అవునసలు ఆకాశమే అందమైన అతివ ఎందుక్కాకూడదు?

అవునసలు ఆకాశమే అందమైన అతివ
ఎందుక్కాకూడదు?

తననిచూసి పుడమి తరుణి ఉడుక్కోవటం
ఎందుకవకూడదు?

పర్వాతాలు పైకి ఎదిగేది ఆ ఆకసాన్ని అందుకోవాలని
ఎందుక్కాకూడదు?

తరువులు పైకి సాగేది ఆ మగువ మీదికెగబ్రాకాలని
ఎందుకనుకోకూడదు?

వెన్నెలలు తన వయ్యారిమేని ఛాయలు,
చుక్కలు తన జడపూలు
ఎందుక్కాకూడదు?


తన సంపదలెంచగా నా తరమా!
ఆ వనరులెంచగా నీ తరమా!

ఎంతనేతలల్లినా ఆకసానికున్నావన్నెలన్నీ
తేగలరా ఎవరన్నా?

వనకన్నె చిన్నబోదా
వన్నెవన్నెల మబ్బుకోకలుచూసి?

రంగురంగు రెక్కల పూలు కినుకపోవా
తన రంగులు చూసి?

ఎన్నిదిక్కులెదికినా ఆపతరమా
ఆశ్చర్యానుభూతిని ఎవరికైనా?


తన స్పందన వర్ణించగ తగునా
నా పదకవితా పటిమ!

తళుకు తారల హారాలు ఓ మారు,
నిశీధి ఛాయలు పలుమార్లు,

నిర్మల వదనాలు వేయిమార్లు,
వడగళ్ళవిసుర్ల వురుములోమారు,

అలవోకనవ్వుల అపురూపమేఘజలతారు అతిశయాలు
లెక్కలేనన్నిమార్లు,

అవేవీ కనరాని నిండునిశ్చల రూపు
వేవేలమార్లు.


తన సౌందర్యం రూపుదిద్దగ చాలునా
ఏ మేటిచిత్రకారుడైనా?

ఏచోట మొదలిడి ఏ రంగు కలిపి
ఏ కుంచెవాడి తనని చూపగలడు?

సరిగంచు చుక్కల బుటాపట్టు చీరలు,
చందమామ సింధురాలు,

క్రిందున్నవారి రాయబారాలు
మోసుకెళ్ళేటి పక్షిగుంపు బారులు,

మెరుపు కలల జవాబులు,
వలపు తాలూకు ఎర్రెర్రని తనువు అందాలు.


ఇపుడు మళ్ళీ అడుగుతున్నాను
అసలు ఆకాశమే అందమైన అతివ ఎందుక్కాకూడదు?

6 comments:

  1. వెన్నెల్ల మేనిచాయలూ, చుక్కల్ల పూలజడలూ,
    మేఘాల నవ్వుల ఆకాశపు అ౦దాన్ని
    అలుపులేని కవుల౦దరూ ఆకాశ౦ కన్నా ఎత్తులో
    కవితలు రాసి మరీ వారి ఊహలరాణిని చేస్తూ ఉ౦టే,
    ఇలా కవియిత్రులూ పడ్డారే పాప౦ అ౦దాల ఆకాశ౦ మీద!

    అతివ అని మీరే అన్నారుగా! మీ పదకవితా పటిమను తన సొగసుచ౦దానికి బహుమతిగా స్వీకరి౦చే కొ౦డ౦త మనసున్న పడతి ఆ వినీలాకాశ౦లె౦డి. ఆమెకిది అలవాటే!తప్పకు౦డా మీ పటిమకు తలవ౦చి మురిసి మీరెవరో తెలుసుకు౦టు౦దిలె౦డి. లేకపోతే నేనున్నాగా సిఫారసు చేయడానికి. నమ్మరా, కావాల౦టే చూడ౦డి, మీకేసే చూసి ఎలా చిరునవ్వులొలికిస్తో౦దో!!!

    ReplyDelete
  2. ఆన౦ద్,

    నిజమే పైకి చూస్తే తను నాకేసే నవ్వుతుంది - సన్నజాజి పూవులా. మీ వ్యాఖ్యతో మరో కవిత వ్రాసేంత స్ఫూర్తినిచ్చినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. ఉషాజి!
    మీ బ్లాగును తెలుగు కవులం మరువం.
    సాహిత్య స్నేహాభిలాషి..
    ఈగ హనుమాన్

    ReplyDelete
  4. స్వాగత నమఃసుమాంజలులు హనీ గారు. వాడినా వాసన వీడని మరువాన్ని మరవ మానవ తరమా! చాలా సంతోషమండీ! "మీ బ్లాగును తెలుగు కవులం మరువం" అన్న మీ ప్రశంస నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. మళ్ళీ మళ్ళీ మీరిటువైపు సాహిత్యమైత్రీ విహారాలు గరపాలని ఆకాంక్షిస్తూ, మీ "నానోలు" ప్రయోగాన్ని ఆశ్చర్యానందాలతో నా లోకంలోకి ఆహ్వానించుకుంటూ, నేనూ మీ క్రొగొత్త ప్రక్రియను మరువనని సవినయంగా తెలుపుకుంటూ.. మరువం ఉష.

    ReplyDelete
  5. "తన సౌందర్యం రూపుదిద్దగ చాలునా ఏ మేటిచిత్రకారుడైనా?"
    *** *** ***

    కదా! ఆ సౌందర్యాన్ని రూపుదిద్దిన మొనగాడెవరు మరి...!!! :-)

    సూరంపూడి గారు బాగా చెప్పారు.

    Just seen it in Priya's Top ten written so long ago. But a good compilation. Ur post says it.

    ReplyDelete
  6. గీతాచార్య, చుక్కలతో తళుకులీతున్న రేయిలో అలా దీర్ఘంగా ఆకాశాంలోకి చూస్తుంటే ఎపుడో హటాత్తుగా జాలువారే ఉల్క మాదిరిగా మీ వ్యాఖ్యలు అబ్బురపరుస్తున్నాయి. మొత్తానికి సృష్టికర్తని మొనగాడిని చేసేసారు నేను మాత్రం అపురూప చిత్రకారుడు అమేయమైన ప్రతిభగల మోహనమూర్తి అనుకుంటున్నాను. ఎన్నెన్నో అందాలు ఎంత వ్రాసినా తనివి తీరని తపనలు ప్రకృతి వైనాలు. నెనర్లు.

    ReplyDelete