హరివిల్లు - ౩ : భువిలో దాగినదేమో?

[నా సాహితీ మిత్రులు "అర్జునుడి బాణాలు" ప్రదీప్ సంకల్పించిన "సప్తకవితల సంకలనం" కొరకు ఈ చిరు కానుక. చదువరులకు ఎవరు తలపుకొస్తారా అని మాత్రం కాస్త కుతూహలంగావుంది! ]

ఏడేడు సంద్రాల తప్పటడుగేసి ఎదిగినాం
సంద్రాల పడవల్ల తప్ప తాగి సిందేసినాం
ఎన్నెల్లో చేపలల్లే వలపు సయ్యాటలాడినాం
పొద్దు చూసి నీలి మబ్బు కళ్ళాపి జల్లినాం

పుట్టి గిట్టినాక అంతా నాకు అతిధులే
ఒడ్డూబారు కొలవను ఆరడుల గొయ్యి తీస్తాను
కాదు కూడదంటే చితిమంట పేర్చేస్తాను
శవవేడుక సంబరాల ఎర్రెర్రని నెగడు పెట్టేస్తాను

పైరు నాకు బహు పసందు, పంట కూడ మంచి విందు
పచ్చ కామెర్ల రోగికన్నా నేను నయం
పచ్చనాకే పట్టుకుంటా, విడవకుండా స్వాహా చేస్తా
పచ్చ గొంగళని ఛీత్కరించినా నాకన్నా ఎవరు హెచ్చు?

రాళ్ళలో రప్పల్లో కాపురముంటా
మనిషి జాతికి వెరచి పారిపోతా
వెంటాడితే మటుకు ఎదురొస్తా
తోకతోనే శాస్తిచేస్తా పసుపువన్నె నా విషం అద్ది

పూలన్నీ సువాసనిస్తాయా, మాలో ఒకరం బైరాగి కామా?
నా వన్నెలు చూసి మల్లెలు సిగ్గుపడవా!
నా సోయగాన మరువం మౌనం వహించదా?
పేరులోనే రంగు దాచిన కనకాంబరం నేను కానా!

మాగాణి గట్టున రావి వేపకి పెళ్ళంట
రాగాలు పలుకగ నాకు పిలుపంట
వూరేగి తూరేగి వెర్రెక్కి పాడంగ
నా పాలపిట్ట వన్నె పులకించెనంట

వంగతోట కాడ ముల్లని మావ గోటికి నా వంత
మనసుపడి మనువాడిన వాడికి నేనె కానా వంట
కూరా నారా లేనివాడికీ నేకానా కారు చౌక
వూదా రంగు వెదకనేల నే నెదురుగ వుండ?

హరివిల్లిలా దేవలోకం విడిచి భువిని దాగదా పలు రూపాలై?

14 comments:

 1. ధన్యవాదాలు... ఇక నా నుంచి రావాలి మరో కవిత...

  ReplyDelete
 2. మౌనం వహించని మరువం
  సంధించిందికదా మిత్రుని బాణాలతో
  సప్తవర్ణాల హరివిల్లుని

  ReplyDelete
 3. * విజయమోహన్ గారు, చమత్కారం ["మరువం మౌనం వహించదా?" అని నేను వ్రాస్తే, "మౌనం వహించని మరువం" అని మీరు వ్యాఖ్యానించటం ;) ] దాగిన మీ వ్యాఖ్యకి ధ్యన్యవాదాలు.
  * మాలా కుమార్ గారు, దర్శించాలంటే అన్నిటా ఈ వర్ణమాలికలే, జగమంతా ఇంద్రదనుస్సు పోకడలే కదండి.
  * ప్రదీప్, ఈ కవితకి స్ఫూర్తి మీ అభినివేశమే...

  ReplyDelete
 4. రస హృదయులు, ఏమంటారో కానీ ఈ హరివిల్లు మీద నా విశ్లేషణ: సప్త వర్ణాలకి నా ప్రతీకలు - జాలరి, కాటి కాపరి, ఆకు గొంగళి, తేలు, కనకాబరం, పాల పిట్ట, వంకాయ. ప్రకృతిలోనే పలు వర్ణాల పోకడలు లేవా. అవే నా కవితకి వస్తువు.
  /********************************************************
  జాలరి: నీలి సముద్రాలు, నీలి మబ్బులే అతని లోకం
  కాటి కాపరి: చితి మంటల ఎరుపు అతని సమస్తం
  అకు గొంగళి - పచ్చనాకు కన్నా తన వన్నెదే అతిశయం
  తేలు - విషం పసుపుగా నా అభివర్ణన
  కనకాబరం - ప్రత్యేకించి చెప్పేదేముంది
  పాల పిట్ట - ఆ రెక్కల అందం ఫిరోజా ఉపరత్నానికైనా కలదా?
  వంకాయ - ఊదా రంగున తనకు ధీటు ఏది?
  ***********************************************************/

  ReplyDelete
 5. ఇంద్రధనుస్సును మాముందు ఆవిష్కరిచారుగా ....మీ విశ్లేషణ మరింత రమణీయంగా ప్రకృతిని కళ్ళముందుంచింది .

  ReplyDelete
 6. * పరిమళం, ఎందుకో ప్రకృతిని కొన్నే కోణాలోంచి చూస్తాము అదీ అందమైన వాటినే ఇంకా అందంగా వర్ణిస్తాము అన్న అపరాధభావన నుండే ఈ రకమైన ప్రతీకలు తీసుకోవాలని అనిపించింది. నా ఆ ప్రయత్నం మరొకరు/మీరు హర్షించినందుకు ఆనందంగావుంది. ఇక ఇంద్రచాపం గురించి ఎందరు కవులు ఎన్ని కొల్లల కవితలల్లారో కదా?

  ReplyDelete
 7. ఉషగారూ, మీ కవితకు నా ప్రతికవిత. మరోసారి, మీలో కవి వేసిన ప్రశ్నకు నాలో కవి ఇచ్చిన సమాధానంలా!

  http://ayodhya-anand.blogspot.com/2009/06/blog-post_26.html

  ReplyDelete
 8. ఆనంద్, ఇంత వరకు అనసూయను. ఇప్పుడు క్రొత్తగా ఆ విద్య నేర్పుతున్నారు. చాలా గాఢంగా, ఎంతో మరెంతో బాగా వ్రాసారు. నిజానికి ఇప్పుడు నా కవితకి ధన్యత చేకూరింది. కృతజ్ఞతలు. మీకున్న కవీతాతృష్ణకి, భాషా కౌశలతకి నిజానికి మరువం తోడు అవసరమా, నన్ను అందలం ఎక్కించటానికి కాకపోతే. నెనర్లు మిత్రమా.

  ReplyDelete
 9. Yedu విషయాలను వస్తువులు గా తీసుకుని..ఏడు రంగులకు అన్వయించి... పదాలను అందంగా అమర్చారు..ఇది నాకొక Successful experiment లాగ అనిపించింది.. Great! మీ కవిత నుండి ప్రేరణ పొందిన..ఆనంద్ గారి టపా కూడా అద్భుతం..

  ReplyDelete
 10. శివా చెరువు గారికి మీ వ్యాఖ్య చూసి వచ్చాను. చాలా బాగా రాశారు.


  "వంగతోట కాడ ముల్లని మావ గోటికి నా వంత"

  అన్నారు కదా...?
  "ముల్లని" అంటే ఏమిటండీ?

  ReplyDelete
 11. శివ, Successful experiment అన్న మీ అభిప్రాయం చాలు నా ప్రయోగానికి సార్థకత చేకూర్చటానికి. కవి మనసు మరో కవికి యదాథదంగా చేరితే చాలు కదా! ఇలా ఎవరి కంటికీ ఆనని ప్రతీకలు వాడాలని ఎప్పటిదో యత్నం. ప్రదీప్ సంకల్పం కనుక తన అంగీకారంతో వెలికి తెచ్చాను. ఇక ఆనంద్ గురించి చెప్పటానికి ఏమీ లేదు. పైన వ్యాఖ్యలో వ్రాసేసాను. he is my catalyst. నెనర్లు.

  ReplyDelete
 12. విశ్వ ప్రేమికుడు, వంగతోట కాడ ముల్లని మావ గోటికి నా వంత" ;) కాసింత ఇబ్బందిలో పడేసారు. సరే కానీండి. రోట్లో తలదూర్చాక రోకటిపోటుకి వెరవకూడదు కదా? పల్లె పట్టు పడుచు జంటల వలపు సయ్యాటల్లో మావ కొనగోటి గాట్లు పరుల కంట పడితే సిగ్గిల్లిన చిన్నది వంగ ముల్లు గుచ్చుకుందని సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. ఆ ముచ్చట "వంగతోట కాడ ముల్లని మావ గోటికి నా వంత" పంక్తిలో ప్రయోగించాను. ఈ వివరణ చాలు కదూ? నెనర్లు...

  ReplyDelete
 13. దీని వెనకాల ఇంత కథ ఉందా?
  క్షమించాలి మిమ్మల్ని ఇబ్బందిలో పడేసినందుకు.
  కానీ నేనడగక పోతే ఈ వాక్యానికి ఇంత తీయటి భావం ఉందని నాకు తెలిసేది కాదు.
  ఇలాంటివి తెలియాలంటే చాలా సాహితీ యానం చేయాలి.
  మీ భాషా పఠిమకు జోహార్లు. :)

  ReplyDelete