అవును, నీ నాయిక ఇప్పుడు ఖండిత, విన్నావా నాయకా?

నాకు కళ్ళు తెరవాలని లేదు,
వాకిట్లోని నిన్ను స్వాగతించాలనీ లేదు.
రెప్పల గోడల వెనుక జాలువారుతున్న,
జలధారల ఇక నిన్నభిషేకించాలని లేదు.
నా గుండెకోట లోని వేల గదుల్లో,
ఎక్కడో ఒకచోట నీ కంటపడకుండా దాగిపోవాలనుంది.
మరలిపొమ్మని నీకు కబురంపాలనీవుంది.
నీతో కలిసి విహరించిన వూహల పూతోటలు,
శిశిరపు శిధిలకళతో కొనవూపిరులు వదులుతున్నాయని,
నీ ఒడిలో నిదురించిన నా కనులు,
నిప్పు కణికలై నన్నే కాల్చేస్తున్నాయనీ వివరించాలనివుంది.
నీ చేతల పులకించిన నా తనువిక,
తానర్పితం కాబోనని "ఖండితంగా" శాసనమేస్తుంది.
చెప్పినవిక చాలని వెళ్ళిరావా మరి?
మన ఆశల సమరంలో, ఆశయాల రణంలో నువ్వొక విజేతవై,
కాదు కాదు జగద్విజేతవై, నా చేయి నీ చేత నుంచి,
నన్ను నీ చెంత చేర్చుకునే ధీరోదాత్తవై మరలిరావా మరి?

5 comments:

  1. WOW!!
    I know what you are talking about!.

    KumarN

    ReplyDelete
  2. ఉషాగారు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటే ఇదేనేమో అసలు వచ్చినది దిరోదత్తుడై మిమ్మల్ని తన చెంత చేర్చు కొడాని కే నేమో?అవేవి తెలుసు కాకుండానే కళ్లు విప్పను , బయటకు రాను నువ్వు ఫో అంటే ఎలా?పశ్చాత్తాపం తో పరుగున వచ్చి అక్కున చేర్చుకుందమనుకునే ప్రియునికి ఇచ్చె స్వాగతం ఇదేనా?

    ReplyDelete
  3. Kumar, glad that you're on the same page as this naayika does :)

    రవిగారు, ఇంకనేం, మీరన్నదే నిజమైతే మన నాయిక ఇక ఒక సీసాపట్టుకుని దేవదాసు గారెక్కడ వున్నారో తెల్సుకుని ఆ దారి పట్టటమే సరి :) లేదూ తన మనసు చెప్పిందే నిజమైన పక్షంలో వెళ్ళిన నాయకుడు తప్పక వస్తాడులేండి తన నాయిక కొరకు, ఏం చెప్పగలం అప్పటికి మళ్ళీ అభిసారికో, విరహోఠ్కంటితో అవ్వొచ్చు కదా! :) మొత్తనికి ఇదేదో బాగుందే మనమంతా ఆమె గురించి ఆలోచిస్తున్నాం, అదృష్టవంతురాలు మన నాయిక.

    ReplyDelete
  4. చక్కని కవిత. ఖండిత ఈ నాయక. ఎప్పుడు కరుణిస్తుందో ఎవరికెరుక?

    ReplyDelete
  5. జయచంద్ర, ఇదే నాయిక "అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట... " http://maruvam.blogspot.com/2009/01/blog-post_22.html అని కూడా వాపోయింది. దేవుళ్ళు, దేవతలే ఈ ప్రణయ రక్కసి చేత చిక్కి విలవిలలాడగా [విరహాలు, ఖండనలు, కలయికలు, ఎడబాట్లు, ఎద పొంగు వలపు ఉప్పెనలు వెరసి ఇంద్రధనుస్సు వంటి పోకడలు] మానవమాత్రులం మనమెంత, ఆ లక్షణాలు తప్పించుకొనగా? మీ వ్యాఖ్యాప్రశంసకి నెనర్లు.

    ReplyDelete