శరత్ జగతి

కొమ్మలు విరుచుకుంటూ తీరిగ్గా ఈ చెట్లు-కొందరు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నట్లుగా-
పుట్టింటికొచ్చిన ఆడపిల్ల అమ్మఒడిలో కూరుకుపోయినట్లు
మంచు కొంగులోకి ముడుచుకుంటూ ఉన్నాయి
పొట్టితోకతో ఇటుకెరుపు పిట్ట ఒకటి కొమ్మ చివర్న రేకు మందారం లా రెక్కలు విచ్చుకుని
పాటలు నా వంతు అన్నట్లు కిటికీలోకి వంగి వంగి చూస్తుంది
టీ కప్పులో సెగలు బిగిసిన చర్మాన్ని తొలుచుకుని ముఖాన ఆవరించుకుంటున్నాయి,
ఫాక్టరీ గొట్టపు పొగలూ మంచు తునకల పైకి ఎగిసి ఆకాశాన్ని ఎక్కుపెట్టుకున్నాయి
తొలిచీ తొలవని గుట్టలోకి కలుగులో ఎలుకల్లా పిలకాయల చేతులు లాఘవం గా పాకుతున్నాయి,
మట్టికావచ్చు, ముద్దలు కట్టిన మంచు కావచ్చు ప్రతిమగా మలిచేందుకు...
ఎక్కడా చురుకు లేదు, కదలికలు మలిగిందీ లేదు
చిక్కగా ఎండలేదు, చలి చెర వీడేదీ కాదు- మరి ఇకప్పుడు
ముక్త కంఠం తో ప్రకృతి జీవనగీతికి హారతి పడుతూ,
తనువున, మనమునా శరత్కాంతుల చంద్రుని చందనాల, ఉధత్కిరణజలుని జాలంలోకి నెడుతూ...
వెన్నెల మాసపు వన్నెల చిన్నెల వగపు వెల్లువలో ముంచెత్తుతూ ఇలా!!!

ప్రవాహమైన "త్రిపద" లట!

1-
పాట
ప్రవాహం
పరవశం
-2-
నది
ప్రవాహం
సాగరకాంత
-3-
కథ
ప్రవాహం
పాత్రోచితం
-4-
మాట
ప్రవాహం
ఇష్టాగోష్టి
-5-
వేట
ప్రవాహం
మత్స్యజీవి
-6-
బాధ
ప్రవాహం
విలాపము
-7-
నవ్వు
ప్రవాహం
సంజీవని
-8-
ధ్వని
ప్రవాహం
సంగీతము
-9-
భక్తి
ప్రవాహం
కైవల్యము
-10-
కళ
ప్రవాహం
అక్షయము

*****
(సహృదయతతో అందరినీ ఆకట్టుకునే నూతక్కి బాబాయ్ గారికి సహకారం ఇస్తూ, ఇలా ఓ పావుగంట ప్రయోగం, నాకు కాస్త సవాల్ నేనే కల్పించుకుని 'ప్రవాహం' అనే పదం రెండవ పదం గా వాడాను ఈ పది త్రిపదల లోనూ
"ట్రై."
"త్రిపద"
రచన: నూతక్కి రాఘవేంద్రరావు.

చిరు పద కవితా ప్రక్రియలలో
స్వీయ మనోజనిత సృజితం
వినూత్న ఆవిష్కరణం.

రెండక్షరాలు తొలిపాదం
మూడక్షరాలు రెండోపాదం
నాలుగక్షరాలు మూడవపాదం
భావసారం చిలుకుదాం .

ప్రయత్నించండి
సాధన చేయండి
వస్తువుకా కొదవలేదు
అక్షరాలా అడుగంటవు

కాని
అక్షరాల పొదుపు
భవ్యతకోమలుపు.
..........................................
ఇలా రాద్దాం .నచ్చితే కొనసాగిద్దాం.)

బందీ

ఆగక కురిసే వెన్నెల్లో అప్పుడప్పుడు తారలు వడగళ్ళు అవుతాయి
రాలిపడే ఉల్కల వెంట బాల్యపు నేర్పుతో వెళ్తాను- ఇప్పటికే ఎన్ని వడగళ్ళు కరిగించాను
ఉల్కల, తోకచుక్కలను చల్లార్చాను!?
ఇకిక్కడ వానవిల్లు విరిసింది, లోలోపల ఒక పందిరి నింగిలా ఒంగి
ఇంకాస్త పరుచుకుని రంగుల కలలు, అతుక్కుని, అతికీ అతకక 
అయినా నిరంతరం గా సాగే గానమై!

అందుకే
నెలబాలుడు వస్తాడనుకున్న పిమ్మట అమాస బాధించదు
పున్నమి రానుంది అనేకున్నాక వేకువ రాకపోకలు పట్టవు
నడుమ కృష్ణపక్షపు పూర్వపక్ష కాంతులలో అవే నీలాలు
ఉన్నవి రానివి లెక్కేసుకున్నాక వేదన మనసున నిలవదు...


అయినా...
మసక తెరలు తొలగవు; చీకటి మొగ్గలూ విచ్చుకోవు
రేయంతా యాష్టగా వేసట యెరుగని ఆత్రుతగా 
వెలుగు కొసలు ముడివేస్తూ- నిదుర నిప్పులు ఊదుతూ-
నీడల్లో నీడగా, కదలాడే గోడగా ఇదిగో ఇక్కడే బందీగా విరిసే ఓ కల కోసం...