నీకివన్నీ తెలుసని, నాకెందుకు తెలియదు?

దృశ్యాదృశ్య వెలుగులోని జ్ఞాపకాల నీడల్లోకి,
వ్యక్తావ్యక్త వూహల్లోని తలపుల వాకిల్లోకి,
భావాభావ వెన్నెలలోని అంధకార గుహల్లోకి,
క్షణభంగుర మనుగడగా అందరాని లోయల్లోకి,
అనామకంగా, అదృశ్యంగా,
అనూహ్యంగా, ఆవేదనగా,
జాలువారుతున్న నా జీవితం, ఇక నాకేం సొంతం?

చెప్పాలనుకున్నది అవ్యక్తమై,
చేయాలనుకున్నది అనూహ్యమై,
చెందాలనుకున్నది అతీతమై,
చూపాలనుకున్నది అదృశ్యమై,
చివరికంతా శూన్యమై, నేనొక అనామికనై,
నాదంటూ కానిదాన్నే నాదని భ్రమిస్తూ,
భ్రమరమై, భ్రాంతి చుట్టూ భ్రమణం చేస్తూ,
సమరమై, ఓటమినే వరిస్తూ,
దీనంతకీ నాకు నేనే సాక్షినెందుకయ్యాననుకుంటూ,
ఛీ ఛీ నాదీ ఒక బ్రతుకేనా అనుకుంటూ,
అసలదీ నాదేనాననుకుంటూ,
నిజమే నాదేదీ కాదు, నాకేమీ లేదనుకుంటూ,
ఆఖరుకి ఈ నిర్లిప్తతా నాదికాదన్న నిజం నిజాయితీగా స్వీకరిస్తూ,
నన్నింత నాశనంచేసిన నా మనసుని ద్వేషిస్తూ,
నా మరణాన్ని ధ్యానిస్తూ, నా ప్రశ్నలకదొకటే బదులని,
నాకు నేనే మరణ శాసనమేసుకుంటూ,
నా మరణ వాంగ్మూల్యం నేనే పఠిస్తూ,
ఇదిగో అడుగుతున్నానిక నిన్ను, నీకు కావాల్సిందిదే కాదా?

నా మీద కాదు నీ చూపు, నా మనసు మీదే,
ఎందుకంటే నాకు సరైన ప్రత్యర్థి అదేనని నీకు ముందే తెల్సు.
దాన్ని చేతబడితే అదే నాకు చేయగలదు చేతబడనీ నీకు తెలుసు.
మరి నీకివన్నీ తెలుసని, నాకెందుకు తెలియదు?
ఇదొక్కటీ నీకు తెలిసుంటే నాకు చెప్పగలవా?
ఇవ్వటానికి నాకింకేం మిగలలేదు, నీకువతనైన వెల కట్టిచ్చేందుకు.

8 comments:

  1. చాలా బాగుంది. మీ కవితలన్నీ చదువుతున్నా. కాస్త సంక్లిష్టత తగ్గించి సరళమైన భాష లో కూడా అప్పుడప్పుడు రాస్తూ ఉండండి.

    ReplyDelete
  2. మురళి గారు. మీ అభిప్రాయం తప్పకుండా జ్ఞప్తిలోవుంచుకుంటాను. నా బ్లాగుకి స్వాగతం, మళ్ళీ మళ్ళీ రావాలి, మీ అభిప్రాయాలు తెలుపుతుండాలని ఆశిస్తూ..

    ReplyDelete
  3. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయండీ మీదగ్గర!

    ReplyDelete
  4. ఇది చాలా అయోమయంలో పడేసిందండీ. అదలా ఉండగా, దృశ్యాదృశ్య వెలుగు .. భావాభావ వెన్నెల .. ఇలాంటి పలుకుబళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి కూడాను.

    ReplyDelete
  5. మహేష్ గారు, పొగిడారా? తెగిడారా? వివరించమని సవినయంగా మనవి.

    కొత్త పాళీ గారు, మరికొంచం వివరణ ఇవ్వగలరా, అసలే 1000 use cases document చేసే పనిలో వుండి బుర్ర కాస్త వేడెక్కి, అందునా శని, ఆదివారాల్లోనూ పనిచేసి, వింతగా పదును తగ్గింది. కొంచం ఈ దారి లోకి తేవాలంటే మరి కాస్త మెదడుకి మేత అవసరం.నా మొద్దు బుర్రతో మీకు మరింత పని కల్పిస్తున్నందుకు క్షమాపణలతో..

    ReplyDelete
  6. ఉష గారు నిజం చెప్పలంటే నాకు మీ కవితలు నాలు గైదు సార్లు చదివితే కాని అర్దం కాదు..కాని చదివాకా అందులో తీయదనం రుచి చుసాకా చాలా సేపు అందులో నుండి బయటకు రాలేను.. మురళి గారన్న్నట్లు కొంచం సరళమైన భాష వాడితే నాలంటి వాళ్ళం ఇంకా ఆస్వాదిస్తాం..ఒక్కో సారి అలాంటి క్లిష్టమైన పదాల వల్లే సగం మీ కవితలకు అందం ఎమో అని కూడా అనిపిస్తుంది :) కాని చాలా ధన్యవాదాలు ఇంత మంచి మంచి కవితలు రాసి మాకు ఆనందాన్ని పంచుతున్నందుకు :)

    ReplyDelete
  7. మీ క్లిష్టమైన భావావేశం వల్లనో, సంక్లిష్టమైన పదాల వాడుకవల్లనో లేక జటిలమైన పదబంధాల వలనో తెలీదుగానీ, కవిత ఆస్వాదనలో శ్రమ కలుగుతోంది.అందుకే ధైర్యం చాలక కవితను మధ్యలోనే వదిలి పారిపోయాను.

    కాకపోతే కొన్ని పదాలు నన్ను ఆపి అర్థాలు కనుక్కొమ్మని నిఘంటువుకోసం పురమాయించాయి.అందుకే నాకు సాధారణంగా తెలీని పదాలు మీదగ్గర చాలా ఉన్నాయేమో అని చమత్కరించాను.అంతేతప్ప కవితల్ని తెగడ్డానికీ పొగడ్డానికీ రెంటికీ నా అనుభవం సరిపోదని నా నమ్మకం. కవితల విషయంలో నేను కేవలం ఒక ఆస్వాదకుడ్ని...

    ReplyDelete
  8. నేస్తం! ఇది చాలు, వేయిమంది ముందు పట్టు శాలువా కప్పినంత వరమిది1 ఇక ఇపుడు మీరిలా చిరు సవ్వడితో నడయాడి వెళ్ళకపోతే నా మరువపు వనం బావురుమంటది, మరది మరవకండేం?

    మహేష్ గారు! మీ మాటలు పరిగణలోకి తీసుకుని నా కవితాదేవికి సమర్పించాను, చూద్దాం ఆవిడ ఏమంటుందో?

    వ్యాఖ్యలు సమయం, ఆలోచనపెట్టి ఇక్కడ నాకు అమూల్య వరాలుగా ఇస్తున్న మీ అందరకూ మరో సారి ధన్యవాదాలతో...

    ReplyDelete