నాకు నేనే పరాయిని

ఎందరున్నా ఒక్క నీవు చాలనిపించావు.
ఎక్కడున్నా అక్కడ నీవే అగుపించావు.
నా వెరపులో, వంటరివేదనలో తోడై వెలికివచ్చావు.
నా గెలుపులో, ఆనందఝురిలో నీడై నింగికెగసావు.

తిమిరానికి తావీయకని నచ్చచెప్పి,
నాలోని కాంతి నీవే కబళించుకుపోయావు.
శిశిరానికి నెలవీయకని హెచ్చరించి,
నా వసంతాన్ని నీవే దోచుకుపోయావు.

చింత నీ చెంత చేరనీయకని బుజ్జగించి,
నాలో నమ్మకం నీరుగార్చే వంచన నీవేచేసావు.
శాంతి నీవెంటే వుండనీమని బ్రతిమాలి,
నా వైరి నీవై సంధిలేని సమరం చేసావు.

ఎంత వింత, ఇంతా చేసి మౌనముద్ర వేస్తివి.
మాటలెన్ని నేర్చినా నీ ఎదుట నన్నో మూగదాన్ని చేస్తివి.
వూసుల ముసురు నన్ను ముప్పిరిగొన్నా నీవు అచేతనవయ్యావు.
నను వీడవు, నాకు తోడవవు, తగునా నా లోపలి మనిషి?

26 comments:

  1. చాలా బాగుందండి.. అడ్డం ముందు నిలబడ్డట్టుగా...

    ReplyDelete
  2. "నను వీడవు, నాకు తోడవవు"
    అది మన నీడేగా ....బావుందండీ ....

    ReplyDelete
  3. మరొక్కసారి మరువం గుబాళింపులను ఆస్వాదించాను మీ కవితలో..

    ReplyDelete
  4. chinnaga ina chakkaga chepparu chaala baagundi

    ReplyDelete
  5. చాలా బావుంది మీ కవిత. రెండు మూడు సార్లు చదివించింది.

    ReplyDelete
  6. బావుంది ఉష గారు

    ReplyDelete
  7. * మురళి, పరిమళం, పద్మార్పిత, క్రాంతి, జయచంద్ర, హరేకృష్ణ, ధన్యవాదాలు. మౌనం కూడా ఒక భాషేనేమో, దానికి భాష్యాలే నాకు తెలియకుందేమో. అది అలకా, నిరసనా, మూగప్రేమా [అన్నీ సాధ్యమే కదా, మనలోని మనిషి మనతో అన్నీ సాగించవచ్చు] తెలియదింకా.

    ReplyDelete
  8. >>నాలో నమ్మకం నీరుగార్చే వంచన నీవేచేసావు.
    అర్ధంకాలా!!

    నాదో ప్రశ్న - మీరు http://sahajmarg.org/ రామచంద్రజీ మిషన్ ని ఎందుకు అనుసరిస్తున్నారూ? మీరూ మెంబరా అందులో? చారిజీ ని చూసారా ఎప్పుడైనా?

    ReplyDelete
  9. భాస్కర్ రామరాజు గారు, వంచనతో నా స్ఫూర్తిని నీరు కారుస్తుంది, నన్ను చింతల పాలు చేస్తుంది అని అన్నది ఎందుకంటే, ఆలోచించే సమయం లేనంతగా I get pushed in to illusions when I make a decision at times and naturally regret over that నా నిర్ణయాల్ని నేనే ప్రశించుకునే స్థితికి నన్ను నెడుతుంది ఆ మనిషి. అలాగే some of the things I do, go beyond what I like. ఇవన్నీ నాలోని ఆ మరో మనిషి నాకు చేస్తున్న వంచనే అనిపిస్తుంది. తనే నన్ను పరాయిని చేసింది అని నిర్వేదం కలుగుతుంది. మూడో మనిషిని కాకుండా నాకు నేనే తనని దోషిగా నిర్ణయించాను. అందుకే ఇంతకు మునుపు కవితల్లో "మనసు ఖాళీ చేసానెందుకు?" అనో "సరి ఎవరు నాకు ఎండమావిలో కూడా దప్తి తీర్చుకోను" వాపోయాను. ఇంకా అర్థం కాలేదంటే ఈ మనిషిదిదో గోల అని వదిలేయండి, బహుశా మీలోని మనిషికి వంచన తెలియదని అనుకుంటా.

    ఇక సహజమార్గ్ గురించి వివరణగా సాయంత్రం జవాబు ఇస్తాను. మీ ప్రశ్నలు చాలా ఏళ్ళ సాంగత్యం నుంచి సమాధానాలు రాబడతాయి మరి. సహనంగా చదవగలరనే అనుకుంటున్నాను.

    ReplyDelete
  10. Well expressed..! The words u use r very touching ..

    ReplyDelete
  11. ఉషాజి!! నాకూ రామచంద్రజీ మిషన్ తో 18 సంవత్సరాల అనుబంధం ఉంది, ఇంకా కొనసాగుతోంది. మా అమ్మ, ఆమ్మ, పెదనాన్న చాలా మంది మెంబర్లు. మా పెదనాన్న ప్రిసెప్టర్ గా కుడా చేసారు కొన్నాళ్ళు.

    మీరు పై మాటలు ఎవ్వర్ని అడుగుతున్నట్టూ? మీ అంతరాత్మనా?

    ReplyDelete
  12. అవును, నాతో నేను, నాలో నేను, స్వగతంగా నన్ను dissect చేస్తూ మీకూ అవకాశం ఇచ్చాననుకుంటున్నాను, మీ లోపలి మనిషిని తరిచిచూసుకోను. అందుకనే ప్రతిస్పందన వ్యాఖ్యల కన్నా మీలో మీరు సంభాషించుకునే రీతిలోవుంటుందేమో. కొన్ని రచనలు చదివాక చాలా సార్లు ఆ పాత్రల్లో జీవించేట్లుగానో, లేక జీవితానికి సామీప్యంగానో వుండి కాస్త స్వగతంలో పడేట్లుగానో వుంటాయి. ఈ కవిత ఆ రెండో కోవలోది. "మనసున్న మనిషికీ సుఖము లేదంతే" కవి గారి ఆత్మ నాలో పరకాయప్రవేశం చేసింది.

    ReplyDelete
  13. భళా...
    ముఖ్యంగా రెండవపేరా.
    అదేమిటో ఈ కవిత చదవగానే నేను రాసిన ఒంటరితనమా... కవిత గుర్తుకొచ్చింది. అయితే నేను రాసినది రాయి అయితే మీరు రాసినది వజ్రం.

    ReplyDelete
  14. * ప్రదీప్ మీ "భళా" ప్రయోగం బాగుంది. మరి ఒ ముత్యాల హారం ఇటు విసరండి మహరాజా! ;) (స్వగతం వెలికి రాగానే ఆ దైన్యం ముగిసిపోయింది, కనుక మళ్ళీ గల గలా ఎండుటాకుల కొమ్మనే] నిజానికి ఆ రెండో పాదమే ముందుగా వ్రాసి, ఎత్తుగడగా సరిపడదని ముందు పాదం వెనగ్గా వ్రాసాను. ఇక మీ కవితకీ దీనికి భావ సామీప్యం తక్కువేనేమో, చదివింది పూర్తిగా గుర్తు లేదు. కానీ ఇది "నిందాస్తుతి" వంటి పదాల అల్లిక కదా. మీది మాత్రం "అన్వేషణ" గా సాగించారేమో?

    ReplyDelete
  15. * ప్రదీప్ పైన వ్యాఖ్య పంపాక ఈ మాట కూడా చెప్పివుండాల్సింది అనిపించింది. "అయితే నేను రాసినది రాయి అయితే మీరు రాసినది వజ్రం." అవసరమా? :) శైలి, వస్తువు అన్నీ వేరు, నిజానికి మనమే వేరు. నాకు నచ్చలేదు మీ మానస పుత్రికని మీరే కించపరుచుకోవటం. అన్యధా భావించకండి. మీవి చాలా లోతైన కవితా వస్తువులు, చదువరి మనసుకి తాకే ఆటుపోటుల అలలు. నావి చిన్న స్పందనకి కూడా వూగే చిగురు కొమ్మలు.

    ReplyDelete
  16. ఉష గారూ
    ఎబ్బే, ఇదేం బావోలేదండా. కిట్నమ్మ అన్నారు, గోదారమ్మా అన్నారు, కిట్నలో మునిగా అన్నారు. మరి పల్నాటి సెరిత్ర రాత్తంటే అటైపు సూపుకూడా సూళ్ళేడు. http://palnativeerulu.blogspot.com/

    ReplyDelete
  17. మొదటి వాఖ్యకు,
    వజ్రమే ఇస్తే మీరు ముత్యాల హారం కోరుతున్నారే.. సరే లెండి ఈ సారి అలాగే ప్రయత్నిస్తాను. ఇక భావ సామీప్యానికి వస్తే, నా కవితలో నేను ఒంటరితనాన్ని వెతుకుతూ, ఒంటరితనాన్ని వర్ణిస్తూ రాసాను.
    ఇక మీ కవితలో "ఎందరున్నా ఒక్క నీవు చాలనిపించావు.
    ఎక్కడున్నా అక్కడ నీవే అగుపించావు."
    ఈ రెండు వ్యాక్యాలు చదవగానే నా కవిత గుర్తుకొచ్చింది. అందుకే అలా అన్నాను.
    రెండవ వ్యాఖ్యపై,
    (బాగా వాత పెట్టారు. కానీ నా భావం చదవండి)
    నా మానస పుత్రికను నేను కించపరుచుకోలేదు. ఎలా అంటారా ?
    నా కవిత రాయే, అది నా లాంటి శిల్పి చెక్కిన రాయి. అది అందరినీ ఆకర్షించదు.
    మీరు రాసే వాటిలో ఉన్న పద ప్రయోగం నా కవితలలో ఉండదు. అందుకు మీరు రాసిన కవితను వజ్రమన్నాను.
    నన్ను నేను మునగ చెట్టెక్కించుకునే కన్నా నన్ను నేను నేలపై ఉంచుకోవడమే నాకు ఇష్టం.
    ఇక చివరలో మీరు రాసిన " మీవి చాలా లోతైన కవితా వస్తువులు, చదువరి మనసుకి తాకే ఆటుపోటుల అలలు. నావి చిన్న స్పందనకి కూడా వూగే చిగురు కొమ్మలు". ఇది కూడా నేను మీకు తిప్పి కొట్టచ్చేమో... సరే లెండి నాకు నచ్చని సంప్రదాయంలో నేనే వ్యాఖ్య రాసాను. (ఒకరిని ఒకరు పోగుడుకునే శైలిలో)

    ReplyDelete
  18. * ప్రదీప్ హమ్మయ్య, పట్టు ఓ పట్టాన వదలని విక్రమార్కులు బేతాళుడిని కనికరించారన్నమాట. ;)నన్ను సులభంగా వదిలేసారు, బ్రతుకుజీవుడా.

    ReplyDelete
  19. "శాంతి నీవెంటే వుండనీమని బ్రతిమాలి,
    నా వైరి నీవై సంధిలేని సమరం చేసావు."
    ఇది చాలా బావుంది

    ReplyDelete
  20. * కొత్తపాళీ గారు, ధన్యవాదాలు. మీకు ఆ పంక్తి నచ్చినందుకు ముదావహం.

    ReplyDelete
  21. * రామ రాజు గారు, ఇంకా చదవ లేదు కానీ మీ పల్నాటి బ్లాగుకి మగువ మాంచాలంత ధీరోదాత్తురాలనై మరీ వస్తా. వైరా, మాచెర్ల, రెంటచింతల, బుగ్గవాగు [నా జన్మస్థలం] ప్రాంతాల్లో నివసించినప్పటి పౌరుషాన్ని వెంటేసుకుని వస్తా! ;)

    ReplyDelete
  22. సుజ్జీ, అలా అంటారా, సరే కానీండి. నిజంగానే ఆ మనిషికి తగిలో, తాకో, కదిపేవుంటుంది నా సంవేదన, స్వగతాల సంఘర్షణ. ఎంతైనా నాతోనే కదా తను సంభాషించగలిగేది నెనర్లు.

    ReplyDelete
  23. ఉష గాని ఉష..లోపలి మనిషి. ఊసుల బాసలు, నీడల తోడులు అన్నీ మనవరకే. వసంతాన్ని శిశిరం దోచుకున్నట్టే, శాంతి ని అశాంతి కబళించడానికి చుట్టూ వున్న ప్రపంచానికి ఒక్క రెప్పపాటు గడువు చాలేమో !

    ReplyDelete
  24. * భాస్కర రామి రెడ్డి గారు, ముందుగా నదుల పట్ల మక్కువ మీరా "గోదారమ్మ పరవళ్ళు, కృష్ణమ్మ ఉరవళ్ళు అచ్చంగ నావేనమ్మా" కవిత వ్రాయగా మీ వ్యాఖ్యే ప్రేరణ. అందుకు కృతజ్ఞతలు. ఇక్కడ ప్రస్తావన అప్రస్తుతమైనా, ఈ రకంగా మీకు తెలుపవచ్చని వ్రాసాను. ఇక ఈ కవితపై మీరన్నది నిజము సుమీ, అందుకే నేను ఆ లోకం జోలికి పోను, నా లోకం లోకి దాన్ని రానీయను. ఊసుల బాసలు, నీడల తోడులు చాలనుకునే మనుగడ సాగిస్తూ, అపుడపుడూ ఇలా మారాములు చేస్తూ గడిపేస్తాను. గుండె గోడల్లో తాను, నా నాల్గు గోడల నడుమా నేనూ - అదీ మా ఇద్దరి లోకం. అయ్యో పాపం పిచ్చితల్లీ, నిన్ను నేనే బద్నాం చేస్తినా! అకటా కింకర్తవ్యం? ;)

    ReplyDelete
  25. చాలా బాగుంది ఉష గారు :)

    ReplyDelete
  26. నేస్తమా, మరువం నీవు ఒకరినొకరు మరువరమ్మా! ధన్యవాదాలు.

    ReplyDelete