పునరపి జననం, పునరపి మరణం.

మరణం:
తానొంటరిగా వస్తది, వేరొకరిని ఒంటరి చేసేందుకు.
పిలుపులు, ఎదురుచూపులు వలదన్నట్లే,
తనకు తాను చెప్పుకుంటది వీడ్కోలు.
విడిచిపోతున్న నీటివెంట వెల్లువయ్యే పాలపొంగల్లే,
నిట్టూర్పు ఘోషతో వేదన వుప్పెన్లు.
వాడినా, వాసన వీడని మరువం,
గుండె గాయానికి అద్దిన మరపు గంధం.
పరిమళిస్తూనే వుంటుంది అనుక్షణం,
తడారని కనులకిస్తూ పొడి వాయనం.
కాకుంటే సాగుతుందా కాల గమనం, జీవన క్రమం?
కాలం కూల్చిన గతపు శిథిలాల్నుండి ఎవరో పిలిచినట్లు,
నేటి నిట్టూర్పుల వేడికి రేపటి కలల మంచు కరిగే వేకువలో,
బ్రతుకు కొమ్మపై, వూపిరి చిగురులు త్రుంపేస్తూ,
తపించే మనస్సుకి మరుజన్మ వరకు మరి రానని
మాటిచ్చి వెంటపెట్టుకుపోతుంది
మరణం.
తనువు వునికి దూరమైనా, తనవారి జ్ఞాపకాల కాష్టంలో,
కాలుతూనే వుంటుంది తానొదిలిన వెళ్ళిన సమిధ.
గడప గడపనీ తట్టి వెళ్తూ,
తన కడుపు పదిలమన్న కన్నవారి మమతలు కాలరాస్తూ,
నా తోడు వీడకన్న ప్రియమార మురిపాలు కన్నీట ముంచేస్తూ,
తను రాక తప్పదని,
వస్తూనే వుంది, వచ్చిపోతూనే వుంటుంది మరణం .
*******************************************************
చెల్లీ, నువ్వెక్కడికీ వెళ్ళలేదమ్మా. అప్పుడు అక్కున చేర్చుకున్న అక్కనే ఇప్పుడు కడుపున మోసానంతే.

*******************************************************
జననం:
అన్నకి ఇష్టం చెల్లంటే,
నాన్నకి ప్రాణం పాపంటే,
అమ్మకి తానే అన్నీనూ,
స్నేహంటే మా లోకం,
తనదేమో నవ్వుల లోకం!*******************************************************
అవును చెల్లీ! నీ మరణం ఒక విరామం మాత్రమే. తిరిగి ఈ జననం ఆ పైవాడి వినోదమేమో కానీ నాకు మాత్రం చాలా ప్రమోదం.

3 comments:

  1. మనసంతా బాధగా అయిపొయింది ఎందుకొ

    ReplyDelete
  2. Usha, your pain reflects in this poem. At the same time, I am sure you are having lots of fun with your sister in her 'new' role.

    ReplyDelete
  3. పునరపి జననీ జఠరే శయనం .....
    చుక్కల లోకంనుండి దారి చేసుకొని
    మీ ఒడిలో పసి పాపై చేరు కొని
    మీ పెదవులపై చిరు నవ్వై ,
    చిరంజీవిగా వర్ధిల్లుతుంది .

    ReplyDelete