ఎగిరే పక్షిలో ఎంత ఉత్సాహమో, రెక్కలార్చుకు బయటకొచ్చే పిల్లలోనూ అదే తీరు.
ఉరికే లేడికాళ్ళలో ఎంత వేగమో, పడిలేచే పిల్ల కళ్ళలోనూ అంతే జోరు.
చివురేసే మొక్కలో ఎంత పచ్చదనమో, ఆకురాల్చే చెట్టులోనూ అదే సిరి.
పూతరాలినా, పిందె రాలినా, పండూ రాలిపోయినా కొమ్మల్లో మొక్కవోని అదే గురి.
అలలతో అల్లికలల్లి నిత్యం ఆకసానికి అందించే ఘన ప్రయత్నం ఆపదు అంబుధి.
నురుగుముత్యాలు అంచలంచెలుగా ధరపైవొలికిస్తూ తన గమనమూ ఆపదు నది.
చిరుగాలీ ఆపదు చలనం, సుడిగాలీ ఆపదు ప్రభంజనం.
మేఘమూ ఆపదు వర్షించటం, తిరిగి తనలోకి ఆకర్షించటం.
బడబాగ్ని, జఠరాగ్ని, దావాలనాగ్నిగా అచ్చెరుపరవదా అగ్ని, కాదా దేవుని ఎదుటా దీపం.
వసంత, గ్రీష్మ, వర్ష శరత్, హేమంత శిశిర ఋతువులుగా నవ్వదా కాలం
అగాధమైనా, హిమశిఖరమైనా, అగ్నిపర్వతమైనా, భూకంపమైనా ఆపేనా పృధ్వీభ్రమణం?
రేయింబవళ్ళలో, మబ్బుల విహారంలో, వన్నెలతారల్లో, గ్రహక్రమంలో మారేనా నింగిస్వరూపం?
కావా అవన్నీ మూగజీవాలు? కావా అవన్నీ మౌన చలనాలు?
ఎవరు ఇచ్చారు వాటికి గమ్యం, వేగం, నిర్దేశం, సంకల్పం?
ఎవరు మెచ్చాలని వాటి సంబరం? ఎవర్ని నెగ్గాలని వాటి తాపత్రయం?
త్వరపడతాయా? తోసుకుపోవాలనిచూస్తాయా? తమ విధులు మరొకరికి బదిలీచేస్తాయా?
మాట వచ్చు, భాష వుంది, మనసు వుంది, మార్గం వుంది,
యోచన తెలుసు, శోధన వచ్చు, భావం తెలుసు, భావ్యం తెలుసు,
అయినా మనిషికి ఏమిటి లేదు? మనిషికి మనిషికీ నడుమ సఖ్యతెందుకులేదు?
సంకల్పానికి బలిమి ఎందుకు లేదు? కలిమిలేముల కలవరమెందుకు పడతాడు?
తల్లికో, తండ్రికో తన ఓటమి అప్పచెప్పి, పరుల ప్రజ్ఞాపాఠవాల్ని చూసి నొచ్చుకుంటాడు.
తనకు తాను పలుపుతాడు కట్టుకుని, వంకల పలాయనం చిత్తగించి ఆపై పాశ్చత్తాపడతాడు.
వాయిదాలు వేసుకుని, వంతులు వేసుకుని సామర్ధ్యాన్ని చంపుకుంటాడు.
ప్రాయాన్ని జార్చుకుని, పయనాన్ని ఆపుకుని, ప్రయాస పడననుకుంటాడు.
ఒక్కటంటే ఒక్కసారి తిరిగి ఏ ఏకలవ్యుడో ఇలకు దిగివస్తే ఇలా చెప్పడా?
"నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది.
కాలాతీతం కానీకు, కానరాని శోకాన్ని వెదకకు, ఓటమికి వెరువకు.
ఆ గమ్యాన్ని అందుకో, నువ్వు చేరాల్సిన తీరాన్ని చేరుకో" అని
మనిషీ! నిక్షిప్తమైన నీ పటిమను వెలికి తీయ్, నిద్రాణమైన నీ ప్రతిభకు సాన పట్టు.
ఆ ప్రకృతే నీకు స్పూర్తి నీ కీర్తికి నాంది నీ విజయానికి పునాది.
మన వెనుకతరం మాదిరే మనంకావద్దా ముందుతరానికి మార్గదర్శకం?
వినరా మన విజయగాథలు రానున్న తరం? కృషితో నాస్తి దుర్బిక్ష్యం.
5,6 పేరాలు చదువుతూ ఏమిటి ఇలా రాసారు నిరాశను చెప్తూ అనుకున్నా... అంతలోనే నా సందేహం పెరగనివ్వకుండా దానికి అడ్డుకట్ట వేసేసారు....
ReplyDeleteఅందుకోండి నా నీరాజనాలు
కృషితో నాస్తి దుర్బిక్ష్యం.దీనిని టైటిలుగా వుంచితే బాగుండేదేమో. మీ ఆలోచనలు చాలా బాగున్నాయి.వాటిని గేయ కవిత్వం రూపంలో కంటే పద్యకవితా రూపంలోకి మలచగలిగితే శాశ్వతత్వం సంతరించు కుంటాయి. ఎందుకంటే పద్య కవిత్వానికున్న చంధస్సు ఆ గుణాన్ని పెంపొందిస్తుంది. పైగా ధారణ కనువై మనసులో గుర్తుండి పోడానికి వీలు కలుగ జేస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నం ప్రారంభించండి.శుభం భూయాత్.
ReplyDeleteవావ్..!
ReplyDeleteఒక్కోసారి మీరు నాకు సమాధానం లేని ప్రశ్నలా మిగిలిపోతారు..ఎక్కడి నుండి వస్తుంది మీకు ఇంతటి భావావేశం... ఎంతటివారైనా కొంత గేప్ తీసుకుంటారు..మీకసలు ఆ అవసరం రాదేమో? ఏ విషయం మీద కవిత రాయాలని అని ఆలోచించనవసరం రాదేమో మీకు.. అలా కవితలు ఉప్పొంగే ప్రవాహం లా పొంగి వచ్చేస్తాయేమో మీకు.. చాలా అబ్బురం గా అనిపిస్తుంది ఒక్కోసారి మిమ్మల్ని చూస్తుంటే.. కొన్ని సార్లు మీరు రాసిన కవితలకంటే మంచి కవితలు చదివాను ..కాని ఇంకేదో ఉంది మీలో .. అదెంటో తెలియడం లేదు...
ReplyDeleteఏంటమ్మా ఇది? ఈ శక్తి ఎలా చేకూరుతుంది? అది వ్యక్తిత్వ మహిమా? లేక సాహిత్య పిపాస వల్లా? ఎక్కడినుండి పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ? ఇంతటి చిక్కని భావాలు?
ReplyDelete"నీలోనే లోకంవుంది, గమ్యం వుంది, సమస్త జగత్తువుంది."
ReplyDeleteAwesome!
ప్రదీప్, ప్రకృతి స్ఫూర్తి ఎలా ఇస్తుందో చెప్పి, కాస్త విమర్శతో, ప్రేరణ ఇవ్వాలన్న ప్రయత్నమిది. మీరు ఈ ప్రయోగాన్ని గమనించినందుకు, మెచ్చినందుకు సంతోషం.
ReplyDeleteనరసింహ గారు, నా బ్లాగుకు సాదర స్వాగతం. పద్యకవితా ప్రక్రియకు ఇంకొంత సమయం కావాలండి. అంత సాహసం చేయగలనా అని సంశయంగావుంది. కాని పితృసమానులైన తమ ఆశీర్వాదంతో త్వరలో మొదలుపెడతాను ఆ ప్రయత్నం.
నాగన్న, నా బ్లాగుకు సాదర స్వాగతం. ఇది మా అన్న పేరు. మేము నాగన్నని కొలుస్తాం. మళ్ళీ రావటం మానకండి.
నేస్తం, ఇపుడు నన్ను పూరిగా మూగనిచేసేసారు. నిజానికి గొప్పదనం నా వ్రాతల్లో కాదు, మీ మనసులోవుంది. సమయం వెచ్చించి చదివి, ఇంత అభిమానంగా కితాబులీయటం మాత్రం మీకే చెల్లింది. ఒక్కోసారి ఇలా ఝురిలా వస్తాయి ఆలోచనలు. మరోసారి వెదుక్కున్నా మాటలే దొరకవు, అంతా చిత్రం.
దిలీప్, హిమశిఖరాలకు చేర్చేసారుగా మీ ప్రశంసతో. ఇదంతా సన్నిహితుడైన నా నేస్తం, సాహితీ మిత్రులైన మీ ప్రోధ్బలం, ప్రోత్సాహం కారణంగా వెలికి వస్తున్న వెల్లువ.
ఇమాయ గారు, నా బ్లాగుకు సాదర స్వాగతం. ఒక్క సారా మినహాయించి మిగిలిన మీ ఆసక్తులతో ఏకీభవిస్తూ మీ హిమాలయ యాత్రా దండులో నన్నూ చేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, మళ్ళీ రావాలని విన్నవించుకుంటున్నాను. మీ బ్లాగు కొంత చదివాను, మళ్ళీ తీరిగ్గా చదువుతాను.
అందరికీ మరోసారి ధన్యవాదాలు.
ఇది నిజా౦గా చిత్రమే. నేను కాకపోయినా, ప్రియగారు మీరు మాత్ర౦ ఒకే భావాన్ని దాదాపు ఒకేసారి వెలిబుచ్చారు. నేను ప్రియ గారి భావాన్నే మరో రక౦గా వెళ్ళగక్కాను. చూసారా, మరో మారు నిరూపి౦చుకున్నారు మీ ఇద్దరి తలపులొక్కటేనని.
ReplyDeleteమీఇరువురి మాటలు
ప్రతి మనిషిలోనూ ఏకలవ్యుడొక్కడేనని చూపాయి.
నాలోనూ కూసి౦త మ౦టను రేపాయి.
నాలోనూ సత్తువ ఉ౦దని గుర్తుచేసాయి.
నాలోనూ ప్రకృతి ఉ౦దని వెన్నుతట్టాయి.
నిద్రలేపాయి!!!
ఆ నేస్తం ఆరోగ్యంగా ఎల్లప్పుడూ మీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను స్వార్ధంతో...
ReplyDeleteవావ్.. కొత్త రూపు ఇచ్చారే.. బాగుంది..
ReplyDeleteనాకు తెలిసి వ్యక్తిత్వ మహిమే ఇది.
ReplyDeleteమురళి, ధన్యవాదాలు. అవును నాకూ ఈ క్రొత్త రూపు నచ్చింది. అందుకే కొంతకాలం ఇదే ఇక మరువపు పోకడ.
ReplyDeleteప్రియ, ఒక్కమాటతో బాధ్యత పెంచేసావు. నా వ్యక్తిత్వానికి ఒక నిర్దేశంవుందని గుర్తుచేసావు. నువ్వు తోడువుటావు అది అందుకోను సాగే పయనంలో అనీ అన్యాపదేశంగా తెలియచెప్పావు. అందుకే నువ్వు నాకు ప్రియమార ఆప్తురాలివి, ఆత్మ బందువువి.
template super ga undi.!
ReplyDeletemee kavitha gurinchi cheppataniki nenu chala alpuralini.
సుజ్జీ, మీరు చదవటమే ఒక కితాబు. ఇక వ్యాఖ్య అన్నది మీ అభిమతం కాని దానికి అర్హత, అనర్హత అంటూ వుండవు.
ReplyDeleteమేఘమూ ఆపదు వర్షించటం, తిరిగి తనలోకి ఆకర్షించటం.
ReplyDeleteఉషాజీ!
మీ కవిత్వంలో చక్కటి ప్రవాహత ఉంది. అయితే అక్కడక్కడ వాక్యాలు తొంగి చూస్తున్నయి, ఆ చిన్న లోపాన్ని(?) తొలగించుకుంటే, ఉషా, మీరు ఉత్తమ కవయిత్రుల కోవలోకి చేరిపోతారండోయ్...శుభాకాంక్షలు మిత్రమా!
ఈగ హనుమాన్
హనీ గారు, మరువాన్ని అఘ్రాణించి చక్కని సలహా ఇచ్చినందుకు అభివాదం. తప్పక మీరన్న లోపాలు తప్పించే ప్రయత్నం చేస్తాను. మీ వంటి వైవిధ్య ప్రయోగ సాహితీ ఘనాపాటుల ముందు నేనెంత చెప్పండి? కానీ మీరు వాడిన "ఉత్తమ" అన్న విశేషనం మాత్రం మహానందంగా అనిపించింది. ధన్యవాదాలు.
ReplyDeleteకేక అండీ బాబూ
ReplyDelete* దొ. నా. కొ. గారు, కేకేనంటారా? అయితే అలాగే కానిద్దాం. ఇంకా ఇంకా మీతో కేకలు పెట్టించగలనని నా సవాలు విసురుతున్నాను [కేక కి ప్రతిగా ఇదే సరైన పదం అని వాడాను, అంతే సుమీ] మరి వస్తూ పోతూ కాస్త కేక పెడుతుండండి సార్!
ReplyDeleteభావం బాగుంది. చాలా. మధ్యలో కొన్ని వాక్యాల్లాగే తగిలాయి. అకడ మరోలా కుదరదేమో అనిపించేలా ఉంటే వేరు. ఇది విమర్శ ఎంతమాత్రం కాదు ఉష గారు. మరింత గొప్ప కవితని పొందాలనే స్వార్థం. Purely my selfish... to feel the best.
ReplyDeleteReally not knowing much abt ur blog b4 made me miss the sensitive side of this cold fellow. ;-) Have u seen I added ur blog to my list?
గీతాచార్య, నిజమే తర్వాత నాకు అలాగే అనిపించింది. పైన వ్యాఖ్యల్లో కూడా ఇదే ఎత్తిచూపబడింది. సాయంత్రం 10 కుటుంబాలకి భోజనాలు, సుమారు 2:00 కి ఒక రెండు పంక్తులు వ్రాసిచ్చి అరగంటలో నాతో ఈ కవిత వ్రాయించాడు. బహుశా నాలో ఏదో నిస్సత్తువ కనపడిందో, కొంచం పరీక్షించాడో. వచన కవితగా భావం వచ్చింది కానీ క్లుపతత, కవితాధార కొంచం లోపించాయి కదా. మీ సద్విమర్శ తప్పక గుర్తు పెట్టుకుంటాను. ఊ, చూసానండి, మీవంటి వారు నన్నూ లెక్కలో వేస్తే నాకూ లెక్కించుకోగలిగినన్ని జ్ఞాపకాలు. నెనర్లు.
ReplyDelete