డిశంబరు మాసం. అంతా కాస్త వూపిరి తీసుకుని వేడుకల్లో, విందుల్లో, వినోదాల్లో మునిగి తేలే సెలవు దినాలకి ముందు శుక్రవారం. హెల్ముట్ ఇంటికి క్రిస్మస్ విందుకి ఆహ్వానం.
అంతకు మునుపటేడు వూర్లో లేని కారణంగా వెళ్ళలేదు. ఈ సారి విశ్వ కూడా ఇక్కడే వున్నాడు. తమ నాలుగు టీమ్స్ వరకే కనుక ఆర్.యెస్.వి.పి. వంటి ఫార్మాలిటీస్ లేవు.
"విశ్వ, సాయంత్రం వెళ్తున్నారా అక్కడకి?" అడిగింది మిత్ర. ఇద్దరూ కలిసి మెక్సికన్ రెస్టారంట్కి లంచ్ కి వచ్చారు.
"మీరు?" ఎదురు ప్రశ్న వేసాడు.
"ఇదే మొదలు ఇలా ఎక్కడకీ వెళ్ళలేదు. అందుకని.." ఆగిపోయిందిక ఏమనాలా అని ఆలోచిస్తూ.
"నాదీ అదే పరిస్థితి." చిన్నగా నవ్వాడు.
"సరే ఓ పని చేద్దాం. కలిసివెళ్దాం." చటుక్కున వెలికివచ్చింది మిత్ర నోటి వెంట.
హెల్ముట్ మూడింటికి వెళ్తూ తన క్యూబ్ కి వచ్చి "మీట్రా సీ యు సూన్.." అని చెప్పి మరీ వెళ్ళాడు.
విశ్వని ఏడింటికి తను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పి మిత్ర కూడా నాలుగింటికి ఇంటికి వచ్చేసింది.
*************************************************
వచ్చీ రావటంతోనే వంటగదిలోకి వెళ్ళి కొద్దిగా వుల్లిపాయ పకోడి చేసింది. అలసటగా వున్నా ఆలస్యం అవుతుందేమోనని షవర్ తీసుకుని, చక చకా జుట్టు డ్రై చేసుకుని, వార్డ్ రోబ్ లోంచి డార్క్ గ్రీన్ లాంగ్ ఫ్రాక్ తీసి వేసుకుంది.
ఫెస్టివ్ అకేషన్ కనుక కాస్త లైట్ గా మేకప్ వేసుకుని, పెదాలకి ఎర్రటి లిప్ స్టిక్ వేసుకుందామని సరుగు తీసేసరికి చిన్న గిఫ్ట్ పాక్ కనిపించింది. అది నవీ పంపింది. సోమవారం వచ్చింది. యధాలాపంగా లోపల పెట్టేసింది.
విప్పనే లేదు, ఇంకా నయం, పిచ్చి బంగారం మధ్యలో ఫోన్ చేసివుంటే అలిగేసేది అని అనుకుంటూ విప్పుతుండగా అనుకోని ఆలోచన, విశ్వకి చిన్న కానుక ఇస్తేనో. మళ్ళీ సంశయం. లోపల లేత గులాబీ రంగు ఆస్ట్రేలియన్ కోరల్స్ తో పూలు చెక్కిన చేసిన చిన్న పెండెంట్. మ్యాచింగ్ హ్యాంగింగ్స్.
సన్న గొలుసుకి తగిలించి పెట్టుకుంది. లిప్ స్టిక్ అద్దుకుంటూ తనలో తనే అనుకుంది ఎందుకు తను అలంకరణలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాను అని.
ఆ మధ్య బాగుంది అని తీసుకున్న పెన్ సెట్ గిఫ్ట్ రాప్ తీసి పాక్ చేసింది. టైం ఆరున్నరైపోయింది చూస్తుండగానే. పకోడి బాక్స్ లోకి సర్ది పెట్టుకుని, గబగబా షూస్ వేసుకుని వింటర్ కోట్ విసుగ్గానే తగిలించుకుని, గ్లౌస్, హాండ్ బాగ్, కార్ కీస్ తీసుకుని బయటకి వచ్చింది.
అప్పుడు గుర్తుకు వచ్చింది గిఫ్ట్ లోపలే మర్చిపోయానని. తిరిగి వచ్చేప్పుడు ఇక్కడ ఆపి ఇవ్వొచ్చులే అనుకుంటూ మెట్ల వైపు నడిచింది.
విశ్వ దగ్గరకి వెళ్ళేసరికి స్వీట్స్ బయటనే సిద్దంగా వున్నాడు.
"అయ్యో చలిలో బయటవున్నారా?" నొచ్చుకుంటూ అడిగింది.
"అలా ఏమీ లేదండి. నేను జస్ట్ బయటకి వచ్చాను. అయినా ఇన్ని పొరలు కప్పుకున్నాక ఇంకా చలేమిటి?" సీట్లో కూర్చుని బెల్ట్ పెట్టుకుంటూ అన్నాడు.
మరొక పావు గంటకి హెల్ముట్ ఇంటికి చేరారు. సంతోషంగా ఆహ్వానించాడు. భార్య రాబిన్ ని పరిచయం చేసాడు. అంతా సరదాగా వున్నారు. ఐవన్ భార్య స్వెత్లానా కాస్త యాస కలిసిన ఇంగ్లీష్ లో సన్నగా పలకరించింది. అంతకు మునుపొకసారి కలిసారు.
అందరి చేతిలో ఏదో ఒక డ్రింక్. కోక్ తీసుకుని కొంచం ప్రక్కగా వచ్చి కూర్చుంది. మరొక పది నిమిషాలకి గిల్డా వచ్చింది. తమ టీం కాదు కానీ తమ మధ్య మంచి చనువువుంది.
"మీట్రా, యు లుక్ గొర్జియస్" హత్తుకుని చిన్నగా కిస్ చేస్తూ అంది. "దిస్ ఇజ్ రిచ్" అంటూ పరిచయం చేసింది. ముందు వివాహం లో ఎన్నో బాధలనుభవించి విడాకులతో ముగించి, రిచ్ తో పరిచయం ప్రేమగా మారాక, ఇద్దరూ ఒక అవగాహనకి వచ్చి లివింగ్ టుగెదర్ చేస్తున్నారు.
"వివాహమే మమ్మల్ని కలిపి వుంచుందన్నది వొట్టి కల మాత్రమే. రిచ్ మనసు మంచిది. నాకీ వయసులో కావలసింది మోరల్ సపోర్ట్ మాత్రమే. తనకి పెద్ద కుటుంబం వుంది. పెద్ద వయసులో వున్న మా అమ్మ, టీనేజ్ లో వున్న నా కూతురుకి నేనే అండ. నన్ను నా అవసరాలని తనవిగా చూసుకునే రిచ్ నాకు అండ" అని ఆ మధ్య చెప్పింది.
మరో పది నిమిషాలకి రిచ్ పకోడి తింటూ వచ్చి మిత్ర ప్రక్కన కూర్చున్నాడు. "మీట్రా యూ ఆర్ సో అడోరబుల్" అన్నాడు. "థాంక్స్" అంది.
సంభాషణ ఇంగ్లీష్ లో నడుస్తుంది. డ్రింక్ చేసి వుండటం వలన అంతా ఇన్ హిబిషన్స్ కాస్త సడలించుకుని చనువుగా మాట్లాడుతున్నారు.
"విశ్వ తో డేటింగ్ చేస్తున్నావా?" కన్ను గీటుతూ అడిగింది గిల్డా.
"అదేమీ లేదు. ఇండియాలోనే తెలుసు. అనుకోకుండా మళ్ళీ కలిసాం." అంది మొహమాటంగా.
"హి లైక్స్ యు. ఐ కెన్ టెల్ దట్" అని గిల్డా అంటుండగా విశ్వ ఇటుగా వచ్చాడు.
"మిత్ర, అటు చూడండి." అంటూ కిటికీ ప్రక్కగా తీసుకువెళ్ళాడు.
సన్నగా దూదిపింజెల మాదిరిగా కురుస్తున్న మంచు. ఓ ప్రక్కగా బాక్స్ వుడ్ పొద ప్రక్కన కూర్చున్న బూడిద వన్నె కుందేలు. అలంకరణకి పెట్టిన రంగు రంగు చిన్ని చిన్ని దీపాల కాంతులు. మనసొక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది.
ఇద్దరూ మాటలు మరిచి మైమరిచినట్లుగా అటే చూస్తుండిపోయారు. విశ్వ చూపులు ఏదో లోకాల్లో తిరుగాడుతున్నట్లున్న మిత్ర మీదే నిలిచిపోయాయి. ఆ దుస్తులలో దేవ కన్య లా వుంది. చిన్నప్పుడు చదివిన షార్ట్ స్టొరీస్ వర్ణించే ఫైరీ మాదిరిగా వుంది.
రాబిన్ వచ్చింది. "మీట్రా, నువ్వు వెజిటేరియన్ అటగా. నీ కోసం ఓవెన్లో మష్రూం పై బర్న్ చేస్తున్నాను. స్పినాచ్ రోల్స్ వున్నాయి." అంటూ చెప్పి వెళ్ళింది.
అంతా కొంచం కొంచం పకోడి రుచి చూసి బాగుందని మెచ్చుకున్నారు. వీళ్ళలో ఈ లక్షణం తనకి చాలా ఇష్టం. ఏదైనా క్రొత్తని త్వరగా ఆహ్వానిస్తారు. రుచి కాని, వస్తువు కాని, కనీసం ఒకసారి ప్రయత్నిస్తారు. కాస్త స్పైస్ తగ్గించే చేసింది కూడా.
అలా అలా గంట పైనే కబుర్లు, ఫుడ్ తో గడిచిపోయింది. ముందు ఫార్మల్ లివింగ్ రూ లో దాదాపుగా పదడుగుల పెద్ద క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసి పెట్టారు. రక రకాల అలంకరణలు, క్రింద పాక్ చేసి పెట్టి వున్న కానుకలు.
సినిమాలలో, షాపింగ్ సెంటర్ లో చూడటమే కానీ ఇలా ఇంట్లో పెట్టినది చూడటం ఇదే మొదలు. రాబిన్ ఆ సంగతులు, తన చిన్నప్పటి క్రిస్మస్ వేడుకలు అవీ చెప్తుంటే తెలియకుండానే మనసు దసరా, సంక్రాంతి పండుగ రోజుల్లోకి తొంగిచూసి వచ్చింది.
పదవుతుండగా అందరూ విషెస్ చెప్పుకుంటూ ఒకరొకరుగా ఇళ్ళకు మళ్ళారు.
దార్లో విశ్వాని అడిగి కార్ ఓ ప్రక్కగా తీసి ఆపింది. దిగి రెండు అడుగులు వేసిందో లేదో షూస్ అప్పుడే గట్టి పడుతున్న మంచు మీదగా జారాయి. పట్టు తప్పి పడిపోతున్నాను అనుకుంటుండగా విశ్వ బలంగా వెనకనుండి పట్టుకుని ఆపాడు.
ఇక అడుగు తీసి వేయాలంటే భయం వేసింది. అలాగే నిలబడి కాసేపు వెన్నెలాకాశం మాదిరిగా మెరుస్తున్న ఆ రేయి వెలుగుల్లో తన కంటి వెలుగులు కలిపి నిలిచిపోయింది. విశ్వ చేరువగా వుండటం ఇంకా బాగా అనిపిస్తుంది.
వెనక్కి తిరిగి నడిచేప్పుడు కలుక్కుమన్న నెప్పి. "అమ్మా! " మిత్ర నోటివెంట ఆ సన్నని మాటలోనే బాధ అంతా ధ్వనించింది.
"అయ్యో పాదం బెణికిందేమో" అంటూ "మీరేమీ అనుకోకపోతే.." అని చెయ్యిందించాడు. నిదానంగా అతని ఆసరాతో కార్ దాకా వచ్చింది. అతని స్పర్శలో ఏదో భరోసా. మునుపు మాదిరి బిడియంగా అనిపించలేదు.
"నేను డ్రైవ్ చేస్తాను. మీకు కాలింకా స్ట్రెయిన్ కావచ్చు. " అంటూ తనని అటు ప్రక్కగా నడిపించి డోర్ అతనే తీసి నెమ్మదిగా మిత్ర సర్దుకుని కూర్చున్నాక అటుగా వెళ్ళి కూర్చుని నెమ్మదిగా స్టార్ట్ చేసి ముందుకు కదిపాడు.
మిత్ర ఇంటికి వచ్చాక, లోపలికి అతనే తీసుకువచ్చాడు. ఇబ్బందిగా వుంది. ఇలా అయిందేమిటీ, ప్చ్ తనలో తనే అనుకుంది. సోఫాలో కూర్చున్నాక ఎదురుగా గిఫ్ట్ పాక్ కనపడింది.
"విశ్వ! అది మీకే." అంది.
"మీరూ ఏమీ అనుకోరనే నా నుంచి ఓ చిన్న కానుక." అంటూ చిన్న బాక్స్ ఇచ్చాడు.
అతను ఎలా వెళ్ళాలి అన్న సందేహం. చూస్తుండగానే స్నో జోరుగా పడటంతో ఎటూ కాని టైం లో ఇక డ్రైవింగ్ మంచిది కాదేమో? అనిపించింది. కాబ్స్ కూడా దొరకటం కష్టమే.
తనే చొరవ తీసుకుని "విశ్వ, ఈ రాత్రికి ఇక్కడే వుండండి. ఉదయానికి కాస్త రోడ్స్ క్లియర్ చేస్తారు. అప్పుడు చూద్దాం." అంది.
ఇద్దరికీ నిద్ర రావటం లేదు. ఇద్దరూ జ్యూస్ గ్లాసులు పట్టుకుని మాటలు మొదలు పెట్టారు. ఏవేవో చిన్నప్పటి సంగతుల్లోకి వెళ్ళిపోయింది సంభాషణ.
మిత్ర ముందు తన విషయాలు చెప్పింది. సుమతి గార్ని గురించి మరి మరీ చెప్పింది. విశ్వ ఆసక్తిగా వింటూ కూర్చున్నాడు. నిదానంగా విశ్వ గురించిన మాటల్లోకి సాగింది.
*************************************************
"అనంత వదినకి మీకు అసలు పోలికే లేదు." అంది మిత్ర.
"అవును అక్క మంచి రూపసి" అన్నాడు.
"ఛా నా ఉద్దేశ్యం అది కాదు. తను చాలా చొరవగా వుంటుంది. మీరు చాలా మొహమాటస్తులు" అంది మిత్ర.
"అదా, అవును నిజమే. చిన్నప్పటి నుండి తను చురుకే" అన్నాడు.
కాసేపు ఆగి "మీకో సంగతి చెప్పాలి. నాన్న గారు బాగా చదువుకున్నారు. వ్యవసాయం తన ఆసక్తి వలనే వృత్తిగా చేస్తున్నారు. ఆయన కారణంగానే నాకు చిన్నప్పటి నుండి న్యూస్ పేపర్ చదవటం, అలా అలా జర్నలిజం మీద ఆసక్తి కలిగింది. పుస్తక పఠనం, చిత్రలేఖనం కూడా ఆయన వలనే అలవడ్డాయి. ఆయనే లేకపోతే నా జీవితం అలా అనాధలా..." ఉద్వేగంగా ఆగిపోయాడు. అతని కళ్ళలో చిరు తడి.
మిత్రకి ఒక నిమిషం ఏమీ బోధపడలేదు. "విశ్వ, ఏమిటి మీరు అంటున్నది." నెమ్మదిగా అడిగింది.
"అవును మిత్ర, నాన్నగారికి 'హావ్ వన్ అడాప్ట్ వన్! ' అన్న ఆదర్శం. నన్ను దత్తత తీసుకుని పెంచారు. నాకు ఈ విషయం ఆయన కానీ అమ్మ కానీ చెప్పలేదు. ఎవరో ద్వారా తెలిసింది. నాతో మాట కూడా తీసుకున్నారు. మీ దగ్గర ఎందుకో దాచాలనిపించలేదు." అన్నాడు.
కాసేపు అలాగే మౌనంగా వుండిపోయారు.
మిత్ర తేరుకుని "విశ్వ, నాకు ఇవన్నీ చెప్పారని మీ పట్ల నా ఉద్దేశ్యంలో ఏ మార్పూ రాదు. ఈ మంచు ఎంత అందంగా వుందో, మన చిన్ననాటి అనుభూతులూ అంతే మధురంగా గడిచిపోయాయి. అనుకోకుండా ఆ మాట వచ్చింది అంతే. ఇక ఆ సంగతి నేనూ మర్చిపోతాను. మీ నాన్నగారిని ఒకసారి కలవాలి. ఆయన గురించి విన్నాక అలా అనిపించింది." అంది.
"చిత్రలేఖనం అన్నారు. ఏమైనా మీ వర్క్స్ వుంటే చూపించండి." అంది. కాసేపు నవలల మీద చర్చ. ఇద్దరికీ కలిసిన ఆసక్తి అదొకటని మిత్ర గమనించింది.
టైం చూస్తే ఒంటిగంట దాటిపోయింది.
"కాసేపు పడుకోండి" అంటూ లేచి మిత్ర బెడ్ రూం లోకి నెమ్మదిగా నడిచి అతనికో కంఫర్టర్ ఇచ్చింది. "కాస్త ఇబ్బంది తప్పదు మీకు, అసలే బారు మనిషి మీరు, ఈ సోఫాలో సర్దుకోవాల్సిందే."
ఇద్దరు పడకల మీద ఒడ్డిగిల్లటమే ఇంకా ఆలోచనలు తెగటం లేదు. రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుని, హాట్ పాక్ పెట్టటం తో నెప్పి తగ్గినట్లేవుంది.
అనుకోకుండా ఇలా కలిసి గడపటం అదో అనుభూతి. నెమ్మదిగా అతనిచ్చిన గిఫ్ట్ విప్పింది. క్రిస్టల్ తో చేసిన చిన్న కుందేలు బొమ్మ. భలే ముద్దుగా వుంది.
నిద్ర రానని మొరాయిస్తూనే నెమ్మదిగా వచ్చి చేరింది.
*************************************************
తెల్లవారగానే లేచే మిత్ర కొంచం ఆలస్యంగానే లేచింది. విశ్వ ఇంకా నిద్రలోనే వున్నాడు. ఓ ప్రక్కకి తిరిగి పడుకుని వున్న అతన్ని పరీక్షగా చూసింది. యూనిబ్రో. కనుబొమ్మలు కలిసి వున్నాయి. అప్రయత్నంగా అలా కలిసివున్నవారు సున్నిత మనస్కులు అని ఎక్కడొ చదివిన మాట గుర్తుకు వచ్చింది.
మరొక గంటకి తొమ్మిది అవుతుండగా అతనూ లేచాడు. శనివారం కనుక హడావుడి లేదు. ఇంకాసేపు వుంటే బాగుండునని మిత్రకి అనిపిస్తుంది.
విశ్వలోనూ అదే ఆలోచన. వెళ్ళాలనిలేదు.
"త్వరగా ఏమైనా వండేస్తాను. బ్రంచ్ తీసుకుని వెళ్ళండి." అంటూ కిచెన్ లోకి నడిచింది.
"అవేమీ వద్దు. మీకు కాలికి రెస్ట్ కావాలి. నేను కాసేపట్లో బయల్దేరతాను." మొహమాటంగా అన్నాడు.
రైస్ కడిగి కుక్కర్ లో పెట్టి, రెండు బంగాళదుంపల వేపుడు, కొంచం టమాట పప్పు చేసింది. విశ్వ ముక్కలు కోసి ఇచ్చాడు.
ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ, ఒకరు పాలు ఒకరు కాఫీ తాగుతూ, వంట పూర్తి చేసి, ఫ్రెష్ అప్ అయ్యి, భోజనం తీసుకున్నారు.
మధ్యాహ్నం కాబ్ పిల్చుకుని అతను వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా మనసులో దిగులు. ఏమిటో ఒక్క రోజులో ఇంత సాన్నిహిత్యం అనుకుంది.
*************************************************
మరో నాల్రోజులకి క్రొత్త సంవత్సరం.
విశ్వ కి వ్రాసిన గ్రీటింగ్స్. కాని అవి మరి కొన్ని నెలల వరకు అతనికి చేరనే లేదు.
మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం,
మాకెందుకిక దిగులని.
గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది,
వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.
మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది,
పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.
నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది,
అది చేయనున్న చిలిపి పనులచిట్టా.
ఋతువు కూడా ఒప్పేసుకుంది,
శీతువునంపి వసంతునికి కబురంపుతానని.
నిదురలో, మెలుకువలో, నన్ను మరిచిన మైమరుపులో,
నేను నిన్నే స్మరిస్తున్నాను, ఋతువుల కందని ప్రకృతి ఇది.
[సశేషం]
“కనుబొమ్మలు కలిసి వున్నాయి. అప్రయత్నంగా అలా కలిసివున్నవారు సున్నిత మనస్కులు అని ఎక్కడొ చదివిన మాట గుర్తుకు వచ్చింది.”
ReplyDeleteవారం రోజుల క్రితం మా అబ్బాయి చిత్రం చూసి మా బంధువొకాయన కనుబొమ్మలు కలిసి ఉన్నాయి అదృష్టవంతుడన్నారు. :)
Waiting for the next post..antae!
ReplyDelete“కనుబొమ్మలు కలిసి వున్నాయి. అప్రయత్నంగా అలా కలిసివున్నవారు సున్నిత మనస్కులు అని ఎక్కడొ చదివిన మాట గుర్తుకు వచ్చింది.”
ReplyDeleteనేనూ ఇదే కోట్ చేస్తున్నానండీ...సున్నితమో, అదృష్టమో నాకు తెలీదు కానీ నా కనుబొమ్మలు రెండేళ్ళ క్రితం దాకా ఇలాగే ఉండేవి...అలా కూడా బావుందనేవారు కానీ ఒక స్నేహితురాలు సలహా మీద ఐబ్రోస్ చేయించటం మొదలెట్టాకా..ఇప్పుడిక అలా లేవు.. :)
కాస్తెక్కువ రాసారే ఈసారి.good good..
Good bavundanDi
ReplyDeleteviswamitra 10 kooda thvaraga raseyanDi..
www.tholiadugu.blogspot.com
Intresting. :)
ReplyDeleteమీట్రా యూ ఆర్ సో అడోరబుల్ :)
ReplyDeleteనిదురలో, మెలుకువలో, నన్ను మరిచిన మైమరుపులో,
ReplyDeleteనేను నిన్నే స్మరిస్తున్నాను, ఋతువుల కందని ప్రకృతి ఇది.Superb!
సూపర్ ర్ ర్ .. no words
ReplyDeleteఅమెరికన్ తెలుగు నవల చదువుతున్నట్లుగా వుంది . వెరైటీగా బాగుంది .
ReplyDeleteమా అబ్బాయి దగ్గరికి బాయిసే వెళ్ళినప్పుడు ఒక పార్టీ కివెళ్ళాము. అప్పుడు నేను కూడా పకొడీ , పులిహోర తీసుకెళితే అందరూ బాగుందని ,కొన్ని పాక్ చేసుకొని ఇంటికి కూడా తీసుకెళ్ళారు . అసలు అమెరికన్స్ తింటారా అనుకున్నాను . అందరూ అలా మెచ్చుకొని తీసుకొని కూడా వెళితే చాలా సంతోషం అనిపించింది . వారి మర్యాదకి ముచ్చటేసింది .
హ్మ్మ్... ముంచుతున్న మంచు జడుల వెనుక వస్తుందన్న వసంతమే గా నేస్తం కప్పుకున్న తెల్ల దుప్పటి కింద మునగ దీసుకున్న మనసుకు వూరట.. మండించే మండుటెండ వెనుక చిరుజల్లు, విసిరే మంచు తెర వెనుక వసంతాల పూల గాలి.. నిదురలేక వేచిచూసే ఎర్ర బారిన కళ్ల కు ప్రియతమా నీ రాకే కాదా జోల పాట. ప్రేమ పుట్టిన క్షణాలను ఎన్ని సార్లు తలుచుకున్నా నిత్య నూతనమే కదా, ప్రతి సారి ప్రియతముని చూసే చూపు కు అది ఒక నిత్య స్రవంతి గా సాగే హేల కదా..
ReplyDeleteవిజయమోహన్ గారు, తృష్ణ, నాకు కూడా మీరన్న అదృష్టం జాస్తి అయితే! :) ఇప్పటికి కొన్ని యేళ్ళ వత్తిడి తట్టుకుని నాతోనే పుట్టిన నా యూనిబ్రో భద్రం. థాంక్స్.
ReplyDeleteతృష్ణ, మీరు ఇలా అంటుంటే చివరికి బాధ పడతారు నా తానుల తానుల కథలు చదవలేక మరి ;) తల్లోయ్ ఇక ఆపు అని పొర్లు దణ్ణాలు పెడతారు.
@ సునిత, కార్తీక్, సుజ్జి, హరేకృష్ణ, థాంక్స్.
ReplyDelete@ భా.రా.రె, యెప్, అంతా అదేమాట అంటారు[ట!] ;)
పద్మార్పిత, చూసారా, మన కవితానుబంధం. ఎంత వచనం వున్నా ఈ ఒక్క తుదిపలుకు నాకు యెంత తృప్తి నిస్తుందో మీకు అంతే నచ్చింది. ఈ పక్షపాత వైఖరి నాకు పోదేమో. ;) థాంక్స్.
ReplyDeleteమాలా గారు, మరి అమెరికాలో పుట్టిన ప్రేమ అక్కడి కథ లాగే వుంటుంది కదా? నా నిమ్మకాయ పులిహోర [లెమన్ స్పైసీ రైస్], బనానా/పైనాపిల్ వేసి చేసే రవ్వ కేసరి [సెమోలిన పుడ్డింగ్], రసమలై [మేలై బాల్స్] ఇక్కడ మహా ఫేమస్. :) మొన్నీ మధ్య పాట్లక్ సరదాగా మా టీం లో ఒకరి ఇంట్లో చేసుకున్నాము. నేను దోశలు చేసాను. పిండి ఎలా చేస్తారు? అలా ఎలా సన్నగా వేయగలరు? ప్రశ్నలతో మొదలై, దోశలో చుట్టిన పొటాటో కూర జారకుండా, కొబ్బరి పచ్చడి అద్దుకుని, సాంబార్ లో ముంచుకుని తింటూ, ఓ యు ఆర్ అ గ్రేట్ కుక్ అంటూ తెగపొగిడారు. తర్వాత కూడా ఒక గంటలో అరవై దోశలు చేయటం అన్న విషయాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. :)
ReplyDeleteభావన, కథ గురించి నీ వ్యాఖ్య అయినా - ఇంకేదో పొర కదిలింది. కంటి చూపుకే కరిగిపోయే మనసనే నా మీద నాకు కోపం. తన రాక ఒక వరమని మురిసే ఈ హృదయమన్నా ఇంకా విసుగు. కన్నీరు నవ్వులో కలిపేయటం అలవాటయ్యాక జీవితం చాలా ఆనందంగా కనపడుతుంది. :) ఓ పలుకు తీపి కావాలంటే మరో ఐదు రుచులూ చేదుతో సహా ఆస్వాదించాలి కదా. జీవితం నుండి వ్యధలు, ఆ వ్యధల నుండి కథలూను. మరదే నీతో వచ్చిన చిక్కు. ఒక తాను నుండి బ్రహ్మ దేముడు సృష్టించి భూమ్మీదకి వదిలిన బొమ్మలం మనమిద్దరం అని పదే పదే తలపోసేలాచేస్తున్నావు. పో నీ జట్టు పచ్చి. ;)
ReplyDeleteఉషమ్మ.. ఇంకేమంటాను తలూపటం తప్ప నువ్వు చెప్పిన ప్రతి దానికి.. ఉషకనుసంధానం గా సాగే పేరే కద ఉమ. ఉష ఐనా ఉమైనా భావనొక్కటే కదా ఆ భావనా పరిమళం మరువపు సుగంధమే కదా. . అవును బనానా పైనాపిల్ కలిపి రవ్వకేసరి చేస్తావా? అవునా బాగుంటుందా?
ReplyDeleteఎప్పటిలాగానే ఆహ్లాదకరమైన కధనం.
ReplyDeleteభావన, మరువపు సాహితీ/మైత్రీ సారం లెస్సగా పలికావు సుమీ! ;)
ReplyDeleteఅవును, ఇక్కడి వారికి మన ఏలకుల బదులుగా పళ్ళు కలుపుతాను, కానీ విడి విడిగానే. ఒక్కోసారి ఒక్కొక్క టేస్ట్. ఇది పెద్ద హిట్. అలాగే నిమ్మకాయ పులిహోర. మెతుకు మిగలదు నా అక్షయంలో.
వెంకటరమణ గారు, ఉరుములేని మెరుపల్లే కాస్త అలా ఓ పలుకు ... థాంక్స్. ;)
ReplyDelete"గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది,
ReplyDeleteవేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని."
మాటల్లేవు మౌనం తప్ప !
ఇదిగో ముందుగా మా పరిమళం మాటరాని మౌనంతో ఓ కబురు చెప్పినట్లే అదీను... ;)
ReplyDeleteకధ ఆహ్లాదంగా సాగుతుంది ఉషగారు. ఈ వారం కూడా నాకు మంగళవారం వరకూ చదవడానికి కుదరక పోవచ్చు :-)
ReplyDelete"సన్నగా దూదిపింజెల మాదిరిగా కురుస్తున్న మంచు. ఓ ప్రక్కగా బాక్స్ వుడ్ పొద ప్రక్కన కూర్చున్న బూడిద వన్నె కుందేలు. అలంకరణకి పెట్టిన రంగు రంగు చిన్ని చిన్ని దీపాల కాంతులు. మనసొక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది."
ఆహా ఊహించుకుంటేనే ఎంత హాయిగా బాగుందో.. నేను చికాగో లో ఉన్నపుడు, దట్టంగా కురిసిన తెల్లని మంచు పై పరావర్తనం చెందిన కాంతి వెన్నెల తో పోటీ పడుతూ మెరిసి పోతుంటే, బ్లైండ్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ వెలుగులో తనివి తీరా తడుస్తూ బయట సన్నగా కురిసే మంచును చూస్తూ గడిపేసిన రాత్రులు గుర్తొస్తున్నాయి.
"నన్ను మరిచిన మైమరుపులో, నేను నిన్నే స్మరిస్తున్నాను" చాలా బాగా నచ్చిందండీ, నాలుక పై తేనె పడగానే ఆ మాధుర్యానికి మనకు తెలియకుండానే ఓ క్షణం మైమరచి కళ్ళుమూసుకుంటాం ఎపుడైనా గమనించారా, మీ కవిత చదివి నేను అలాటి అనుభూతికే లోనయ్యాను.
అన్నట్లు ఇందాక చెప్పటం మరిచాను, నాదీ యూనీబ్రో నే.. కళ్ళద్దాలు పైఅంచు వెంబడి ఒకే వరుస లో కలిసి ఉండే కనుబొమలు చూసుకుని, నాలుగోతరగతి నుండీ కళ్ళద్దాలు పెట్టుకోడం వలనే అలా అయింది అని ఫిలయ్యేవాడ్ని :-) సున్నితత్వం అదృష్టాల సంగతేమో కానీ హైస్కూల్ రోజుల్లో మాత్రం సినిమా హీరోలకు మల్లే విడిగా లేవే వీటిని ఎలా సరిచేయాలా అని తెగ ఆలోచించేవాడ్ని. నా బాధ చూసి అమ్మ అలా ఉంటే అదృష్టం రా అని చెప్తుండే సరికి చేతులారా అదృష్టాన్ని చెరిపేసుకోడం ఎందుకులే అని అలానే వదిలేశా :-).
ReplyDeleteఓహ్ అలా ఐతే నేను అద్రుష్టవంతుడినే అన్నమాట :)
ReplyDeleteవేణు, మీరు అన్న ఆ రాత్రులు ఇక త్వరలో నాకూ రోజూ అనుభవంలోకి వస్తాయి. అటువంటి ఓ రేయి వ్రాసుకున్న అనుభూతి ఇది. "నాకు నిన్న రాత్రి మావూరి చందమామతో ఓ అనుభవం. తెలుగు కాలేండర్లేదు కనుక పెరుగుతున్నాడో, తరుగుతున్నాడో చెప్పలేను కానీ, సగమే వున్నాడు, కానీ మంచుతో -30F వుండి వూరిని వణికించేస్తున్న చలి కన్నా చల్లగా, మోడుల్ని సైతం వూపేస్తున్న గాలిని గేలిచేస్తున్నట్లు మెల్లగా వచ్చాడు. ఎంత కాంతో, ఇంతకు మునుపెవరి కళ్ళలోనూ చూడలేదు. తను కురిపించిన కాంతులు, ఉప్పు గుట్టల్లా పోగేసిన మంచు తిన్నెల్ని స్ఫటికపు మెరుపులతో నింపేసాయ్. "సగం చంద్రుడు నిండు కాంతులని" అని ఒక కవితా భావవీచిక మదిలోకి వచ్చింది, "
ReplyDeleteమీరే కాదు నేను సైతం ఆ యూనిబ్రో అదృష్టజాతకురాలినే. :)
కథ అంతా ప్రేమమయమే అంటే ఆహ్లాదమే కావాలి ఏ రాహువో ఆ అనుభూతి కబళించకపోతే.. నేను నిజంగా జీవించిన అనుభూతలలోనే మీరూ తన్మయత్వం పొందుతున్నారు. చిత్రం. ఇది భావుకతకి అందేది కావటం కావచ్చు. థాంక్స్.
@ రాఘవ్, హాయ్ హెల్లో ఇంకా నమస్తే! మరువపువనానికి విచ్చేసినందుకు థాంక్స్. ఇక పోతే క్రొత్తవారిని ప్రోత్సాహించాలి కనుక "మా యూనిబ్రో/అదృష్టవంతుల క్లబ్ ప్రెసిడెంట్ మీరు. వైస్ ప్రెసిడెంట్ వేణు గారు. నేను సెక్రటరీ. :)
ReplyDelete@ వేణు, మాటలో మాట - నేను కాడా ఎన్నో వత్తిళ్ళు తట్టుకుని నా/పరుల చేతులారా అదృష్టాన్ని చెరిపేసుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. ఓ సారి నృత్య ప్రదర్శనకి దాసరి నారాయణ రావు గారి యూనిట్ వారితో కలిసాం. ఆ మేకప్ మాన్ నా వెంట పడ్డాడు ఇంత వత్తుగా వున్నపుడు చాలా చక్కగా తీర్చిదిద్దవచ్చు అని. అంతా వాడికి వంత. ఏడ్చి మొత్తుకుని బయటపడ్డాను. రెండో సారి పెళ్ళికి, అంతా కలిసి వీలైనంత సణిగి గొణిగి, పెళ్ళిరోజు పిల్ల కన్నీరు పెట్టకూడదన్న కారణం తో వదిలేసారు. ఈ మధ్య ఓ పిల్ల అలా చేసుకుంటే మీరింకా అందంగా, యంగ్ గా కనపడతారు అని వూరించింది. పోవమ్మా! అని కొట్టిపడేసా. కనుక ఇక నా యూనిబ్రో నాతోనే ఈ లోకం వదులుతుంది. :)
@ వేణు, "నాలుక పై తేనె పడగానే ఆ మాధుర్యానికి మనకు తెలియకుండానే ఓ క్షణం మైమరచి కళ్ళుమూసుకుంటాం ఎపుడైనా గమనించారా, మీ కవిత చదివి నేను అలాటి అనుభూతికే లోనయ్యాను." చాలా థాంక్స్. ఈ మాట మరొక కవితకి వూపిరి పోసింది. త్వరలోనే మీ ముందుకు వస్తుంది.
ReplyDeleteవాహ్ కేక పెట్టిద్దాం అలా ఐతే :)
ReplyDeleteరాఘవ్, ఎవరితో పెట్టిద్దామండి? ఇంకా కేక నాకు వినపడలా మరి...
ReplyDeleteనేను సరిగా చెప్పలేని భావాన్ని మీరు సగం చంద్రుడు నిండు కాంతులని అక్షరబద్దం చేసిన తీరు చాలా బాగుందండీ..
ReplyDeleteహ హ యూనిబ్రో క్లబ్ బహు బాగు :-)
వావ్ నిజమా నా మాట మీ నుండి మరో కవిత వెలువడడానికి కారణమైందంటే అంతకన్నా ఏం కావాలి, సూపర్ :-)