పల్లె పగలబడి నవ్వింది
పాలపిట్ట అరుపల్లేవుంది
చేపల చెరువు మీద నాచు
అచ్చంగా పంటపైరు పచ్చ
పాడి గేదె పాలు పట్నాలకి అరువు
గాడి పొయ్యి వూక దండుగ ఖర్చు
కూలీనాలీ బ్రతుకుల్లో అర్థాకలి పేగరుపులు
కాసీకాయని తోటల్లో కంకర దిగుబళ్ళు
గుడి పూజారి గోడు కంఠ శోష
నడిబజారుల్లో నక్కల వూళ
సన్నకారు రైతు ఇంటి ఆలుమగలు
కొత్తసీసాలో పాతసారాలా రాళ్ళు మోయు కూలీలు
పలకా బలపం పట్టని అన్నాచెళ్ళెళ్ళు
కలవారింట వంటింటి కుందేళ్ళు
బ్రతకనేర్చిన పంతుళ్ళ పసలేని పాఠాలు
గడప దాటిన క్షణం మరిచేటి పిలగాళ్ళు
పల్లె వలసలు పట్టణానికి, పట్టణవాసం పరదేశానికి.
దేశానికి పట్టుకొమ్మ పల్లె ఏడ్వలేక వెక్కెక్కి నవ్వింది!
పల్లెల పరిస్థితిని బాగా చెప్పారు ఉష గారు . ఇప్పుడు మా ఊరు చూస్తే ఇంతకు ముందున్న కళ కనపడదు. పట్నాలు పడమరననుకరిస్తే, పల్లెలు పట్నాలననుకరిస్తున్నాయి. ఇంటికొచ్చి గడ్డంచేసే వాళ్ళే లేరు. వాళ్ళకి యూనియన్లు... అన్నీను... ఇంక మనం పల్లెల గురించి పుస్తక్కాల్లో చూసుకోవాల్సిందే. అనగనగా ఓ రాజు లాగా.. అనగనగా.. ఓ పల్లే.. అయ్యింది పరిస్థితి. పూటకూళ్ళవ్వలేరి ?... మెస్సులు వచ్చాయి... పాత బంగారం.. ఇక చూడడానికీ దొరకదు..
ReplyDelete"పల్లె వలసలు పట్టణానికి, పట్టణవాసం పరదేశానికి."
ReplyDeleteకాల గమనం లో ఈ పథం తారుమారు కానుంది. పల్లె కి మంచి రోజులోచ్చి దరహాసం చేస్తుందని ఆశిద్దాం!
కవిత బాగుంది.ఎందుకో మొదటి చరణం చదవగానే పదహారేళ్ల వయసు లో ఏదో పాట గుర్తొచ్చింది :-)
ReplyDeleteఆఖరు చరణం చదివినప్పుడు "వీధి అరుగు" కూడా గుర్తొచ్చింది :-)
రెండో పంక్తికి ఆఖరు పంక్తికి భావం మారిందేమో అనిపించింది.
~సూర్యుడు :-)
మా ఊరు గుర్తొచ్చిందండి..
ReplyDelete"వెక్కెక్కి నవ్వడం" అన్న ఒక్క ప్రయోగంతో మొత్తం చెప్పేసారు.
ReplyDeleteమా ఊరిలో కూడా మాతరం వారు ఇంచుమించుగా పల్లె ఖాళీ చేసేశారు .
ReplyDelete"పల్లె వలసలు పట్టణానికి, పట్టణవాసం పరదేశానికి."
నిష్టూరంగా ఉన్నా ....నిజం చెప్పారు .
పల్లెలు వైభవం కోల్పోయి వెలవెలపోతున్నాయి .
అయినా తల్లిలా స్వాగతిస్తూనే ఉంటాయి .
మారుతున్న పల్లె దశ బాగా చెప్పేరు వ్యవసాయం సరి ఐన ఆధారం లేక ఒక గేంబ్లింగ్ ఐపోయాక రైతులందరి మనోవేదన ఎంతని వ్రాస్తే అర్ధం అవుతుంది... పంట చేతికందిరాని సవత్సరం మా తాత సాయింత్రం పొలం నుంచి వచ్చి దిగులు గా ముందు వసారాలో జనప నారో నులకో పేనుతూ దిగులు గా కూలబడిన క్షణం ఇంకో సారి కళ్ళ ముందు కనిపించింది మీ కవిత చదువుతుంటే...
ReplyDelete"పల్లె వలసలు పట్టణానికి, పట్టణవాసం పరదేశానికి.
ReplyDeleteదేశానికి పట్టుకొమ్మ పల్లె ఏడ్వలేక వెక్కెక్కి నవ్వింది" - ఇది ఆత్మవిమర్శలా అనిపిస్తోందేమిటి చెప్మా...
దీనికి కారణమేమిటో అందరికీ తెలిసిందే.
మన అభివృద్ది "కాన్ సంట్రేటెడ్". అందుకే పెద్ద పట్టణాలు అభివృద్ది రేసులో ముందున్నాయి. చిన్న పట్టణాలే వెలవెలపోతుంటే ఇక పల్లెల సంగతి చెప్పేదేముంది.
నాది పల్లె కాదు, చిన్న పట్టణం. నాలా హైదరబాదుకో అమెరికాకో జర్మనీకో లేక మరో ప్రదేశానికో వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ఎక్కడో అడ్డుకట్ట వెయ్యాలి.
కానీ నేను చదివిన చదువుకు మా ఊరు ఉపాధి చూపదు. అందుకే "డిష్ట్రిబ్యూటెడ్" అభివృద్ది కావాలి. అయితే ఎవరో వచ్చి మనకోసం ఆ పని చెయ్యరు. మనమే పూనుకోవాలి, అంతవరకు ఇలాంటి బాధతో కూడిన నవ్వుల కవితలకు అంతే ఉండదు. నేను ఆ అడ్డుకట్టను కాగలనో లేదో తెలియదు, కానీ నా జీవితకాలంలో అలాంటి ప్రయత్నం చెయ్యకుండా అయితే ఉండను.
బతక నేర్చిన పంతుల్ల పసలేని పాఠాలు
ReplyDeleteగదప దాటిన క్షణం మరిచేతి పిలగాల్లు
చాల బాగా చెప్పారు. ఈరోజుల్లో టీచర్స్ చీటీ వ్యాపారాలలోను స్థానిక రాజకీయాలలోను మునిగి పాఠాలు చెప్పడం మరిచిన సంగతిని బాగా చెప్పారు. ఫని ప్రదీప్ గారులాంటి వాళ్ళను కార్యోన్ముఖులుగా చేయగలిగిన మీ కవితకు వందనం.
పల్లెలు మారాలి
ReplyDeletehttp://yreddy.blogspot.com/2008/12/blog-post.html
ఆత్రేయ గారు, నిజమండి. పల్లెలు విఛ్ఛిన్నమైపోతున్నాయి. ప్రక్కదారి పట్టి,ఒకప్పుడు మమ్మల్ని అణిచారు అని బండి చక్రం మాదిరి ఇపుడు పైచేయిగా వున్న వారి నడవడికని నేనూహించలేదు, అంగీకరించలేకపోతున్నాను. మా ముత్తాత, తాత గార్ల హయాంలో ఎంతో సామరస్యంగా అందరు కలిసిమెలిసి గడిపిన పల్లె మాది. అటువంటిది ఇపుడు ఏదో లోటు, ఎక్కడో అపశృతి. పోయినేడు వెళ్ళినపుడు ఇంటికి దగ్గరగా మా కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది, నాన్న గారు దిగి తోస్తున్నా అక్కడే తూము గట్టు మీద కూర్చుని పిచ్చాపాటీ కబుర్లాడుతూ, "ఏంటండీ ఇంజినీరు గారు, కారు పాడైయిందా" అన్నారే కానీ అంగుళం కదలని ఆ కూర్చున్న కుర్రకారుని చూస్తే ఎందుకో చాలా అసహనం వచ్చింది. వారి అమ్మానాన్నలంతా ఏ వేళలోనైనా తలుపు తట్టి వచ్చిన లోగిలి మాది. సహపంక్తిన భోజనం చేసిన గతం వుంది. అయినా ఈ ఎడాలు మాకూ తప్పలేదు.
ReplyDeleteప్రసాదు గారు, "పల్లెటూళ్ళు మన భాగ్యసీమరా, పాడి పంటలకి లోటు లేదురా" అన్న పాట నిజం కావాలని, "ఆ రోజెంతో దూరం లేదు" అని కూడా అవాలని, వసుధైక కుటుంబం రావాలి ఆకాక్షిద్దాం.
ReplyDeleteసూర్యుడు గారు, ఉదయానే మెదడుకి మేత, ఈ పాట ఒక వేయి పాటల గుట్ట తవ్వి వెలికి తీసాను. :) మీకు గుర్తొచ్చిన పాట "కట్టుకథలు నేను నవ్విస్తే కవ్విస్తే బంగారు పాల పిచ్చుకా మా మల్లి నవ్వాలి పకా పకా, మల్లి మళ్ళీ నవ్వాలి పకా పకా" అని అనుకుంటున్నాను. ఇక అఖరి చరణం "వీధి అరుగు" అన్న మీ మాట పాట/కథో లేక నిజంగా అరుగుల గురించా తెలియదు. మా అమ్మమ్మ గారి లంకంత 150+ సంవత్సరాల ఇంటి అరుగులు ఎన్నో చర్చలకి, సమావేశాలకి వేదికలు. అవే మా పిల్ల ఆటలకి కూడా నెలవులు. ఇంకా వున్నాయి అలాగే, వెళ్ళినపుడు ఒకసారి ఆప్యాయంగా తడిమి చూసుకుంటూవుంటాను. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. భావం మారటం కూడా ఎందుకలా అనిపించిందీ అన్న వివరణ ఇస్తే బావుండేది.
ReplyDeleteమురళీ, అంతే కదండీ, అందరికీ వారి పల్లెలు/స్వంత వూర్లు గతవైభవాలే. "వూరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా, అయినోరు కన్నూరు అంతరంగాన వుందురులే". నిజానికి ఈ కవిత పోయినేడు వెళ్ళినపుడు తనకన్న చిన్నదైన పిల్లతో స్కూలు బాగ్, అన్నం కారియరు మోయిస్తున్న నా మేనకోడల్ని చూసి వ్రాసుకున్న అసంపూర్తి కవిత, మీ "గంట మ్రోగింది" ఇచ్చిన స్ఫూర్తితో పూర్తి చేయగలిగాను. ధన్యవాదాలు.
ReplyDeleteమహేష్, అందుకే ముందు మొదటి పంక్తిలో వ్రాసిన ఆ పదం చివరి పంక్తి మార్చాను. దానిలో అంత అర్థం వుందని నాకూ అనిపించింది.
ReplyDeleteవైరెడ్డి గారు, మరువపు వనానికి సాదర స్వాగతం, అవును మారాలి, మనమంతా ఏకమై ఆ ఆశయాన్ని సాధించాలి.
పరిమళం, అభివృద్ది దిశగా పయనించిన యువతకి తప్పని మార్గమిది. పల్లెల ఈ దుస్థికి ప్రద్దిప్ చెప్పిన మూల కారణం చదవండి. ఆ పై మరికొన్ని. వృత్తివిద్యలని కులాలనుండి వేరు చేయలేని సాంప్రదాయం చవిచూసిన అపజయమిది. పల్లెల తీరు మీరన్నట్లేవుంది. "అమ్మ ఉషమ్మ వచ్చావా తల్లీ" అని ఏ బంధుత్వం లేకపోయినా నేను గుమ్మంలో ఏ వేళ దిగినా పలుకరించే మా ఎదురింటి రత్తాలత్త మనసు నాకు తెలుసు. "అమ్మ పోయారని రావటం మానకమ్మా మేమంతా లేమూ" అన్న ఆ పదిమంది ప్రేమా ఇంకెక్కడా చూడనూ లేదు. పల్లెలు నిజంగా పేదవైన కొన్ని మనసులు ప్రేమకి తరగని గనులే.
ReplyDeleteప్రదీప్, అవును ఈ కవిత శోధనలో వెలువడిన ఆత్మవిమర్శకి అద్దం. మీరన్నవే నా అభిప్రాయాలు, ఆపై మరికొన్ని. ఇక అడ్డుగోడ విషయంలో నేనూ ఆ అడ్డుకట్టకి ఓ ఉడుతనౌతాను. నా సమీప భావిలో నేను చేయాలనుకున్న పనులకి స్వీకారం కూడా చుట్టటమైంది. ఆ పల్లెలకే నా చివరి మజిలి. ఏదో ఒకరోజు మనం మన ప్రయత్నాలని కలబోసుకుని ఈ రోజునీ తలపోసుకుంటామేమో!
ReplyDeleteవర్మ గారు, అక్కడి పరిస్థితి మీరు బాగా గమనించారు కనుక చెప్పగలిగారు. నేను వచ్చినపుడు ఏమి అడిగినా తడబడే మా కుటుంబాల్లోని పిల్లల్ని చూసి ఆ వరస వ్రాసాను. ప్రదీప్ వంటి యువత ముందుకు వస్తే, అంకురంలో పాటలా "ఎవరో ఒకరు ఎపుడొ అపుడూ నడవరా ముందుకు .." అని మరి కొన్ని అడుగులు కలిసి ప్రగతిపథం వైపు సాగగలమని ఆశిద్దాం. నేనూ నా కార్యాచరణని మరవనని ప్రమాణం చేస్తున్నాను.
ReplyDeleteఉష గారు
ReplyDeleteచాలా బాగా చెప్పారు,పల్లె యొక్క గొప్పతనాన్ని ఎంతో బాగా చెప్పారు
చేపల చెరువు మీద నాచు
అచ్చంగా పంటపైరు పచ్చ అన్నారు
చేపల చెరువు అంటే భీమవరం వైపు వుంటాయి కదా, చెరువు అంటే పిల్లలంతా గెంతులేస్తూ ఆడే చెరువు కదా
ఉష గారు
ReplyDeleteమీకు ఇది న్యాయమా!
ఆఫీసు కి వచ్చి బ్లాగ్ ఓపెన్ చేసాను.ఒక కామెంట్ రాసాను
మీ నీలకంఠారెడ్డి వల్ల నా కంఠం తేగేటట్టు వుంది.. వచ్చి రాగానే అంత గట్టిగా నవ్వితే ఆఫీసు లో పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలరు..చివరకు జేబు రుమాలు నోట్లో పెట్టోకొని నవ్వినా సౌండ్ బయటకు వచ్చేసింది..చదువుతున్న నాకే ఇలా వుంటే ప్రత్యక్షంగా ఆ క్షోభను ఎలా తట్టుకున్నారు :)
నాకు కవితలు అంత త్వరగా అర్థం కావు (కలాపోసణ లేదు అని తిట్టుకున్నా సరే), కాని ఈ కవిత మాత్రం ఒక్క సారి మనసుని అలా ఆర్ధ్రం చేసి పోయింది. చాలా బాగా రాసారు
ReplyDeleteఈ మద్య పల్లెలు కూడా అభివృద్ది చెందుతున్నాయి అయితే ఇంకా చాలా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉంది . కవిత బాగుంది
ReplyDeleteఇంత మంచి కవితని ఇంత ఆలస్యంగా చూసానేమిటా అని నా మనసు విలవిలలాడింది...
ReplyDeleteఎంత బాగారాసారండి!!
ReplyDelete* హరేకృష్ణ, పల్లెలు ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చవి చూసాయి, కానీ కాలచక్రంలో ఆ ప్రాభవాన్ని కోల్పోయి చితికిపోయాయి. ఈ కవిత ఆత్మ అది. చెరువు అంటే pond/lake etc. వరి వంటి బంగారు పంటలు పండిన మాగాణీ భూముల్ని/పొలాల్ని చేపలు/రొయ్యలు చెరువులుగా తవ్వేస్తున్నారిపుడు. అందుకే ఆనాటి పైరు పచ్చ ఈ చెరువుల మీద పేరుకున్న నాచులో వెదుక్కోవాల్సివస్తుందని వ్యంగ్యంగా వ్రాసాను.
ReplyDeleteమీకు అన్ని నవ్వులు పంచిన మా మంచి నీలకంఠారెడ్డి గురించి మరో వ్యాఖ్య తర్వాత వ్రాస్తాను. ;)
* లక్ష్మి గారు, మీ మనసుని ఆర్ధ్రం చేసింది అంటే ఈ కవిత ద్వారాగా నేను చూపిన సమస్య మీకు గోచరమైందన్న మాట. మీ తొలి వ్యాఖ్యకి ధన్యవాదాలు, నా బ్లాగుకి స్వాగతం.
ReplyDelete* శివ, పైన వ్రాసిన వ్యాఖల్లో కొందరి+నావి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ అందరి అభిమతం మీరన్నదే. అందరిలోనూ పల్లెల అభివృద్ది అన్నది తావుచేసుకుంటే అది సాధించటం సాధ్యమే. నెనర్లు.
ReplyDelete* పద్మార్పిత, సృజన, '03, '08 - ఈ నా రెండుసార్ల మనదేశానికి వచ్చిన ప్రయాణాల్లో బావురుమంటున్న సందుల పల్లెలు, జీవం లేని పెద్దలు నా మనసుని వుసూరుమనిపించారు. ఈ కవితకి ఆత్మ ఆ ఆవేదనే. మేము పండుగలు, వేసవి సెలవలు ఎక్కువగా పల్లెటూర్లలోనే గడిపాము, అందువలన నాకు ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. నా పిల్లలు, యువ, స్నేహ సినిమాల్లో చూపే ఆ కళకళలాడే ఇళ్ళు, పల్లెపట్టు పండుగ వాతావరణాలు వెదుక్కోవటం వాళ్ళ కళ్ళలో కనిపించింది నాకు. "అమ్మ మరి ..." అని వాళ్ళడిగిన ప్రశ్నలు ఎక్కువ ఈ విషయం మీదే. ధన్యవాదాలు.
ReplyDeleteపల్లె కళ్ళకు కట్టింది ..
ReplyDeleteకవిత గుండెకు పట్టింది ...
అభినందనలతో _
డా || ఆచార్య ఫణీంద్ర
డా.ఆచార్య ఫణీంద్ర గారు, పల్లెల దయానీయ స్థితి గుండెకి తాకని వారు అరుదేకదండి. ధన్యవాదాలండి.
ReplyDeleteనిజంగా నాకు తట్టలేదు ఆలోచన ..చేపల చెరువు అనుకున్నాను..భలే చెప్పారు
ReplyDeleteహరేకృష్ణ, ఫర్వాలేదండి, తోటల్లో కంకర దిగుబడి అన్నదీ అదేమాదిరి పోలిక, మునుపటి పళ్ళ తోటల్ని ఫలసాయంలేదని కంకర తవ్వి తీస్తూ క్వారీలుగా మార్చేసారు. ఇది కొంచం తరిచి చూడాల్సిన కవిత. నా తాజా టపా చూడండి, సూటిగా తన వూసు విప్పేస్తుంది.
ReplyDelete@ఉష గారు,
ReplyDeleteతీరిక లేక ఈ మధ్య ఇక్కడకి రాలేదు.
మీరు చెప్పిన పాటే నాకు గుర్తొచ్చింది :-)
ఎప్పుడో, కృష్ణశాస్త్రి గారి "వీధి అరుగు" అనే వ్యాసంలో పట్నాల గురించి, పల్లెల గురించి ఇలాగే వ్రాశారు. నాకు అది గుర్తొచ్చింది :-)
నా ఉద్దేశ్యంలో పాలపిట్ట అరుపు శుభసూచకమేమో (సంతోషంగా చేసే పని) అని, చివరన ఏడవలేక వెక్కి వెక్కి నవ్వడం అన్నారుకదా, రెండిటికి భావంలో తేడా ఉందేమో అనిపించింది :-)
నేననుకున్నది తప్పైతే, క్షమించి వదిలేయండి :-)
~సూర్యుడు :-)
* సూర్యుడు గారు, వ్యవధి తీసుకుని వచ్చినా తిరిగి వచ్చి నా "ప్రతి-వ్యాఖ్య" కి నవ్వులపువ్వులతో బదులిచ్చినందుకు ఆనందం. పోతే "పాల పిట్ట - మన రాష్ట్ర పక్షి, చాలా అందం కానీ దాని అరుపు అంత బాగోదు" అన్న మూడు మాత్రం గుర్తు. తన అరుపు శుభసూచకం అన్నది మీరు తెలిపారు. పల్లెల దీన స్థితిని వర్ణించటానికి అందుకే నేను దాన్ని ఎన్నుకున్నాను. ఇది సరైనది కాకుంటే మీబోటి విషయ పరిజ్ఞానం గల వారు నన్నే మన్నించాలి. ;) మిగిలిన వివరణలకి ధన్యవాదాలు. మరువం చదువరులకు ఎపుడూ ఆహ్వానం పలుకుతూనే వుంటుంది.
ReplyDeleteఏమని వ్రాయమంటారండి... పలుచ బడిన పల్లెటూళ్ళ గురించి వ్రాయాలా? ఆడుకున్న మైదానాలు చిల్లకంపకు కొలువైదని వ్రాయాలా? హృదయమున్న పూరిళ్ళ స్థానాన్ని కంకర మిద్దెలు ఆక్రమించాయని వ్రాయాలా?ఏమిటో ఎలాగో వుంది. బ్రతుకు బాటలో సహజమైన మార్పు అసహజంగా తోస్తుంది.
ReplyDeleteఅందుకేనండి మరోసారి ఇలా వాపోయాను, "త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే స్వర్గమొకటి కట్టేద్దామా?" at http://maruvam.blogspot.com/2009/01/blog-post_08.html
ReplyDeleteఅంతా సహజమే, స్వాభావికమే అనేది మనసుకి సులువుగా అవగతం కావటం లేదు. నాకు బావురుమనే మా వూరుచూస్తే వెళ్ళాలని కూడా వుండటం లేదు. సినిమాల్లో చూపే కృత్రిమ పల్లె అందాలే నేనూ చూసి ఆనందించటానికి అలవాటు పడుతున్నాను.