అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట...

అదుపన్నది ఎరుగనే, అలసటకి తావీయనే, నీవడిగిన తడవే
మనమనుకున్న తావున నే వేచుండలేదా, నీ "అభిసారిక"నై?

నీపై అలిగానేమోనని నా మది నాపై కినుకవహించి,
నాపై నేనే అలిగానేమోనని తనపై తనకు దిగులు జనించి,
నడుమ తనపై జాలిలేదాని తనువు మదిపై నిందలువేసి,
ఈ అన్నిటినీ చిన్ని గుండె ఇలా వొంటరిగా గమనించేసి,
తనువు, మనసు, ఆ హృదయం కలిసిన నేను నిలిచానిట "కలహాంతరిక"నై.

మునుపే చెప్పాగా, రెప్పల గోడల వెనుక జాలువారుతున్న,
జలధారల ఇక నిన్నభిషేకించాలని లేదని.
నా గుండెకోట లోని వేల గదుల్లో,
ఎక్కడో ఒకచోట నీ కంటపడకుండా దాగిపోవాలనుందనీ.
నీ చేతల పులకించిన ఆనేనే ఇపుడు నిక్కచ్చిగా "ఖండిత"నే

యేనాడు వీడావీ చేయి, హొయలు ఒక పరి, వగలు తదుపరి,
అన్నీ కలిసి కలల కావేరినై, దిగుళ్ళ ద్రిగ్గుళ్ళే దీన దేవేరినై
నిస్పృహలో స్పృహ తప్పిన నిండు గోదారినై,
చుక్కాని జారిన నట్టేటి నావంటి వయ్యారినై,
రేయి గుబుళ్ళలో తనువు త్రుళ్ళింతలో తుంటరినై,
తమకమద్దే వేకువల్లో తల్లడిల్లే ఒంటరినై,
లేతప్రాయంపు "ప్రోషితపథిక"నైతిని కాదా?

ఎంత చిత్రం లోకాలనేలేటి రాజునీవైతే,
సరసాల నిన్నోలలాడించి, నీకు రారాజ్ఞి నేనైతి.
వింత కాదేటిదని అంతా మేళమాడితే,
సరాగాల గారాలొలికిన "స్వాధీనపథిక"ను కాదేటీ?

నిత్యం నీ తడిపొడి తలపులతో తనువునలంకరించుకొని,
రహస్యం దాచలేని గుండె చేసే గడబిడనే గంధంగా రాసుకుని,
కార్యం నెరవేర్చుకుని కన్నుగీటిన నిన్నే కాటుకగా అద్దుకుని,
ఆలస్యం చేయక రారమ్మని వేడుతూ నీ "వాసవసజ్జిక"నైతి.

నీ తనువుపై కరిగి, నీ ప్రతిమగా తిరిగి రూపు దిద్దుకుందామని
నా మెత్తదనం నువ్వద్దిన ముద్దుతోనే నీకు తెలుపుదామని
ముకుళించిన నా చేతుల్లో నీ రూపు ముద్రించుకుందామని
నా ఎదలో నిను బందీ చేసి నీకు నేవశమౌదామని
వేచివున్నానిట నీ "విరహొత్కంఠిత"నై.

నేతాళలేనీ విప్రలంబని విన్నవించితి కాదే వేయిమార్లు,
వేగిరపడి, వేదనపడి, వేళపాళయని యోచించక,
విరహాన నను ముంచకని వేడుకుంటిని కానా వేయినూర్లు,
మరి యేలనయా ఈ జాగు, వీడు చేరనేలేదు నీ "విప్రలబ్ద"కై?

ఇన్ని పోలికలు చెప్పి, అన్నీ ఒక నేనేననీ అదీ నీ కొరకేనని చెప్పనా మరోమారు? ఆ అవసరంలేదిక దరిచేర దారిపట్టానంటావా?
గుండె గనుల్లో బొగ్గంటి బాధల్ని, ముగ్గు రాళ్ళుచేసి దంచుదామంటే, రవ్వ పొడుల్లా కవిత వెలుగులు రువ్వుతున్నాయి!

Reference:

The Nayika Bhava

The shastras have classified the basic mental status of woman, the Nayika, into Eight divisions, called Ashtanayika bhavas. These divisions portray the heroine in different situations, express different feelings, sentiments & reactions.

The Ashtanayika bhava are

Abhisarika - She is the one who boldly goes out to meet her lover.
Kalahantarika – She is the one who is repenting her hastiness in quarreling with her lover, which has resulted in their separation.
Khandita – She is the one who is angry with her lover for causing her disappointment.
Proshitapathika – She is the one who is suffering and missing her beloved who is away on a long journey.
Swadheenapathika – She is the one who is proud of her husband’s or beloved’s love and loyalty.
Vasakasajjika - She is the one who is preparing for the arrival of her beloved, by decorating herself and her surroundings to provide a pleasant welcome for her lover.
Virahotkantita – She is the one who is separated from her lover and is yearning for reunion.
Vipralabda – She is the one who is disappointed that her lover has not turned up at the tryst as he promised.

vipralambha: The highest perfection of 'adhirudha' affection in conjugal love involve
meeting (madana) and separation (mohana). In the ecstasy of madana,
meeting, there is kissing, and in the ecstasy of mohana, separation,
there is a symptom of separation, and there is also a symptom called
transcendental insanity. The ecstasy exhibited before the lover and
beloved meet, the ecstasy experienced between them after meeting,
the state of mind experienced by not meeting, and the state of mind
experienced after meeting fearing separation are called vipralambha

10 comments:

  1. ఉష గారూ.. భలేగా ఉన్నాయండీ మీ అష్టనాయిక పేర్లు.
    మీ బ్లాగు పేరుకి మీరు సార్ధకత్వం తెస్తున్నారంటే నమ్మండీ :)

    ReplyDelete
  2. ఇదేమిటండి మీరు రాసిన కవిత నాకు అదేదో భాషలో కనబడుతుంది :( మదుర వాణి గారి వాక్య బట్టి అమేకు బాగనే కనబడుతున్నట్లు ఉంది ..మిగిలిన pOstలన్ని బాగానే కనబడుతున్నాయి .. ఏమై ఉంటుంది చెప్మా

    ReplyDelete
  3. నేస్తం! మరో సారి చూడండి. ఇపుడు ఫాంట్ మార్చాను.

    Thanks for bringing this up.

    ReplyDelete
  4. విడివడి మనమొక యుగమయె
    భయమయమయె నాదు మనము
    నిలకడ వదిలే, గడవక సమయమిపుడు
    వడివడిగా నిన్ను జేర వచ్చితి చెలియా .. కలహాంతరికా

    చేసిన తప్పును ఒప్పితి నప్పుడే
    నిను నొప్పించిన బాధ నాకూ
    నొప్పే సఖియా.. ఒప్పును చేయగ
    నిప్పుడు ఒప్పించగ వచ్చినాను, చెప్పవె సుఖమా .....ఖండితా

    ఎపుడొ వీడితి నిత్తరి, పరి విధముల
    వగచె మనము ఓ సొగసరీ
    పెరిగి పరితాపము గిరివలె
    దరిజేరితి కరుణచూపు ఓ గడసరీ ... ప్రొషితపథిక

    రాజును నేనని నేనన నా మనమున
    నెన్నడు నిండిన నా రాణివి నీవని నేనన
    నిజమే భామా !! మన మధ్యన వీణలు
    మీటగ మరలితి నీ దరికి నేడు పదవే రాణీ ... స్వాధీనపథిక

    తడబడు అధరపు తమకములద్దగ
    అదిరెడి ఎడదకు స్థిరతను కూర్చగ
    వేచిన కన్నుల తృప్తిని నింపగ
    తమకము నిండిన తనువుతొ వచ్చితి లలనా ... వాసవసజ్జిక

    విరహలతా పరిష్వంగనాలంకృత శిల్పవు
    వాంచాశ్వాసావృత సంపూరిత శంఖవు
    విరహాగ్నిజ్వలిత కామధూపావృత దీపవు
    విరహోత్ఖంఠితవు మదాగమన కాక్షితవే బాలా..

    వేళాయెను అదినిజమే నువుతాళలేవు అదియును నిజమే
    కళగల కాంతవు ఆ కళ్ళకు నీలాలు ఏల తగదే భామా
    విరహాన నేను మునిగి వడివడి వేళకు వస్తే,
    ఆనాడు నే రాలేదని ఈనాడీ శిక్షలోద్దు విడవవె ఇంతీ ..... విప్రలబ్ధ

    అదుపన్నది నీకు లేదు అలసట అది అసలులేదు
    ఆరుబయట వేచి ఉండి ఆత్రంగా చూస్తావు
    నీకేమో నేనే ప్రియుడు వేలల్లో నాకు ప్రియులు
    నీ ఇచ్చము వచ్చి నపుడు రమ్మంటే తగున చెలియా ? ... అభిసారిక

    ReplyDelete
  5. ఎప్పటినుండో మీకు కామెంటేద్దాం అనుకుంటూవుంటే ఆఫీసులో మీ బ్లాగ్ కామెంట్ భాగం పనిచేయడం లేదు - పాత బ్రౌజర్ లెండి - అందుకనుకుంటా. ఇప్పటికి తీరిక దొరికింది మరువాన్ని ఇంట్లో చూడటానికి. నాకు ఇంట్లో కంటే ఆఫీసులోనే తీరిక ఎక్కువ.
    నా ఈ బుర్రకి ఎందుకో గానీ కవితలు ఎక్కవు. మళ్ళీ మీరు ఎప్పుడు వచనం రాస్తారా అని చూస్తుంటాను.

    మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చడం ఎప్పుడో గమనించా. మరీ గొప్పగా లేకపోయినా పాత దానికంటే చాలా మెరుగు.

    లోగిలిని మరచిపోకండేం.

    ReplyDelete
  6. ఆత్రేయ గారు, ఎదురుగా వుండుంటే మీలోని కవిహృదయానికి పాదాభివందనం చేసుండేదాన్ని. ఎంత బాగా వ్యక్తపరిచారండి. ఎంత మంచి భావయుక్తమైన పదాలు, ఆపై అంత చక్కటి బిగువైన కూర్పు. చూడగా చూడగా కవితాదేవి కూడా ఈ ప్రేమ భావనల్లో చిక్కుకుని, పురుషపక్షపాతైనట్లుంది. ప్రియుల చెంతనే చేరిపోయినట్లుంది, నా బోటి పాత సఖుల్ని, నెచ్చెల్లుల్ని వదిలిపెట్టేసి. ఏదిఏమైనా కానీ నా మరుపవు వనం ఈ రోజు చక్కని సుగంధాలు వెదజల్లుతుందంటే అది మీ బోటి వారి సహకారం, ఆదరణే. కవితా ప్రపంచంలోని అన్ని వైవిధ్యాలు ఇక్కడ వెల్లివిరియాలన్నదే నా ఈ చిరు ప్రయత్నం. హృదయపూర్వక ధన్యవాదాలు + కృతజ్ఞతలు.


    పోతే శరత్ గారు, ఈ వంకనైనా మొఖం చూపారు, సంతోషం. అయినా అలాగనేస్తే యెలాగండీ బాబు, మీ [ప్ర]వచనాలకి మేమంతా ఎదో వంత వచనాలు కలపటం లేదూ, అలాగే నా కైతలకి మీరూ ఏవో ఒక జేజేలు చెప్పాలి. అదీ మన కూడలి, లోగిలి మిత్రుల మథ్యనున్న పరస్పర అవగాహన. కాదంటారా? అయినా, ఏం బాఅయండి అది, సహాయం చేయపోతిరి ఆపై, ఎవరో కాస్త దయ చూపి template మార్చితే అలా పెదవి విరుపు మాటలనడమే. నేనొప్పుకోను గాన ఒప్పుకోను. నాకు బాగ నచ్చింది. అదంతే :) ధన్యవాదాలు.

    ReplyDelete
  7. ఈ అష్టనాయికల్లో స్త్రీలకు గల choice చూస్తే అబ్బురపాటుగా ఉంది. మంచి కవిత...అర్థాలు కూడా చెప్పినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  8. మహేష్ గారు, ఇదే విధంగా నాయకులకూ choice వుంది. త్వరలో ఆ టపా ఇక్కడ రానుంది. మరి మరుపవు వనానికి రావటం మరువకండేం? మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ReplyDelete
  9. .. మీ అష్ట నాయికల కవిత చాలా బాగుంది అమ్మో ఎన్ని విషయాలు తెలుసునో కదా మీకు

    ReplyDelete
  10. నేస్తం, మీ ఈ పలుకులు మాత్రం పంచదారగుళికలు. అయ్యో దేవా, ఇంత అలవాటు చేస్తివేమయ్యా వీటిని? ధన్యవాదాలు.

    ReplyDelete