పకుండా, నాకూ ఏమీ తోచకే ఇలా వచ్చాను, రండి ఈ లోపల గార్డెన్ బాగుంటుంది. లోపల కూడా తిరగొచ్చు" అంటూ అటుగా దారితీసింది మిత్ర.

"ఎలావుంది ఇక్కడి జీవితం" ఉపోధ్ఘాతంగా అడిగింది. అతనింకా మాటల పొదుపరేనని మునుపే గమనించింది.

"బాగుంది, క్రొత్త పరిచయాలు. ప్రభావాలు." అన్నాడు.

"ఊ నచ్చిందన్నమాట. చెప్పండి ఏదైనా ఒక ఆ క్రొత్త విషయం." సంభాషణ పొడిగిస్తూ అడిగింది.

"సరే, ఇదిగో నా జాగింగ్, గారీ నుండి అలవాటైంది. తను మరథాన్ రన్నర్. విషయం తెలిసే కొద్దీ అదీ తను అంత శ్రద్దగా ప్రాక్టీస్ చేస్తూ మంచి సమాచారం ఇచ్చాక నాకూ ఆసక్తి పెరిగింది. తన ద్వారాగా ఒక పేస్ టీమ్ తో కలిసి సాధన చేస్తున్నాను." అన్నాడు.

తర్వాత ఓ పది నిమిషాలు పేస్ టీమ్, మారథాన్ కి వయసుకి సంబంధించిన అంశాలు, శారీరక ఇబ్బందులు, సిద్దపడటం వంటి విషయాల మీద సాగింది.

"కాసేపిక్కడ కూర్చుందామా" అని అడిగింది.

కాస్త ఎత్తుపల్లాలుగా వున్న ఆ తోట వాళ్ళు నిలబడిన దగ్గర నుండి కొంచం దిగువకి మారుతుంది. మళ్ళి కాస్త వెనగ్గా కొండ మాదిరిగా కనపడుతుంది. సూర్యాస్తమయం కానుంది. కనకాంబరం వన్నెలో ఆ బింబం కాంతులీనుతూవుంది.

"మీరిక్కడికి తరుచుగా వస్తుంటారా?" అని అడిగాడు. ఇద్దరూ అక్కడే ఓ చెట్టు క్రిందగా వేసిన బెంచ్ మీద కూర్చున్నారు. మిత్రకి ఎడం ప్రక్కగా అతను.

పెద్ద కుచ్చు తోకని తమాషాగా కదుపుతూ పైకి, క్రిందకి పరుగులు పెడుతున్న ఉడుతని తదేకంగా చూస్తున్న మిత్ర "అవునండి ఇక్కడకి వస్తే తాత గారి మామిడి తోటలో వున్న ఫీలింగ్. ఆ తోపుల్లో తిరుగాడినట్లే వుంటుందిక్కడాను." అంది మిత్ర.

మిత్రని ఒకసారి పరీక్షగా చూసాడు. చిన్న చిన్న పూలున్న లాంగ్ స్కర్ట్, పసుపు రంగు స్లీవ్ లెస్ టాప్, ఆ సాయం సంధ్య వెలుగుకి కాస్త లేత గులాబీ ఛాయ కలిసినట్లుండే ఆమె మోము మరింతగా వెలుగుతుంది. అప్పటికప్పుడు ఆ రూపు చిత్రించాలన్న అనుభూతి. హృదయం లో మాత్రం చిత్రించుకుపోయింది. ఆ కూర్చోవటమ్లో కూడా ఏదో హుందా, హొయలు. లేదా తనలోని భావనా అది? చిన్నగా నవ్వు పాకివచ్చింది అతని మొహమ్మీదకి.

అప్పుడే తల తిప్పి చూసిన మిత్ర సన్నగా అతని కుడి బుగ్గ మీద పడ్డ చొట్టని అప్పుడే గమనించింది. మరో పది సెకన్లలో ఆమెలో ఉద్వేగం. ఆ కల తనకింకా గురుతే. చివ్వున ఏదో బిడియపు పొర.

'ఎంకీ నే చూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపోతుంటేనూ' విశ్వ మనసులో కదలాడుతున్న భావన.

ఇద్దరూ ఎవరి అనుభూతిలో వారున్నట్లుగా మరో ఐదు నిమిషాలలా గడిపేసారు.

ఇంతలో ఆ ప్రక్కగా వున్న ఓ పదడుగుల స్తంభం మీదకి నెమ్మదిగా ఎగురుతూ వచ్చి వాలింది ఓ గ్రద్ద.

"ఇంత దగ్గరగా ఈ పక్షిని చూడటం నాకు ఈ వూర్లోనే జరిగింది" అన్నదామె.

"అవును మేము చిన్నప్పుడు గ్రద్ద నీడ మీద పడటం కోసం పైన ఎగిరే పక్షి నే చూస్తూ క్రింద పరుగులు తీసేవారం" అతనూ చిన్ననాటి జ్ఞాపకాన్నిగుర్తు చేసుకున్నాడు.

సన్నగా గాలి వీచి చెట్టు పూలు ఒకటీ రెండూ రాలి ఇద్దరి మధ్యగా పడ్డాయి.

అప్రయత్నంగా చేతులు అటుగా కదిపిన ఇద్దరికీ ఒకరి చెయ్యి ఒకరికి తాకింది. తొలి స్పర్శ. చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది మిత్ర.

"సారీ, చూసుకోలేదు" అన్నాడు విశ్వ.

మరింత ముడుచుకుపోయింది, 'అంటే అతనూ గమనించాడు..' మొహమాటంగా వుంది.

"ఇక వెళ్దామా?" లేస్తూ అడిగింది.

"ఊ, పదండి, చూస్తూ చూస్తూ గంట గడిచిపోయింది. కంపనీ ఇచ్చినందుకు థాంక్స్" అన్నాడు విశ్వ.

"అయ్యో అలా ఏమీ కాదు, ఆమాట కొస్తే నాకూ సమయం తెలియకుండా గడిచిపోయింది. మనం మొదటిసారి వర్క్ విషయాలు కాకుండా వేరే విషయాలు మాట్లాడాం. గమనించారా?" లోలోపలి తడబాటు కప్పిపుచ్చుకోవటానికి తనీ మాట అంటుందా?

సన్నగా నవ్వి "నిజమండి, నాకు ఈ గార్డెన్ నచ్చింది, మళ్ళీ రావాలి." అన్నాడు.

ఈ సారి వెనక్కి మళ్ళకుండా ముందుకే వెళ్ళి కాస్త చుట్టూ తిరిగి పార్కింగ్ దగ్గరకి వచ్చారు.

"ఆలస్యం అయింది కదా. డ్రాప్ చేసి వెళ్ళనా?" కార్ డోర్ తీస్తూ అడిగింది మిత్ర.

"వద్దండి, ఎంత పది నిమిషాల్లో వెళ్ళిపోతాను. మరిక సెలవా, రేపు కలుద్దాం." అంటూ ఆగాడతను.

మరొక పది నిమిషాలకి ఇల్లు చేరిన మిత్ర స్నానం చేయటానికి వెళ్తూ, లాండ్ లైన్ మీద ఆన్సరర్ చెక్ చేసుకుంది. నవీ మెసేజ్, "పైవారం ఇండియాకి వెళ్తున్నాను. తాతగారికి ఏమైనా కొని తీసుకువెళ్ళనా? " అది క్లుప్తంగా సమాచారం.

రాత్రికి కాల్ రిటర్న్ చేయాలి అనుకుంది. విశ్వ గురించి చెప్పనా మాననా అని తర్జన భర్జన పడి అప్పుడే కాదు, అనుకుంది. కానీ ఏదో తెలియని భావన. అతని పట్ల ఆత్మీయత వంటిది కలుగుతుంది. ఒంటరితనం వలన పూర్వ పరిచయస్తుడు కనుక ఆ దగ్గరతనం ఫీలవుతుందా? కాదు, అతనిలో తనకు తెలియని పార్శ్వం తెలుస్తుంటే ఆ వైపు గా తన మనసు వెళ్తుంది. ఇది నిజం.....

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

రాత్రి డిన్నర్ పూర్తి చేసి, మర్నాటి ప్రాజెక్ట్ ప్రపోజల్ మీదా, ప్రజంటేషన్ మీద కాసేపు గడిపి, మిత్రని గురింఛి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విశ్వ.

నిద్ర దూరమై, అటూ ఇటూ దొర్లి, విసుగ్గా లేచి యండమూరి నవల చదువుతూ కాసేపు, నవీ తో మాట్లాడుతూ కాసేపు గడిపి, అస్పష్టం గా వున్న భావాల్ని అలా కాగితం మీదకి వంపింది.

ఇరు మేఘాల చిరుసందడిలో చినుకుల జడి,
మేరు గర్జనల అలజడిలో మెరుపుల వరవడి,
సరి సరి రాగాల నెత్తావి గుస గుసల గుంభన సడి,
విరి తరుల వయ్యారి వూపుల పొంగారు పుప్పొడి,
గోధూళి వేళ, పున్నమి రాత్రుల జాలువారు,
తెమ్మెరలు, వెన్నెల వెలుగులు వెరసి వెల్లువైన పుత్తడి జాడలు,
కావా నీకు నా రాయబారం, మోసితెస్తూ నా ప్రేమ సంబారం.

[సశేషం]

సాహితీప్రియులకు దీపావళి పసందైన విందు!!!!!

ముందుగా పేర్కున్నట్లే దీపావళి శుభాకాంక్షలతో, మీ ముందుకు వచ్చిందీ సంకలనం. ఇక నాతో పాటే మీరూ విహారాలు, విలాసాలు, విలాపాలు గరపండిక...

*** *** *** *** *** ***
రండి రండి రారండి
గెలుపు జెండా ఎగరేయండి
ఏకీభవ సంబరాల
దివిటీ వెలుగులు కనరండీ ॥రం॥

మనం మనం మనమందరం
మనమే నవసాహితీ మార్గదర్శకులం
జలం జలం కడలిజలం
జలమే మనకలాలకి కథనరంగం ॥రం॥

పదం భావం పదబంధకవనం
రాదా ఎగిసిఎగిసి సాగరకెరటమై
ముదం మోహనం "మత్స్యరూపం"
అవదా మనరచనా కీర్తికిరీటంరం
-మరువం ఉష
*** *** *** *** *** ***

"జలపుష్పాభిషేకం" కొరకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. శ్రీకారం చుట్టగానే మొదటి రచనలు అందించిన ప్రదీప్, భా.రా.రె, బాబా గార్లకి వందనాలు. సంకలనం పి.డీ.యెఫ్. గా మలచటం లో పూర్తి బాధ్యత స్వీకరించి తోడ్పాటు అందించిన గీతాచార్య, సృజన, ధన లకు ధన్యవాదాలు. చిత్రసేకరణ నా వంతు. ఇక చివరిగా నేను
వ్రాసిన పాటకి రాగం కట్టి పాడతానని, అక్కడక్కడా పదాలు మార్చిన భా.రా.రె.కి అభివందనాలు. ;)

పైన లింక్ చూడని వారికి ఇదిగో మరోసారి... సంకలనం పదం పై నొక్కండి...

నీకూ నాకూ తెలియనిదా ఇది?

ఇన్స్పిరేషన్:

All, everything that I understand, I understand only because I love. – Leo Tolstoy

If you want a relationship to get deeper and deeper with the passage of time, you will go on strengthening it all your life ...


*** *** *** *** *** ***

నీ మౌనం నను బాధించిన ప్రతి క్షణం

నా భాషలో భాష్యం వెదికానిన్నాళ్ళు.
నీదీ ఓ భాషేనని అదొక్కటే నీకు తెలుసనని,
నాకు తెలిసినదేదో కలవరపరిస్తే,
తెలిసీ తెలియని భావాలతో

నేనూ నీవలె సంభాషిస్తున్నానిపుడు, చూడు మరి!!!


నా భావం నీకెరుక పరుచను
ఈ రెప్పచాటు నీరు చాలదా?
నీ ఒదార్పు నాకందించను
ఓ రెప్పపాటు చూపు చాలదా?
మన బంధం బలీయమవను
నీది నాదీ ఒకటే లయ కావద్దా, చెప్పు మరి!!!

యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ

జలపుష్పాభిషేకం ఉపసంహారం: ఎవని వర్ణించుటలో వాక్కు విఫలమై వెనుకకు మరలునో, ఎవడు మనసుకు అందడో - తనే దైవమైతే ఆ దైవాన్నినేను కాంచాను. సమస్త జీవరాశి కలిసి మెలిసి సాగించు సజీవచిత్రం గా వర్ణించాను, నా మానసాన ఆ సుఖశాంతుల కల్మష రహిత ప్రకృతినే దైవంగా నిర్వచించుకున్నాను.

*************************************************

స్వాప్నిక జగత్తు కాదది,
గడచిన ఘనచరిత్ర కానే కాదు.
సంపూర్తి కానున్న చిత్రమది.
సృష్ట్యాది నుండి సాగిన గానమది.
రానున్న మహత్తర భావి అది,
మానవీయ మధుర కావ్యమది.


తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ
నలుదిక్కుల నడుమ పృధ్వి ఒక్కటే.
వేలు, వేవేలు, లెక్కలేనన్ని, పాలపుంతల
పలుచుక్కల నడుమ ఆకాశం ఒక్కటే.
భాష, వేషం, రంగు, రూపు
భిన్నస్వరాల ఏకీభావం ఒక్కటే.


యుద్దభీతి, కీర్తికాంక్ష, స్వార్థభక్తి, కుటిలనీతి
పునాదులు పెకలించిన జాతి అది.
శాంతి, సమత, మమత, ఆత్మీయత
నాలుగు వేదాలుగా విలసిల్లిన రీతి అది.
తరులు, గిరులు, వనాలు, మైదానాలు
సాంత్వన చెందిన ప్రకృతి అది.


సాగరాలు నవ్వాయి అలలు అలలుగా,
జలపుష్పాలు ఎగిసిపడగా.
నదీనదాలు సాగాయి మెల్ల మెల్లగా,
పైరు పచ్చ చిన్నెలు మిడిసిపడగా.
గాలులు వీచాయి చల్ల చల్లగా,
నీలి మబ్బు వన్నెలు మెరిసిపోవగా.

"యతో వాచో
నివర్తంతే అప్రాప్య మనసా సహ"
వేదం వచించినా, దైవం నా వాక్కున కందిన తరుణమది.
నా మనసుకు అందిన దైవత్వమది.
మానవత్వమే సాధనగా నీవు నేను గరపు యాగమిది.
వసుధైక కుటుంబం మనదని చాటనున్నది భావి తరం.
"లోకాస్సమస్తా స్సుఖినో భవంతు" సాకారం కానున్న రేపు అది.

*************************************************

సంకలన ప్రయత్నం లో కాంచిన విలాపాల పిదప రానున్న యుగం విధంగా వుండాలని నా ఆకాంక్ష కవిత. మనిషి తలిస్తే అన్నీ సాధ్యమేను, తన మానసమే దైవ నిలయం. తన సాధన వలన సమస్త జీవకోటి సామరస్యంగా గడుపు జీవనం సుసాధ్యం.

విశ్వామిత్ర - 6

కాలానికి వేగం పెరిగిందేమో, లేక రోజులు ఎండుటాకులుగా రాలిపోయాయో!!!!! రెండేళ్ళు గడిచిపోయాయి. విస్సూని కాదన్నాక మిత్ర తనంత తనుగా సిద్దపడి పెళ్ళి ప్రస్తావన తెచ్చేవరకు ఇంకే సంబంధాలు తన దగ్గర ప్రస్తావించవద్దన్న మాధవయ్య గారి ఆజ్ఞ మేరకిక ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది.

హైదరాబాదు నుండి మిత్ర బెంగుళూరికి మారటం, ఒక సంవత్సర కాలం క్రాష్ కోర్సులు చేసి, అమెరికాకి రావటం, ఒక సంవత్సరకాలం జరిగిపోవటం అయింది. వేష, బాషల్లో కొద్ది మార్పు తప్పించి పెద్దగా మార్పు లేదు. ఆహార విషయంలో శాఖాహారి అయిన తనకి కొద్దిపాటి ఇబ్బందులున్నా జరిగిపోతుంది.

***********************************************

శనాదివారాల్లో తప్పనిసరి ప్రయాణం, ప్రక్క స్టేట్ లో వున్న కజిన్ మృదుల కూతురి మొదటి పుట్టిన రోజు వేడుక. ఆరు గంటల డ్రైవ్, వెళ్ళిరావటం అయింది.

తను పనిచేసే చోట ఇంటినుండి పనిచేసే సౌలభ్యం వుంది. అన్న సమయానికి పని పూర్తి చేస్తే చాలు. మీటింగ్స్ వున్నప్పుడు, టీం అంతా కలిసి డిస్కస్ చేయాల్సిన అవసరం వున్నప్పుడు మాత్రం వెళ్ళితీరాలి. పని వత్తిడి తప్పదు. కానీ గుర్తింపూ అంతే సమంగా వుంటుంది.

మానేజర్ గుల్డెన్ టర్కీ నుండి వచ్చింది. ఎప్పుడూ చిర్నవ్వుతో హుషారిస్తూ వుంటుంది. తను కాక టీం లో మరో నలుగురు పనిచేస్తున్నారు. నాలుగైదు టీములకి కలిపి జర్మన్ దేశస్తుడైన హెల్ముట్ తీల్బర్ ఆర్కిటెక్ట్. తనతో ఎక్కువగా కలిసి పని చేసేది ఐవన్. బల్గేరియా దేశస్తుడు. భాష సమస్య కొంతవున్నా పనిలో మంచి ప్రావీణ్యం వుంది. తిరు శ్రీలంక తమిళుడు. ముభావి. జాన్ అమెరికన్. చురుగ్గా పనిచేయటంలో దిట్ట. శుక్రవారం మాత్రం నాలుగింటికి వెళ్ళిపోయి సోమవారం వరకు ఎక్కడున్నదీ తెలియనీయడు. "చార్జింగ్ మై సిస్టం" అని జోక్ చేస్తాడు.

సోమవారం ఉదయం బద్దకంగా వుండి మరో గంట పక్కమీదే గడిపి, నిదానంగా లేచి, స్నానం, ధ్యానం పూర్తి చేసుకునే సరికి ఎనిమిదయింది. బౌల్లో మొలకెత్తిన పెసలు, మెంతులు వేసుకుని సిస్టం ఆన్ చేసి, "వర్క్ ఫ్రమ్ హోమ్" ఈ-మెయిల్ పంపుదామనుకుంటూ ఫోల్డర్ ఓపెన్ చేసింది.

తొమ్మిదింటికి గుల్డెన్ స్కెడ్యూల్ చేసిన మీటింగ్ ఇన్వైట్ ఎదురు చూస్తూవుంది. షార్ట్ నోటీస్ ఇస్తున్నందుకు ఏమీ అనుకోవద్దని, ప్రాజెక్ట్ లో కొంత ఒక కన్సల్టెన్సీ కంపెనీకీ ఇవ్వాలన్న అప్పర్ మానేజ్మెంట్ నిర్ణయం కారణంగా, వస్తున్న ఇంజనీర్ని కలవటానికి, పనిని విభజింజచటానికి మీటింగ్ అజెండా పంపింది.

గబగబా తినటం పూర్తి చేసి, ఫార్మల్ వేర్ గురించి ఒక నిమిషం యోచించి, ఆ ఆలోచన విరమించుకుని, పెద్దగా ఆలోచించకుండా చేతికందిన జీన్స్, టీ-షర్ట్ వేసుకుని క్లుప్తంగా మిగిలిన అలంకరణ పూర్తిచేసి, బయట పడింది. అప్పటికి ఎనిమిదిన్నర అయిపోయింది. దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది.

దార్లో అంతరాయం. కొంచం ముందు ఏదో యాక్సిడెంట్ అయిందో, కార్ బ్రేక్ డౌన్ కావచ్చు. అనుకోని ఆలస్యం. ఐవన్ కి కాల్ చేసి పది నిముషాలు ఆలస్యమౌతానని చెప్పింది. అఫీస్ కి చేరగానే చేతిలో బ్యాగ్ విసిరినట్లే పడేసి, కాన్ఫరెన్స్ గదిలోకి పరిగెట్టినట్లే నడిచి వెళ్ళింది. టీం అంతా వున్నారు. పరిచయాలు అవుతున్నాయి.

"ఓ కమ్ కమ్ మీట్రా" గుల్డెన్ నవ్వుతూ పిలిచింది. ఆమెకి అభిముఖంగా గుమ్మానికి వీపుపెట్టి కూర్చున్న వ్యక్తి కావచ్చు ఆ బయట కన్సల్టెన్సీ నుండి వచ్చింది అనుకుంటుండగా "దిస్ ఇజ్ మీట్రా" అంటూ "మీట్రా, హి ఈజ్ .." అంటుండగానే అతను లేవటం "హాయ్ ఐయామ్ విశ్వ" అంటూ నవ్వుతూ కరచాలనం కొరకు చెయ్యి చాపటం జరిగిపోయాయి.

ఆ చేతిలో మృదువుగా చేయ్యి కలుపుతూ కళ్ళెత్తి చూసింది. పరిచయమైన ముఖం, ఆ నవ్వు మాత్రం తెలియలేదు అనుకున్నంతలోనే స్ఫురించింది. అవును విస్సు కదూ. తల తిప్పి చూసింది. హెల్ముట్ తో మాట్లాడటానికి ప్రక్కకి తిరిగిన అతని కుడి బుగ్గ మీద చిరు దరహాసానికి పడ్డ చొట్ట.

ఆలీవ్ రంగు సూట్, టై తో నీట్ గా ఇన్షర్ట్ చేసిన హాఫ్ వైట్ చొక్కా, నొక్కి దువ్విన జుట్టు. విస్సూనే. సందేహం లేదు. ఎంత మార్పు అతనిలో. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. రెండేళ్ల క్రితం అతన్ని వద్దన్నాక మళ్ళీ ఇదే చూడటం. అన్యమనస్కంగా కూర్చుంది. లంచ్ వరకు సాగిన ఆ టెక్నికల్ మీటింగ్ లో కాంట్రాక్ట్ కి సంబంధించిన విషయాలు అన్నీ చర్చించారు. మరొక వారానికి వస్తానని అతను సెలవుతీసుకున్నాడు.

***********************************************

హెల్ముట్ అధ్వైర్యంలో మిత్ర సాఫ్ట్వేర్ స్టబ్స్ డిజైన్ చేయటం. విశ్వ కంపెనీ కోడింగ్ చేసివ్వటం. ఐవన్, మిత్ర ఇంటిగ్రేట్ చేయటం ఇలా టాస్క్ లన్నీ విడతీసారు. మరో వారానికి విశ్వ రావటం జరిగింది. ఈసారి సోమ వారం నుండి ఐదు రోజులు వుండేట్లుగా వచ్చాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు లంచ్ కి కంపెనీ ఇస్తున్నారు.

మూడోరోజు మిత్ర, విశ్వ వెళ్ళారు. ముందుగా అతనే అడిగాడు, "మిత్ర! మీకు నేను గుర్తు వున్నానా?" అని.

మొహమాటంగా వుంది. "ఎలా వున్నారు, విస్సూ, ... విశ్వ?" అని అడిగింది.

మరొక అరగంటకి నెమ్మదిగా విషయాలు ఒకటొకటీ మాట్లాడుకున్నారు. నిజానికి విశ్వ ఉద్యోగం వివరాలేమీ తెలియదు. అతను హైదరాబాదులోనే సాఫ్ట్వేర్ రంగంలో వున్నాడని ఇప్పుడు చెప్పాడు. అతను వచ్చి సంవత్సరమున్నర అయిందట. అతని మిత్రుడు హర్ష ద్వారాగా వచ్చాడట.

అతని స్టార్ట్ అప్ కంపెనీకి సీనియర్ టెక్ లీడ్ గా విశ్వ రావటం జరిగిందట. మునుపు మీద చాలా మాటకారి అయ్యాడు. "మీరు చాలా మారారు." ఆ మాట అనకుండా వుండలేకపోయింది. తెలియని సంబరం, ఈ సంవత్సరకాలం లో పూర్వ పరిచితులని చూడటం ఇదే.

చిన్నగా నవ్వేసాడు. "మార్పు అవసరాన్ని బట్టి కలుగుతుందేమో." అన్నాడు. ఆ తర్వాత పెద్దగా మాటలు ఇద్దరూ పొడిగించలేదు వ్యక్తిగత విషయాలలోకి.

శుక్రవారం అతను వెళ్ళేముందు మరో సారి కాఫీకి కలిసి వెళ్ళారు. ఈ ఐదు రోజుల్లో మరికొంత చనువు పెరిగంది.

***********************************************

తర్వాత గడిచిన మూడు నెలలు ప్రాజెక్ట్ వర్క్ లో చాలా వరకు టెక్నికల్ ప్రాబ్లెంస్, డిబగ్గింగ్, అప్పుడప్పుడు హెల్ముట్ చపలచిత్త బుద్ది మూలాన చీకాకులు, ఐవన్ తో చక్కని టీమ్ వర్కింగ్. విశ్వతో భేటీలు చిటికెలో జరిగిపోయాయి. విశ్వ కంపెనీ ఆహ్వానం మీద మిత్ర ఈసారి అతని వూరికి వెళ్ళింది. తర్వాత ప్రాజెక్ట్ ప్రపోజల్స్ గురించి ఈసారి అలా ఏర్పాట్లు జరిగాయి.

అతని టీం మొత్తం నలుగురు. తను డెలప్మెంట్ మానేజర్. శివ, మైకల్, కెండల్ టీం మెంబర్స్. అంతా పాతిక నుండి ముప్పై లోపు వయసు వారే. ఆఫీస్ అసిస్టంట్ యాస్మిన్. ఆస్ట్రేలియన్.

టూరిస్ట్ గా వెళ్ళిన కెండల్ తో పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రణయంకి దారి తీయటం, అతని కొరకు తను ఇక్కడికి రావటం జరిగిందని మిత్ర తో విశ్వ చెప్పినప్పుడు కొంచం ఆశ్చర్యం ప్రేమలో ఇంత మహిమ వుందా.

తన స్వదేశాన్ని, తన వారినందరినీ వదిలి వచ్చేసిందా? దాదాపు రెండేళ్ళుగా నిద్రాణంగా వున్న ఆలోచన మళ్ళీ తిరిగి మొదలైంది.


అసలు చదువు, ట్రైనింగ్, ఇక్కడికి రావటం, ఇక్కడి వాతావరణం, ఉరుకుల పరుగుల జీవితం వీటిల్లో పడి పెళ్ళి ధ్యాసే రాలేదు. విశ్వ మూలాన అప్పటి ఆలోచనలు తిరిగి చోటుచేసుకుంటున్నాయి.

తిరిగి వచ్చినా తనలో తెలియని మార్పు. ఒంటరితనం కొట్టొచ్చినట్లుగా తెలుస్తుంది. అప్పుడప్పుడు మాట్లాడొచ్చా అని అడిగి నంబరు తీసుకున్నా ఇంతవరకు అతన్నుండి ఎప్పుడూ కాల్ రాలేదు.

***********************************************

విశ్వ డైరీలో అప్పటి రోజుల్లో ఒక పుట.

"మిత్ర. అదే రూపు. చూడగానే నా గుండె చప్పుడు గొంతులోకి తెలిసినట్లు, మనసు అదుపు తప్పినట్లు అదే అపురూపమైన భావన. మునుపు మిత్ర తిరస్కారంతో నాలో బాధ కలుగలేదు. ఆమె నిర్ణయం సహజంగా అనిపించింది. ఒక్కరాత్రిలో మార్పు రాదు. కానీ తనకోసమే నా పట్టుదల పెరిగింది.

మిత్రకి తెలియని నిజం ఆమెని గెలవటానికే నేనింత కష్టపడ్డాను. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ప్రయత్నపూర్వకంగా ఆమె జీవితంలో మళ్ళీ తారసపడటానికే, తనని నా స్వంతం చేసుకోవటానికే. కానీ అది ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా కాదు, ఆమె నా గురించి తెలుసుకోవాలి. నన్ను కోరుకోవాలి. తను నా గమ్యం. ఆమెని చేరేవరకు నా గమనం. ఆమె నా ప్రేమకి చివరి మజిలీ. అంతదాకా ఎంతకాలమైనా వేచివుంటాను."


సన్నగా అతను హమ్ చేస్తున్న పాట "ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా ... "

***********************************************

మిత్ర మనసులో మళ్ళీ తొలకరి జల్లు వంటి మధురోహలు. ఉద్వేగం. ఏవేవో మధురోహలు. ఇంకా చిరునామా తెలియని తన తోడు కోసం అభిసారిక గా తను వ్రాసుకున్న ఓ లేఖ... ఆమె కవితల పుస్తకాన్ని అలంకరించింది.

ఎంత మౌనమీ ఉదయం!
గలగలల కొబ్బరాకుకే కదలిక రాని మౌనం,
విడివడని మొగ్గల్లో విడదీయలేని మౌనం,
అంతటా స్తంభించిన గాలిలో మౌనం,
తెల్లగా విస్తరించిన మబ్బులో మౌనం,
ఇవే నీకు నా రాయబారం!

ఇన్నిటా మరింత మౌనంగా చలించే నా హృదయం,
మెల్లగా సాగుతున్న నా నిరీక్షణం,
చల్లగా వస్తున్న మన సంగమతరుణం,
నీకై నాకై నేల్కాంత వేసిన పూపొదరిళ్ళు,
తరువులు పరిచిన చివురు పరుపులు,
నీ ఒడిలో నిదురించే నా కళ్ళు,
అవిగో అక్కడే నా వూహల వేణువులు,
నాలోని మౌనం తటాలున పరుగిడే నీ దర్శనం!

సెలవిక ప్రియా! అపూర్వమీ ప్రేమ జీవనం,
అంతులేనిదీ మధుర కవనం.
[సశేషం]

గమనిక: ఇది ప్రేమకథ. విశ్వ మిత్రల ప్రేమ అన్వేషణల చివరి మజిలీ. ఇందులో లాజిక్స్ వెదికి ఈకలు పీకుతానంటే అలాగే, అవన్నీ ఓ టోపీగా తయారు చేసి మీకే వేస్తాను. చక్కని ప్రేమ సాగరంలో ఈదులాడి వెళ్ళండి. ప్రేమైక జీవన మధురిమ ఆస్వాదించి వెళ్ళండి.

మారథాన్ - మళ్ళీ మొలకేయవే మరువమా!!!!!

హల్లో మిత్రులు, ఈ యేడు మారథాన్ పరిగెట్టాను. ఆ మూడున్నర గంటల పరుగులోని అనుభూతిని, కన్నుగీటిన కుర్రాడి వైనంతో సహా సంబరంగా మీకు పంచేసాను కదా! ;)

మర్చిపోయానంటారా, వూరుకుంటానేమిటీ ...

నా మారథాన్ - విశ్వమానవ ఆయురారోగ్యాలకి అంకితమిస్తు, నేగరిపిన యాగం!

ప్రక్కన కూర్చుని చెవిలో జోరీగలా మరీ హోరెత్తిస్తాను. అప్పుడు అంతా ఆహా ఓహో అన్నారుగా, వ్యాఖ్యల్లో అభినందనలు కురిపించేసారుగా :) అందుకే మళ్ళీ వచ్చే యేడు మారథాన్ కి సాధన పరుగులు మొదలు పెడుతున్నాను.

"సాధన ఎందుకు అంటారా"? మిమ్మల్ని క్షమించి వదిలేస్తా. మరి "సాధన చేతనే కదా సమకూరు పనులు ధరలోన?" ఇప్పటికి ఏడు మైళ్ళు ఆగకుండా పరిగేట్టేస్తా, ఇక దాన్ని పదమూడుకి పెంచి, మునుము కన్నా ముందుగా పూర్తీ చేసే ఆలోచనలోవున్నాను. అదీ సంగతి.

కాస్త దండోరా వేద్దామని ఈ టపా! ఈ ప్రయత్నాల్లో వున్న మిత్రులు మీ మీ సలహాలు, సమాచారాలు నాతో పంచుకోండేం. అలాగే ఏమైనా కావలిస్తే నాతోనూ సంప్రదించండి.


ఆగండాగండి మరి నాట్యం అంటారా, అదీను, దివ్యంగా రోజుకి గంట నా కాళ్ళకి ఓపిక వుంటే రెండు గంటలు లాగిస్తున్నాను.

మన బ్లాగుల్లో ఓ బాటసారి గారు మారథాన్ గురించి కాసిని అనుభవాలు పంచారు. నాకు తెలిసి కొంత ఉపయోగపడే సమాచారం ఇది.

wrote by some body who is preparing for మారథాన్

http://well.blogs.nytimes.com/2009/06/01/why-walk-breaks-help-you-run/


http://well.blogs.nytimes.com/tag/marathon/

మహాభారతం - మరో దృక్కోణం !!!

గమనిక: జలపుష్పాభిషేకం కొరకు నా మరొక రచన. ఈ కవితకి ఆధారం పలు మహాభారత గాథలు. కొంత నా వూహ జోడించినా మూల కథల్లో మార్పు చేయలేదు

మొదటి తరం:

అతిలోక సౌందర్యవతిని
అపరిమిత జ్ఞానసంపన్నురాలను
గంధర్వకాంతను
గుణగణాల అధికురాలను "అద్రిక"ను
సృష్టికర్తకు నను మించిన సృజన ఇక మిగలలేదా?


ఆతని మానసాన మరొక యోచనకు సృష్టి
లోకరీతిని మార్చు వినూత్న ప్రయోగారంభం
సమస్త ప్రాణి జన్యు వ్యవస్థకి సవాలేమో?


తొలిజీవ పరిణామమగు "మత్స్య" రూపిణినై
సప్తసముద్ర వాసినయ్యాను
మానవోత్తమ శౌర్యపరాక్రమ వసురాజ పరోక్షాన
పురుష రేతస్సు సంగ్రహించాను
జలచర గర్భాన మానవ కవలల నవ్య సృష్టి చేసాను


రెండో తరం:

దాశరాజ పుత్రికనై కాళి నామమున ఎదిగాను
జన్మ కారణాన "మత్స్యగంధి"గా మరులు గొలిపాను
యోగి నందు కాంక్ష రగిలించి యోజనగంధినయ్యాను
దైవమానవ సంగమ నూతన వంశవృద్దికి అంకురమయ్యాను


మూడో తరం:

కానీనుడను కృష్ణద్వైపాయనునిగా ఉద్భవించాను
వేదాలను, పురాణాలను విభజించి
"వేదవ్యాసుడ"నయ్యాను
భారతాన లేనిది జగతి నందులేదన్న నానుడిగా రచనచేసాను
ప్రతి పాత్రయందు తరతరాలు చెప్పుకొను కథ మలిచాను

మూడు తరాల చరితనందు ఎన్ని సాంఘిక న్యాయాలు?
ముందు తరాలు అందుకోను మరిన్ని శాస్త్రీయ సూచనలు
మహాభారతాన తరగని నిధులు విలువైన నిక్షిప్త గాథలు!

*******************************************
జీవ పరిణామం : human evolution
జన్యు : genes
రేతస్సు : sperm
కానీనుడు : పెండ్లికి ముందు కన్యకు పుట్టిన వాడు