వస్తాను మరల మరల, ఓ సంద్రమా!

ఎప్పుడెప్పుడు కలుస్తానోననుకున్నా,
అప్పుడప్పుడు కలుస్తుంటాను.
ఇక్కడిక్కడే చూస్తున్నాననుకుంటూ,
ఎక్కడెక్కడో చూస్తుంటాను.

అదిగో నీలం, ఇదిగో నల్లనంటూ, నీ రంగులు
వెదికేస్తుంటాను ఎప్పటిమాదిరే!
అలల చెక్కిళ్ళపై నురుగు మెరుపులతో,
నవ్వేస్తావ్ తప్పనిసరిగా.

తనననుమతి అడుకగ తన ప్రతిమని
నీ ఒడిలో దాచావని,
చుప్పనాతి సూరీడు గుర్రుమంటాడు,
చర్రుమని నీ నీరు కొల్లగొట్టేస్తాడు.

దోచింది దాచేందుకు ఖజానా లేదా ఖలిఫాకి.
మబ్బు దుబ్బుల్లో వంచేసి మొఖంచాటేస్తాడు.

తబ్బిబ్బులయ్యే నీలికొండల మేఘమాలకి,
నీనున్నా నీకండంటూ,
రాడా మరి రయ్యి, రయ్యీ మంటూ గాలి చెలికాడు?

అదను చూసి ఓ దెబ్బేసి,
మబ్బు కుండలు దబ్బున తన్నేసి,
జారుకుంటాడు పొలికేకలెట్టే గొల్లోడిలా,
తత్తరపడ్డ బుల్లిమేకంటి వాన చిన్నోడు,
దోసిళ్ళ తోడీ, గుప్పిళ్ళనింపీ, నీ నీరు,
నీకిదిగో లెమ్మని వంచిపోతుంటాడు, అయితేనేం,
మానాడేంటి నేల కన్నేమీద తన చిలిపి జల్లుల వసంతాలు?

చేసిందంతా చేసేసి ఇక ఇప్పుడు తొంగి చూసేటి సూరీడ్ని,
రారమ్మని చెలిమి చేసేస్తావు. నీ రంగు తనకద్దుకోమంటావ్
సిగ్గుపడి ఎర్రబడ్డా, కుంచెకందని రంగుల్లు
ఆకసానికి అద్దేసి, ప్రతిరూపుగా నీ తనువెల్ల కప్పేసి
సెలవు తీసుకుంటాడు తన నెలవుకి.

నీ ఎదురుగ నేనలా నిలుచుంటా, లెక్కపెట్టలేనన్ని మార్లు,
సాక్షినవుతూనేవుంటానీ అనుభూతికి.

అలలెక్కి దిగే గవ్వనై, దోబూచులాడలేను.
చిందేసే చేపపిల్లనూ కాలేను.
కొమ్మల మెట్లు దిగి ఓ మునకేసి,
మళ్ళీ రెమ్మల వూయలలూగే గువ్వనసలే కాలేను.

బాటసారినై వచ్చి నీ చెలిమికి పిపాసినయ్యానో,
మరి బానిసనయ్యానో, అందుకే అంటున్నాను,
వస్తాను మరల, మరల, ఓ సంద్రమాని!

4 comments:

  1. తనననుమతి అడుకగ తన ప్రతిమని
    నీ ఒడిలో దాచావని,
    చుప్పనాతి సూరీడు గుర్రుమంటాడు,
    చర్రుమని నీ నీరు కొల్లగొట్టేస్తాడు
    chaalaa baagaaraasaaru :)

    ReplyDelete
  2. ఉషాగారు మీ ఉపమానాలు అద్భుతం. చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  3. chaala chaala baagundi Usha.

    ReplyDelete
  4. నేస్తం, జన్య, ధన్యవాదాలు.
    ఆత్రేయ గారు, ధన్యజీవిని.

    ReplyDelete