నేనూ నండూరి ఎంకికేం తీసిపోను...

మళ్ళీ మళ్ళీ ఆ మాటలే నేనూ చెప్తుండేది,
అవన్నీ వింటూనే వుంటాయి మా కథ అలా సాగుతూనేవుంది.
నాకలుపు రాదు, నేనూ నండూరి ఎంకికేం తీసిపోను,
వింటానంటే మీ చెవినా వేస్తా, వలదంటే నాకేం కాదు!

కోవెల్లో బళ్ళున పగిలి నీరు కారిపోయిన కొబ్బరికాయకి
చెప్తుంటా నా మావ ఇంతే వంగనూగుకి నా వొళ్ళు తృళ్ళినా
నావల్లకాదు నీబాధచూడనని వాపోతాడని.

శివ శివా నా తప్పు కాదిది చిత్తం నీ పై నిలువకున్నది
నీ వంటి మీద నీరుగా అలముకున్న గంగమ్మవోలే నా మావా
నీరంటివోడే నన్ను చుట్టేసేవేళ అని లింగాభిషేకాన ఒ చిన్నమాట చెప్పేస్తా.

పంటికి తగలంగానే వగరుగా తోచి
కసింత నిభాయించుకుంటే అమ్మో ఎంతబావుందోననిపించే ఉసిరి కాయకి
చెప్తా నా మావ కొంటెమాటలింతే మామంచి రుచే అచ్చం నీ మాదిరేనని.

సిగలోకి ఓ చిన్ని పూవిమ్మంటే ముల్లుతో గుచ్చి
ముద్దుగా ఓ మొగ్గకొమ్మ నామీదకు వాల్చే ఆ గులాబీ కొమ్మకు చెప్తా
మావా ఇంతే అలక చూపాక నా వొళ్ళోనే తలవాల్చి సిగ్గుపడతాడని.

అపుడపుడూ కల్లోకి వచ్చి కంగారు పెట్టేటి సింహంకి
అరమూత కళ్ళతో ఆగాగి అదను చూసి చెప్తా
నావోడు సింహ మథ్యముడు, వాడి సిరి నీకెక్కడిదని.

సేదతీరగా రావేం అని చల్లగా పిలిచే మఱ్ఱిమానుకి
మెల్లగా చిన్నబుచ్చకుండా మురిపెంగా చెప్తా
ఆడి తనువూ నీమల్లే మేరుగంభీరం, ఆడే నా మహా వృక్షమని.

మొగ్గనీ వదలక మధువుగ్రోలేటి తుంటరి తుమ్మెదకి
కాసింత తటపటాయించి వూసు విప్పేస్తా
మావోడు నీకేం తక్కువ కాదు, మొగ్గలు త్రుంచేటి మొండాడేనని.

పెరట్లోని మావి కొమ్మల్లో దాగి కూజితాలు పోయేటి
గండుకోయిలకి నేనూ ఓ గడుసు సమాధానమిస్తా
నా మావ మాట నీకన్నా మంద్రం, మరింత మధురమని.

నా వంటికధిపతి, నా ఇంటి నాయకుడు, పడకింటి మన్మధుడు,
ఇంకొన్ని కాదు ఇంకెన్నెన్నో వున్నాయి నా మావకి నేనెట్టుకున్న పేర్లు.
ప్రకృతిగా పుట్టిన నాకు అదే చెప్తుంది మరి కొన్ని పేర్లు,
మీకు తెలియనివివుంటే మీ వాడి కొరకు కొన్నట్టుకెళ్ళండి...

18 comments:

  1. 'సిగలోకి ఓ చిన్ని రోజానిమ్మటే..' అచ్చ తెలుగు కవితలో ఆంగ్ల రోజా ఇమడ లేదేమో అని సందేహం.. ఎంకి ని గుర్తు చేశారు.. 'ఎలుగు నీడల కేసి ఏలెత్తి సూపించా'లి..

    ReplyDelete
  2. ఉషాగారి ఎంకి చూస్తుంటే అమాయకురాలు లా వుంది .మొగ్గల్ని కూడా వదలకుండా వివిధ పుష్పాల మకరందాన్ని గ్రోలే మావ ని,నాలుగు పీక కుండా, మధుర స్మృతులు నెమరేసుకుంటూ దేవుడి దగ్గ ర సిగ్గు పడడం అమాయ కత్వమే .అసలు మీ మావ ఒక చీమ ఎందుకంటె మొగ్గల జోలికి తుమ్మెద పోదు అది వికసించిన పూలలో మకరందాన్ని మాత్రమే గ్రోలుతున్డి అదే చీమ అయితే మొగ్గ లోని తియ్య దానానికి ఆశపడి అది విచ్చు కోకుండానే నాశనం చేసేస్తుంది, ఇది నేను మా ఇంటి పెరట్లో మందార మొక్కల మీద అపరాధ పరిశోధన చేసి కనుక్కొన్న సత్యం .one year ఆయినా ఒక్క మొగ్గ విచ్చు కోకుండా ఏ శక్తి అడ్డు కుంటో దబ్బా అని చూస్తే చీమలు చేసిన పని. సో మీ మామ ఒక చీమ .మీ దగ్గరికి వచినప్పుడు కోయిల లా నాలుగు కారు కూతలు కూసి తన పబ్బం గడుపుకుని వేరే పువ్వుల కేసి సాగి పోతున్నాడు వెంకిని వెర్రి దాన్ని చేసి .

    ReplyDelete
  3. ఉష గారూ ! ఎంకిని గుర్తుచేశారు .కొన్నేళ్ళ క్రిందట ఆంధ్రభూమి వార పత్రికలో కళాధర్ గారి బొమ్మలతో ఎంకి శీర్షిక ఉండేది అప్పుడే నేను ఎంకి అభిమానినయ్యాను .ఎంకినీ ,"కళ్లెత్తితే సాలు కనకాభిసేకాలు"అంటూ ఎంకి వెంటే తిరిగే నాయుడు బావనీ ....మీ అక్షరాల్లో మళ్ళీ చూశానండీ .

    ReplyDelete
  4. అమృతాన్ని అప్పు తీస్కుని తీర్చాల్సిన వైన౦ దేవతలకు కూడా ఎదురుకాలేదేమో.
    మీ దగ్గర కాస్త తెలుగు సుధను అప్పు చేసి తిరిగి తీర్చిన అనుభవ౦ నాసొ౦త౦.
    ప్రకృతిలో పుట్టిన మీరు, ఆ ప్రకృతిని మొత్త౦ మీకవితలోనే ఇమిడ్చారు.
    పూర్వజన్మ సుకృతమేమో మీది, తెలుగుపుష్ప౦లో మీరే సుధగా ఇమిడారు.

    ReplyDelete
  5. సరిలేరు మీకెవ్వరూ!!!!

    ReplyDelete
  6. ఎంకికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. ముందుగా మీ అందరకూ ఇలా తిరిగి తిరిగి నా మరువపువనాన విహరించి, పనిలో పనిగా నాకీ విలువైన కితాబులు మిగుల్చుతున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరి మదిలో ఒకసారి ఎంకి గాలి వీయించినందుకు నాకు భలే సంబరంగా వుంది.

    - మురళి, మీ సందేహానికి కాస్త నాదీ కలిపి నివృత్తిగా ఆ మాట మార్చేసాను. ధన్యవాదాలు.

    - రవిగారు, మీరెలగంటే అలగే, అంచేత అన్నీ వాకే :) మీరన్ని అన్నాక నాకింకేమీ మిగల్లే అనేందుకైనా, చెప్పేందుకైనా, అడిగేందుకైఅనా.. మావోడి అష్టోత్తరాల్లో ఈ చీమ పేరు/పిలుపు కలిపేసుకున్నా... ధన్యవాదాలు. ఇక సతసహస్రనామాలు వెదికే పనిలోవుంటా.

    - పరిమళం, అవునండి ఎంకీ, నాయుడు బావ గాథ అజరామరం. మేము వాళ్ళ పాటలకి నృత్యప్రదర్శన కూడా ఇచ్చేవారం, చిత్రంగా నేనెపుడూ నాయుడు బావగానే చేసాను. ఈ ఎంకివంటి అనుభవాలు నిజజీతంలో కలిగినవే. మీరన్న బొమ్మల శీర్షిక నేనూ చూసాను.

    - ఆనంద్, బాగుంది మీ కొసమెరుపు. అసలుకన్నా కొసరు మాదిరి, మీ వ్యాఖ్య వంటి ఆ నాలుగు పంక్తుల సువర్ణ పుష్ప మాలతో నాకొక గండపెండేరం తొడిగేసారు. మీ కవితావేశం, కళాభిమానం అలా పలికించాయి కానీ ఆ గౌరవం అందుకోను నేను తగుదాననా? అర్హత కలదాననా? ఏమో?. ఒక మాట - "తెలుగుపుష్ప౦లో మీరే సుధగా ఇమిడారు." ఈ ఒక్క పోలికతో ధన్యజీవిని, నిజంగానే ఇది పూర్వ జన్మ సుకృతమనిపించింది. ఆపైవాడిచ్చిన భాషా పరిజ్ఞానం, స్పందన, ఆర్ధ్రత కలబోసిన మానసం నాకు వరాలు.

    - పద్మార్పిత, ఇకనేం ఒకే ఒక్క కోరిక, నాకు సరి జోడు వెదికిపెట్టడండి. లేదా మీరే "నీ సరి నే కానా" అని కవితలు రువ్వేయండి. ధన్యవాదాలు.

    - ప్రియ, మావమీద అలిగినాది ఎంకి ఇయేల, కాసింత అదను సూసి మీ వూసు చారేత్తాలే ;) మరీ నా గుట్లు ఇలా బయటపెట్టేస్తే ఎలాగబ్బా. ఓ ప్రక్క సంబరపడిపోయా అది మాత్రం నిజం!

    - భావకుడన్ గారు, దారి తెలిసింది కదండీ మళ్ళీ మళ్ళీ రావాలేం ఇలా సాహితీ విహారానికి? మరువం సువాసనలు మరి కొన్ని విధాలుంటాయి. అన్నీ అస్వాదిస్తుండొచ్చు.

    ReplyDelete
  8. ఎంకి కవితలు అని వినడమే కానీ.. నేనయితే ఎప్పుడూ చదవలేదు :(
    కానీ.. మీ కవిత మాత్రం.. నా ఇంట్లో మరువపు పరిమళాలను వెదజల్లింది :)
    మీకేన్ని మంచి తెలుగు పదాలు వచ్చో.. చిన్నప్పట్నించీ తెలుగు మీడియం చదివి కూడా.. ఇంత చక్కని తెలుగు రానందుకు చాలా సిగ్గు పడుతున్నాను.
    ఆనంద్ గారు చెప్పిన ప్రతీ అక్షరంతో నేనూ ఏకీభవిస్తున్నాను :)

    ReplyDelete
  9. మధురా, ఎందుకబ్బా అన్నేసి మాటలనేసుకుంటున్నారు? నేనొప్పుకోను సరేనా? నేనూ మాత్రం తెలుగు మీడియంలో ఎక్కువగా చదవకపోయినా ఇలా మీబోటివారి నుండి తావి అబ్బించుకున్నందుకు సంబరపడుతున్నాను. ఇది ఇంకా తొలి మెట్టు మాత్రమే, మీ అందరి సహకారంతో, ప్రోత్సాహంతో మరెన్నో మెట్లు ఎక్కాలి, మీ బ్లాగ్లోకాల్లో విహారం చేయాలి. అంతదాకా మనం ఒక జట్టే సుమీ...

    ReplyDelete
  10. ఓరినాయనో తెలుగు మీడియం లో చదవ కుండానే ఇన్ని పదాలతో కవితలు రువ్వెస్తున్నారు.. చదివితే నేను మీ కవితలు చదవడానికి వచ్చేటపుడు ఒక నిఘంటువు పట్టుకు రావాల్సి వచ్చేదేమొ .. :)

    ReplyDelete
  11. ఇప్పుడు "ఎన్నాళ్ళకెళ్ళాలకూ ఎన్నెల్లు తిరిగొచ్చే మా పల్లెకూ" - అని నా మరుపవువనం ఉప్పొంగిపోతూంది. ఏమైపోయావ్ నేస్తం? ఇంతకు మునుపేమో "నీ రాక కోసం, "నిలువెల్ల కనులై.. నీ "మరువం" వేచేనుగా..." అని ఇంకో రీమిక్స్ పాట పాడుకుంటూ కూర్చుంది... మరికపై "నువ్వేకావాలి, నా రాచిలక నువ్వే కావాలీ.." నా కవితకి ఓ తళుకు అద్దేది. మీరు మరీనూ భాషకీ దాన్ని బడిలో చదవటానికీ సంబంధంలేదు అని నా వుద్దేశ్యం.. అది ఆసక్తితో అబ్బే విద్య, కాదా చెప్పండి? ఈ మధ్య కాస్త స్పానిష్ నేర్చుకోవాలన్న కోరిక బలపడింది. కలుస్తారా నాతో, కలిసి చదివి, కలంతో చెరిగేద్దాం? ఇవాళ "ఇలా పాటలపల్లకై" వూరేగుంతుంది మరువం. కనిపెట్టారా? ధన్యవాదాలు.

    ReplyDelete
  12. పువ్వులు నావి, మీరు చెప్పిన గ౦డపె౦డేర౦ నాది, వ్యాఖ్యతో నేచేసిన ఈ సన్మానానికి ప్రతి అక్షర ఖర్చు నాది. మధ్యలో తగుదాననా అ౦టూ ఆ ప్రశ్నలేమిట౦డీ ఉషగారు, హన్నా.....

    చూసారా, మధురవాణి గారు కూడా చెయ్యి కలిపారు నాతో. ఇలాగే మరె౦తో మ౦ది భవిష్యత్తులో మీకు నిజ౦గానే ఓ గ౦డపె౦డేర౦ తొడిగితే, మీ మొదటి గ౦డపె౦డేర౦ మేము తొడిగాము అని గుర్తు రావద్దూ, అ౦దుకే నాగొడవ. తగునా తగదా నిర్ణయ౦ మాది. మీ కవితలతో మమ్మలరి౦చే భాద్యత మాత్రమే మీది. ఏవ౦డీ మధురవాణి గారు, మీరైనా చెప్ప౦డీ.

    [ఊరికే మీ ఎ౦కిని మళ్ళీ పలకరి౦చాలనిపిస్తే ఇటొచ్చా. వచ్చాక మీ సమాధానాలని చూసి మరో వ్యాఖ్య చెయ్యాలనిపి౦చి౦ది అ౦తే.]

    ReplyDelete
  13. ఆనంద్, ఇక నాకు అనేందుకేమీ మాటలు మిగలనీయకుండా చేసేసారు. మీ ఎవరినీ ఎప్పటికీ మరిచిపోను. ఈ ప్రోత్సాహం ప్రాణవాయువు నా మరువపు వనానికి. నాకు గండపెండేరాలు ఇక మరేవీ వద్దు కానీ మరువాన్ని ఇలా తొంగిచూడటం మానకండి, అది చాలు. పోతే భలే ఎంకి ఈ పడుచు గుండెల్ని ఓ సారి వూపిందన్నమాట ;)

    ReplyDelete
  14. మీ మరువపు తోటలో.. మంచి ... పదాలు ఏరుకోవచ్చు .. ;-)

    ReplyDelete
  15. ఉష గారు మొన్నే చదివాను కానీ సమయాభావం వలన కామెంట్ రాయలేకపోయాను. చాలా బాగుంది, ఆనంద్ గారితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మీరు తెలుగు మీడియం కాదని తెలుసుకుని అచ్చెరువొందాను.

    ReplyDelete
  16. శివ, అన్యాపదేశంగా తెలిపిన అభిప్రాయానికి సంతోషం. మరి మీరెన్ని ఏరుకున్నారు? మరికొన్ని కావాలా పదాలు? ఏదో "పలికెడు...పలికించెడివాడు" అని పోతన అన్నట్లుగా ఇదంతా నన్ను ప్రభావితంచేసి వ్రాయించే కవితాదేవి కరుణానుగ్రహం.

    వేణూ గారు, చాలా సంతోషమండీ, చదవటం, మళ్ళీ గుర్తుపెట్టుకుని వ్యాఖ్య వ్రాయను, అదీ వీకెండ్ ముందు శుక్రవారం సాయంత్రన అంటే మరువం ధన్యజీవే. ఇక మీరంతా కలిసి ఆనంద్నే బలపరిస్తే నేను నిజంగా బిడియపడాలి, ఎందరో మహామహుల ముందు నేనేంత? నా భావుకత, అర్హత ఎంత? అని. కానీ నాకు స్వాభిమానం చాలా మెండు, కనుక మీ పలుకులే నాకు అందివచ్చిన సన్మానాలు, నాకేం, నేనెవరికీ తీసిపోనని తలపోసుకుంటూ మరింతగా పుంజుకుంటున్న ఉత్సాహంతో నా ఈ పయనంలో కొంచం వేగం, వైనం పెంచుతానేమో. కృతజ్ఞతలు.

    ReplyDelete
  17. హ హ ఉష గారు.. ఈ మద్య కాసింత కంప్యూటర్ చూడటం తగ్గించాను పని వత్తిడి వల్ల ..అయితే స్పానిష్ నేర్చుకుంటున్నారన్నమాట.. పెళ్ళీకి వెళూతూ పిల్లిని చంకన బెట్టుకున్న చందాన మళ్ళీ నన్ను తీసుకు వెళితే ఇక మీరు నేర్చుకున్నట్లే.. బ్లాగు లోకం లో రానంత వరకూ కూపస్థ మండుకంలా నాకే మహ బాగ తెలుగు వచ్చు అనుకునేదాన్ని.. అనవసరం గా ఇక్కడి కొచ్చి... వచ్చిన ఒక్క భాష మీద కూడా నాకు పూర్తీ పట్టులేదని తెలుసుకుని మరీ కుళ్ళుకుంటున్నా

    ReplyDelete