కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!

ఉప్పెనగా ఉరికినా
క్షణపాటే ఆ జడి,

సుడిగాలై చెలరేగినా
క్షణికమే ఆ హోరు.

కానీ, నిశ్శబ్దంగా,
నువ్వుచేస్తున్న ఈ గాయం,

ఉప్పెనై ఊపి ఓక్షణం,
సుడిగాలై త్రోసి మరోక్షణం,

క్షణాలకి వెనకడుగిస్తూ
నన్ను బెదిరిస్తోంది.


ఎవరిదో వికటాట్టహాసం
కాలమేనేమో?

నీవెంత? అని
అది అడిగేది నన్నేనేమో?

కానీ, నేనిలా పోరాటం
సాగిస్తూనేవుంటాను

నా గుండెలో తగిలే గాయం
నాకో జీవితకాలం

సరిపడే కసవుతుందే
కానీ క్షణభంగురం కాదు.


నాలో నువ్వున్నా
నీలో నేనుండలేను
,
నింగీనేలా
కలిసున్నాయంటే చిత్రమేగా!

అయినా
ఎవరా పిచ్చిమాట చెప్పింది?

తూర్పూ పడమరే కలిసుంటాయి.
నిన్నింకా నాలోనే దాస్తాను,
నువ్వు నిప్పై కాల్చినా
నేను మంచై నిన్నార్పేస్తాను.

నువ్వు నన్నెంత మోసగిస్తే
నేనంత ప్రేమికనౌతాను.

ఎవరన్నారామాట
అలౌకికబంధమసాధ్యమని?

బహిర్గతం కాని స్వచ్చతని
వెన్నలా కరిగిస్తున్నారెందుకో?

ఈ నేతి ఆజ్యంతోనే
నా ప్రేమ హోమం చేస్తాను.

యాగఫలం నీకే అంకితమిస్తానేమో!

ముల్లువంటి నిన్ను పచ్చిగానే వుంచాలి,
ఎండితే విరుగుతావు.

పక్కలో బల్లెమై
నాకే వెన్నుపోటు పొడుస్తావు,
ఎమో అదీ కావచ్చేమో?

మరందుకే అంటున్నానికపై
నీలోని పచ్చిదనం
నేనౌతాపచ్చదనం సాక్షిగా.

కళ్ళు దేముడిని చూస్తూ
కపటాన్నెదుంకు పెంచాలి?

అసలు దేముడేడి?
దేవేరి ఏది?
నాకెవరూ కానరారేమి?

నువ్వే నాఇలవేల్పువి,
నీ నిర్లిప్తతే
నీవు బోధించే భగవద్గీత
.
నేనదే నిత్యం పఠిస్తాను,
నిన్ను ప్రసన్నం చేస్తాను.

నిన్నావహింపచేసే
ఈ యాగాన్ని మొదలిడతాను,

మన స్నేహమే ఫలంగా
వేయి యజ్ఞయాగాదులు ముగిస్తాను.


పుఠని నింపుతుందే
కానీ నా కలం,

నా భావన జీవనకి పోస్తోంది
తులసీతీర్థం
.
కాలం పంపుతున్న క్షణం
బాధకి తిరిగి ఇస్తుంది వూపిరి.

భావన బాధని అధిగమించినా
అది క్షణికం.

బాధే నన్ను ముగించితే మటుకు
అది శాశ్వతం.

కానీ ఈ బాధ పెద్దదీ కాదు,
ఆ భావన
చిన్నదీ కాదు.

బాధనణిస్తే భావన పొంగుతోంది,
భావన మరిస్తే బాధ పెరుగుతోంది.


పదే పదే అదే అదే క్షణం,
నువ్వు చూసిన ఆ చూపే,

నువ్వు అన్న ఆ మాటే,
నువ్వు చేసిన ఆ గాయమే,

తలచినా తలవకున్నా
తిరిగి పరిహసిస్తోంది.

ఆశని నివురుచేస్తుంది,
నా గొంతు నులిమేస్తోంది.

నా చివరి కేకలో ధ్వనించేది
బాధ కాదు,
భయమూ కాదు
,
నన్ను నేను సంభాళించుకొని,
నిన్ను నిన్నుగా చేయాలన్న తపన.


ఆర్తిలేదు,
తృప్తి లేదు,
అన్నీ కరిగి నీరయాయి.

ఆవిరైన అనురాగం,
బండరాయై మండిపోతున్న
గుండెని చల్లార్చి,

తానూ నీరై,
తిరిగి నన్ను చల్లబరిస్తే,

నేనొక వూపిరి తీసి,
అది నీ గుండెలోనింపుతాను.

నిన్నీ లోకబంధాల నుండి దూరంగా
నా ప్రేమతీరాల్లో చేర్చి,

సేద తీరుస్తాను,
నీ ఎదపైనే నేనూ అలసట తీర్చుకుంటాను.

అపుడేమంటుందీ కాలం,
ఖచ్చితంగా ఓటమినొవ్వకా?

కానీ అందాకా నా గుండె
ముక్కలవదనేమిటి నమ్మకం?


తొలిబీటే పూడని నాకు
వంద దెబ్బలు నీవిచ్చిన
మలి కానుక
.
స్వాంతన నేవెదకను,
నాలో వున్న నిన్నే గమనిస్తుంటా
క్షణక్షణం
.
ద్విగుణీకృతమయ్యే
నీ రూపే చూస్తుంటాను
అనుక్షణం
.
అనాఘ్రాతమైన గడ్డిపూవే నాకిష్టం,
నాపక్కన నడిచే నీవంటేనే ఇష్టం
.
కానీ జాజిమల్లెల జలతారు నీవు,
పలువురి మది మెచ్చిన
ద్రువతారవీవు,

ఎదురుగా నువ్వు,
ఎవరూ కాని నువ్వు,
ఎదలో నువ్వు,
అసలు నేనే నువ్వు.

ఎవ్వరికీ తెలియకుండా పోతుంటాను
ఎవరూయెరుగని నా వూహాతీరాలకి,

నీకూ తెలియని నిన్నూ
తీసుకుపోతుంటాను
నా వెంట తప్పనిసరిగా.

జావళి పాటంటి ప్రేమ మనది,
జాలువారే వెన్నెల తెర మన వలపు.

నీ రాక ఉల్కపాటు,
నీ తీరు మెరుపువేటు,
నాకు తెలియని వేగం ఆ రెండు.

వస్తా నీ వెనుక తీసుకుపో
నాకూ నేర్పించు
నీలా నడచుకోవటం.

నీరింకిన నీ ఎద చెలమలో
నా చెలిమిదాహం తీర్చాల్సింది నీవే
,
బీటిచ్చిన నా ఎద పాత్రలో
ప్రేమ నింపాల్సిందీ నీవే.
అందుకే
కాలంతో సాగే నా ఈ గానం,
కాదనవనే నీకు అంకితం.

16 comments:

 1. "భావన బాధని అధిగమించినా అది క్షణికం.
  బాధే నన్ను ముగించితే మటుకు అది శాశ్వతం.
  కానీ ఈ బాధ పెద్దదీ కాదు, భావన చిన్నదీ కాదు.
  బాధనణిస్తే భావన పొంగుతోంది, భావన మరిస్తే బాధ పెరుగుతోంది."

  ఉష గారు,
  మీకింత చిక్కని భావాలు ఉప్పెనలా ఎలా వస్తాయి? ప్రిపేర్ అయి రాసినట్లు అసలే ఉండదు.ఒక్కోసారి చదివి మూగబోడమే తప్ప తిరిగి ఇది బాగుందని రాయడానికి భాషే దొరకదు నాకు.

  I'm jelous..!

  ReplyDelete
 2. ఇప్పుడు నాకనిపిస్తుంది మీ కవితలను మెచ్చుకుంటూ వాక్య రాయడానికి కూదా అర్హత ఉండలేమో అని .. అంత బాగా రాసారు

  ReplyDelete
 3. "నాలో నువ్వున్నా నీలో నేనుండలేను"
  ...చాలాబాగుందండీ..

  ReplyDelete
 4. ఉష గారూ ! నేస్తం గారి లాగే నేనూను .......ఎన్నోసార్లు మీ బ్లాగ్ లోకి వచ్చి కామెంట్ రాయటానికి నా పరిజ్ఞానం ,భాషా సరిపోవని మౌనంగానే వెళ్ళిపోయా .....ఇన్నాళ్ళకి నేస్తం గారు మా భావన మీముందుంచారు. " జాలువారే వెన్నెల తెర"మీ వలపు అవునో కాదో తెలీదు కానీ జాలువారే వెన్నెల తెర మీ కవిత అన్నది అక్షర సత్యం .

  ReplyDelete
 5. అందం, అలక, అనురాగం, ఆప్యాయత, అనుబంధం, అట్టహాసం, ఆశ్చర్యం, అద్బుతం, ఆనందం ఇలా అన్నింటితో నిండిపోయిన ప్రేమికా హృదయగానం చివరికి అంకితం చేసిన ‘కాలంతో సాగే ఈ గానం’ నిజంగా ఒక ఆణిముత్యం.

  చక్కని భావాల్ని ఒక తియ్యని జ్నాపకంగా మాతొ పంచుకొన్న ఉష గారికి ధన్యవాదాలు.

  ReplyDelete
 6. నేనొక వూపిరి తీసి, అది నీ గుండెలోనింపుతాను.

  మీ ఊపిరి మరొకరి ప్రాణాలు. ఆతని అడుగులు మీ గు౦డె చప్పుళ్ళు.
  మీ ఆలోచనలు ఝరులు. మీ భావాలు ఉప్పెనలు.
  మీ కైతలు మ౦చు శిఖరాలు. మీ మాటలు నిప్పురవ్వలు.
  మీకు కనిపి౦చేవి నా పొగడ్తలు.
  నా నిజాలు మీకు జోహార్లు.

  ReplyDelete
 7. ఈనాడైనా ఈ కవితా పాఠం పూర్తిగా చదువుదామని వచ్చాను. ప్రస్థుతానికి మొదటి పేరా చదివాను.
  కోడిగుడ్డుపై ఈకలు అనుకోపోతే
  1. "క్షణాలకి వెనకడుగిస్తూ నన్ను బెదిరిస్తోంది." ఇక్కడ "వెనకడుగేస్తూ" లేదా "వెనుకేవస్తూ" అని ఉండాలేమో??

  2. "క్షణాలకి వెనకడుగిస్తూ నన్ను బెదిరిస్తోంది.
  ఎవరిదో వికటాట్టహాసం కాలమేనేమో?" --- ఈ రెండు పంక్తులకు పొంతన సరిగ్గా కుదరలేదేమో!!!
  ఎందుకంటే మొదటి పంక్తి లో బెదిరిస్తున్నది గాయం, మరి హటాత్తున్న వికటాట్టహాసం కాలానిది ఎలా అయ్యింది.

  నా భావం మీకర్ధమయితే నన్ను సమాధానపర్చగలరు. నా వ్యాఖ్య మీ మీద వచ్చిన కువిమర్శ అనుకుంటే ఈ వ్యాఖ్య తొలగించగలరు

  ఇక మిగతా పేరాలు చదివాక మళ్ళీ వ్యాఖ్యానిస్తాను.

  ReplyDelete
 8. "నువ్వు నన్నెంత మోసగిస్తే నేనంత ప్రేమికనౌతాను." -- చాలా బాగుంది.
  కానీ ప్రేమకు మోసానికి చాలా దూరమున్నదే !!!

  రెండవ పేరాలో నేను పీకిన కోడిగుడ్డుపై ఈకలు
  (ఇది కువిమర్శ అనుకుంటే ఈ వ్యాఖ్యను వెంటనే తొలగించండి)
  1. " నాలో నువ్వున్నా నీలో నేనుండలేను,
  నింగీనేలా కలిసున్నాయంటే చిత్రమేగా!
  అయినా ఎవరా పిచ్చిమాట చెప్పింది?
  తూర్పూ పడమరే కలిసుంటాయి. " --- మొదటి రెండు పంక్తుల మధ్య చక్కని సమన్వయముంది, స్వగతంలాగా కూడా ఉంది.
  కానీ మూడవ పంక్తిలో మూడవ వ్యక్తి చెప్పినట్టు అడిగిన ప్రశ్న ఎందుకో ఆ భావాన్ని కొద్దిగా దెబ్బ తీసినట్టనిపించింది.
  ఇక నాలుగవ పంక్తి అసాధ్యాన్ని సుసాధ్యమంది. కానీ అదే సమయంలో మొదటి పంక్తిలో అసాధ్యమన్న రెండవ భాగం సుసాధ్యమేనని చెప్పడమేనా మీ భావం ?

  2. " ఎవరన్నరామాట అలౌకికబంధమసాధ్యమని?
  బహిర్గతం కాని స్వచ్చతని వెన్నలా కరిగిస్తున్నరెందుకో?
  ఈ నేతి ఆజ్యంతోనే నా ప్రేమ హోమం చేస్తాను.
  యాగఫలం నీకే అంకితమిస్తానేమో! " - కొన్ని ముద్రా రాక్షసాలు ఉన్నాయి. వెన్న - స్వచ్చత పోలిక బావుంది.
  వాటిని పక్కన పెట్టి విషయంలోకి వద్దాం.
  అలౌకికబంధమసాధ్యమన్న సమాజాన్నెదిరించి ప్రేమ హోమం చేస్తున్నారు.
  పేరాలో నాలుగవ పంక్తిలో అసాధ్యాన్ని సుసాధ్యమన్న మీరు ఇంతలో అర్ధోక్తిలో పేరాను ముగించడం వల్ల నాకు సందేహమొస్తోంది, నేను సరిగ్గానే చదివానా అని ??

  ReplyDelete
 9. సుజాత, దిలీప్ గార్లు, ఈ కవిత పుణ్యమాని మళ్ళీ మీ వ్యాఖ్యాభాగ్యం కలిగింది. భలేవారే, మీరు మూగవోతే నేనిక తెగిన వీణనే. ఇక జెలస్ అంటారా నేను నమ్మను గాన నమ్మను.

  నేస్తం, మునుపోసారి చెప్పాను విన్నవుంపుగా ఇక తప్పదని ఈ సారి మందలిస్తున్నాను. అలా అనవద్దు, మీరు మెచ్చాలేకాని "అర్హత" అంత మాట వాడొద్దు ప్లీజ్.

  మురళీ, ధన్యవాదాలు.

  పరిమళం గారు, మీకూ నేస్తానికి పెట్టిన సన్నవాతే పెట్టాననుకుని, అవే వాక్యాలు మీకు కూడా అన్వయించుకోండి. "జాలువారే వెన్నెల తెర మీ కవిత అన్నది అక్షర సత్యం" మీ అభిమనంతో అల్లిన ఈ శాలువ కప్పారు, అది చాలు.

  పృథ్వీ, చిరకాల దర్శనం. మరింత ముదావహం మీ అభినందనకూడా మీ కళాఖండాల్లా నిండుగా వుంది.

  ఆనంద్, ఇలా కవితా వ్యాఖ్యలల్లటంలో ఇక మీరు ఘనాపాటి అయిపోయారుగా, ఇక నేను సుజాత గారిలా మూగపోవటమే తరువాయి.

  మీ అందరకూ మరో మారు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  ReplyDelete
 10. ప్రదీప్, ఈ టపాకి ఇది పదకుండో వ్యాఖ్య. ఈ పదకుండు అంకెతో నా జీవితానికి చాలానే లంకెలున్నాయి. అంచేత మీకు విడిగా నా మారు అభిప్రాయాన్ని వ్రాస్తున్నాను.

  1) లేదండీ. నా ప్రయోగమదే. క్షణాలు రావటనికి సంశయం పడి వెనకడుగు వేస్తున్నాయన్నదే నా భావం. తను చేసిన గాయం అలా వాటిని బెదరగొట్టింది.

  2) ఇది కాలంతో సాగిన గానం,ఒకసారి బెదిరినా తిరిగి వస్తుంది కదా. నా మిత్రుని ముందు వోడిపోయినట్లే, తననీ గెలవలేనని నన్ను చూసి నవ్విందన్నమాట. భావావేశం పొంతన, స్వాంతన చూసుకు రాదు కదా, తనకు సరైన పదాలు మోసుకుంటూ వెలికి వచ్చిందిలా.

  మీరు భలేవారే,ఇంత అమూల్యమైన సమయం వెచ్చించి అంతకంత ధీటైన వ్యాఖ్య వ్రాసినందుకు నేనే ఇంకెలా ధన్యవాదాలు తెలుపగలనా అని తబ్బిబ్బవుతున్నాను.

  ప్రేమకే మోసం, త్యాగం, ద్వేషం కలగలసిన త్రిగుణాత్మక శక్తివుందనే నాప్రఘాడ నమ్మకం. ఎవరి నమ్మకాలు వారివి. మోసాన్ని చవిచూసాను. మిగిలినవి కూడా గమనించాను.

  1) ఏం, స్వగతంలో ప్రశ్నించుకోమా, నిజానికి నా స్వగతంలో నాకు జవాబు దొరకని ప్రశ్నలే తిరిగి తిరిగి వేసుకోవటం అలవాటు. ఇదేం రెటమతం అనుకుంటున్నారా? నింగీ నేలా కలిసినట్లు కనపడుతూ కలవవు, తూర్పూ పడమర కలవవు అంటారు కాని, దిక్కులుగా కాక, ఎల్లలుగా వూహిస్తే కలుస్తాయి కదా. కనుక అంతా మన ధోరణిలోవుంటుంది.

  2) మరి ఇది ఒక సమరం, యాగం గెలుపు, ఫలం నా చేతిలోవి కాదు, నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ, తనకీ సగం పంచుతూ, మళ్ళీ నాలో నేనే జంకుతూ, పలు రకాల పోకడలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాను. సమాజాన్ని, కాలాన్ని, విధిని, రీతిని, రివాజునీ, ఇలా ఇంకెన్నిటినో దాటాక కదా తనని చేరేది.

  ఇకపోతే ముద్రారాక్షసాలను సరిదిద్దాను, మాస్టారు గారు, మరో సారి దిద్దుతారా?

  మరి మిగిలిన పేరాలకి ఈకలు పీకటమో, లేనివి తగిలించటమో ఎప్పుడు చేస్తారు? నిజంగా చాలా సంతోషంగా వుంది. ఇది మెదడుకి మేతలా, నా ప్రాజెక్ట్ పని మాని మరీ రప్పించింది బ్లాగులోకి. త్వరలో మళ్ళీ మీ వ్యాఖ్యకి మారు వ్యాఖ్య వ్రాయాలని ఆశిస్తూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ..

  ReplyDelete
 11. మౌనమె నీభాష ఓ మూగ మనసా.......

  మూగబోయిన౦త మాత్రాన మీ భావాగ్ని, భావాల దావాగ్ని చల్లారుతు౦దా, మీ కవనా ప్రవాహ౦ స్థ౦భిస్తు౦దా. ఇది అన౦త౦, నిర౦తర౦. మీ ఆవేశ౦ శ్రీశ్రీ గారి రథచక్రాల్. ఇవి ఆగవు, ఆగనే కూడదు.
  [మామూలు నానుడి ప్రకార౦, మీ ఆలోచనలు కద్లితే ఆగవు, ఆగితే కదలవు అని కాద౦డోయ్ నా అర్ధ౦. సూక్ష్మాన్ని గ్రహి౦చాలి మీరు.]

  ReplyDelete
 12. ఉప్పెనగా ఉరికినా క్షణపాటే ఆ జడి,
  సుడిగాలై చెలరేగినా క్షణికమే ఆ హోరు.
  కానీ, నిశ్శబ్దంగా, నెమ్మదిగా నువ్వుచేస్తున్న ఈ గాయం,
  ఉప్పెనై ఊపి ఓక్షణం, సుడిగాలై త్రోసి మరోక్షణం,
  క్షణాలకి వెనకడుగిస్తూ నన్ను బెదిరిస్తోంది.
  ఎవరిదో వికటాట్టహాసం కాలమేనేమో?
  నీవెంత? అని అది అడిగేది నన్నేనేమో?
  కానీ, నేనిలా పోరాటం సాగిస్తూనేవుంటాను
  నా గుండెలో తగిలే గాయం నాకో జీవితకాలం
  సరిపడే కసవుతుందే కానీ క్షణభంగురం కాదు
  chaala baavundhi marinni maakosam raayagalaru ani aasistunnaamu

  ReplyDelete
 13. ఉషగారు,
  నిజానికి పదకొండుతో నాకు కూడా చాలా అనుభందముంది. పదకొండవ నెలలోనే నే జన్మించాను. అంకెల్లో నాకు రెండంటే ప్రాణం. మొదటి స్థానం నాకవసరం లేదు. రెండవ స్థానమొస్తే చాలు. ఎలాగూ మొదటిస్థానమెపుడూ దేవునిదేగా.....

  " భావావేశం పొంతన, స్వాంతన చూసుకు రాదు కదా, తనకు సరైన పదాలు మోసుకుంటూ వెలికి వచ్చిందిలా " --- అప్పుడెప్పుడో పోతనామత్యుడు తన బావ శ్రీనాధునితో గజేంద్రమోక్షం గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అయితే ఇది భావావేశం, దాన్ని నియంత్రించి సరైన ఆకారమివ్వాల్సినది కవులు, కవయిత్రులే. నేను చెప్పదల్చుకున్న విషయం మీకర్ధమైందని ఆశిస్తున్నా..

  ఇక ప్రేమ... మోసం.. త్యాగం .. ద్వేషం
  మోసం చెయ్యాల్సిన అవసరమొచ్చేది, ఏదైనా మనకి దక్కి తీరాలనుకున్నప్పుడు
  త్యాగం , ఏదైనా మరొకరి కోసం వదిలేయాల్సివచ్చినప్పుడు
  ద్వేషం, మనకు కావలసినది అవతలివారికి దక్కిందన్న అసూయలోనుంచి వస్తుంది.
  మీరు చెప్పే పై మూడు లక్షణాలు దేహాల మద్య జరిగే ప్రేమలో వస్తాయి.
  అసలు భాద ఏమిటంటే ప్రేమ అంటే ఏమిటి? ఎవరూ సరైన సమాధనమివ్వలేరు. కానీ అందరూ డాక్టరేట్లే.... ప్రేమలో !

  మళ్ళీ దారి తపుతున్నా.... మిగతా వాటికి వ్యాఖ్య రాద్దామని వచ్చి ప్రతీసారీ వెనక్కిపోయా... ఇప్పుడు మూడవ కవితకు వ్యాఖ్య రాస్తున్నా....

  ముందుగా చిన్న ప్రశ్న.... మొత్తం కవితలు ఒకదానితో ఒకటి ముడిపడినవేనా.. ??
  ముడిపడితే కనుక, అమోఘం. ఒక చోట సందేహం, మరో చోట నిశ్చయం. సందేహం నుంచి నిశ్చయంలోకి ప్రయాణమేమో ఈ కవితా సంపుటి.
  అలా చూస్తే మొదటి కవిత భయం....
  సో, భయం... సందేహం... నిశ్చయం.... తర్వాత ఏముందో.... (ఇంకా చదవలేదు. చదివాక వ్యాఖ్యానిస్తాను)

  1. " నిన్ను ముల్లువలే పచ్చిగానే ఉంచాలి .... ఎండితే విరుగుతావు. " ఎందుకో నాకు గాయం గుర్తుకొచ్చింది. గాయం పచ్చిగా ఉంటే భాదిస్తుంది. ఎండితే మానుతుంది. సరిగ్గా దానికి వ్యతిరేకం వాడారు. మంచి ప్రయోగం

  2. ఇప్పటికే ఒకసారి అడిగినదే మళ్ళీ అడుగుతున్నాను
  " మరందుకే అంటున్నానికపై నీలోని పచ్చిదనం నేనౌతాపచ్చదనం సాక్షిగా.
  కళ్ళు దేముడిని చూస్తూ కపటాన్నెదుంకు పెంచాలి?" - హటాత్తున దేవుడు ఎందుకు వచ్చాడు?
  మొదటి వాక్యంలో ఒక నిర్ణయముంది, రెండవ వాక్యంలో ఒక ప్రశ్న ఉంది.
  ఆ నిర్ణయానికి ఈ ప్రశ్నకు సంబంధమేమి ?

  3. "నీ నిర్లిప్తతే నీవు బోధించే భగవద్గీత." చాలా మంచి ప్రయోగం
  కానీ అంతలోనే " నేనదే నిత్యం పఠిస్తాను, నిన్ను ప్రసన్నం చేస్తాను. " అనడంతో ఆ ప్రయోగం గురించి పునరాలోచించవలసిన అవసరమేర్పడింది.
  ఏలననగా భగవద్గీతా పఠనంతో దేవుడు ప్రసన్నమవడు. భగవద్గీత దిశా నిర్దేశిణి మాత్రమే ...
  ===
  ప్రస్థుతానికి ఇవీ నేను పీకిన ఈకలు. మరోసారి మిగిలిన ఈకలు పీకే ప్రయత్నం చేస్తాను.
  అంతవరకు సెలవ్

  ReplyDelete
 14. ప్రదీప్, నేను కూడా ఈ వ్యాఖ్య పది సార్లు చదివుంటానిప్పటికి. కాని సవివరంగా వ్రాయాలి, సబబైన సమాధానమీయాలని కాస్త వాయిదా వేస్తున్నానంతే. వృత్తిపర, వృత్తేతర కార్యాలు సమయాన్ని తమలో తాము పంచేసుకున్నాయి. త్వరలో నా జవాబు ఇక్కడ చోటు చేసుకుంటుంది. మీ సమయానికి, సమీక్షకీ సదా కృతజ్ఞతలు.

  ReplyDelete
 15. భా. రా.రె. ఇది నా కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!
  కవితకి ప్రతి వ్యాఖ్య. మళ్ళీ గొడవ పడకండి నాతో.

  ప్రదీప్, చాలా సమయం తీసుకున్నా 4 నెలల క్రితం నుండీ back of the mind తిష్టవేసిన ప్రశ్నలకి ఈ రోజు సమాధానం ఇద్దామని ప్రయత్నం.

  1) "భావావేశం, దాన్ని నియంత్రించి సరైన ఆకారమివ్వాల్సినది కవులు, కవయిత్రులే" - ఈ చురక కొత్తపాళీ, బాబా, ఆత్రేయ గార్లు ఇంతకు మునుపే వేసారు. బహుశా కాస్త బాణీ మరిందేమో కూడా గత 4 నెలల పరిణామ క్రమంలో.

  2) "దేహాల మద్య జరిగే ప్రేమ" ఇది కాదనలేము. మానవీయ ప్రేమల్లో స్త్రీ పురుష బంధంలో దేహం ఒక వాహనం. మానసిక బంధాన్ని బలోపేతం చేసే శక్తి స్పర్శకేవుంది. ప్రేమ తత్వానికి ప్రతీక అయిన మాధవుడు రాధని ప్రణయంలో కాదా ముంచి తేల్చింది? ఆ పరిపూర్ణతలో ప్రేమదే ప్రధమ స్థానం. మోసం, ద్వేషం చవి చూసిన వారే ప్రేమని గుర్తించగలరు.

  ఇక మీ ప్రశ్నల్లోకి

  (0) మొత్తం కవితలు ఒకదానితో ఒకటి ముడిపడినవేనా.. ?
  అవును. స్వీయానుభవం జోడించిన కల్పన.

  (1) "ముల్లు" ప్రయోగం మీ అంత తరిచి వాడలేదు. స్వీయానుభవం ఇక్కడ పదాలు కూర్చుకుంది.

  (2) ఈ కవిత చాలా భావోద్రేకంలో వ్రాసుకున్నాను. స్వగతం కలేసిన ఈ నిందాస్తుతి తనకు సమర్పించాను. ప్రశ్న నాదే జవాబూ నాదే నిర్ణయం నాదే అనిశ్చితీ నాదే. ఒకదాని వెంట ఒకటి మనసుని కుదిపిన క్షణాలవి. కల్లా కపటం ఎరుగనిది ప్రేమ అయితే, ప్రేమమూర్తి అయిన దైవం పట్ల నమ్మిక కలవారే ప్రేమని పంచుతారు, వారే కనిపించే దైవాలు. తనే నాకు దైవం.

  (3) "నీ నిర్లిప్తతే నీవు బోధించే భగవద్గీత." నచ్చినందుకు ధన్యవాదాలు. "ప్రసన్నం" అన్నది లౌకికంగా తనలో స్పందన తేవటానికి అన్న భావనలో వాడాను. నా భాష్యాలు విస్మరిస్తున్న తనలో నా మౌనం/నిర్లిప్తత మార్పు తెస్తాయని ఓ మారు అనిపించింది.

  మీకు సబబుగా తోచకపోతే అది మన ఆలోచనలోని అంతరం. నా వరకు ఇది సప్త వర్ణ స్వగతం తనకి అంకితం. ఈ గానం తనలో సవ్వళ్ళు సృష్టించింది. చివరిగా నా వ్రాతల్ని నేను తిరిగి తరచుకునే అవసరం కల్పించే మీరంటే ఎపుడూ గౌరవాభిమానాలే!

  ReplyDelete