బహుదూరపు బాటసారి

ఈ తరుణాన వెనుదిరిగి చూస్తే వేవేల క్రోసుల నా జీవితబాట,
తృప్తిసౌధం చేరగ నేను పరుచుకుని నడిచొచ్చిన రహదారి.
గతుకులున్నాయి, అతుకులున్నాయి, అయిననూ పొందికైన అమరిక.
అరమరికలేక అంటిపెట్టుకున్న ఆత్మీయులే అట మైలురాళ్ళు.

అచటచట బాట ప్రక్కగా నా లక్ష్యసిద్ధి నిలిపిన గిరులు,
నిరాశలో కృంగిన లోయలు, వెలికి తెచ్చిన ఆశయాల నిచ్చెనలు.
నవ్వుల క్షణాలు విత్తులుగా నాటిన తరులు, పూల వనాలు,
నడుమ వేదన ఘడియలే తాకవలని ముళ్ళజెముడు పొదలు.

బడలిక వున్నా, దప్పికగొన్నా కొంత పరుగూ తప్పలేదు.
పరుగాపి విశ్రమించిన ఏ మజిలీ నాది కాలేదు, నిలవనీయలేదు.
ఇరుప్రక్కా, వెనుకా ముందూ పయనించే సహచరులు కోకొల్లలు.
ఎవరి దారి వారిదే, వేగమెంచ ఎవరి గీటురాయీ నాది కాదులే!

ముందువైపు చూపుసారిస్తే ఎందుకో వేగంగా సాగాలన్న అత్రుత.
కలల కల్లోల సాగరాలు, వెతల అగ్ని పర్వతాలు కనుమరుగైనాయి.
సాఫల్య మైదానాలు, కైవల్య పచ్చిక బయళ్ళు వూరిస్తున్నాయి.
నా త్రోవ తుది వరకు నేను అలుపెరుగని బహుదూరపు బాటసారినే!!!

13 comments:

  1. ఆహా అద్భుతం, నేను ఒక్క పంక్తి రాస్తే ఆ పంక్తితో మీరు ఒక కవితను రాయడం నేను నమ్మలేకపోతున్నాను. బహుశా ఈ కవితను నా కవితతో కలిపితే బహుశా ఇంకా అందంగా ఉంటుందేమో (???)
    ఇక ఆ శిలాజం ఆత్మకధ రాయడానికి ప్రేరణ మీ బ్లాగులో (http://maruvam.blogspot.com/2009/05/blog-post_24.html) నేను రాసిన వాఖ్య " ఎక్కడో చదివినట్టు "తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత"
    కొండ ఎక్కే పనిలో ఉన్నా, కానీ ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు "
    ==
    ఇక సామీప్యమంటారా, ఉన్నదల్లా ఆ ఒక్క వాక్యమే సామీప్యం. నేను బాట వేసానని ఒక్క ముక్కలో చెబితే, ఆ బాట గురించి జనసామ్యమైన రీతిలో చెప్పారు. చాలా సంతోషం.

    ReplyDelete
  2. మీ కవిత చదువుతుంటే గతజ్ఞాపకాల చెమ్మ ఒక్కసారిగా ఉప్పొంగిన భావన. నాకెందుకో ఈ పరుగుల లోకానికి దూరంగా సెలయేటి పరవళ్ళ మధ్య, పక్షుల పలకరింతల తో సహజీవనం చేయాలని ఎంత కోరికో. ఇక్కడికి వచ్చాక పరుగులు తగ్గకపోయినా, ప్రకృతి అందాలు కొద్దిగా నైనా సేదతీరుస్తున్నాయి.

    ఓడిన ప్రతిమజిలీ ఒక మైలు రాయి.ఆ మైలు రాళ్ళే తరువాతి కాలంలో గెలుపురాళ్ళు.

    ReplyDelete
  3. నేనొప్పుకోను ..నేను చేబుదామనుకున్నదే ..భాస్కర్ రామిరెడ్డి గారు ముందే చెప్పేశారు ....నేనైతే ఇంత అందంగా చెప్పలేకపోదునేమో ....

    ReplyDelete
  4. చాలా బావుంది..లాంగ్ టర్మ్ గోల్స్ ఇంకా పాజిటివ్ థింకింగ్ గుర్తుకొచ్చాయి..అభినందనలు

    ReplyDelete
  5. * ప్రదీప్, ఈ పొడిగింపు మీకు నచ్చినందుకు నాకూ సంతోషం. ఇక ఈ రెండిటినీ అనుసంధానం చేయటం మీరే చేయకూడదూ? మీ అభినందనతో కొంచం లోలోని సంశయం పోయింది, తెగ విసిగించిన work related issue resolve కూడా అయింది. అన్ని మంచి తరుణములే అని నేటికి సెలవిచ్చాను. :)
    * భాస్కర రామి రెడ్డి గారు, "గతజ్ఞాపకాల చెమ్మ" నాలోను ఉప్పెనేనండి. అదే నా బలహీనత అని సన్నిహితులు హెచ్చరిస్తారు. నాకూ ఓ ఎకరం మల్లెల తోటలో, కాస్త తామర చెరువు తవ్వి, కూర మళ్ళు కూడా పెంచుకుంటూ, ఇదండీ జీవన సంధ్యలో నా కల. తీరుతుందనే నమ్మకం.
    * పరిమళం గారు, ఇంత ముచ్చటగా అభిమానం మీరు పంచాక చాలు సుమండి. వేరే మాటలేలా? ;)
    * హరేకృష్ణ, కవితలోని ఆత్మ జీవితాన తృప్తి ని పొందటం, దానికి దార్లే మీ వ్యాఖ్యలో ప్రస్తావించినవి.

    అందరికీ నెనర్లు.

    ReplyDelete
  6. నవ్వుల క్షణాలు విత్తులుగా నాటిన తరులు, పూల వనాలు,
    నడుమ వేదన ఘడియలే తాకవలని ముళ్ళజెముడు పొదలు...

    chala baaga chepparu..

    ReplyDelete
  7. * సుజ్జీ, అర్థరాత్రి అలిసిన వేళల మీ వ్యాఖ్య చాలా ఆనందాన్నిచ్చింది. "నడుమ వేదన ఘడియలే తాకవలని ముళ్ళజెముడు పొదలు" ఏ మనిషినైనా నెమరేసినా మొదటిసారంత తీవ్రంగానే కృంగదీసేవి అవే. అందుకే అలా వ్యక్తీకరించాను - ముళ్ళ పొదని తాకకుండా తప్పుకు తిరిగినట్లే వీటినీ దూరం వుంచాలని, "నవ్వుల క్షణాలు విత్తులుగా నాటిన తరులు, పూల వనాలు" నిత్య నందనవనాలుగా పెంచాలనీ. నెనర్లు.

    ReplyDelete
  8. పద్మార్పిత, మరి జీవితేఛ్ఛ, జీవితం పట్ల ఆపేక్ష కూడా అంతే సూపర్బ్ కదా, అందుకే మీ చేత ఈ కవిత superb అనిపించింది. నెనర్లు.

    ReplyDelete
  9. నడిచొచ్చిన దారిలో ఎన్ని ముళ్ళు, రాళ్ళు ఉన్నా ఆగి వెనక్కి చూసుకున్నప్పుడు వీటిని దాటి వచ్చామన్న సంతోషం వెలలేనిది.. భవిష్యత్ బాటలో పూలు మాత్రమే ఉండాలనుకోవడం ఆశావాదం.. ముళ్ళున్నా పక్కకి తొలగించుకుని వేల్లిపోగలం అనుకోవడం ఆత్మ విశ్వాసం... చాలా బాగుందండి కవిత..ఆశావహమైన ముగింపుతో..

    ReplyDelete
  10. మురళి గారు, పద్యానికి తాత్పర్యం మాదిరి మీరలా క్లుప్తంగా, అయినా వివరంగా నా కవితని విశదీకరిస్తే నాకే ముచ్చటేస్తుంది, నా మరువం గుభాళింపు చూసి. నెనర్లు.

    ReplyDelete
  11. evari geeturaayi vaaride anna vaakyam nannu baaga aakattukumdi. prati majili mimmalni meekugaa nilabedutoo mumduku saagipoyemduku, okamaaru gumdelnimdaa oopiri teesukunemduku saayapadina jnaapakala vuravade mee kavita anipimchimdi. chaala udvegamgaa vumdi.

    ReplyDelete
  12. వర్మ గారు, comparison is death of happiness ఇది నేను నమ్మిన సూత్రం. అలాగే కర్మయోగం అనుసరించేదాన్ని. కనుకనే "ఎవరి గీటురాయీ నాది కాదులే" అని అన్యాపదేశంగా ఎవరి కొలమానం వారిదే అని తెల్పాను. మీ మిగిలిన వ్యాఖ్య అంతా నాకు పూర్తిగా వర్తిస్తుంది. నా మారథాన్ - విశ్వమానవ ఆయురారోగ్యాలకి అంకితమిస్తు,...http://maruvam.blogspot.com/2009/04/blog-post_11.html, ఈ శీర్షిక మీరే పెట్టాలి http://maruvam.blogspot.com/2008/12/blog-post_21.html నేను చూపగల నిదర్శనాలు. ఏమిటో నా బ్లాగుని ప్రమోట్ చేస్తున్నట్లుగావుంది ఈ ప్రతి వ్యాఖ్య. :) still going ahead with posting.

    ReplyDelete