దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా.

ముందు మాట: ఇవి దేముడితో నా సంభాషణలు. నాకు వ/నచ్చిన రీతిలోనే నేను వెళ్తాను. మీ దారికి నను రమ్మని పిలవకండి.
**********************************
ఇదేమిటని నివ్వెరపోకు

జరగలేదెపుడూనని తప్పుకోకు
వున్నావాని కొందరన్నారు
వేడుక చూస్తునావాని కొందరడిగారు
బ్రతుకు ప్రశ్న చేసి పంపావీ లోకానికి
నిను ప్రశ్నిస్తూనే ముగిస్తా కడకి

తేటతెల్లనైన నా మనసు నీకు కనరాలేదు,
నల్ల బంగారాల నగలకి లోబడిపోయావా?
గుండెగుడిచేసి ఆ లయలో నిను లయం చేసినా
గర్భగుడుల్లోనే బందీనౌతానంటావేం?
ముక్తి చాలని వేడినా రిక్త హస్తాలే నావి,
అరిషడ్వర్గాలు ఇంకా పెంచుతున్నావేం?

మనసనే నీ శత్రువు నాకుంది,
ఆ ఒక్కటీ అంతం చేసేయ్.
రక్కసి వూహా రాజ్యమేలుతుంది,
ఆ సంహారమూ కానిచ్చేయ్.
నన్ను శిధిలం చేయమని నా ప్రార్ధన,
కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా.

44 comments:

 1. దేముణ్ణి ప్రశ్నించాను, పలకరించాను, వేడుకున్నాను ఇపుడూ అంతే ప్రార్ధిస్తున్నాను. అప్పటి మాటలివి.
  (1)
  అయ్యో దేవా,
  నా గుండె తలుపులు, గొళ్ళాలు వూడే దాకా
  తట్టి తట్టి బొబ్బలెక్కాయేమో నీ హస్తాలు
  ఇలా చాపు నా భక్తి నవనీతం రాస్తాను
  రేపో మాపో నాకై అభయమీయాలవి మరి!
  (2)
  జగమంతా తానై!

  సౌధమొకటి కట్టి స్వామినకడ వుంచానన్నారెవరో
  వీలుచూసుకొనొకసారి రమ్మని కబురంపారు
  వైనమేమిటని ఆత్మతో జాబువ్రాసాను
  నీలోవున్నానని మరిచావా అని మొట్టికాయ వెయ్యనేవేసారు
  జగమంతా నిండిన స్వామి ఒక చోట ఒక రూపున వుండటమేమిటి?
  యుగమంతా ముగిసినా వుండడా తానక్కడే నిరాకార నిర్మలుడు?

  #http://maruvam.blogspot.com/2008/12/blog-post_6690.html#
  (3)
  జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు?
  http://maruvam.blogspot.com/2009/04/blog-post_06.html
  (4)
  మాయో, మర్మమో, మోక్షమో, సఫలమో ఈ జీవితం?
  http://maruvam.blogspot.com/2009/03/blog-post_24.html

  ReplyDelete
 2. నా ముందు మాట:
  మీ ముందు మాటలో వేరే దారికి రమ్మని పిలవొద్దన్నారు. అందుకే మీ దారిలోనే ఎదురొచ్చి వ్యాఖ్యానిస్తున్నాను.
  ఎప్పటిలాగే ఈ వ్యాఖ్యను తొలగించే హక్కులు మీవే, అయితే మీరు ఎప్పటిలాగే అలా చెయ్యరని తెలుసు. అయినా ఏదో చాదస్తం.
  సరే, ఇక విషయానికి వస్తే, ఆ దేవుడు మీకు ఇచ్చే సమాధానానికి నా ఊహ ఈ వ్యాఖ్య
  ===========
  >>> తేటతెల్లనైన నా మనసు నీకు కనరాలేదు,
  > ఆ తేటతెల్లని మనో క్షీర సాగరం పైననే కదా నేనున్నది
  >>> నల్ల బంగారాల నగలకి లోబడిపోయావా?
  > నల్ల బంగారమంటి బొగ్గులతో వచ్చిన బూడిదను నుదిటిన పూసుకుని తిరిగే శివుడుని సైతం నేను కాదా
  >>> గుండెగుడిచేసి ఆ లయలో నిను లయం చేసినా గర్భగుడుల్లోనే బందీనౌతానంటావేం?
  > నాకు హృదయపు గర్భ గుడి చాలని తెలియదా, మళ్ళీ ఆ గర్భగుడులలో బందీని చేసినది నీవు కాదా
  >>> ముక్తి చాలని వేడినా రిక్త హస్తాలే నావి, అరిషడ్వర్గాలు ఇంకా పెంచుతున్నావేం?
  > ముక్తి చాలన్న కోరికలోనే ఏదో కోరిక మిగిలి లేదా? స్వార్ధం ముందుకు రాలేదా... ఆ స్వార్ధమే నా కోసం వేచి చూసే సహనాన్ని హరించలేదా? ఇక అరిషడ్వర్గాలు పెరగవా ?

  ReplyDelete
 3. * ప్రదీప్, మొదటిసారిగా దేముడు పూనతాడట, పలికిస్తాడట అన్నది నిజ జీవితంలోకి అనుభవంలోకి తెచ్చారు. నిజంగా మరొక్కరైనా నాకు సమాధానం ఇస్తారనే, ఒకవేళ ఆయన మరొక భక్తులింట పూజకి ఆగిపోయుంటే దూత నైనా పంపుతాడనే ఇలా సభాముఖంగా విన్నవించుకున్నాను. ఇక ఆ చివరి స్వార్థం మన ముందు భక్తశిఖామణులు అంటించిన జాడ్యం, అరిషడ్వర్గాల నుండి అది జనించి, అది తీరక అవి మరింత విజృంభించి ఇలా ఏం చేయాలో తోచక ఆయన్ని నిలదీస్తూవుంటాను. సహనాన్ని పరీక్షించకని బెదిరిస్తూవుంటాను. అయినా నా పిచ్చి కానీ దైవంతో మైత్రి, వైరి రెండూ తిరిగి ఆయనాడించే ఆటలు కావా ఏమి! జగన్నటకసూత్రధారి దగ్గరి స్క్రిప్ట్ ఎవరైనా కొట్టెస్తే బాగుండు, రేపటి నా పాత్రని ఈ రోజే రిహార్సలు వేసుకుంటాను.

  ReplyDelete
 4. అమ్మో దైవదూతను చెయ్యొద్దు నన్ను.. just kidding ;)
  "జగన్నటకసూత్రధారి దగ్గరి స్క్రిప్ట్ ఎవరైనా కొట్టెస్తే బాగుండు, రేపటి నా పాత్రని ఈ రోజే రిహార్సలు వేసుకుంటాను." - whats fun if you know the future.... it will be too pale and dull...

  ReplyDelete
 5. మరుజన్మ అక్కర్లేదు; "మమ = నాది" " అహం = నేను" అనే రెండు పదాలు ఇచ్చై చాలు. అన్ని ప్రశ్నలకీ సమాధానాలు వాటంతట అవే దొరుకుతాయి.

  ReplyDelete
 6. ఉష గారు,

  మనసు శత్రువెలా అయిందండీ ....అయితే బుద్ది అవాలి కాని.....మనసే మీ చేతా ఈ ప్రశ్నలు వేయిస్తోంది.....ఇంత అంతర్మధనం చేస్తోంది....
  సాగర మధనంలో మొదటి ప్రస్థానం గరళానిదె
  ధైర్యమో/నమ్మకమో ఒదలక సాగిస్తేనే కదా అమృతం వచ్చేది?

  ఇక ప్రదీప్ గారు,
  నన్ను సదా వెంటాడే ప్రశ్న...కోరికలు ఉండకూదదంటూ సాధన చేసే వారికి అది కూడా ఒక కోరికే కదా? ఆ నిష్కామ స్థితి నిజంగా సాధ్యమా?

  బుద్ధితో ఆలోచిస్తే తట్టేది కాదేమో ఆ స్థితి

  ReplyDelete
 7. భావకుడన్ గారు,
  ఆ నిష్కామం సాధ్యమే అని నేను నమ్ముతాను.
  బహుశా కోరికలలో రకాలు ఉన్నాయేమో ?
  ఉత్తమ కోరిక, మధ్యమ కోరిక, తుచ్చ కోరిక వగైరా...
  ఉత్తమ కోరికలు ఉండడమే వైరాగ్యమని మనం భావిస్తున్నామేమో !!
  మీరన్నట్టు బుద్దితో తట్టదది, సాధనతోనే వస్తుంది.

  ReplyDelete
 8. ఉష గారూ,
  బాగుందండి, కరుణశ్రీ గారిలాగా చెప్పారు. ఠాగూరును గుర్తుకు తెచ్చారు.
  భావకుడు గారు,
  మనసు కన్నా పై స్థాయి లొ బుద్ధి ఉంటుంది. బుద్ది, బుద్దిగా మనసును చూస్తూ ఉంటుంది, మనసు తిన్నగా ఉన్నంతవరకు. మనసు తింగరి వేషాలేస్తే, బుద్ది వారిస్తుంది. వినకపోతే, మనసు తరువాత బాధపడుతుంది.
  కోర్కెలగురించి -- సంకెళ్ళు బంగారపువైనా, ఇనుపవైనా సంకెళ్ళె.
  కోర్కెలు మనసులోజనిస్తాయి. మనసు లయమై పోతే కోర్కెలే ఉండవు. ఇది జ్ఞానమార్గము.
  పిల్లవాడు, ఎప్పుడూ టీ.వీ చూస్తుంటే వాడిచేత టీ.వీ మానిపించాలంటే వాడిని బయట తిప్పుకు రావాలి. రెండు పనులు టైము వేస్టు పనులైనా, మొదటి దానికంటే రెండవది ఉత్తమము. అలానే, మనసుకు కోర్కెలు తప్పు అంటే వినదు. అందుకే దానికి వేరే మంచి కోర్కే అలవాటు చేయాలి. ఇది భక్తి మార్గము.

  ReplyDelete
 9. ప్రసాద్ గారు, నాది, నేను - ఒక్కోక్షణం అవి ఏనాడో విడనాడాననే నాకు అనిపిస్తుంది. అందుకే నన్ను గురించి ఆ సమయాల్లో నేనిలా తలచాను.
  శూన్యంలో మౌనాన్ని నేను
  మౌనంలో రాగాన్ని నేను
  రాగంలో భాష్యాన్ని నేను
  భాష్యంలో భావాన్ని నేను
  భావంలో జీవాన్ని నేను
  జీవంలో పూర్ణాన్ని నేను
  నేనన్న అహాన్ని వీడిన బ్రహ్మని నేను...
  అందుకే సమాధానాలు కూడా వద్దు, ఇక పరమాత్ముని సన్నిధి చాలని అనిపిస్తుంది. అంతలోనే మమకారం కదలాడుతుంది. తన నీడలా మోహం, ఇలా ఒకటొకటి. ఆ బంధనాలనుండి విముక్తి కావాలనే ఆ ప్రార్థన. ఆయనకీ మానవ జీవితం క్రొత్త కాదు. రాముడిగా, బుద్దుడుగా చవి చూసాడు అయినా మళ్ళీ ఓసారి జీవిస్తే ఆ శోకాంధకార జీవితం గుర్తుకువస్తుందని అదే కానుకగా ఇస్తానన్నాను.

  ReplyDelete
 10. బావుకుడన్ గారు, కొంత పునర్వసు గారు చెప్పారు. నా మానసమిది. బుద్ది కర్మానుసారిణి. మనసుని అది నియంత్రించగలదు. కానీ అన్నివేళలా మాత్రం కాదు. నిలువరించినా ఆగక అదుపు తప్పుతుంది కొన్ని సార్లు. ఆపై పాశ్చాత్తాపపడుతుంది. ఈ ప్రార్థన అలా బాధ పడి ఖిన్నవదనై తన ఉనికి ముగించేయాలనే అలా వేడుకుంది. వేదన, శోధన, మధనపాటు ఇలా అన్నీ అనుభవమైపోయాయి. వేచి వుందామన్న భావన కలగని క్షణాలు వచ్చినపుడు ఇలా ప్రార్థిస్తాను. ఉపశమనం ఆయనే కల్పిస్తారు. ఉదాహరణకి ఉదయం వున్న భావోద్రిక్తత ఇపుడు లేదు. ఇలా చర్చిస్తుంటే ఇంకా ప్రశాంతంగా వుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 11. ప్రదీప్, కోరిన వివరణ ఇచ్చినందుకు నెనర్లు. ఎంతైనా దైవదూతలు మరి. వినినంతనే ప్రత్యక్షమై కూరిమి చేస్తారాయే...

  ReplyDelete
 12. >> కరుణశ్రీ గారిలాగా చెప్పారు. ఠాగూరును గుర్తుకు తెచ్చారు.
  పునర్వసు గారు, ఆ మాటతో నా కవితలకి ఓ సార్ధకత చేకూరినట్లుగా వుంది. నా బ్లాగుకి స్వాగతం. బావుకుడన్ గారికి తగు సందేహనివృత్తి చేసినందుకు ముదావహం.

  ReplyDelete
 13. "యద్యద్విభూతిమత్సత్త్వమ్" అన్న ఆయన ’విభూతి’ని అందిపుచ్చుకున్న మీరు ఆయనకే ప్రశ్నలు సంధిస్తారా ?జన్మనిచ్చే ఆయనకే మరుజన్మ కానుకగా ఇస్తారంటారా ! హమ్మా !

  ReplyDelete
 14. ఆధ్యాత్మికత పట్ల అభిప్రాయాలు పంచుకోను ఆకాంక్ష కలవారెవరైనా మీ అమూల్యమైన భావాలు నాతో పంచుకోండి. ఇతి మత పర చర్చ కాదని మనవి. మనలోని దైవం పట్ల మనకుగల భయ, భక్తులు, ముక్తి, మోక్ష సాధనల పట్ల అవగాహన, అంతర్మధనం నా ఈ కవితకి ఆధారం. నా అహాన్ని జయింపచేసిన వాడు ఆ పరంధాముడే. నేను లీనమయేదీ ఆ పరమాత్మునిలోనే. ఇంత దృఢ సంకల్పం అలవరచుకున్నది ఆ దేవదేవుని చేరుకోవాలనే, ప్రదీప్ గారు, పునర్వసు గారన్నట్లుగా ఇది ఉత్తమ కోరిక, క్రమేణా నిష్కామ భావన కలుగుజేసేదీను.

  ReplyDelete
 15. విజయమోహన్ గారు, నా కవితే శివుడాజ్ఞ, ఎలా అంటారా - మీ మందలింపులో దాగున్న భావన గ్రహించాను. కానీ, పైన వ్యాఖ్యల్లో వ్రాసాను ఎందుకు అలా అన్నానో. నాకు మరు జన్మ వద్దు. వున్నా అది ఆయనకే ఇచ్చేస్తాను. పిత్రువాక్పరిపాలకునిగానో, గీతా బోధచేసో, నిర్వాణం పొందో ఆయన ఈ భవసాగరాన్ని ఈదేయగలడు, మానవ మాత్రురాలిని ఇక నా వల్ల కాదు. మాయా మోహాల్లో పడిపోతున్నాను, ముక్తి మార్గానికి దూరమౌతున్నాను, అని వేదన దహించినపుడు ఈ నిందాస్తుతి వెలువడుతుంది. నాకీ అరిషడ్వర్గాలు వద్దు. జవాబు దొరకని ప్రశ్నలూ వద్దు. ఆయన సన్నిధికి చేరిపోతే చాలు. అదే వేడుకోలుగా కాక కానుకలకి వరాలు అమ్ముకుంటున్నాడని కాసింత పరిహసిస్తూ నా మరుజన్మ ఇస్తాను అన్నాను. అలా అన్నందుకేగా మీరిలా వచ్చి మంచి ఉద్బోధ చేసారు మరి. కనుక వొప్పుకుంటారా, ఈ కవిత ఇంతటి అమూల్యమైన అభిప్రాయ సేకరణకే పుట్టిందని.

  ReplyDelete
 16. నేనన్న అహాన్ని వీడిన బ్రహ్మని నేను,
  బ్రహ్మనే శూన్యాన్ని నేను. వలయం పూర్తవుతుంది. శూన్యం నుండి శూన్యం లోకి. పూర్ణం నుండి పూర్ణం లోకి.
  విభూతి అందిపుచ్చుకున్న తరువాత వీరూ వారౌతారు. అప్పుడు అంతా ఒకటే, మరలా వెలువడి నప్పుడు, వీరే వారికి కానుకలిస్తారు. అద్వైతాన్ని చాలా అందంగా అందించారు.

  ReplyDelete
 17. పునర్వసు గారు, మీ పూరణకి ధన్యురాలను. ఈ ఉదయం కలిగిన ఈ భావన ఆధ్యత్మిక పరంగా ఇంత ఉదాత్త విశేషాంశాలతో కదలటం అంతా ఆ దైవ సంకల్పం.

  ReplyDelete
 18. ఆసక్తికరమైన సంభాషణ."నిను ప్రశ్నిస్తూనే ముగిస్తా కడకి" ఒక నిరంతర శోధనకి వ్యక్తీకరణ. అదే నిజం.అదే అవసరంకూడా.

  ReplyDelete
 19. చివరి చరణం బాగుంది.

  ReplyDelete
 20. మీ date of birth చెప్పేయండి. జగన్నాటక సూత్రధారి script ఇచ్చేస్తాను

  ReplyDelete
 21. "నేనన్న అహాన్ని వీడిన బ్రహ్మని నేను"

  ప్రార్ధనలూ, సందేహాలూ, బంధనాలూ, విముక్తులూ అన్నీ ఆ అహంకారనివే! దాన్ని వీడిన తర్వాత ఉండేది కేవలం సచ్చిదానంద బ్రహ్మం

  Read more on "I" and "Mine" on my blog: http://plaintruthsfromprasad.blogspot.com/

  ReplyDelete
 22. మహేష్, బహుశా ఈ కవిత కూడా ఒక విధమైన శొధనేనేమో? ఈ రకమైన అశాంతికి తరుచుగా లోనవటం, అది వ్యక్తం చేసిన తరుణాన మరిన్ని జ్ఞాన సంబంధిత విషయాలు సముపార్జన చేయటం. మళ్ళీ సాంసారిక దైనందిన జీవనం. ఇది నా జీవిత చక్రం. నెనర్లు.

  ReplyDelete
 23. * కొత్త పాళీ, బొల్లోజు బాబా గార్లు, ధన్యవాదాలు. సుపరిచితుల బహు కాల దర్శనం. మరువానికి భాగ్య దినం.

  ReplyDelete
 24. * నీహారిక గారు, అయ్యోరామా, ఆ జాతకాలు/స్క్రిప్టులు చదివేసా. నిజానికి ఈ ధోరణికి వస్తానని అవే చెప్పాయి. నేనన్నది కేవలం ఆత్మ విమర్శగా, వ్యంగ్యంగా నన్ను నేనే హేళన చేసుకుంటూ, ఎందుకంటే తెలిసినా, తెలియకపోయినా కొన్ని విషయ వాసనలు ఎదురైనపుడు నా మనసుకేమౌతుందో నాకే తెలియటం లేదు. అందుకు అలా ధ్వనించాను. అదిసరే కానీ ఆథ్యాత్మిక చింతనలో పడే వారి జన్మ రాశి మీకు తెలియకనా ఏమి నన్ను అడగటం? వూహించండి చూద్దాం.

  ReplyDelete
 25. ప్రసాద్ గారు, చాలా ఆనందం. మీరిచ్చిన లింకులో కొన్ని చదివాను. ఆ 20 టపాలు క్రమంగా చదువుతాను. పైన వ్రాసాను కదా.. ఇంకా
  ahamkara - the thought of I;mamakara - the thought of Mine అన్న బంధనాల్లో ముఖ్యంగా ఆ రెండో దాంట్లోచి బయటపడలేకపోతునాను. వ్యక్తుల పట్ల నా అనుబంధం ఒక పాశమై నన్నూ పెనవేసి కట్టేస్తుంటుంది. ఆఖరుకి వృత్తిపర విషయాల్లో కూడా I get so emotional, and it gets sort of surgically removing the attachment I develop to a task. అంతలోనే "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం" అనిపించేంత అనుభవాలు. ఈ రెండూ నాకు సమ్మతం కాదు. మీరన్న దిశగా సాధన చేస్తున్నాను. ఏదో ఒకరోజు సచ్చిదానంద స్తాయిని చేరుకుంటాను. మరొక్కసారి కృతజ్ఞతలు.

  ReplyDelete
 26. ఈ ఆథ్యాత్మిక టపాకి తమ విలువైన అభిప్రాయాలు ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు. చివరిగా నా సాధన గురించి. కర్మము తొలగించుకుని జ్ఞానం, యోగము ఇరు కనులుగా సాగాలన్న నా ప్రయత్నానికి ముందు నేపథ్యం ఇది.
  http://sahajmarg.org/ రామచంద్రజీ మిషన్ వారి రాజయోగ అభ్యాసిగా మారిన వైనమిది. మా ఇంట్లో అన్నయ్య [నాగేశ్వరరావు/నాగు] పుట్టినపుడు త్రాచుని చంపారట, పాపపరిహారంగా గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేయించి నిత్య పూజలు, అభిషేకాలు జరిగేవి. నా వూహ వచ్చేసరికి భజనలు, పూజలు, గుడికి వెళ్ళటం, నది స్నానాలు ఇలా దైవారాధనలో మునిగితేలేవారం. మా మేనత్త గారికీ ఇదే పరిస్థితి. అత్త కొడుకు నాగరాజు/చిన్న నాగు పుట్టినపుడు పొలంలో త్రాచుని చంపారట. అది మావయ్య గారికి కలలో కనిపించిందట. అలా వాళ్ళింట్లోనూ పూజలే. గుడి పూజారి కన్నా ముందుగ ఉదయానా, చివరిగా రాత్రిలో శ్రీశైల మల్లయ్యని పూజించేవారు. నిత్య ఉపవాసాలు, సమారాధనలు. ఈ నేపథ్యంలో పెరిగిన నాకు, కాథలిక్ కాన్వెంట్ మూలాన ఆ మతపర విషయాలు కూడా పరిచయం చేయబడ్డాయి. నాకు 16సం. వయసపుడు మేనత్త కుటుంబం మొత్తం సహజమార్గ అభ్యాసులుగా మారారు. ఒక విధమైన కూతూహలం, అదెలా జరింది అని. నా చేతివ్రాత బాగుంటుందని బాబూజీ ఉపదేశాలు వ్రాయించారు. అలా జిజ్ఞాస కలిగింది. మా మేనమామ గారి భార్య కూడా అభ్యాసి అయ్యారు, తను నేను బాగా ఉత్తరాలు వ్రాసుకునేవారం. బాగా ఆస్తిపరులైన తనలో క్రమేణా వైరాగ్యపరమైన దృష్టి రావటం గమనించాను. దాదాపు 60 సం. పైగా శివ పూజల్లో మునిగి తేలి, గీత పఠనంలో జీవించిన నానమ్మ కూడా మారటం, తను నాకు యూనివర్సిటీలో చదివినపుడు తోడుగా రావటంతో మరింత బలపడింది. అలా అభ్యాసిగా మారాను. ఈ క్రమంలో, "రాతిలోనే దేముణ్ణి దర్శించంగలమనుకుంటే నా ఆకలి తీర్చగ నూకలు విసిరే తిరుగలినే పూజిస్తాను" అన్న కబీరు మాటలు, "గుడి మెట్లకి రాయే, గుళ్ళోనూ రాయే మీకు అని గేలి చేసిన వ్యక్తితో నీ తల్లి స్త్రీ, భార్యా స్త్రీ ఆ ఇద్దరిలో వేర్వేరు రూపాలు చూడగలవుగా, ఇదీ అంతే" అన్న వివేకానందుని నుండి, గీతా భోధలు, "క్రింద పడ్డ సూది నెత్తటానికి క్రేను అవసరం లేదు, చెయ్యి చాలు" అన్న సహజమార్గ సందేశం వరకు చదివిన వాటి పట్ల అవగాహన కలిగిందనే భావిస్తున్నాను. చాలా రోజుల తరబడి నాతో ఆధ్యాత్మిక చర్చలు జరిపిన శంకర్ మనోహర జోషి గారు కూడా "అధములు భజనలు, మధ్యములు పూజలు, ఉత్తములు ధ్యానం" చేస్తారు అని అంగీకరించారు. అటువంటి ఉత్తమ మానసిక స్థాయి రావాలంటే నిరాకారమైన, నిర్గుణ,నిర్మల మూర్తిని, ఆ పరమాత్మని మనలో మనం దర్శించగలగాలి. అందుకే నా ఈ సహజ మార్గ పయనం, సాధన. నేను నా పిల్లలకి చేతులు ముకుళించటం వచ్చిన ప్రాయం నుండీ నేర్పింది అదే, "మీ హృదయంలో వసించే స్వామిని ప్రార్ధించండి, మీ స్వంతానికి కోరికలనేవి కోరకండి, మరో ప్రశాంతమైన రోజు ఈ వసుధైక కుటుంబానికి ఒసగమని అడగండి" అని. నాకు కలిగిన అనుభవాలు పెక్కు. నా సమస్యాత్మక వేదనా భరిత బౌతిక జీవితంలో ఆ మార్గం మూలంగానే ఇంకా మనగలుగుతున్నాను. జీవితమంతా ధార్మిక జీవనం గడిపిన నాన్న గారు ఇపుడు సహజమార్గాన ఆథ్యాత్మిక మార్గాన పయనం మొదలుపెట్టారు. ఇంటా బయటా నేను పాలుపంచుకునే సత్సంగ్ మునుపటి సాధు సాంగత్యం వంటిదే. ఓం తత్ సత్.

  ReplyDelete
 27. "మీ హృదయంలో వసించే స్వామిని ప్రార్ధించండి, మీ స్వంతానికి కోరికలనేవి కోరకండి, మరో ప్రశాంతమైన రోజు ఈ వసుధైక కుటుంబానికి ఒసగమని అడగండి"
  ఉష గారూ ! అమ్మ చెప్పే మాటలు గుర్తొచ్చాయి . అందరూ బావుండాలని కోరుకో ..ఆ అందర్లోనూ నువ్వూ ఉంటావు నేనూ ఉంటాను అనేది .అప్పట్నుంచీ అదే అలవాటు .కవిత ...సందేహాలూ ..వివరణలూ ...ఆసక్తికరంగా ఉన్నాయి .

  ReplyDelete
 28. * పరిమళం, నా మాటల్లో మీ అమ్మగారి పలుకులు ఏరుకున్నందుకు చాలా సంతోషం. నేనూ అటువంటి అమ్మనే కదా. నేను నేర్చింది నా పిల్లలకి పంచాను. ఓ రేపున నా పిల్లలు మీ మాదిరే నన్ను తలుచుకుంటారనుకుంటే ఏదో అలౌకికానందం. మీరు మళ్ళీ నాలో మమకారం నింపేసారు, అయ్యో దేవా ఇక నా గతి ఇంతేనా? మీకు ఆసక్తి కలిగించినందుకు ముదావహం. పఠనాసక్తి, సాధనాసక్తికి శుభారంభం. నెనర్లు.

  ReplyDelete
 29. I think you are a capricorn woman.

  ReplyDelete
 30. బాగుందండి మీ వేదాంత చర్చల పరంపర.మీరు తెలుసుకున్న సత్యాన్ని నలుగురికి తెలుపుతున్నారు-- అదే చదవరులకు ఒక అభ్యాసం."భగవంతుణ్ణి చేరుకునే మార్గం పూజల్లొ,వ్రతాల్లో,మూఢాచారాలలో లేదు.నలుగురికి ఉపయోగపడేట్లు చేసే పనిలో ఉంది.మానవ సేవే మాధవ సేవ.అదే జీవిత పరమార్ధం.ముక్తికి మార్గం" అని నమ్మే మనిషిని నేను.మీతో పాటే మరో నలుగురిలో ఆధ్యాత్మిక పరమైన ప్రకంపనలు కదలాడించగలిగారు.అదే మీ ముక్తికి సొపానం.(పొరపాటు ఏమైన రాస్తే మన్నించగలరు)

  ReplyDelete
 31. ** అయ్యోదేవా, ఇప్పుడే ఈ మతిమరపూ ఇచ్చావా? ఇప్పుడు నీహారిక గారికి ఏమని చెప్పనయ్యా, స్వామీ? ఇందుకే కదా నిన్నలా నిలదీసేదీ? ధన్యవాదాలండి. నా రాశి మీన రాశి pisces

  ReplyDelete
 32. * తృష్ణ, మీ నమ్మకం సనాతన మన ధర్మానికి ప్రతీక. అది కొనసాగించండి. నా మార్గం, నేను నేర్చుకోవటం, నాకు తెలిసింది చెప్పటం, సాధన చేయటం నడుమల సాగుతూవుంది. అందరిలోనూ అంతర్లీనంగా వుండేదే ఆథ్యాత్మికం, దారులు వేరైనా చేరేది ఆ దరికే. పయనం మొదలుపెట్టాను. గమ్యం చేరతాననే నమ్మకం. మీరేమీ పొరపాటు మాట అనలేదు.

  ReplyDelete
 33. కేవలం సేవ చేయటం మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వదు. సేవకు ఆధ్యాత్మికం తోడైతే అందే ఫలితాలే వేరు. ఉష గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఇక మీ ప్రస్తుత టపా గూర్చి..... నవవిధ భక్తి మార్గాలలో మీది ఏ రకమైన భక్తి మార్గమో నాకు అర్థం కావడం లేదు. సఖ్యానికి కాస్త దగ్గరగా ఉన్నట్టుగా నాకు తోచుతున్నది. మీలాగే దేవునితో తన మనసులోనే పోట్లాడే ఒకావిడ నాకు తెలుసు. నేను కూడా అప్పుడప్పుడు నా స్వామితో ఈ పనే చేస్తుంటాను.

  ReplyDelete
 34. saipraveen నాది సహజమార్గం. srcm.org మీకు సమయం చిక్కితే ఇదే టపాలో పైన నేను వ్రాసిన వ్యాఖ్యల్లో నా జీవిత ప్రహసనం వ్రాసాను.చూడండి. మీరడిగిన వివరాలు దొరకొచ్చు.నెనర్లు.

  ReplyDelete
 35. "అధములు భజనలు, మధ్యములు పూజలు, ఉత్తములు ధ్యానం"... ఈ పంక్తి నన్ను బాధిస్తున్నది. ఈ కలియుగములో కేవలం దేవుని నామస్మరణము చేస్తేనే చాలు, స్వర్గప్రాప్తి కలుగుతుంది. ధ్యానం వల్ల కేవలం మనము మాత్రమే లాభపడతాము. పూజలలో పాల్గొన్న వారికి మాత్రమే, దాన్ని లాభము కలుగుతుంది. కాని, భజనలలో ఆ భగవుంతుడి గుణగణాలు, ఆయన నామాన్ని మనము స్తుతిస్తాము. కొందరు ముందుండి పాడితే, కొందరు దానికి తమ స్వరాన్ని కలుపుతారు. ప్రత్యక్షంగా పాల్గొనని వారు, ఆ భజనలు కేవలం వినడం చేతనే పరోక్ష పద్ధతిలో పాల్గొన్నవారవుతారు. ఇందువలన అందరూ లాభపడతారు.

  ReplyDelete
 36. saipraveen అనుభవజ్ఞులు విజ్ఞులు తెలపాల్సిన అంశాల్లోకి నేను రావటం సబబు కాదు. దైవం కలడా లేడా అన్నది మొదలు ఆ దైవాన్ని చేరుకొనె మార్గం వరకు ఎన్నో చర్చలు జరగొచ్చు. వీటన్నిటినీ ప్రక్కనుంచితే నమ్మకం అంకితం ఇవి నా వరకు నేనుఎంచుకున్న మార్గంలో నేను కనపరచవలసిన లక్షణాలు. అవి అలవరుచుకునే సాధనలో భజన, పూజ, ధ్యానం ఈ పరిణామ క్రమం సంభవించింది. ధ్యానం లోనూ సత్సంగ్ వుంటుంది. బాధలనుండి విముక్తి, ధనప్రాప్తి, స్వర్గలోక సంప్రాప్తి ఇవి నా వాంఛితాలు కాదు. సంచిత కర్మ తప్పదు. జన్మరాహిత్యం, మోక్షం పట్ల ఆసక్తి ఇంకా తెలుసుకోవాల్సింది చాలావుంది. ఇది వాదోపవాదం కాదు కనుక ఇక ముగిస్తున్నాను. నెనర్లు.

  ReplyDelete
 37. ఉష గారు, మీ బ్లాగు అంటే నాకు మక్కువ ఎక్కవ. చాలా బాగా వ్రాస్తున్నారు. అసలు ఇటువంటి అంశములపై బ్లాగులను చూడడమే అరదు. మంచి ప్రయత్నం. నేను కూడా ఇకమీదట వాదానలకు దారితీసే వ్యాఖ్యలను చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

  ReplyDelete
 38. saipraveen, apologies, too tired to write in telugu. :( you took me wrong. i am all for explaining if I knew any. I never treated your comment as a base for an argument. I just did not want to hurt your beliefs nor budge on mine. Also spirituality is such a noble land that dwelling itself within itself is a boon, and enlightening some is even a rare gift. I had all fortune to sit by Swami Chinmayananda, have letters hand written addressed to me when I was hardly 13 by his disciples, met an australian whose grand mother used to accompany swami vivekananda and he even showed the book autographed by swami. Many more to quote, my journey started of at a higher point when young. Seeing many marching along makes me feel content. Come and visit me more often.

  ReplyDelete
 39. మీరు నిజంగా అదృష్టవంతులు. చాలా గొప్పవారితో మీకు పరిచయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. నేను అంతర్జాలం(internet)ను ఆన్ చేసే ప్రతిసారి మీ బ్లాగు తప్పక చూస్తాను. మీరు కూడా నా బ్లాగును కాస్త చూసి మీ విలువైన సలహాలను అందిచాలని కోరుతున్నాను. ధన్యవాదములు.

  ReplyDelete
 40. /*** All, this comment is for an older post not on my top post ఏకాకి ***/

  saipraveen, Don't miss out on Mr. Prasad Chitta's blog http://plaintruthsfromprasad.blogspot.com/ మీకు ఆసక్తి వుందని తెలుస్తుంది కనుక ఆథ్యాత్మిక పయనంగా సాగాలంటే వివరణాత్మక విజానాన్ని ఇచ్చే బ్లాగది. అలాగే సహజమార్గ్ వారిదే మరో జాలం http://spiritualityfoundation.org/ besides srcm.org
  నా జీవితం కర్మని బట్టి యోగం, యోగాన్ని బట్టి ప్రాప్తం అని నమ్మే తీరు. కనుక "బుద్దికర్మానుసారిణి" అని నమ్మి నిగ్రహాన్ని అలవరుచుకుని కైవల్య సాధన దిశగా సాగే పయనం. మీ బ్లాగుకి వచ్చాను. వ్యాఖ్య వ్రాయాలంటే మరోసారి చదవాలనిపించి ఆగాను. కొంచం సమయాభావంలో వున్నాను. కానీ అక్కడ నా అభిప్రాయం పంచుకుంటాను. నిజానికి మరువానికి వచ్చిన ఎవరి బ్లాగైనా చూసేతీరతాను. ఇక్కడితో ఈ టపాకి సెలవిస్తూ, త్వరలో మరో టపాతో మనం మళ్ళీ మరింతమంది అభిప్రాయ సేకరణ చేద్దాం.

  ReplyDelete
 41. ఉషాజీ,
  కవిత ఈ కవితకు సరిపడ ( తక్కువేనేమో ) వ్యాఖ్యలలో వారి వారి మనసు విప్పి చర్చించిన తీరు, ఎంత మమతలు వద్దనుకున్నా మమకారాల వైపు లాగుతుంది. కానీ అంతా చదివిన తరువాత ఒకే ఒక క్షణం నిశ్చల నిర్వికార స్థితి ఎలా వుంటుందో అనుభవించాను. ఇంతకంటే దైవం గురించి , ఆధ్యాత్మికత గురించి చెప్పలేని అశక్తుణ్ణి. నావరకు నాకు నేను లోనైన ఆ నిశ్చల నిర్వికార స్థితే దైవం. ఆ క్షణం లో నిర్గుణిన్ని. సర్వ లోక హితుణ్ణి. లోక కల్యాణ కర్తవ్యుణ్ణి.

  ReplyDelete
 42. @ భా.రా.రె. అన్నీ యదృఛ్ఛికాలు కాదు జీవితంలో జరిగే సంఘటనలు. మీరు ఈ రోజు భగవంతుని గురించిన ఈ వ్యాఖ్య వ్రాయటం అదీ శక్తిస్వరూపుణిగా కొలిచే దుర్గాష్టమి నాడు కావటం మీకేదో సందేశం కావచ్చు.
  > ఆ క్షణం లో నిర్గుణిన్ని. సర్వ లోక హితుణ్ణి. లోక కల్యాణ కర్తవ్యుణ్ణి
  ఈ స్థితి కలకాలం నిలవాలని ఈ మిత్రురాలి ఆకాంక్ష.

  నాకూ మరొకసారి ఈ ఆధ్యాత్మిక లోకంలో సేదతీరే అవకాశాన్నిచ్చారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 43. ఉష గారికి, నమస్కారములు.

  "ఆధ్యాత్మికం" వర్గం క్రింద మీరు వ్రాసిన కవితలు "మాయో,మర్మమో...ఈ జీవితం; జగదాధారా; దేవా! కానుకగా....; నా జీవనమే వ్రతం" మొదలైనవాటిని చదివాను. అందులొ "మాయో,మర్మమో...ఈ జీవితం" చాల చక్కగా వున్నది. అంటే, మిగిలినవి బాగా లేవని నా ఉద్దేశ్యం కాదు.

  మనసనే నీ శత్రువు నాకుంది,
  ఆ ఒక్కటీ అంతం చేసేయ్.
  రక్కసి వూహా రాజ్యమేలుతుంది,
  ఆ సంహారమూ కానిచ్చేయ్.
  నన్ను శిధిలం చేయమని నా ప్రార్ధన,
  కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా.

  ఈ కవితలొ మీ భావాలు కొన్ని నాకు అర్ధం కాలేదు. "మనసనే నీ శత్రువు నా కుంది" అంటూనే, ఆ పై వరుసలొ "తేటతెల్లమైన నా మనసు నీకు కనరాలేదు" అని వ్రాసారు. అంతేకాకుండా, ఆ మనసుని అంతం చేయమన్నారు. మనసు, భగవంతుడికి శత్రువు ఎట్లా అవుతుంది? మనసును అంతం చేసినట్లైతే, మీ ఉనికి ఎక్కడ? అలాగే, "నన్ను శిధిలం చేయమని" ప్రార్ధిస్తున్నారు. ఈ జన్మలొ మిమ్మల్ని శిధిలం చేస్తే, ఈ జన్మే వృధా అవుతున్నపుడు, మరు జన్మ గురించి తాపత్రయం ఎందుకు?

  భగవద్గీత, పదవ అధ్యాయం: విభూతియోగం:ఇరవై రెండవ శ్లోకం; మరియు ముప్పై తొమ్మిదొవ శ్లోకాలను మీరు చదవండి. మనసు గురించి, సమస్త జీవరాసుల గురించి తెలుస్తుంది.

  ఇక ముగింపుగా చెప్పాలనుకున్నది: "ఆధ్యాత్మికం" అంటె, "మన మనస్సు, శరీరముల" గురించి తెలిపేది. ఆధి భౌతికం, ఆధి దైవికం అంటె, భౌతిక శరీరము, వాటికి కలిగే కష్ట,నష్టాలు,లాభాలు; దేవతలవలన మనకు కలిగే లాభాలు,నష్టాలను గురించి తెలియచెప్పేవి. వీటిని గురించి, నా బ్లాగు లొ " ఎవరీ భగవంతుడు? (రెండు భాగాలు);"హరిః ఓం" మొదలైన వ్యాసాలలొ నాకు తెలిసినది వ్రాసాను. నా అభిప్రాయాలు, మీ మనసులోని అభిప్రాయాలతొ ఎంతవరకు కలుస్తాయో వీలుంటే చదవండి. ఇది మిమ్మల్ని విమర్శించటానికి వ్రాసింది కాదు; కేవలం విషయ విశ్లేషణం మాత్రమే. నా బ్లాగు లింక్ క్రింద ఇస్తున్నాను.

  భవదీయుడు,
  మాధవరావు.
  http://madhavaraopabbaraju.wordpress.com/

  ReplyDelete