మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా?

ఎందుకు అందం అంటే ఆనందమని అపోహ?
ఎందుకు అందమే కనులకువిందని ప్రలోభ?

ముద్దులొలికే గులాబీకా అందం ఉందంటే
ముళ్ళ శిలువ కొమ్మను ధరించినందుకే కదా?

సీతాకోకచిలుక అతిశయమంతా,
గొంగళి ఛీత్కారాలు భరించి తన రూపు మార్చుకున్నందుకే కాదా?

రామచిలుక వన్నెచిన్నెల రాణింపు,
గోరింక జతైనందుకు లోకం చిన్నచూపును సహించినందుకే కదా?

అద్దం చూపని అనుపమానమైన అందాలన్నీ,
కవుల కల్పనల అద్దంపట్టబట్టే మనగలిగేను కాదా?

తనకంటూ ఓ ఉనికి లేని అందం,
చిరునామా చెప్పలేని అనాధ కాదా?

చూసేకన్ను చేసే గారడికాదా అందం,
మనసు మనసుకి పూర్తి భిన్నమది కాదా?

ఆస్వాదనలో నెలవుండే అందం,
కాలగమనంలో కరిగే మైనపువత్తి కాదా?

వేదన లేనిదే కలదంటూ ఖరారుగా చూపలేని అందం,
కలకాలం నిలవదనీ మనసుకి కనువిప్పు కలగాలి కాదా?

అనుభూతికి అందని అసలు అందం,
అనుభవం ప్రోదిచేసుకున్న హృదయంది కాదా?

ఆ అసమాన సౌందర్య్యాన్ని కాంచని మనం,
ఈ సుందర ప్రపంచాన అందవిహీనులం కాదా?

16 comments:

  1. మంచి కవిత రాసారు

    దేహ సౌందర్యాన్ని మించినది ఆత్మ సౌందర్యం
    దేహ సౌందర్య దర్శనానికి కళ్ళు చాలు,
    కళ్ళు చూపని ఆ ఆత్మ సౌందర్య దర్శనానికి ఆకాశమంత మనసుండాలి.
    ("గగన జఘన....." అన్న అర్ధంలో కాదు సుమా ఇక్కడ ఆకాశం)

    ReplyDelete
  2. మీ అభినందనకి సంతోషం. ఇదీ నా స్వానుభవం నుండి వచ్చిందే. బాహ్యసౌందర్యాన్ని మాత్రం చూస్తారు, లోలోపలి నన్నెందుకు గమనించరు అన్న వేధించే ప్రశ్ననుండి జనించింది. మీరిలా అతి శీఘ్రంగా వ్యాఖ్యలు పెడుతుంటే అదో సంతృప్తి.

    ReplyDelete
  3. బాగుంది ఉష గారు.

    "బాహ్యసౌందర్యాన్ని మాత్రం చూస్తారు, లోలోపలి నన్నెందుకు గమనించరు"
    ఏవిటో అలా అలవాటు పడిపోయింది ప్రపంచం అంతే !!

    ReplyDelete
  4. నిజమేనండి వేణు గారు, కొన్నిసార్లు బయటకి వెళ్ళటానికి భయపడేంతగా విసిగించేసారు కుర్రకారు ;) ఆ వయసులో కొంచం ఆనందం కలిగించిన మాట నిజమేను. ఆ దశ దాటాక ఇప్పుడు కూడా "అందంగావున్నారు" అన్న ప్రశంస తరుచుగా విన్నా ఏదో నిర్లిప్తత, ఎందుకంటే అందులో నిజాయితి కనపడక. ఈ ప్రపంచం దృష్టి మారదు. మరో వాదనావుంది, అలా అందాన్ని గుర్తించకపోతే అదో తంటా అట, కొందరికి అదే బాధట. కనుక ధృక్పదంలోనే తేడాలుంటాయి అని ఓ నేస్తం వాదించారులెండి. నాదీ పద్దతి. కనీసం కనులకి కనపడే నాతో పాటుగానైనా నా అంతర్గత మానసాన్ని చూడగలిగితే బావుణ్ణని. ప్రదీప్ గారన్నట్లు "ఆత్మ సౌందర్య దర్శనానికి ఆకాశమంత మనసుండాలి." కాబోలు.

    ReplyDelete
  5. hmmm నిజమే, ఆత్మ సౌందర్యం కంటే భాహ్య సౌందర్యం కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం ,ఇప్పుడే కాస్త ఖాళిగా ఉన్నా కదా మొహానికి ఏదన్నా పూసేద్దాం అని గంధం ,తేనే కలుపుకుని మీ కవిత చూసాను ... ఇంకేం రాయనూ .. నా మొహం :(

    ReplyDelete
  6. నేస్తం, నా కవితలో ఏదో స్పష్టత లోపించి మీరు పొరబడుతున్నారేమో - వంటి సంరక్షణలోని భాగం మీరు చేస్తుంది. నేను కూడా అటువంటివి పాటిస్తాను. పోనీ సౌందర్యపోషణ అనుకున్నా తప్పేమీలేదు. అది మన స్వవిషయం. ఎదుటివారి అందాన్ని కేవలం బాహ్యంగా కాకుండా, మరి కొంచం లోతుకి వెళ్ళి వారి మానసాన్ని కూడా చూడగలిగితే బాగుండును, అలాగే ప్రకృతిలో కూడా రూపు నిమిత్తంలేకుండా అన్నిటిని అనుభూతిపరంగా ఆస్వాదించగలిగితే బాగుండు.

    అసలు పరంధామునికే పంచామృతాల అభిషేకాలు చేస్తారు, సుగంధపుష్ప మాలలు, అగరు ధూపాలు వేస్తారు. ఇంకా అందంగా వర్ణిస్తారు. దేవినీ జగదేకసుందరిగా తీర్చిదిద్దుతారు. కనుక ఈ లోపం లోకం పుట్టిననాటిది. మనం కేవలం అందులో ఒక భాగం. ఎప్పటిలా నవ్వేయండి. ధన్యవాదాలు.

    చిన్ని, మీకు సాదర స్వాగతం. మొదటి వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ReplyDelete
  7. మిరియాల వారూ .. గగన జఘన .. హ హ హ. బైదవే, మీ పేరుకి సులువుగా పిల్చుకునే ఒక చిన్న కుదింపు పేరు మీరే సూచించి పుణ్యం కట్టుకోండి బాబూ!
    నేస్తం .. హ హ హ.
    ఉష గారు, పద్యంలో భావం చాలా బావుంది. మీరేమనుకోనంటే దీన్ని కొంచెం డిసెక్ట్ చేస్తాను. రెందు విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టాలని నా విన్నపం. ఒకటి విషయానికి తగిన క్లుప్తత. రెండోది వాక్య నిర్మాణం. ఈ రెంటి మీదా శ్రద్ధ పెడితే మీ పద్యాలకి అంతస్సౌందర్యమే కాక బాహ్య సౌందర్యం కూడా వస్తుందని నా హామీ :)
    అదలా ఉండగా, ముళ్ళ శిలువ అని ఏమీ లేదు. మీక్కావలసిన కవి సమయం ముళ్ళ కిరీటం అయుండచ్చు.

    ReplyDelete
  8. సాదరంగా ఆహ్వానించి
    ఆపేక్షగా పలకరిచే
    హితుడిలో అందం కనబడదూ .. ?
    ప్రక్కన చేరి అనునయించి
    అక్కున చేర్చి సాంత్వననిచ్చే
    అనుయాయిలో అందం కనబడదూ.. ?
    సాయం కోసం చేతిని చాచి
    అపేక్షించకనే అవతలకి పోయే
    ఆగంతకుడిలో అందం కనబడదూ.. ?

    అందం ఒకరి సొత్తూ ఎపుడూ కాదు
    అది ఆపాదించిన కళ్ళదే..
    అస్వాదించే మనసుదే ..

    ReplyDelete
  9. కొత్త పాళీ గారు,
    నా పేరు ని క్లుప్తంగా అంటే మీకు నచ్చిన పేరుతొ పిలవచ్చు.
    "ఫణి" , "ప్రదీప్" , "అర్జునా" లేక "ఫణి ప్రదీప్" అని అయినా పిలవచ్చు.
    పై నాలుగింటిలో ఏదైనా నాకు సమ్మతమే. ఈ నాలుగు పేర్లే ఎక్కువ మంది వాడేవి. అయితే ప్రొఫైలులో మాత్రం నా పేరును కుదించలేను.
    ఆత్రేయ గారు,
    మీ కవిత బాగుంది

    ReplyDelete
  10. బొల్లోజు బాబా గారు ఎక్కడవున్నా మరొక్కసారి నాకు కాస్త సాయం వస్తే బావుణ్ణు :)

    ఆయనిదివరకు నన్ను సమర్థిస్తూ చెప్పిన మాటలివి.

    "ఒకటి మాత్రం నిజం, మనం మనసులో ఉన్న భావతీవ్రత బయటకు వచ్చేప్పుడు, ఖచ్చితంగా దానికి కావల్సిన పదాలను అదే తెచ్చుకొంటుంది. దానిని చదివి ఎడిట్ చేయవలసి వచ్చినప్పుడు, ఒక్క అక్షరాన్ని కూడా తొలగించటానికి, మనసొప్పుకోదు."

    Ref: http://maruvam.blogspot.com/2008/12/blog-post_26.html

    కొత్తపాళీ గారు, మీ సద్విమర్శలకి నేనెపుడూ సిద్దమేనండి. ఇకపై ఆ రెండు విషయాలపై తప్పక దృష్టి పెడతాను. నిజానికి నా భాషా పరిజ్ఞానం పెరుగుతున్న తీరుకి నాకు నేనే చాలా అందంగా కనపడుతున్నాను నా మానస దర్పణంలో ;)

    ఆత్రేయ గారు, అవండి అచ్చంగా నేను వెదికే అందాలు. మీరు మాటల్లో వెలికితెచ్చారు నేను స్వగతంలో దాచాను. మీ కవితా రూపం చాలా అందంగా అమిరింది నా ఈ అందం మీద కవితా సందేహాన్ని తీర్చింది, మంచి సందేశాన్నిచ్చింది.

    ప్రదీప్, ఇక్కడకి మళ్ళీ తొంగిచూసి సమాధానమిచ్చినందుకు కృతజ్ఞతలు.

    అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  11. ఉషగారు, ఆ వివరణ నన్నుద్దేశించిందే అనుకుంటాను. బాబాగారి మాటల్ని ఒప్పుకుంటాను. ఐతే, రచన అంటూ రాసింతరవాత, దాన్ని గుండెల మీద కుంపట్లా భరించలేము గనక, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రూపంలో పాఠకులకి ఆవిష్కరించాలి గనక (రచయిత కేవలం తనకోసమే రాసుకుంటాడు అనే వాదన నేనొప్పను), ఆ ఆవిష్కరించ బడేది సాధ్యమైనంత గొప్పగా ఉండాలి, అందంగా ఉండాలి అనే తపన కూడా రచయితకి ఉండాలి. తన కలంలోంచి జాలువారిన అక్షరాల్ని మార్చాలన్నా కత్తిరించాలన్నా కవికి ప్రాణసంకటంగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలోనే మంచి సంపాదకుల అవసరం ఉంటుంది.

    ReplyDelete
  12. మీరన్నది నిజమేనండి, అందుకే ముందే చెప్పాను. మీ మాటలు తప్పక ఆచరణలోకి తెస్తాను అని. చాలా సంతోషం మీరు నా ప్రతిస్పందన తెలుసుకున్నందుకు. కృతజ్ఞతలు. I believe in edit by delete at work దాన్ని మరువం కొమ్మలు త్రుంచటానికి వాడతాను. లేదా మిమ్మల్నే తోటమాలిగా రమ్మని వేడుకుంటాను. మరి రానని అనకూడదండోయ్. తప్పితే ప్రదీప్ వున్నారు, ఆ హోదా అందుకోను. :)

    ReplyDelete
  13. నిజంగా అద్భుతం ఈ కవిత. చాలా బాగా చెప్పారు అందం గురించి.
    ఇలాంటి ఆలోచనలు భావాలు మదిలో ఊగుతూ ఉంటాయి అప్పుడప్పుడూ.. కానీ, వాటికి ఇంతందంగా, భావయుక్తంగా అక్షర రూపం కలిగించగలగడం మీ పూర్వజన్మ సుకృతం.. మా అదృష్టం కూడానూ..!
    ఉష గారూ, మీ కవితలన్నింటినీ తప్పనిసరిగా పుస్తకం వేయించాలండీ.. ఈ సరికే ఒక పుస్తకానికి సరిపడినన్ని అయ్యే ఉంటాయి కదూ..!

    ReplyDelete
  14. మీ అభిమానానికి ధన్యురాలను. నిజమే ఈ కళ అబ్బటం, తద్వారాగా మీవంటి వారి ప్రేమాభిమానాలు చూరగొనటం పూర్వ జన్మ సుకృతమో, నాకీ జన్మ కలిగించిన భాగ్యమో. మరికనేం, అచ్చు వేయించేసి నాకొక ప్రతి దానం చేయండి. అసలే ఆర్థిక మాంద్యం, నా వల్ల కాదా పని.

    ReplyDelete
  15. నా మనవి మన్నించి సాహితీ మిత్రులు బొల్లోజు బాబా గారు నా "మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా?" కవితపై విశ్లేషణ. నావంటి మరెందరికో ఎన్నో వివరాలున్న విలువైన సద్విమర్శ.
    ********************************
    మీలో అద్భుతమైన కల్పన శక్తి ఉంది. అలవోకగావివిధ భావాల పరంపర మీ కవితలలో తొణికిసలాడుతుంది. సందేహంలేదు మీ కవితలు చదువరి మనో యవనికపై మంచి ఆలోచనలను నాట్యం చేయిస్తాయి.

    ఈ క్రింది విషయాలు మిమ్ములను నొప్పిస్తే వాటిని ఇగ్నోర్ చేయండి. ఈ కారణం మన అనుబంధానికి అడ్డంది కాబోదనే ధైర్యం చేస్తున్నాను. ఈ అభిప్రాయాలన్నీ కవిత్వంపైనే కానీ వ్యక్తులపై కాదు.

    అభియోగాలు
    1. మీకు కలిగిన భావాన్ని మీరు యధాతధంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది కూడా మీరెంచుకొన్న పదాల వల్లకానీ, లేక పదాల కూర్పువల్ల కానీ జరుగుతుంది.
    1. ఉదా: ఎందుకందమంటే:
    ఈ పదం మీ ఉద్దేశ్యం ఎందుకు అందం అంటే అని. వాటిని సంధి చేయటం వల్ల, కొంత సంక్లిష్టత ఏర్పడింది. ఇక్కడ ఆయా పదాలకు ఉన్న నానార్ధాలే కారణం.
    అందం= అందటం to get
    మంటే = మంట/fire
    కనుక పదాలను సంధిచేసేపుడు కొంచెం జాగ్రత్త వహించాలి. తిరిగి చదువుకొన్నప్పుడు ఇలాంటి అనుమానం వస్తే విడదీసేయటం చేయాలి. అంతే కాక ఇలా సంధిచేయటం రెండుకన్నా ఎక్కువపదాలను చేసినట్లయితే ఎబ్బెట్టుగా ఉంటుంది. నా ఉద్దేశ్యం గ్రామ్యంగా మారిపోతుంది. డెప్త్ చచ్చిపోతుంది. ఆవిధంగా కొన్ని సందర్భాలలో లేదా ప్రత్యేకమైన లయకోసం మాత్రమే చేస్తే అందంగా ఉంటుంది.
    విడదీసేసినా కవిత్వపరంగా దోషం కాదు.

    2. భావ అస్ఫష్టత
    ఎందుక్కనువిందంటే అందమని ప్రలోభ

    ఇక్కడ ఎందుకు కనువిందంటే అన్నారు. ఆ కనువిందేమిటో చెప్పలేదు. ఒక వేళ కనువిందు అనేది అందమయితే, తరువాత పదంలో ఆ అందాన్నే ప్రలోభ అని అంటున్నారు.
    నిజానికి మీరు చెప్పిన వాక్యమర్ధం ఇలా వస్తుంది.
    "అందం అనేది ఎందుకు కనువిందంటే అందం అన్న ప్రలోభ వలన" ఇది కొంత గందరగోళంలా లేదూ?
    మీరుమరో గొప్పఅర్ధాన్ని ఉద్దేశించవచ్చు కానీ నేనిలా అర్ధం చేసుకొన్నానంటే, నాలానే ఆలోచించేవారుకూడా ఉంటారని మీరు అస్యూం చేసుకోవాలి.

    3. ముద్దులొలికే గులాబికా అందంవుందంటే,
    ముళ్ళ శిలువ కొమ్మ భరిస్తేనే కాదా?

    ఇక్కడ భరించటం అన్న వెర్బ్ కు సబ్జెక్ట్ ఏమిటి? గులాబీయా, కొమ్మా? అంటే కొమ్మ గులాబీని భరించిందా, లేక గులాబీ కొమ్మనుభరించిందా?
    ఒకవేళ గులాబీ, ముళ్ళ కొమ్మను భరించింది అని మీరు చెప్పదలచుకొంటే, భరించినందుకే కదా? అని ఉంటే మరికొంత స్పష్టంగా ఉంటుంది.
    లేదా కొమ్మ బదులు కొమ్మను అని ఉండాలి.

    మీ ఉద్దేశ్యం గులాబీ ముళ్లకొమ్మను భరించినందుకే దానికి అంత అందం ఉంది. అని అయితే ఆ భావాన్ని ఇలాగ కూడా వ్రాయొచ్చు.

    ముద్దులొలికే గులాబీకా అందం ఉందంటే
    ముళ్ళ శిలువ (కిరీటపు) కొమ్మను భ/ధరించినందుకే కదా?

    4. జతగా గోరింక చిన్నచూపు సహిస్తేనే కాదా?

    ఇక్కడ చిన్నచూపు చూసింది ఎవరు? సమాజమా లేక గోరింకా?
    మీ ఉద్దేశ్యం సమాజమని అనుకొంటున్నాను. అలాగయితే
    వాక్యం ఇలా ఉంటే బాగుంటుంది.
    గోరింక జతైనందుకు లోకం చిన్నచూపును సహించినందుకే కదా? (ఇంకా బాగా రాయొచ్చేమో)

    ఇదే అభియోగం గొంగళి చీత్కారాలు అన్న వాక్యం పై కూడా.

    5.కాల్పనిక అన్న పదంబదులు కల్పనల అన్న పదం బాగుంటుందేమోననిపిస్తుంది.

    6.కరిగే మైనపువత్తే కాలగమనాన కాదా?
    అన్న వాక్యం ఇలా ఉంటే ఎలా ఉంటుంది.

    కాలగమనంలో కరిగే మైనపువత్తి కాదా?

    7. కలదంటూ ఖరారుగా చూపలేని అందం,
    కలకాలం నిలవదు కనువిప్పు కలిగాక కాదా?

    అందం కలదంటూ చూపలేము అన్నారు. బాగానే ఉంది. (ఈ వాక్యం కూడా పై వాక్యాల భావలతో విభేదిస్తుంది గమనించారా?)
    తరువాత కలకాలం నిలువదు అంటున్నదేమిటి? అందమా? లేక కనువిప్పా? ఒకవేళ అందమయితే పైవాక్యంతో విభేదన జరుగుతుంది. లేక కనువిప్పయితే దేనికి కనువిప్పు? రెండవవాక్యాన్ని మళ్లా వ్రాయవలసిఉంటుంది.

    8. అనుభూతికి అందని అసలు అందం,
    అనుభవం ప్రోదిచేసుకున్న హృదయంది కాదా?
    ఇది అద్బుతమైన వాక్యం.



    ఈ కవితను మొదట చదివినపుడు మీ భావాలను అర్ధంచేసుకొని, సాగిపోయాను. మీరు నన్ను కోరారు కనుక మరలా చదివి, మీకు ఉపకరిస్తాయన్న ఉద్దేశ్యంతోనే ఇలా వ్రాస్తున్నాను తప్ప రంద్రాన్వేషణ కోసం కాదని మీరర్ధం చేసుకొంటారని ఆశిస్తున్నాను.

    మరొక పరిశీలన

    బాహ్యసౌందర్యం తక్కువ అంత:సౌందర్యం ఎక్కువ అని చెప్పేటప్పుడు మీరు తీసుకొన్న ప్రతీకలన్నీ, అందమైనవే. అది కొంత భావాన్య్వయాన్ని దెబ్బతీసింది. మీరెంత వాటివెనుక గ్రే ఏరియాలను చెప్పినప్పటికీ కూడా. మీరు ఆయా గ్రే ఏరియాలను ప్రధాన వస్తువులుగా వాడుకొని ఉండాలి. (నా అభిప్రాయమే సుమా)

    ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ: కాళిదాసు బాహ్యసౌందర్యానికి పెద్దపీట వేసి మేఘాలను/హంసలను ప్రతీకగా తీసుకొంటే, జాషువా అంత:సౌందర్యమే మిన్న అని చెప్పటానికి గబ్బిలాన్ని ప్రతీకగా తీసుకొన్నాడు. అప్పుడు రసభ్రంశం జరగదు.

    మరొక సూచన
    అంత్యప్రాసలపై మోహాన్ని కొంచెం తగ్గించుకోండి. :-)
    కవితలో తూగు అవసరమే అది ఒట్టి అంత్యప్రాసలవల్ల మాత్రమే రాదు.

    ఈ సందర్భంలో త్రిపురనేని శ్రీనివాస్ వ్రాసిన కొన్ని కవితా పంక్తులు (ఇవి నాకెప్పుడూ శిరోధార్యాలే. అలా ఉండాలని నిత్యం కలలు కంటూ ఉంటాను.)
    ఈ కవితలో భావం మిమ్ములను ఉద్దేశించినది కాదు నన్ను కూడా. ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్లీ

    కవులందరకూ ఈ కవిత ఒక హిపోక్రిటిక్ ఓత్ లా ఉండాలని నా అభిప్రాయం.

    కవిత్వం కావాలి కవిత్వం
    అక్షరం నిండా జలజలలాడేపోయే
    కవిత్వం కావాలి కవిత్వం.

    ప్రజల్లోని అగాధ గాధల మీదే రాయి.
    కాగితం మీంచి కన్నులోకి, వెన్నులోకి
    దూసుకుపోయే కవిత్వం వ్రాయి.

    కవిత్వం వేరు వచనం వేరు.
    సాదా సీదా డీలా వాక్యం రాసి కవిత్వమని
    బుకాయించకు.
    కవిత్వాన్ని వంచించకు.
    వచనమై తేలిపోతావ్ .
    కవిత్వం కావాలి కవిత్వం
    అక్షరం నిండా జివజివలాడిపోయే
    కవిత్వం కావాలి కవిత్వం

    ఫుట్ నోట్సులు ఉన్నది కవిత్వంకాదు
    అక్షరానికి అక్షరమే వివరణ అధో జ్ఞాపికలెందుకు
    చివరాఖర్న బ్రాకెట్లు పెట్టేది కవిత్వం కాదు.
    స్వానుభూతికి సహానుభూతే సహజానుభూతి
    కుండలీకరణాలెందుకు.
    .......
    తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని
    మొరాయించకు కవిత్వాన్ని వంచించకు
    వచనమై సోలిపోతావ్
    కవిత్వం కావాలి కవిత్వం

    అక్షరం నిండా కువకువలాడిపోయే
    కవిత్వం కావాలి కవిత్వం
    జ్ఞాపకాలలోయల్ని తవ్వకు, అయ్యోపాపం అనకు
    సాగదీసిన సానుభూతి వాక్యాలొద్దు
    జాలి జాలి ఏడుపు మొహం డ్రామాలొద్దు
    ........

    చెత్తల్ బుట్టల్ మాటల్ రాల్చి కవిత్వమని
    ఘీంకరించకు
    కవిత్వాన్ని వంచించకు
    వచనమై పుడతావ్
    కవిత్వం కావాలి కవిత్వం
    అక్షరం నిండా కళకళ లాడిపోయే
    కవిత్వం కావాలి కవిత్వం

    ReplyDelete