మావూర్లో అవతరించిన పిచ్చుకపై ...

అవును నాకర్థమైపోయిందిలే,
నువ్వొచ్చింది మావూర్నుంచేనని,

నీ బుల్లి ముక్కు, బుజ్జి బుజ్జి రెక్కలే
నాకు గుర్తులు.

నువ్వొక్కత్తివే వచ్చావేమని పలకరిస్తే,
అవును అలా ఎగిరిపోతావేం
రెక్కలు నీకేవున్నాయని టెక్కా ఏంటి?


ఎందుకంటే కాలం నను మార్చిందో,
కాలంతో నేనే మారానో కానీ
,
గమనించలేదేమోనని సరిపెట్టుకుందామన్నా,
మనసాగక నీ ముందుకొచ్చినా తప్పుకునేపోయావ్.
అంటే నువ్వు నన్ను గుర్తు పట్టలేదన్నమాట!

వుండు ఇంకొక ప్రయత్నం చేయనీ,
అద్దంలో నిన్ను చూసుకుని,

పొడిచి పొడిచి ముక్కంతా ఎర్రన చేసుకున్నావని,
గుర్తుందా
? నువ్వు రెక్కలతో ఎగిరితే,
నేను కాళ్ళతో ఎగిరెగిరి చివరికి నినుపట్టి
,
అల్లంత దూరాన వదిలివస్తే,
నాకన్నా ముందే తిరిగొచ్చి వెక్కిరించావ్.


పండక్కి పట్టూలంగా వేసుకుని,
పారాణి అద్దుకుని,

కాళ్ళగజ్జెలు పెట్టుకుని, పూలు కోసుకోను,
బూరియ్య గారి మల్లె తోటకొస్తే,
పందిరిగుంజలతో,

నీ వాళ్ళనేసుకుని స్తంభాలాటలాడుకుంటూ
మరోసారి వెక్కిరించావ్.


అమ్మమ్మ కాకమ్మ పిచికమ్మాంటూ కథలేవో చెప్తుంటే,
అక్కడక్కడే తిరుగాడుతూ
కామాక్షక్క విసిరిన నూకలన్నీ ఏరేరి తిన్నావ్.

రామన్న తాత పొలంలో నువ్వేనంటగా
పురుగులేరి పంట కాపాడింది,

ఇంకొన్ని విన్నవన్నీ మళ్ళీ నిన్ను
అడిగి తెలుసుకుందామంటే
అదిగో అలాగే వెక్కిరించావ్.


నేవెళ్ళిపోయినా నువ్వక్కడే వుండిపోయావ్,
మరి నీకు అవలేదేమో నాకులా పెళ్ళి.

వేసవికొచ్చినా, ఉగాదికొచ్చినా
కనిపిస్తూనేవున్నవుగా చాన్నాళ్ళు.

వేణు చెప్పాడు విన్నావేంటే అక్కా!
పిచ్చికలు చచ్చిపోయాయంటాని
,
ఎంత బాధేసిందో, ఎందుకని అడిగితే
తలో మాటా చెప్పారు,

పురుగుమందుల ప్రభావమన్నారు,
అయినా నువ్వుండగా అవెందుకని
వాళ్ళనెక్కిరించకపోయావ్?


మళ్ళీ ఇంతకాలానికి ఈ చలి దేశంలో,
ఆకు రాలు కాలంలో,

భలేగా కనిపించావే,
బోలెడంత సంబరమైపోయింది.

వెంట పదిమందినేసుకొచ్చావ్,
నాలా వలస వచ్చేసావేంటి?

హమ్మయా గురుతుకొచ్చేసానేంటి,
ఎప్పటిలానే వెక్కిరిస్తున్నావ్?

19 comments:

  1. చాలా బాగుంది.
    జ్ఞాపకాల పూలవానలో తడిచాను.

    ReplyDelete
  2. ఉషగారు చాలా బాగుంది...సంక్రాంతి ముందు రోజే పిచ్చుకలను గుర్తు చేసారు.. మా తాతయ్య అనేవారు పిచ్చుకలంటా సంవత్సరం అంతా గెంతుతాయంటా .... కనుమ రోజు మాత్రం నడుస్తాయంట ... అల్లరి చేయకుండా శ్రద్దగా వాటిని గమనిస్తామని అలా అన్నారో ..మరి నిజమో తెలియదుగాని..అప్పట్లో పట్టించుకోలేదు ..ఇప్పుడు చుద్దామంటే ఏవి పిచ్చుకలు :(

    ReplyDelete
  3. jeevitamamte nanukutaa konni unnappudu pattimchukomu manam pattimchukovaalnukunesariki avivumdavu.

    ReplyDelete
  4. ఉష, పిచ్చుకలు కనిపించని ఈ రోజుల్లో బెజవాడలో concrete jungle మధ్యలో మా మామయ్య ఇంట్లో పిచ్చుకలని చూసి ఎంత ఆనందం వేసిందో. తను కష్టపడి multiply చేస్తున్నాడు వాటిని. దానికి తోడు మీ కవిత చదివాను నా ఆనందం ఎక్కువ అవ్వటానికి. థాంక్యూ.

    ReplyDelete
  5. ఉషగారు చాలా బాగుంది.సంక్రాంతి శుభాకాంక్షలు .

    ReplyDelete
  6. బొల్లోజు బాబా గరి "అంతరించిపోతున్న పిచ్చుకలపై........" చదివాక, చాలా రోజుల తర్వాత ఈ మధ్య మా ఇంటి backyard ఓ పది పిచ్చికలు కనపడేసరికి ఎంత సరదా పడ్డానో. అలాగే మా నాన్న గారి కళ్ళలో ఎంత ఆశ్చర్యం తొణికిసలాడిందో గుర్తుకొచ్చి ఇలా కవితలా ఒలికిన మదురిమిది. వారికి నా కృతజ్ఞతలు. ఆయన కవిత ప్రేరణగా ఇది నా మూడో కవిత.

    మహేష్ గారు, మీ కిచ్చిన మాట [నా మనసులోనే లెండి] నిలుపుకున్నాను. ఇది చాలా సరళంగా, పసి బిడ్డ పాలబువ్వంత మెత్తని భాష. వొప్పుకుంటారా?

    నేస్తం! అచ్చంగా మా బుల్లెంకమ్మ మామ్మ పచ్చడికని పొయిలో దోసకాయ కాలుస్తూ చెప్పిన మాటలే మీరు మళ్ళీ గుర్తుచేసారు.

    జన్య! నన్నొకసారి మీ మావయ్య గారి పొలాలకు తీసువెళ్ళాల్సిందే మరి, మరీ మనియాద పెట్టేస్తున్నారు.

    దుర్గేశ్వర గారు, మీరు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ఇలా నేను వాపోయే వ్యక్తి, వస్తు పరమైన జాబితా వెయ్యేళ్ళు వ్రాసినా తరగదేమో?

    పరిమళం గారు, మరి పాయసం కూడా చేసి పంపరాదాండీ?

    ఒక్కోసారి ఒంటరిగా, మరోసారి జంటగా, ఆపై గుంపుగా వచ్చిపోతూనే వుంది మన వూరు వూరపిచ్చుక మా పెరట్లోకి.

    మీ అందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. హమ్మయ్య భాష చాలా సింపుల్ గా ఉంది. భావం మాత్రం గొప్పది.

    ReplyDelete
  8. ఉష గారు బాగుందండి. మీ ఎక్కిరించే పిచ్చుకల్ని మావూరి వైపుకూడా రమ్మనండి.

    ReplyDelete
  9. బావుందండి ఉష గారు.ఏమిటీ అమెరికాలో బేక్ యార్డ్ లోకి పిచ్చుకలా?అదృష్టవంతులు.నేస్తం గారూ మా తాతయ్య కూడా అవే మాటలు చెప్పవారు.నేను ఎప్పుడూ గమనించలేదు:(

    ReplyDelete
  10. మురళి గారు, మరి తప్పుతుందా తమ బోటి చదువరులని మళ్ళీ మళ్ళీ నా మరువపు వనంలోకి రప్పించాలంటే, భాష మార్చక? ;)

    ఆత్రేయ గారు, అలాగే తప్పకుండా పంపిస్తాను, ఇప్పుడిప్పుడే నా కూరలమడుల్లోకి అవి వతనుగా వచ్చి, బన్నీ బావతో, కొంగ మావతో కబుర్లాడుతున్నయి. లేకులోని చేపలు, బాతులతో చెలిమి చేస్తున్నాయి. బెంగ పడవని నాకనిపించాక అడిగి ఓ రోజుకి మాత్రం పంపుతాను,అంతకన్నా నేనుండలేను వాటినొదిలి :)

    రాధికా, నిజంగానే, నా చిన్న కళ్ళు పెద్దవి చేసుకుని, నోరు తెరుచుకుని వుండిపోయా మొదటి రోజు వాటిని అంత పెద్ద సంఖ్యలో చూసినపుడు. కాకపోతే మా ఇంటి నుండి కనిపించే మొక్కజొన్న, సోయాబీన్ పొలాలు వాటి రాకకు అర్థం వెదికిపెట్టాయి. మరి చూడండి, ఒకసారి వచ్చివెళ్తానంటారేమో? ;)

    ReplyDelete
  11. చాలా బాగుంది ఉష గారు. సరళమైన భాష లో మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించే లా ఉంది. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. వేణూ గారు,నిజమేనండి ప్రకృతిలోని సహజమైన అందాలన్నీ, ఈ పక్షులు, చెట్లు,చేమలు మనని ఇలా అలరించినంతకాలం, మన మనసులు లలితంగా, మన పదాలు సరళంగానే వుంటాయేమో!

    ReplyDelete
  13. ఉష గారు చాల బాగా రాసారు ....మీరు ఫీల్ అవ్వినట్లే నేనునూ ....చెట్టు మీద ఏ పిట్టను చూసిన మురిసిపోతాను ..మీ టపాలు ఇప్పుడే కొన్ని చదివాను చాల బా రాస్తున్నారు .

    ReplyDelete
  14. చిన్ని గారు, శ్రద్దగా చదివి మీ భావాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ప్రకృతితో చెలిమి చేసే ప్రతివారు మనబోటివారేనండి, ఆమె అందాలు ఆస్వాదిస్తూ, అనుభూతుల్లో మమేకమౌతూ జీవిస్తాం. పిట్టలు, పూలు, మబ్బులు, జింకలు, సెలయేర్లు ఇలా ఎన్నో ఆమె ప్రతిరూపాలు.

    నా వ్రాతలు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  15. First let me express my initial feelings... then I'l write the comments

    It's just like meeting an old friend, when got to watch or heard about the little sparrows. పిచిక చెల్లి అని చిన్నప్పుడు పెంచాను నాలుగైదు పిచికలని. వాటిలో ఒకటి చచ్చిపోయింది. అప్పుడు చూడాలి నా బాధ... నాలుగు రోజులు లేవ లేదు. ఈ సమ్దట్లో సడేమియాలా ఒకదాన్ని శ్రీమాన్ మార్జాలం గారు...

    అయ్యయ్యో ఇలా వాటినిక్కడ పెడితే ఆ పాపమంతా మనకే చుట్టుకుంటుందని అక్కా, కుమారి పిన్నీ మిగిలిన రెంటినీ పంపేశారు. కొన్నాళ్ళకి మర్చిపోయాను కానీ ఎందుకో ఆ ’పిచ్చి’ జీవులంటే నాకు చాలా ఇది. భలే ఉంటాయి బుజ్జి బుజ్జి కళ్ళు, ముక్కు. తమాషాగా...

    అలాగే ఉడుతలు. ప్చ్. చాన్నాళ్ళనుంచీ మర్చిపోయిన వాటిని గుర్తుజేసి మీరు నన్ను ఫ్లాష్ బ్యాక్ లోకి నెట్టి మళ్ళా ఈ బీస్ట్ (పనిలో ఉంటే అంతే. ఎమొషన్లెస్స్ బీస్ట్ అంటారు నన్ను) ని కాస్త మానవీకరించారు ThankQ.
    ;)

    చాలారోజులకీ మధ్య మా అమ్మమ్మ (ఆవిణ్ణీ నేను పెద్దమ్మమ్మ అంటాను) గారింట్లో ఆవు పిన్నిని చూశాను. నేను పుట్టకు ముందు పాడి ఉండేది కానీ, నాకు ఊహతెలిశాక అదో లెజండ్ అయిపోయింది. ఈ మధ్య మళ్ళా ఒక ఆవు వచ్చింది. హాయిగా చిన్నపిల్లాడిలా ఆడుకున్నాని.

    If u like, see it here the pictures...

    http://booksandgalfriends.blogspot.com/2009/10/blog-post_21.html

    ReplyDelete
  16. Oh wow, multiplying Sparrows? My goodness. How sweet to hear? He deserves a salute

    ReplyDelete
  17. కొన్ని పిచ్చిక కథల్ని పంచుకోమని pleading... :D

    ReplyDelete
  18. గీతాచార్య, అంత వివరంగా మీ వ్యాఖ్య పంచుఉన్నందుకు నెనర్లు. ఇటువంటి వాస్తవ కవితలు ఎవరినైనా భావావేశానికి గురిచేస్తాయని నా నమ్మకం. బాబా గారి కవిత చదువుతూ యధాలాపంగా కిటికీ బయటకి చూస్తే అలా పదీ చేరి కిచకిచమని గుసగుసలాడుకుంటూ నాచే ఈ కవితని లిఖింపచేసాయి. పైన వ్యాఖల్లో మరికొన్ని వివరాలు వ్రాసాను.

    ReplyDelete