నేస్తం, ఒక్కసారి తిరిగిరావూ?

స్థబ్దతలో నన్నొదిలి నిశ్శబ్దంగా,
నువ్వు వెళ్ళిన మరుక్షణమే

నా గుండెని జయించిన నిరీక్షణ,
నా చూపుల్ని శూన్యానికి బదిలీచేసిందా క్షణమే.

వినికిడి మాత్రం మిగిలిన నా చెవులకు,

నీ అలికిడి ఇంకా అందనేలేదు.
రోదించాకే తెలిసింది నా గొంతు మూగవోయొందని,
తామర లేని కోనేరులా నేను మిగిలున్నానని.

మౌనప్రాంగణమైన మదిలోకి,
చిన్న సవ్వడితో అడుగిడే వూహా కన్యలు
నానుంచి కొల్లగొట్టిన నీ జ్ఞాపకాలని
అలంకరించుకొని ఆదమరిచిపోతునాయి.

వసంతం ముగిసిన కోయిలలా తిరిగి నీ రాకకు
క్రొత్త గీతం వల్లించుకుంటున్నాను.
కలగాపులగంగా రంగులద్ది వదిలిన
అసంపూర్తి చిత్రంలా నా జీవితం.

పచ్చని వేడుకల నీడల నల్లని వేదనలు,
వునికిలో శూన్యంలా, ధ్వనిలో మౌనంలా,
నింపేకొలదీ వెలితౌతున్న నా మది,
తనకు తానే బందీ అయింది,

పంచేకొలదీ మిగిలిన వెతల సంకెళ్ళతో.

రేపటి రేవులో ఎదురుచూపుల గేలం,
ఆశల ఎరతో,
తిరిగి తిరిగి పట్టిస్తుంది,
కాలం తల్లి కన్న క్షణాన్ని.


క్షణాలు కరిగి, క్షణాలు తరిగి,
జీవితం ఘనీభవించదే కాసంతైనా?
పరుగు పరుగున ప్రవహిస్తుంది,
నిన్నటి గాయానికి నేటి మందు రాసేస్తూ.

కాలానికి ఎదురీదుకుంటూ గతం వెదుకుతూ,
స్మృతుల తిన్నెలపై, నీ జాడనన్వేషిస్తూ,
అలసితి, సొలసితి,
నేస్తం, ఒక్కసారి తిరిగిరావూ?

7 comments:

  1. విరిగిన వక్రతల్లో ఎన్ని వంకరలో
    కరిగిన నా కన్నీళ్లలో ఎన్ని కలవరింతలో
    కారణమేదైనా కాలంలోనే ఆగిపోయావేమి నేస్తమా?,
    విడిపించిన క్షణాల్ని వెక్కిరిస్తూ నేనూ విలపించాను
    విధిరాతను దిక్కరిస్తూ నేనూ వేదన పడ్డాను..
    అనుభూతి రూపంలో గతాన్ని మింగేసాను, ఐనా
    ఇప్పటికీ ఆశల తుంపరలు నిన్నే చేరుకుంటున్నాయి..

    ఉషా గారు, నాకు మాట్లాడటం తెలియదు కానీ చిన్న ఉపమానం, చల్లటి నీళ్ళు ఎంత వేడిగా వున్నాయో చెప్పవచ్చేమో కానీ ఈ కవిత ఎంత బాగుందో నేను చెప్పలేను. ముఖ్యంగా అనుభూతికి మాటల రూపం ఇవ్వడం మళ్ళీచూస్తున్నాను. సూపర్ అనుకోండి..:)

    ReplyDelete
  2. ఉనికిలో శూన్యంలా, ధ్వనిలో మౌనంలా,
    నింపే కొలదీ వెలితౌతున్న నా మది,

    నాకు పై వాక్యాలు బాగా నచ్చాయి ఉష గారు.

    ReplyDelete
  3. పృథ్వీ! నాకు మాత్రం నేను కలల్లోనే చూసే వెదురుపుష్పాన్నో, మావూరి శివాలయంలోని నాగమల్లినో అఘ్రాణించినంత ఆనందంగా వుంది మీ ప్రశంస చూస్తుంటే.

    వేణూ గారు, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, నిజానికి నాకింకా అంతుబట్టనంత, నే పోల్చలేనంత వెలితి అనిపిస్తుంటుంది. ఇప్పటికి అలా పోల్చేసాను.

    ReplyDelete
  4. ఉష గారు,
    కవితలు మిగతా బ్లాగులు చదివినట్టు ఎప్పుడైనా సరే చదవలేను. మంచి మూడ్ ఉండాలి. ఎవరి మీదా విసుక్కోబుద్ధెయ్యని వెచ్చని ఉదయాలు, చల్లని సాయంత్రాలు..ఇలా! ఇవాళ మీ బ్లాగు తీరిగ్గా చదివాను. చాలా రుచిగా ఉన్నాయి మీ కవితలు. ప్రిపేరై రాసినట్టు కాక, ఫీల్ అయి రాసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మీరు ఫీల్ అయి రాస్తేనే చదివే వాళ్ళని కూడా ఫీల్ అయ్యేలా చెయ్యగలుగుతారు. అభినందనలు!

    ReplyDelete
  5. సవినయంగా మీ ప్రశంసని స్వీకరిస్తున్నాను, సుజాత గారు. మునుపు వ్రాసుకున్న నా మాటలే తిరిగి ఉటంకిస్తున్నాను. "ప్రేరణ " కన్నా నాకు "పూనకం" వంటిదండీ ఈ కవితావేశం. అది వంటి మీదకి కాక మనసుకి పడుతుంది. అది దిగాక ఏమి గుర్తుకిరాదు. మనసు గర్భం లోంచి భావ ప్రసవవేదన పడి బయటపడేవే నా ఈ కవితా బిడ్డలు.

    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు

    ReplyDelete
  6. ఉష గారూ, మీ భావాలు అద్బుథంగా ఉన్నాయి. మీ లంటి వారు నన్ను మెచ్చుకోవడం అంటే పై తరగతికి పమోషన్ వచ్చినట్లే

    ReplyDelete
  7. కళాప్రపంచంలో తరతమబేధాలుండవ్, శృతీ, కళాదృష్టి, కళభావన, కళాభిరుచి, కళాభిమానం ఇవే నాలుగు దిక్కులూను నా వరకు. సరే మరి, మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుందాం. కానీ మీ ప్రశంసను మాత్రం సవినయంగా స్వీకరిస్తున్నాను.

    ReplyDelete