నీ లెక్కలతో మన లెక్కలు!!!!!

ఇప్పుడు చెప్పుకుందామా
పాఠాలు ఎవరికెన్ని వచ్చాయో?
ఎప్పుడూ నీదేగా పైచెయ్యి
ఒక్కసారికీ నన్ను గెలవనీ!

నీకసలు రేఖాగణితం రాదు
నీవు గీసిన నుదుటి రాతలు
నాకు చూపవందుకనే
పిచ్చి గీతలని కొట్టివేస్తానని కదు?

నున్నని నా అరచేతి నిండా
అడ్డదిడ్డంగా ఏవో గీసిపారేసావు
వున్నవీ లేనివీ కల్పించి చెప్పను
శాస్త్రమొకటి కనిపెట్టమన్నావు, కాదా?

అరిగేలా తిరిగే పాదాల్లో
అక్కడక్కడా వేలి కొసల్లో
శంఖు చక్రాలు లిఖించావు
ఎక్కడాలేని అర్థాలు వెదకమన్నావు, అవునా?

నీవు కేంద్రబిందువునన్నావు
నీ చుట్టూ అనంతవృత్తం
నను గీసుకు రమ్మన్నావు
ఇక్కడే నేను కొత్త పాఠం నీకు చెప్తున్నాను, వింటావా?

అమూర్త భావనవి, బిందువువీ నీవు
నిన్నూ నన్నూ కలిపే రేఖ సరళసమీకరణం,
నువు కేంద్రంగా గీసే వృత్తం అదొక వర్గసమీకరణం
నా మనసే సంకేతంగా ఇది నా బీజగణితం, తెలిసిందా?

నాలోని నిన్ను వెలికి తెచ్చి
వైశ్లేషిక రేఖాగణితం వెచ్చించి
అవురా నా సృష్టి ఇంత చిత్రమాని
నిను నివ్వెర పరిచానా కన్నయ్యా?

**********************
కాస్త పూర్వాపరాలు : వేలినెప్పితో కాస్త చేతికి పని తగ్గి, బుర్రకి పదును పెడదామని అలా అలా చదువుతూ లెక్కలకీ నాకు పరమాత్మునికి కలిపి ఇలా లెక్కకట్టాను. :)

గణితంలో రెండు వేర్వేరు పాయలయిన రేఖాగణితాన్నీ (geometry) బీజగణితాన్నీ (algebra) కలిపి సాధింఛిన దానిని వైశ్లేషిక రేఖాగణితం అంటారు. (దీనికే కో - ఆర్డినేట్ జామెట్రీ అని కూడా పేరు.) రేఖాగణితానికి గ్రీకులూ, బీజగణితానికి మన దేశస్థులూ ఆద్యులు. [రిఫరెన్స్: http://www.eemaata.com/em/issues/200803/1217.html/3/]

48 comments:

  1. లెక్కలు-కవిత్వం-జీవితం-ఆధ్యాత్మికం-తన్మయత్వం
    ఇన్ని భావాలు ఒకేసారి ఒకే కవితలో ఒకే సమయంలో (చదువుతున్న సమయం అని) వెలికి తీయించారు. చాలా బాగుంది.

    ReplyDelete
  2. బాగుందండీ ....కుశాలమా ?.....ఇంకొన్నాళ్ళు విశ్రాంతి కావాలేమో అని తోస్తుంది .

    ReplyDelete
  3. "కో - ఆర్డినేట్ జామెట్రీ" ఆహా ఈ పదం విని ఎన్ని నాళ్ళైందో. వైశ్లేషికరేఖాగణితం చూసి కాస్త ఖంగారు పడినా విశ్లేషణ చదివాక కుదుటపడ్డాను. మొత్తానికి కన్నయ్యక్కూడా లెక్కలు రావని తేల్చేశారనమాట :-)

    కన్నయ్య సంగతేమో కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా నివ్వెర పరిచారు :-) విశ్రాంతి అవసరమని చెప్పి రెండు రోజులు అవ్వలేదు ఇంతలోనే... పైగా నన్ను ఆపలేని అమ్మా నాన్నలు అంటూ ముందు టపాలో వ్యాఖ్య:-) ఇక లాభం లేదండీ నేను మీ మాష్టారి అవతారం ఎత్తాల్సిందే..

    కన్నయ్య మేని ఛాయతో ఆరడుగుల భారీ విగ్రహం, మెలితిరిగిన మీసకట్టు, తీరైన పంచెకట్టు అంచును అలవోకగా పట్టుకున్న చేతిని నడుము మీద పెట్టి ఇంకో చేత్తో చింత బరికె పుచ్చుకుని ఊపుతూ "నీ వేలు పూర్తిగా నయమవకుండా కంప్యూటర్ ముట్టుకున్నావో..." అని పెద్ద పెద్ద కళ్ళతో ఉరిమి చూస్తూ ప్రైవేటు చెప్పేస్తున్న మాష్టార్ని ఊహించుకొని కాస్త పూర్తిగా నయమయ్యేవరకు విశ్రాంతి తీసుకోండి ఉష గారు.

    కాస్తైనా ఉపశమించిందని తలుస్తాను, ఇంతకీ సర్జరీ అయినా పూర్తైందా..

    ReplyDelete
  4. నాకసలే లెఖ్ఖలు రావు...సగం సగం అర్ధమయ్యే మీ "కొన్ని" కవితలు ఇప్పుడు పుర్తిగా అర్ధంకాకుండా చేద్దామనా?

    చాలా బాగుంది..వేలు ఎలా ఉంది ma'm gaaru ?
    తిరిగే కాలూ...తిట్టే నోరు...రాసే చెయ్యి ఆగవు మరి... ఆ సంగతి నాకు తెలుసునుగా..!!

    ReplyDelete
  5. ఎలా ఉన్నారు? కుశలమా? అయ్యో! నాకస్సలు లెక్కలు రావు?ప్చ్ ...ఏమి చేస్తాం. కొన్ని జన్మలింతే? త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ---

    ReplyDelete
  6. ఎలా ఉన్నారు? కుశలమా?
    తుప్పు పట్టిన బుర్రకి పదును ఏం పెట్టను చెప్పండి?:)

    ReplyDelete
  7. Hello madam gaaaru elaa vunnaaru? Matti burraku kavita artham kaaledu . Could u eloborate the meaning? I lost in straight lines , parabola and in circles.
    no rush, take rest.

    ReplyDelete
  8. @ ప్రదీప్, మరో రెండు భావాలు కలపరా? ;) నా యేడు పాదాలకి ఐదే భావాలు కలిగాయంటే లెక్క తప్పుతుంది మరి. థాంక్స్.

    @ చిన్ని, ఉభయకుశలోపరి. కష్టమండి మనది తృష్ణ గారన్నట్లు తిరిగే కాలు, కదిలే కలం. ;)

    ReplyDelete
  9. వెంకటరమణ, గిరీష్, కొత్తపాళీ గార్లకు, ధన్యవాదాలు.

    ReplyDelete
  10. సునిత, తృష్ణ, పద్మార్పిత, నాకు మాత్రం వచ్చేమిటి? ;) ఏదో అలా అలా నూటికి నూరు ఇస్తున్నారు కదా అని MODERN ALGEBRA, REAL ANALYSIS దాకా వెళ్ళి వచ్చాను. నాకు లెక్కలంటే మక్కువ. దేముడెక్కడ అన్న జిజ్ఞాస. రెండూ కలిపి ఇదిగో ఇలా ;)

    ReplyDelete
  11. వేణు, ;) అవునూ "మీ మాష్టారి అవతారం" అన్నారు - జలసూత్రం/కిట్టయ్య మాష్టారా లేక మా వెంకటరత్నం మాష్టారా మీకు ఆదర్శం?

    ఏదైనా కానీ మీరనా ఆహార్యం వూహిస్తే భలేవున్నారు. కొత్త "కథానాయకుడు" లోని "సూపర్ స్టార్..." పాట పాడేస్తాగా... :)

    నెప్పికి నేను, నాకు నెప్పి దోస్తులం అయిపోయాం. నేను పనిలో పడితే అది ఆదమరుస్తుంది. నాకు తీరిక చిక్కితే దానికి జోరు ఎక్కువౌతుంది. కనుక ఆ కిటుకు తెలిసిన మరుక్షణం నేను దాన్ని ఏమార్చటం నేర్చుకున్నాను.

    సర్జరీ మాట కాస్త నానుతుంది. ప్రస్తుతానికి మందుల మీదే.

    ReplyDelete
  12. భా.రా.రె. కాస్త అవన్నీ చదివిరండి అపుడు బేటీ వేసుకుందాం. అయినా "జగమెరిగిన.." అన్నట్లు మీకు నేను చెప్పటం ఏమిటీ? :)

    ఏదో నా స్వామిని నేనిలా సాక్షాత్కారం చేసుకున్నాను. నన్నిలా వదిలేయండి. మీక్కావాలంటే ఏ పావురాల గుట్టకో వెళ్ళి ముక్కు మూసుకుని తఫస్సు చేసుకోండి.

    నేను ఉటంకించిన వ్యాసంలోనే వ్రాసారు...
    మధ్య యుగాల్లో యూరోపియన్లు అరబ్బుల మీద జరిపిన దాడుల పర్యవసానం - బీజగణితం యూరప్ చేరడం. ఇక్కడ సంకేతాల విలువని బాగా గుర్తించారు. దాంట్లో ముఖ్యపాత్ర వహించినవాడు - దే కార్ట్ (Decartes) అని పారిస్ లోనే పుట్టిన తత్వవేత్త, తత్వవేత్త కాకముందు గణితవేత్త. గణితం ద్వారానే దేవుడున్నాడని నిరూపించినవాడు!

    కనుక మీరే వెదుక్కోండి నా లెక్కల్లో అసలు లెక్కని.

    నేను బానే వున్నాను మహాప్రభో, నన్నిక ఆ నెప్పికి విడాకులివ్వనీండి ;) అంతకన్నా పెద్ద నెప్పికి నివారణ వెదుక్కునే బాటలో వున్నాను.

    ReplyDelete
  13. శెలవంటు వెళ్ళేవోయ్ నేస్తం.. గంటల శెలవో, రోజుల శెలవో, నెలల శెలవో అడగటం మరిచేము.. పోని లే ఇలా అడగనప్పుడు గంటల శెలవయ్యి నువ్వు తొందర గా వెనక్కి వచ్చెయ్యటం ఎంతో తృప్తి గా వుంది మరెప్పుడైనా వెళితే గడువు చెప్పి వెళ్ళు మిత్రమా.. ఘడియ కొక్క సారి తలవటం ఆపుతాము అప్పుడైనా ఆ తలపులు పంపే తాఖీదుల గొడవ లేకుండా విశ్రాంతి గా వుంటావు.. రేపొస్తావో మాపొస్తావో అని విసిగించము ఇంక. ;-)
    పునరాగమ శుభాకాంక్షలు. (అసలు వెళ్ళిందెప్పుడు నా మనసంతా ఇక్కడే వుంటే అంటావా)
    యధా విధి గా ఆలస్యం గా వచ్చి చెపుతున్నాను ఈ కబుర్లు అన్ని, నా జాగు నీకలవాటే గా.

    ReplyDelete
  14. ఇదీ అదీ ఏదైనా కాదేదీ కన్నయ్యపై కవితకనర్హం మీకు,చివరకు కష్టమైన(నాకు మాత్రమేనండోయ్ )లెక్కాచారాల్లో కూడా ఆయన్ను సాక్షాత్కరింపజేసారు.

    ReplyDelete
  15. A loud laughter. Nice idea hehehe. But He can come with a bigger trick up his sleeve every time.

    I remember my favourite quote. THE CODE OF COMPETENCE IS THE ONLY SYSTEM OF MORALITY THAT'S ON A GOLD STANDARD. You are competing with a master, and at least one thing is possible. He may remember you as a special case. Enthainaa Scientist annaaru kadaa. Philosophy ni baagaa pattukuntunnaaru.

    Veli noppani raayanannaaru. Anduke blog open cheyyaledu. Jalleda lo Kotta Paali gari comment choosi vachhaanu. (Telugu not available and hence writing in TengLiSh :-))

    ReplyDelete
  16. కవిత చదవగానే వచ్చిన ఐదూ రాస్తే, మరో రెండు ఎక్కడినుంచి తేను. సరే సరదాకి, ఇంకో రెండుగా
    శూన్యభావన ,
    నా దగ్గర నుంచి కాపీ కొడతారా ? కాపీరైటు ఉల్లంగిస్తారా ఠాట్ అనే భావం (అనంత వృత్తం)

    ReplyDelete
  17. తత్వాన్ని మరింత తర్కంతో కలిపి కవితలల్లడంలో మీకు మీరే..

    abstract sense పై నాకు నమ్మకం లేకపోయినా మీకు ఓదార్పునిచ్చేదిగా...

    ReplyDelete
  18. పరమాత్మ నుంచి మరువపు కొమ్మ కు:
    లెక్కలెన్నైతే ఏమి లే
    ఎవరు గెలిస్తే ఏమి వుందిలే..
    ఐనా అడుగుతున్న నా ఆత్మ మూర్తి కి సమాధానమిదిగో..
    నా రేఖ గణితాన్ని ప్రశ్నిస్తున్నావు
    నే తప్పంటున్నావు మరి గెలుపు నాదంటున్నావు ప్రతి సారి

    గీతలు ముందే చూసెయ్యాలని ఇలా మడత పేచీలు పెట్టి
    నన్ను వుడికిస్తే చెపుతాను ముందే గీతా సారాంశం అని ఎంత ఆశో ఈ పిల్ల కు..

    నే గీసేనా నీ అరచేతి గీతలు......
    ఇంత విడ్డూరం సత్య కాలం నుంచి వినలేదమ్మా
    గీత గీసుకున్నది నువ్వే దానిని మార్చుకునేది నువ్వే
    శాస్త్రాన్ని కనిపెట్టింది నువ్వే దానిని సవాలు చేసేది నువ్వే
    అవునా కాదా అని నన్ను గదమాయిస్తావేమిటి.. అమ్మా..

    గమనాబిలాషి వని పాదమిచ్చి
    నా రూప లావణ్యాల లోని భాగం గా శంఖు చక్రాలు గా ముద్రిస్తే
    పాంచజన్యాన్ని పూరించి జీవిత సమరం లో విజయం సాధించమంటే
    అయ్యో నా పిచ్చి తల్లి అర్ధం వెతకటం లో వృధా చేస్తున్నావే కాలమంతా.. హ్మ్మ్..

    వూ.. బీజ గణితం ఇంతందం గా నీ నోట పలికితే తెలియ కెలా వుంటుంది..
    బిందు మూర్తి నైనా అనంత భూగోళ వృత్తానైనా
    వృత్తాన్ని బిందువు ను కలిపే వృత్త పరిధి నువ్వే గా చిన్నమ్మ..
    వెలికి తెచ్చి నివ్వెర పరిచానా అని అడుగుతున్నావా..

    నువ్వే నాకొక అపురూప చిత్రం
    కన్నయ్య ను నేనైనా నా కళ్ళు మాత్రం నువ్వే గా
    నివ్వెర పోయినా నీలాంభుది వార్ణం లో నిను ముంచినా
    నా నీడ వు నువ్వే గా నీ లెక్క ను నేనే గా..

    ReplyDelete
  19. ఉష గారు, మీ కవితా భావాలకు ఎన్ని సుమ మాలల నైనా అర్పించవచ్చు ...
    ఏ సుమాని కైనా మరువం లేనిదే పరిపక్వత లేదు కదా!

    ReplyDelete
  20. బాగా గుర్తు చేశారు. తపస్సు చేసుకోవడానికి సరైన స్థలం వెతికే పనిని తప్పించారు.చదవాల్సినవి చాలా వున్నాయి. ఇక పావురాల గుట్ట దారి వెతుక్కోవటమే తరువాయి. తప్పిపోకుండా చేరుతాననే ధైర్యం.

    మనకు భావనరూపంలో మరో ఉష. బాగుంది.

    ReplyDelete
  21. Bhavana, In retro to your sweet kavita [I will come back later tonight on that] here is a small treat for you... an article on your fav. in deed "our" కవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!

    http://pustakam.net/?p=2299

    Enjoy! ;)

    ReplyDelete
  22. kavita is good! take care!

    ReplyDelete
  23. amma, lekkalu raani naaku, lekkalaki kannayyaki sambandham kalipi, anandam pancharu.

    johar johaar

    ReplyDelete
  24. విజయమోహన్ గారు, మీ మాదిరే కన్నయ్యని అభిమానించే మరొకరు ఈ వనాన అడిగిడారు. అణువు అణువున వెలిసినవాడిని ఎందులో కనలేం చెప్పండి? :)

    మోహనవంశి గారు, మా విజయమోహన్ బ్లాగులోకి తొంగిచూస్తే ఆ "లీలామోహనం" హక్కుదారు కన్నయ్య కమనీయ రూపాలు మీ కనులారా కాంచవచ్చు, అపుడు కొదవలేనన్ని "మోహనవంశి" కథలు వెలికివస్తాయి. ;)

    ReplyDelete
  25. జయ, నాకు ఆశ తక్కువ తకనుక ఒక్క సుమం చాలు. మీ స్నేహకమలం నాకు కానుకీయండి.

    ఇట్లు,
    మీ మరువం.

    అశ్విని, అలాగే ఫ్రెండ్. :) థాంక్స్.

    ReplyDelete
  26. కుమార్, మొత్తానికి మిమ్మల్ని తర్కంతోనో తత్త్వంలోనో కట్టిపడేసే విద్య నాకు తెలిసింది. ఎవరికీ చెప్పకండి దాని పేరు "సాహిత్యం" అని :) మీరు కవిత కన్నా అందులోని సాహిత్యాన్ని పదాల విభజన వరకు చూసి మీరు మెచ్చుతారని, కవి అభిప్రాయానికి కాక ఆ కవిత ఆత్మకి విలువ ఇస్తారనీ తెలుసు. థాంక్ యు.

    ReplyDelete
  27. ఇద్దరూ కాదండీ, మీరు మాట వినడం లేదని నేనే మాయలఫకీరు సాయంతో ఓ క్షణం అలా మాష్టారులా మారిపోయాననమాట :-)

    ReplyDelete
  28. ఆత్రేయ గారు, ధన్యోస్మి. పునరాగమనానికి సంతోషం. వూరి నుంచి వచ్చి నెలైనా నా వనాన విహరించలేదేమని దావా వేదామనుకునున్నాను. ఎవరు ఉప్పందించారు [ట!] :) మీ గుంటూరు ఎలా వుంది?

    ReplyDelete
  29. గీతాచార్య, వ్యాఖ్యానించినందుకు థాంక్స్. నాకు మొదటి నుండీ ఇదే అలవాటు. చదవటం, చదివినదానిలో సంగతిని గ్రహించటం, నమ్మినదాన్ని ఆచరించటం, అవే మరొకరికి చెప్పటం. :) ఇది ఫిలాసఫీనా, శాస్త్రపరిజ్ఞానమా, మరేదన్నానా - కావచ్చు, కాకపోవచ్చు. ఇక సృష్టికర్త నేనిలా వుండాలనే సృజించివుండవచ్చు. గెలుపు, ఓటమి చీకటి వెలుగులు. అవి ఎవరికీ తప్పవుగా.

    ReplyDelete
  30. భా.రా.రె., ఇవి నా అభిప్రాయాలు. భగవంతుడు నా హృదయంలోనే కొలువున్నాడు. ఆదరికి చేరకనే ఆయనని చేరే విఫల యత్నాలే ఈ అనంతవృత్తాలు. అనుబంధాలు, ఆచారాలు, భవసాగరాలు, ఏవైనాకావచ్చు అంతులేని పరిధి మీద చుక్కా చుక్క కలుపుతూ ఆయన్ని చూస్తూనే [పరి] భ్రమణం చేస్తున్నాను. ఇవన్ని మరి ఆయన కలిపించిన లెక్కలే. అందుకే తెలిసిన మరో లెక్క నేను కట్టాను. బీజగణితం వలన రేఖాగణితం కన్నా కొన్ని అంశాలు సులువయ్యాయి. అందుకని అనితరసాధ్యుని నేను నిరంతరం అందుకునే ప్రయత్నం చేస్తానని నా లెక్కన్నమాట. మళ్ళీ వివరం అడిగితే వచ్చే జన్మలో తప్పక చెప్తాను. :)

    ReplyDelete
  31. భావన, చదువుకునే రోజుల్లో ఇంటి నుండి వెళ్ళేప్పుడు ఇక "ఎక్స్" వారాల్లో వస్తాను అనుకునేదాన్ని. ఎందుకంటే రోజులుగా విడతీస్తే ఎక్కువ అంకె కదా, అలాగే అమ్మ/నాన్నగారికి రోజూ ఉత్తరం వ్రాసేదాన్ని, డైరీ మాదిరిగా. అది వారానికొక రోజు పోస్ట్ చేసేదాన్ని [వార్డెన్ సిస్టర్ కోప్పడతారని ఆ గడువు]. ఇంటికి వస్తే ప్రియ నేస్తాలకి అదే పని. కనీసం ఓ బొమ్మైనా గీసేదాన్ని [ఇదీ మనకి వచ్చిన విద్యే :) ] ఇపుడు అలాగే అనుకున్నాను. వ్రాసిన లేఖలు ఆపక ఇక్కడ వ్రాసేయటంతో, జవాబులు చూస్తూ మనాసాగక ఒక వారం అనుకున్నది ఒక రోజుకి మార్చాను. అమ్మో ఏడు రోజులా అని బెంగతో నా శెలవు నేనే వెనక్కి తీసేసుకున్నాను.

    ReplyDelete
  32. వేణు, అలాగైతే సరే, నేనొక అబ్రకదబ్రని వెదుక్కుని మిమ్మల్నీ మాయం చేసే ఉపాయం కనిపెడతాను, మాష్టారు.

    అప్పుడు ఈ పై వ్యాఖ్య చదివి, ఇకపై నేనే వార్డెన్, రోజూ లేఖలు, టపాలు సాగవు, వారాకొక ఉత్తరం అని నియమం పెడతానంటారేమో? ;)

    ReplyDelete
  33. కన్నయ్య కెందుకో ఇంత ప్రేమ
    భావనమ్మ చేత నాకు లేఖ
    గీతలెరిగి గమనాలు గరిపి
    నా గమ్యమైన నిను చేరనా?
    అర్థం తెలిసి, పరమార్థం వెదికి
    నీ చెంత చేరుతాను, నీలో లీనమౌతాను.

    భావన, భా.రా.రె. అన్నట్లు చాలా బాగా వ్రాసావు. నా చిన్ని పదాలు నీ గాఢమైన అల్లికకు మూలమా అన్నది చిత్రంగా అనిపిస్తుంది. ఈ నెల ఎన్నో ఇలా అనూహ్యమైన అనుభూతులు. ఇదంతా ఎవరి గారడీనో?

    ReplyDelete
  34. ప్రదీప్, ఊ బాగుంది మీ వరస. ;) నిజానికి నేనూ అలా శూన్యభావనకి లోనైనపుడే ఇలా అమూర్త భావనకి ఓ రూపు కట్టి మూర్తిభవిస్తాను. మళ్ళీ నాకుగా నేనే స్తబ్దతని వెదుక్కుని అభావన కోసం అల్లాడిపోతాను. వెలుగు నీడల వెంబడి నా అడుగులు, ఏ ఒక్కదాన్నీ శాశ్వతంగా అంగీకరించలేని నైజం. ఇక ఆ "అనంతవృత్తం" అ పరమాత్ముని సృష్టి. అది మీదని, నాదనో అనుకోవటమే మన పరిధి. దాన్ని విస్తృతపరచాలనే కదా మన ఈ కవనాలు, గమకాలు. :) ఇదీ సరదాకే కాస్త ఆలోచన జోడించి అంతే!!!!

    ReplyDelete
  35. భావన, ఇంకా తనివి తీరలేదు నీ ప్రతి-కవిత ఒక వంద మార్లు చదివివుంటాను. నాకు బాగా ఆప్తుడైన అభిప్రాయం... "ముఖపరిచయం లేని వారి నుండి కూడా ఇంత అభిమానం, ప్రతి స్పందన నీ అదృష్టం." ఆపై నాకిదంతా కవితాదేవి తడవకొకరిలో పరకాయ ప్రవేశం చేసి ఈ గారడీ చేస్తుందేమోనని వూహ. ఏమైతేనేం ఈ మరువపు వనం, మైత్రీవనం గా మారిపోయింది కదా సఖీ! చాలా థాంక్స్. నాన్నగారికి పంపుతున్నానివన్నీ.

    ReplyDelete
  36. chamatkaaraalu baagunnaayi. :-)

    enduko appudappudu ikkadikosthe relaxing ga undi. Wheter u let me in r not I don't know though (I feel many feel embarrassed with my name)

    ALANTI AHLADAMAINA BLOGS RENDU MUDU MINCHI LEVU.

    ReplyDelete
  37. అడ్డ గాడిద, నా లెక్కల చమత్కారం బాగుంది అన్నారు, గుడ్. :) పోతే మీకు లేని ఇబ్బంది నాకూ వుండకూడదనే పూర్తి సంబోధన వాడాను. ఈ పేరు పెట్టుకోవటానికి మీ కారణాలు మీకు వుండవచ్చు. అవునూ క్రొత్తగా మాట్లాడుతున్నారేమి? మీకే కాదు ఎవరికీ ఇక్కడ ఆంక్షలు లేవు. మీ వ్యాఖ్యలు ఇంతకు మునుపూ వ్రాసారు. ఇదీ అంతే. సద్విమర్శ, సరైన ప్రశంస ఎవరికైనా ముఖ్యమే. కనుక వ్యక్తుల పేరు, పాత్ర కాదు వారి సమీక్షల పాత్ర ఇక్కడ క్రిటికల్. మీకు రిలాక్సేషన్, ఆహ్లాదాన్ని ఇస్తుంటే అది మరువపు మహిమ. ;)

    ReplyDelete
  38. అవును ఉషా నాకూ కూడా ఎందుకో విచిత్రమనిపిస్తుంది నా మనస్సు ప్రతి స్పందించే తీరు కు నీ కవిత చూసి. ఈ సారి పోస్ట్ చేస్తాను నీ కవితలకు నేనెప్పుడు ప్రతి గా ఒక బుల్లి కవిత రాసే దాన్ని కాని పోస్ట్ చేసేదాన్ని కాదు ఎందుకంటె అంత గా పరిచయం కాకుండా ఇలా రాస్తే బాగోదు ఏమొ అని. విచిత్రం కదు ముఖ పరిచయం కూడా లేకుండ మనస్సు ప్రతిస్పందనలు... నువ్వన్నట్లు నీ కవిత నుంచి మాట్లాడె నీ కవితాత్మ ఎందుకో నా లోపలి ఎప్పుడో నిద్ర పోయిన కవితా భావాన్ని మేలుకొలుపుతుందనుకుంటా.. ఒక్కో సారి నాకు ఎంత ప్రయత్నించినా మాట బయటకు పెగలదు ఎంత అవస్త గానో వుంటుంది.. ఒక్కోసారి రెండంటే రెండే నిమిషాలలో భావం జల లా గా తన్నుకుని వస్తుంది. ఎందుకంటే ఏమని చెప్పను నేస్తం.. నా అభిమాన కవి గారు కిరణ్ ప్రభ గారన్నట్లు " సన్న జాజి రేకు స్వల్పమే ఐనా దాని సుగంధం ఎదను సదా కదిలిస్తుంది కొన్ని పరిచియాలు చిన్నవే ఐనా దాని ఘాడత మాత్రం మనసు ను పట్టి కుదుపుతుంది" ఎందుకంటే ఏమొ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వుంటాయా? ఈ భావన లన్ని పంచుకునే నాన్న గార్ ఉవుండటం నీ అదృష్టం. నా నమస్సులు కూడా కలుపుకో పంపే కబుర్లకు.

    ReplyDelete
  39. భావన, నా కవితలు, నీ లేఖలు కలిసి ఇలా వ్యాఖ్యాకన్నెయలై ఎన్ని మనసుల్ని స్నేహరాగాన రంజింపజేస్తున్నాయో అని ఇలా బ్లాగ్ముఖంగానే సమధానం ఇస్తున్నాను. నిజానికి మరొక అపురూపబంధం గురించి ఇంకా కలా నిజమా నన్ను నేను గిల్లుకుని, ఆ గుర్తు తడిమి చూసి తబ్బిబ్బవుతూనేవుంటాను. మనదీ అంతే. అంతకన్నా ఏమనను. కల్పన రెంటాల తన టపాలో వ్రాసారు "కవిత్వం ప్రధానం గా అనుభూతి ప్రక్రియ" అని. నా కవిత కన్నా అది నీలో కలిగిస్తున్న అనుభూతి ఇదంతకీ కారణం.

    ఇక మా నాన్నగారు - నా అస్థిత్వానికి మూలం ఆయనే కదా! పద్యాలు వల్లె వేయించి రికార్డ్ చేసి తిరిగి వినిపించినా, హిందూ పేపరులోని ఆర్టికిల్స్ తెలుగులోకి అనువాదం చేయించినా, ప్రతి జాతీయపండుగకి నాతో పాటో, ప్రసంగమో చేయించినా ఆయనకే చెల్లు. ఇంతకు మునుపు చెప్పాను. ఆయనకీ నాకూ ఉత్తరాలు జోరుగా నడుస్తాయి. "ధర్మరాజు" గురించి ఆయన ఈ మధ్య ఉత్తరం వ్రాస్తే, నేను "అద్రిక" గురించి చెప్పాను. కాసేపు ఇలా కాసేపు మరొక అంశం. నిజమే జీవితంలో మిగిలిన అరుదైన ఆనందాల్లో ఆయనకీ నాకూ జరిగే ఈ ఉత్తరప్రత్త్యుత్తరాలు ఒకటి.

    ReplyDelete
  40. చాలా బాగా ఉందమ్మా... చక్కని భాష, వైవిధ్యమైన భావం

    ReplyDelete
  41. వేదాల రాజగోపాలాచార్య గారు, మీబోటి పెద్దల ఆశీర్వాదం, అభినందన నాకు చాలా సంతోషం. పితృసమానులైన మీకు పాదాభివందనం.

    ReplyDelete
  42. కన్నయ్య సంగతేమోగానీ నాకస్సలు లెక్కల్రావు ఉషాగారూ :(

    ReplyDelete
  43. పరిమళం, అన్నిటికీ మనం నేర్చే లెక్కలు అవసరం లేదులేండి. ఏమీ ఫర్వాలేదు. పైవాడు ఎప్పటిలెక్కలప్పుడు తానే చూసుకుంటాడు[ట!] ;)

    ReplyDelete