ఇపుడిపుడే అరుదెంచే శీతువులో,
విడివడని చినుకుతెరై జాలువారే హిమతుషారం,
రవి రాకకి పట్టింది ప్రత్యూష రథం,
జల్లుగా కురిపింది హేమంత చందనం.
ఇరు మేఘాల చిరుసందడిలో చినుకుల జడి,
మేరు ఘర్జనల అలజడిలో మెరుపుల వరవడి,
సరి సరి రాగాల నెత్తావి గుస గుసల గుంభన సడి,
విరి తరుల వయ్యారి వూపుల పొంగారు పుప్పొడి,
గోధూళి వేళ, పున్నమి రాత్రుల జాలువారు,
తెమ్మెరలు, వెన్నెల వెలుగులు వెరసి వెల్లువైన పుత్తడి జాడలు,
కావా నీకు నా రాయబారం, మొసితెస్తూ నా ప్రేమ సంబారం.
స్మృతుల అక్షయం నుండి తొణికే, క్షణపు బిందువులన్నీ ఏరి,
జీవనసాగరతీర భావరేణువుల తళుకులద్ది,
గుండె ఆళువలో గుత్తంగా చేర్చి, ఓ రూపునిస్తే
మెలిమి ఆణిముత్యమై మెరిసి, నా మీద రువ్విన,
మెరుపుల జడికి ప్రతీకవై నిలిచిన,
నా అపురూప నేస్తం,
కంటి బాస, గుండె వూసు, జతగూడి గుస గుసలాడితే,
నీ కలకంఠి నోట పలికే పాటకి పల్లవి నీ స్ఫూర్తే.
మీ కవితలు చదివే సగం తెలుగు నేర్చుకుంటున్నాను .. ఎంత తీయని భాష .. ఎంత చక్కని పదాలు
ReplyDeleteఅబ్బబ్బా..... ఏం రాసారండి, పదాలు ఎక్కడ దొరికాయండి మీకు!
ReplyDeleteనేస్తం, పద్మ్మార్పిత, మీ ఇరువురి పలుకులు మాత్రం కేవలం నా మీద కురిసిన హేమంత చందనాలు. మరి మీకు నా చందన తాంబూల వందనాలు.
ReplyDelete