ఏరువాక పున్నమికి రైతన్నలకి నా వందనం!

నాడు:

ఏరువాక పున్నమికి వెండిమబ్బు దారబ్బంతి
చిక్కులేని పోగులు పుడమికి జారవిడుచువేళ,
ఏటిగట్టున ఎంకిని తలదన్నే పూబంతి
దుక్కిదున్నగ పోతున్న మావకి ఎదురువస్తూ,
సాలుకోమారు సాగించే సంబరం కృషి పౌర్ణమి!

అగరుధూప పరిమళాల నాగళ్ళు.
పసుపు రాసిన కొమ్ముల ఎడ్లు.
ఇత్తడి డేగిసాలో వూరించే పొంగళ్ళు.
పల్లె సందు సందున సందళ్ళు.
వతనుతప్పని తొలకరిజల్లు తృళ్ళింతలు.

నేడు:

ఇరుకుబాటలో ఇరుసులేని బండిలో మరో కృషీవలుడు,
కాలినడకన ఎదురువస్తూ, ఏరువాకని తలపోస్తూ నేను.
చెంత సోయాచిక్కుడు, మొక్కజొన్న విత్తుల మూటలు,
ఐదుమాసాల్లో అవి పండించును బంగారు పంటలు.
ప్రక్కన విరగకాసే యాపిలు పళ్ళతోటలు, బళ్ళునిండే గుమ్మళ్ళు.

ఆదిమానవుని మనుగడ వ్యవసాయ సంస్కృతి,
అధునికమానవునికీ సేద్యం ఓ వృత్తి.
పొలం, హలం, కండబలం, ధాన్యం రైతు ధనం.
ఆతను సాగించు స్వేదయాగం భావితరానికొసగు ఫలం.
తరతరాల చరిత మూలధనమైన ఆతనికి నా వందనం!

21 comments:

 1. "చిక్కులేని పోగులు పుడమికి జారవిడువేళ,".....ఎంతందంగా వుందా దృశ్యం .

  ReplyDelete
 2. బాగుందండి!!
  ఉషగారు... మీ వందనాలతో సంతసించి
  రైతన్న వర్షించిన మేఘాలకి స్వాగతం పలికేరు!!

  ReplyDelete
 3. నేటి,నాటి మా పరిస్థితులకు అద్దం పట్టింది మీకవిత.
  సంస్కృతి నుంచి వృత్తిలోకి దిగజారాం.

  ReplyDelete
 4. "ఏరువాక పున్నమికి రైతన్నలకి నా వందనం!" తొలి వ్యాఖ్యలు పంపిన చిన్ని, పద్మార్పిత లకు ధన్యవదాలు, కవిత వ్రాయటానికి రెండు ప్రేరణలు - (1) నిన్న ఉదయం జాగింగ్ కి వెళ్ళినపుడు పెద్ద జంబో ట్రక్ లో వ్యవసాయ ఉపకరణాలు తీసుకుని వెళ్తూ ఎదురైన రైతుని చూసినపుడు ఎందుకో 'రోజులు మారాయి' లోని 'ఏరువాక సాగారో..' పాట జ్ఞప్తికొచ్చింది. (2) రాత్రి నాన్నగారి తో మాట్లాడినపుడు అంతకు మునుపే షటిల్ ఆడుతూ ఉదయిస్తూ దేదీప్యంగా వెలిగిన చంద్రుడిని గురించి ప్రస్తావిస్తే "అవునమ్మా, 6/7 ఏరువాక పున్నమి, ఇపుడే ప్రసాదం తీసుకుని వస్తున్నాను" అని చెప్పారు. చిన్నపుడు అమ్మమ్మ గారి వూర్లో మా వెంకటేశ్వర రావు మావయ్య ఏరువాకకి యేగినప్పటి జ్ఞాపకాలు తిరిగొచ్చాయి - ఈ కవిత వెలికి వచ్చింది.

  * చిన్ని, ఈ పోలిక కూడా చాలదండి ఆ అందాన్ని వర్ణించగ, కవి మనసు కాంచినంత అందంగా పదాలు కూరలేదేమో!
  * పద్మార్పిత, సంతోషం, తొలకరి జల్లులు కురిసాయని కమ్మని కబురు చెప్పారు.

  ReplyDelete
 5. విజయమోహన్ గారు, వృత్తే దైవం గా భావించే "రైతే రాజన్న దేశంలో మహారాజైన" మీ వంటి వారు వుండగా వ్యవసాయానికున్న విలువ మారదు. సంస్కృతి కాలానుగుణంగా మారుతుంది అది అనివార్యం. బంగారు పళ్ళంలో తిన్నా పట్టెడు అన్నమే తినాలి కదండి. ఎన్ని తరాలు మారిన మీవంటి రైతులే భావితరానికి వారసులు.

  ReplyDelete
 6. ప్రకృతి వైపరీత్యాల కు అతీతంగా కష్టించి పనిచేసే అన్నదాత కి అంకితం చేసిన మీకు అభినందనలు

  ReplyDelete
 7. అమ్మా,
  సేద్యం ఒక వృత్తి కూడా కాదు, ఒక వ్యాపార దృక్పధం తో చూస్తున్నారు. ఈ భూమి మీద ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత దిగుబడి వచ్చింది అనే లెక్కలు వేస్తున్న ఈ రోజుల్లో ఏరువాక పున్నమి మీద కవిత రాసే సంస్కారం ఉన్న మీ లాంటి వాళ్ళని చూస్తే చాల ఆనందంగా ఉంది.
  ఇక్కడకి రావటంతో అనుకోకుండా శ్రీ చిలకమూరు విజయమోహన్ గారి బ్లాగ్ కూడా చూడటం తటస్థించింది. ధన్యవాదాలు!

  ReplyDelete
 8. prasad gaaru,
  గొదావరి జిల్లాలో పుట్టి ఏరువాక పున్నమిని మర్చిపోవటమా????

  ReplyDelete
 9. "ఆతను సాగించు స్వేదయాగం భావితరానికొసగు ఫలం.
  తరతరాల చరిత మూలధనమైన ఆతనికి నా వందనం!" ధన్యవాదాలు తరతరాల చరిత మూలధనమైన "అతనికి" నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకివే మా అభినందనలు

  ReplyDelete
 10. హరేకృష్ణ, శ్రీ, ధన్యవాదాలు. రైతుల పట్ల గౌరవాభిమానాలు, సానుభూతి రెండూ వున్నాయి. ఇన్ని "డే" ల సంసృతికి అల్లుపోతున్న మనం మన మూలాల్ని మరవకూడదనే ఈ చిరు ప్రయత్నం. మా తాత గారి తరం వరకు మోతుబరి రైతు కుటుంబం మాది, అందువలన సాంప్రదాయ వ్యవసాయ పండుగలన్నీ చూసాను. చిన్నప్పటి వేసవి అంతా పల్లెతూర్లలో గడపటం వలన, కొంత జిజ్ఞాసతో తెలుసుకున్న విషయాల వలన ఈ క్షణం మనం ఈ మాటలు చెప్పుకునే భాగ్యం కలిగింది.

  ReplyDelete
 11. నీహారిక, మీరన్నది నిజం, అసలు కొన్ని ప్రాంతీయ వేడుకలు మనలో ఈ ప్రేమాభిమానాలని పెంపొందించటానికే పెట్టారేమో పెద్దలు. మా తాత/ముత్తాత గార్లు చాలా విస్తారంగా తిరిగి పొలాలు కొన్నారట, పైగా ఆదరంగా చూసిన మనుషులు. అందుకేనేమో ఈ మధ్య ఈ మధ్య వరకు ఆయన వయసు వారు వాళ్ళని తలుచుకుని, మమ్మల్నీ ఎంతో అభిమానంగా చూసేవారు. దశరా సమయాల్లో నూజివీడు ప్రాంతాల నుండి లంబాడి తెగల వారు, సంక్రాంతి సమయానికి ఆయన గుఱ్ఱాన్ని పోషణ చేసిన వెంకడు ఇలా ప్రత్యేక సమయాల్లో కనపడేవారు. దురభిమానం కానంత వరకు కన్నూరు, జన్మ భూమి వంటివి మేలు కూర్చే భావనలే.
  అన్నట్లు మే లో వ్రాసిన "గోదారమ్మ.." చదివారా? ఇంకొంచం ఉప్పొంగవచ్చు మనలో గోదావరి పట్ల ప్రేమ ;)

  ReplyDelete
 12. ప్రసాద్ గారు, నా బ్లాగుకి సాదరంగా స్వాగతిస్తూ, మీ తొలి వ్యాఖ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రైతుల పట్ల నా అభిప్రాయం పైన వ్రాసాను కనుక మళ్ళీ ప్రస్తావించనవసరంలేదు. వ్యాపార దృక్పధం అన్నది, సేద్యం అనే కాదు, అన్నిటా గోచరమౌతున్న మార్పు. ఈ పరిణామాన్ని మనం ఆపలేము కానీ కాలానుగుణంగా మనం అవసరం మేరకు మారుతూ, నమ్మిన విలువల్ని పాటిస్తే ఇన్ని లెక్కల జీవితంలో కూడా లెక్కగట్టలేని అనుభవాలని, వెల కట్ట లేని అనుభూతులని మూటగట్టుకోవచ్చు కదండి? అనుబంధాల్లోనే "పెట్టుబడి-దిగుబడి" సూత్రం తావు చేసుకున్నపుడు ఇక ఆర్థిక లావాదేవీలు వృత్తిని తాకకుండా వుంటాయా? ఈ సంస్కారం, స్పృహ కలగజేసినవారు నా తల్లి తండ్రులు, గురువులు, ఆత్మీయులు. సహేతుకంగా చూసి నమ్మిన ప్రామాణికాలే నా మనుగడకి ఆధారం. నాకు కూడా శ్రీ చిలకమూరు విజయమోహన్ గారి బ్లాగ్ చూడటం మీ మాదిరిగానే తటస్థించింది. నేనూ SW Engineer నే. మీరు మళ్ళీ రావాలి, మరువపు పరిమళాలు అఘ్రాణించాలి.

  ReplyDelete
 13. మేమూ ఇక్కడకు వచ్చేముందు వ్యవసాయదారులమే ....ఏరువాక సాగినరోజు పూజ చేయటం మా వారికి ఎదురు రావటం గతమంతా కళ్ళముందు కదలాడింది ....ఉష గారు ధన్యవాదాలండీ ....

  ReplyDelete
 14. పరిమళం గారు, అలా పాత జ్ఞాపకాల తడి తగలపోతే మన పొడికళ్ళ యాంత్రికత్వం ఎపుడో గుండెకి కూడా పట్టేస్తుందేమోనని నాకు భయమండి. అందుకే సన్నగా నా నేస్తం చీవాట్లేస్తున్నా ఇలా చిన్ని చిన్ని జ్ఞాపకాల్లో, గత ప్రాయపు అలల్లో తేలుతూనేవుంటాను. మిమ్మల్నీ ఈ కవిత అలా ఓ సారి వాటిలో తడిపినందుకు ముదావహం.

  ReplyDelete
 15. ఎంత బాగా చెప్పేరు రెండిటికి వున్న సామ్యాన్ని. బాగుంది ఉష గారు. మీ వూరిలో ఇంకా ఏరువాక దగ్గరే వున్నారా? మెమోరియల్ డే అవ్వగానే నాట్లు వెయ్యరు మొక్క జొన్న సొయా చిక్కుడు? మీ గోదవరి వాళ్ళను చూస్తే బలే ముచ్చట గా వుంటుంది.. మేము అంతా పత్తి, మిరప పొలాల మద్య తిరిగిన బ్యాచ్ లేక పోతే సముద్రపు గట్లెమ్మట తిరిగే వాళ్ళము. మీ అనుభవాలు మాతో పంచుకుంటున్నందుకు థేంక్స్

  ReplyDelete
 16. భావన, ఇంకా లేదండి, దుక్కి దున్నుతున్నారు. నారు మళ్ళ వరకూ రాలేదు. నిజానికి మా గోదావరి వాళ్ళని చూస్తే నాకూ ముచ్చటేనండి. అబ్బోసి మీరు తిరిగారన్నమాట మిరప పంటల్లో, ప్రత్తి పైరుల్లో. ఇక సముద్రం - [చేపలు పట్టే వారా ఏమిటి? ;)] ఎటో వెళ్ళిపోయింది నా మనసు ... కవిత నచ్చినందుకు నెనర్లు.

  ReplyDelete
 17. ఏరువాకలు పోయి చేపల చెరువులు వచ్చాయండి ఇప్పుడు.

  ReplyDelete
 18. బోనగిరి గారికి, తొలిసారి వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీరన్నాక ఆ కోణం కళ్ళముందు ఆవిష్కరించబడింది. త్వరలోనే ఓ కవితగా వస్తుంది. ఇక్కడ కూడా మా ఇళ్ళు పొలాల మధ్యనే వున్నాయి. అంటే ఇళ్ళ స్థలాలుగా మారిన పంట పొలాలు. అందుకే ఇంకా మనిషి ఆశ సోకని పొలాలు ఉదయాన్నే కనబడతాయ్. మా ఇంటి వెనుక కృత్రిమంగా ఏర్పరచిన పెద్ద చెరువు, దాన్నిండా ఎక్కితిప్పలుగా చేపలు. ఇవన్ని చెరువు చుట్టూ ఇళ్ళ స్వంతదార్లం డబ్బులేసుకుని పెంచేవి. కాస్త నయనానందం, కాస్త కడుపుకి పరమానందం [కానీ నా వంటి కొందరికి కాదు!]. ఎక్కడ మొదలైందో ఈ మార్పు, మనిషి ప్రకృతిపై చేసే కత్తిసాము. అంతిమ విజయం ఎవరిదో, ప్చ్.

  ReplyDelete
 19. చూసుంటె రాసే ధైర్యం చేయకపోదును.ఇప్పుడు మీరిచ్చిన లిన్ తో చూసాను ఎందుకో దారిపొడుగునా ఉత్సాహభరితంగా జరుగుతున్న ఉభాలు (ఇది కళింగాంధ్రలో ఉడుపులను అనే వాడుక పదం) చూసి మనసు పులకించి రాయాలనిపించి రాసాను. మీ అంత బాగాలేదు నా భావ వ్యక్తీకరణ.

  ReplyDelete
 20. ఏరువాక సాగటం నేను చూడటం చిన్నప్పటి జ్ఞాపకం. మీ ద్వారాగా మీ ప్రాంతపు పడికట్లు తెలుస్తున్నాయి. స్పందన ఏ ఒకరిలోనూ ఒకే విధంగా చాలా వరకు వుండదు. అది వ్యక్తమయ్యే తీరు కూడా అంతే కదండీ. ఒకరి ప్రభావం ఒకరి మీద అనుకరణని బట్టివుండొచ్చు. నేను చదివి వంట బట్టించుకున్నది చాలా తక్కువ, తోచినట్లు వ్రాసుకుపోవటం ఒకింత విమర్శకి గురౌతున్నా అదే అలవాటు. నా వరకు పోలిక అన్నది ఆరోగ్యకరంగా వున్నంతవరకు ఫర్వాలేదు. మీరు అదే ఉద్దేశ్యంలో అనివుంటే సరే. లేదంటే నేను అంగీకరించను. ఇంత కథ ఇకపై మీరు ఇలా ఆలోచించవద్దని చెప్పటానికే. నెనర్లు.

  ReplyDelete
 21. ఏరువాక మీద విషయ సేకరణ చేసుకునే పనిలో వుంటే మీ ఈ టపా కనపడింది. ఏరువాక మి౯ది మీ హృదయ స్పందన మీ సాంప్రదాయక అభిరుచి అభినందనీయా లు.

  ReplyDelete