ఆగక కురిసే వెన్నెల్లో అప్పుడప్పుడు తారలు వడగళ్ళు అవుతాయి
రాలిపడే ఉల్కల వెంట బాల్యపు నేర్పుతో వెళ్తాను- ఇప్పటికే ఎన్ని వడగళ్ళు కరిగించాను
ఉల్కల, తోకచుక్కలను చల్లార్చాను!?
ఇకిక్కడ వానవిల్లు విరిసింది, లోలోపల ఒక పందిరి నింగిలా ఒంగి
ఇంకాస్త పరుచుకుని రంగుల కలలు, అతుక్కుని, అతికీ అతకక
అయినా నిరంతరం గా సాగే గానమై!
అందుకే
నెలబాలుడు వస్తాడనుకున్న పిమ్మట అమాస బాధించదు
పున్నమి రానుంది అనేకున్నాక వేకువ రాకపోకలు పట్టవు
నడుమ కృష్ణపక్షపు పూర్వపక్ష కాంతులలో అవే నీలాలు
ఉన్నవి రానివి లెక్కేసుకున్నాక వేదన మనసున నిలవదు...
అయినా...
మసక తెరలు తొలగవు; చీకటి మొగ్గలూ విచ్చుకోవు
రేయంతా యాష్టగా వేసట యెరుగని ఆత్రుతగా
వెలుగు కొసలు ముడివేస్తూ- నిదుర నిప్పులు ఊదుతూ-
నీడల్లో నీడగా, కదలాడే గోడగా ఇదిగో ఇక్కడే బందీగా విరిసే ఓ కల కోసం...
No comments:
Post a Comment