ఈ గీతానికి నువ్వే పేరుపెట్టు - ప్రేమని మాత్రం వద్దు, అది కరిగిపోతుంది ...

పేరులేని ఈ జీవనపుష్పం సౌరభాలు గాలిలో కరిగిపోయే క్షణాల,
నీవొక పిల్లతిమ్మెరవై తననలుముకున్నావ్,
ముకుళించే వేళ తిరిగి బొడ్డుమల్లి మొగ్గైంది.
మరుసారి వికసిస్తే తన సౌరభాన్నంతా నీలోనే కలపాలని కాబోలు.


రేపటి వేకువనే వస్తావని, తన రేకు రేకు నీవే విరియిస్తావని,
రానున్న పొద్దుని నేచెప్పేవరకాగమని బుజ్జగించి,
పోతున్న మాపుతో మైత్రిచేసి సగం రేయిలో నిలిపేసి నీకై వేచివున్నా.
శీతల పవనమై, మబ్బురెక్కలతో వేగిరం వస్తావు కదూ, నా నేస్తం?


గుండె కతలన్నీ గుట్టుగా, గుసగుసగా చెప్పలేనని,
కలంనడిగి నీలి అక్షరాలు తెచ్చా.

చిర్నవ్వు రేకులన్నీ నీపై చల్లలేనని, చిరుగాలి తెరలుతెచ్చా.
నిన్ను హాయిగా మురిపించి, అదిలించి, నెమ్మదించలేనని,
చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?


జీవితపు యెలమావి తోటలో తిరిగి స్నేహపుచిగురింపు.
ఆ చివురు సుతారంగా కొరికిన కాలపుకోయిల గళంవిప్పిన,
కమ్మని జీవన గీతమై, మన ప్రేమ సంగీతసరస సమ్మేళనంలో,
తన్మయ స్వరాలు, తనివితీరని రావాలు రువ్వే ఆ తరుణం,
నిత్యం శాశ్వతం చేద్దామా? ఈ ఆమనినే నిండుజీవితం కొనసాగిద్దామా?

13 comments:

  1. రెండో పాదం తప్పితే మిగిలిన వరసలన్నీ అర్ధమయినట్టున్నాయి.

    "వెన్నెలమ్మని తేను వెళ్దామంటే" లో తేను అంటే ఏమిటండి?

    "తన రేకు రేకు" "నీకై వేచి ఉన్నా"... ఈ కవితలో జీవన పుష్పం, నేను ఇద్దరూ ఉన్నారా? లేక ఇద్దరూ ఒక్కటేనా? నాకిది అర్ధం కావడం లేదండి :(

    ReplyDelete
  2. నాకు కవితలు మరీ లోతుగా ఆలోచించి అర్ధం చేసుకునేంత సీన్ లేదు :(
    కానీ.. చందరయ్య లైన్లు నచ్చాయి :)

    @ దిలీప్ గారు,
    'తేను' అంటే తేవడానికి వెళ్ళాను అనేమో..!!
    ఉష గారు మీరే చెప్పాలి అవునో కాదో.. :)

    ReplyDelete
  3. తేను దీన్ని cat లో "కే"/"క్యా" ని పలికినట్లు పలకాలి. తేవడానికి అని అర్ధం.

    ReplyDelete
  4. @ మధుర వాణి గారు

    ఇప్పుడు అర్ధమయింది, రాత్రి నిద్ర మత్తు లొ చదివా :-) ఎంత జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదు...

    ఇంకొక డౌటు ఉంది, అది కూడా తీరిపోతే ఈ కవితని ఆస్వాదించే స్థాయికి వెళ్తా...

    ReplyDelete
  5. మీరు నేస్తం నేస్తం అంటూ రాసే ప్రతి కవిత నాదే అని ఫీలైపొతున్నామరి :P చాలా బాగా రాసారు

    ReplyDelete
  6. దిలీప్ గారికి, అలేఖ్య గారికి, ముందుగా స్వాగతం. మీ ఏకాంతవేళల ఇలా అపుడపుడు మరువపు గాలి [చాలా మంచిదని, తులసీ అంత గుణాలున్నవని "చరక సంహిత"లో వ్రాసి కూడా వుంది] పీలిస్తే ఆరోగ్యకరం!

    దిలీప్, మీ సందేహం ఒకటి మధురవాణి, అలేఖ్య గార్లు తీర్చివేసారు. పోతే ఆ రెండో పాదంలో నా జీవనపుష్పం, నేను ఇద్దరం వున్నాం, అది విరియాలని చూస్తూ నేను, తనని అలా విరియింప చేసే నేస్తం కొరకు అదీనూ.

    మధుర, అవును ఆ చందరయ్యకి ఎన్ని కొంటె కళలో చెప్పలేను, ఒక్కోసారి ఒక్కోవిధంగా ఏడిపిస్తాడు, నాకు కూడా ఈ చేష్ట భలేనచ్చింది.

    వేణూ గారు, మీ ఈ చిరు పలకరింపులే వేణుగానమంత మనోహరం.

    నేస్తం, ఇకనేం, త్వరలో ఇవన్నీ మాలగా గుచ్చి మీకు మన సాహితీమైత్రి చిహ్నంగా బహూకరిచ్చేస్తాగా!

    ReplyDelete
  7. అవును, నిజంగా ఆరోగ్యకరం నా భావుకాత్మకి! :-) ఇప్పుడు ఇంకో సారి చదువుకుంటాను తీరికగా ఉన్నప్పుడు...

    ReplyDelete
  8. మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ అన్నారు...

    @ఉష గారు,
    మీరు రాసిన "చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
    ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
    నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి, నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక? " చదువుతుంటే "ఇరులు నిశాచరులు...." అంటూ విశ్వనాధ వారు రాసిన తామసి పద్యం గుర్తుకొచ్చింది.
    అంటే అర్ధంలో సామ్యముందని కాదు, నడకలో సామ్యం వల్లనన్న మాట.
    **********************************
    ప్రదీప్ గారు సమిధ ఆనంద్ బ్లాగులో https://www.blogger.com/comment.g?blogID=2436801545512226753postID=307266853269796910isPopup=true వ్యక్త పరిచిన అభిప్రాయాన్ని తర్వాత వినియోగానికై ఇక్కడ తిరిగి పెట్టుకుంటున్నాను.

    ReplyDelete
  9. మొత్తానికి నా వ్యాఖ్యలు ఎక్కడున్నా లాక్కుని తీసుకొచ్చి మీ తోటలో కట్టేస్తున్నారన్నమాట, బాగుంది.
    నిజానికి ఈ టపా ఎందువల్లనో చదవలేదు. చదివాక అంతకన్నా మంచి వ్యాఖ్య రాయలేనోమో అనిపించింది.
    మొత్తం కవితలో ఆ మూడు పాదాల నడక పరిగెత్తింది, మిగిలిన భాగం నడచింది

    ReplyDelete
  10. * ప్రదీప్ అందుకే ముందుగా పై వ్యాఖ్యలోనే సంజాయిషీ కూడా ఇచ్చేసా. అయినా ఎంత అభిమానం లేకపోతే అలా పదిలపరుస్తాను చెప్పండి, ఈ వనం నా స్వంతం కదా. ఇక్కడి కవితలు, మాటలు నా వారసులకి అందించాలి కదా. అందుకే ఒకసారి వ్రాసాను - "పనిలో పనిగా కవితాదేవి పూనినపుడు అకడకడా నే వదిలివచ్చిన ఆశుకవితల్ని అనాథబిడ్డలుగా వదలాలనిపించలేదు. అట్టట్టా తిరిగి వాటినీ చంకనేసుకొనొచ్చి ఇందులో (మరువం లో) వదిలాను. " అని అలాగే మరువాన్ని గురించిన మాటలూ మూటగట్టెసుకుంటానన్న మాట! ;

    ReplyDelete
  11. నేనే కవిత.
    నా కవిత ప్రకృతి.
    ఆ ప్రకృతి నా మనసు.
    నా మనసు నేనే!
    కాబట్టీ నేనే ప్రకృతి.
    నా కోసం నా పురుషుడు రాకుండా ఎక్కడెకళతాడు?
    నేను కాక అతడికి ఈ లోకంలో మిగిలిందేమిటీ, దొరికేదేమిటీ?

    మీ కవితనే కుదించి, మీ నేస్తం కోసం మీరు తెచ్చి సిధ్ధం చేసినవన్నీ చూసి, మీలో ఒకింత గర్వాన్ని నింపి, నా దృష్టితో మిమ్మల్నోసారి చూసి, ఆలోచిస్తే నాకు తోచిన నాలుగు మాటలివి. మీ కవితతో దీనికి పూర్తిగా సంబంధముందనలేము కానీ, నా స్పందన ఇల్లానే బయట్కొస్తానంది. తప్పు నాది కాదు, దానిది.

    ReplyDelete
  12. ఆనంద్, జీవితంలో ప్రతి దానికి ఒక కారణం, వివరణ అన్వయించుకుని తగు కారణాలతో దైవ నిర్ణయాన్ని వెదుక్కోవటం అలవాటు. ఎప్పటిదో జనవరి టపాకి మీ వ్యాఖ్య రావటం అందులో దాగున్న సందేశాన్ని నాకు ఇవ్వటానికే. మీ స్పందన, అది వెలికి వచ్చిన సమయము సరైనవీ, సత్వరం కావాల్సినవీను. ఈ కవిత నా స్వానుభవంలోనిది. మీ సమాధానం అంతే, నిజ జీవితానికి సంబంధించినది. సంతోషం. కాస్త ప్రస్తుతంలోకి వచ్చి క్రొత్త టపాలకి సమాధానమీయరాదు? ;) మీకు, నందినికీ, అమ్మా, నాన్న గార్లకి నెనర్లు.

    ReplyDelete