ఈ శీర్షిక మీరే పెట్టాలి

ఏయ్ ఓ మనిషీ! ఇక నీవు నా మనసువి. నీతో నిత్యం వూసులాడతాను.
నన్నొదిలివెళ్ళిన వాళ్ళవీ, నను చూడటానికి రాని వాళ్ళవీ పేర్లు వ్రాసిపెట్టా
వాళ్ళంతా వున్నా లేకున్నా నేనీతోనే వుంటానంటివిగా
మరి నీ జాడ తెలియెక కుములుతున్నా
వేళ మీరిపోతోంది ఇక గూడు చేరవా?
బహుదూరం పోయావు, బడలిగ్గా లేదా?

"ఎక్కడికి వెళ్ళానని ఒక్కసారైనా ఆరా తీసావా? వెళ్ళిన మనిషి తిరిగి రాడానివూరుకున్నావా? ఏటిదాపుల్లో నా జాడకై ఎపుడైనా వెదికివచ్చావా?" అని కదా అంటున్నావ్? వినేసాలే

"ఎక్కడికి వెళ్ళానని ఆరాతీయమని అడగను
నేనటు ఇటు తిరిగి నీ వైపే తిరిగొస్తాను
నేనలిసిపోతాననన్న తలపుల్లో నీ వలిసిపోయుంటావు
ఇద్దరం కలిసి వెళ్దాము మన ఏటివొడ్డుకి దప్పితీర్చుకోను." అని చెప్పావు మరిచావా?

నీకు మరపెక్కువని పరి పరి సార్లు పరాచికాలాడతావని ఇదిగో ముందే చెపుతున్నా, పుట్టే ముందే నా మరపు పదిమందికి పంచిచ్చి, వాళ్ళందరి మైమరపు నేనొక్కతినే వెంటతెచ్చుకున్నా. నేనేదీ మరవను, నువ్వు మరిచానంటే మన్నించను, ఈ మాట మాత్రం మరవకు.

అలిసిన గుండె ఆగిపోతుందేమోనని అణువణువు శతకోటివేణువులై వూపిరినాపుతున్నాయి నా కంటి చివరిచూపు నీ మీదనే నిలపాలని. నా గుప్పిట్లో బీజం నుండి విడివడుతున్న చిరు మొలకవోలె తోచే నీవె వటవృక్షమై నన్ను చుట్టేస్తున్నావెందుకిలా? నా కంటి చెమరింపు నను మోసగించదు.


వేచిన ప్రాణికి ప్రాణం నీ రాకే.
వేదం నీవిచ్చే అనుభూతే.
వేకువలో, వెన్నెల్లో, వీడ్కొల్లో
వేయి భావనలకి మూలాధారమీవు

వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు. ప్రకృతి తన పురుషునిలో ప్రేమికుని వెదుకుతున్నట్లు, అందుకు తనకొక రూపు కావాల్సి నా దేహమరువడిగినట్లు, ఏడనో దాగి వేదిస్తున్న తన మగని వునికి నీ దాపుల్లో కనుగొన్నట్లు, నన్ను నిలువున క్రమ్ముకున్న దాహమో, విడలేని మోహమో విన్నవిస్తానన్నదీ ఈ క్షణం. ఎంతకాలమింక నన్ను వేధించుకు తింటావ్? నిజమొకటి చెప్పనా - కాలంమీద చాలా కోపంగా వుంది. అది కదలను, కరగను పొమ్మంటుంది. పాడు నా మనసు నీ మాట వింటానంటుందేంటీ? ఎక్కడెక్కడో తిరగను ఇక్కడే నీతో వుంటానంటుంది. సరే మరి, అది నీ దగ్గర వదిలి నేమళ్ళీ పయనమౌతున్నా.

ఆకాశంలో నా వలెనే ఒక ఒంటరి తార ఇంత వానలోనూ, బహుశా నే బిక్కు బిక్కు మనటం తాచూసిందేమో. తోటి చుక్కలకేం చెప్పి వచ్చిందో, వెన్నెల్లో తడిసే ఒంటిని వానధారలకి అప్పచెప్పి, నా వంక మినుకు మినుకున చూస్తూ నాకు తోడువున్నానంటుంది. నీకన్న అదే నయం, గగనాలనుండి స్నేహహస్తం అందిస్తోంది.నా కినుక నీ పైనా? నిను చేరలేని నా పైనా? తెలవారనీయని ఈ నిశిపైనా? నా ఇష్టానికి నను పోనీయని కట్టుబడి మీదనా? మన జీవితాలకి వారధి కట్టలేని విధి పైనా?
రాలేనని ఇప్పటికైనా కబురంపావ్. నీ నెలవుకి నే రాగలనని ఎలా అనుకున్నావ్? అయినా, వస్తున్నానక్కడకి. దారిలో మనం వెళ్ళే కొలనుకి వెళ్ళాను. నీళ్ళే లేవు, బహుశా నా కంటి నీరు తానే ఇచ్చింది కాబోలు. ఇక ఝామైనా మిగిలుందో లేదో? బ్రహ్మ ఘడియలు కూతవేటున వున్నాయి, కూడలికొచ్చి బండి కొరకు చూస్తున్నా. బెంగగావుంది మన వూరు వదలాలంటే, నీతావుకి రాకుండా వుండలేననీ వుంది. ఏమిటో నా మనసు పిచ్చిదైపోతుంది. నేవచ్చేసరికి వేచివుండేం, ఒంటరిగ ఇక నేను మనలేను. తిరిగి నేను తప్పిపోతే, ఆ తప్పునాది కాదంటే నీవొప్పుచెప్పలేవింక, నేనప్పచెప్పలేనింక నన్ను నేను.

గమనించనేలేదు వాన వెలిసిపోయింది, నాలోని కలత చెదిపోయినట్లే. ఈ నిశ్శబ్దంలో చిరు సవ్వడి నా గుండెది మాత్రమే. జేగంటలా ఏదో మంగళాలు వినిపిస్తుంది. స్నేహమంత్రాలు జపియిస్తుంది.

అలుపుగా వుంది, ఇక ఆగిపోవాలనీవుంది. తోడుకావాలనీ, అదీ తొందరగా దొరకాలనీ వుంది. ఒంటరి పయనం నీ ముంగిట నిలిపి, నీతో కలిసి మరొకపరి నే చూసొచ్చినవన్నీ చూడాలనివుంది.

నువ్వెందుకు నాకు లొంగవని మునుపనుకున్న నేను, నా మీద నీకు సర్వాధికారాలు ఇచ్చేసే ద్రోహమెందుకు చేస్తున్నాను, అసలెందుకు నన్నిలా ఏమారుస్తున్నాను? ఓ అడుగు నా వైపు వేసి, నేనడిచొచ్చిన పది అడుగులు నీ వైపు కలిపేస్తున్నావు. అందుకే పరిగెడుతూనేవున్నా తిరిగి కొలిస్తే ముందుకన్నా వెనుకబడిపోతున్నా. నిన్ను దాటి వెళ్ళలేక నిస్సహాయనౌతున్నా. నిను స్మరిస్తూనే తిరిగి స్పృహలోకివచ్చేస్తున్నా.

రామబాణం తగిలిన గువ్వ "ఇంకే బోయవాడు నన్ను వేటాడినా నీ శరణంకోరుండనా? నువ్వె విలుకాడివైతివే, నేనెవరిని పిలవను, రామా?" అని అడిగిందట. నాకూ గువ్వకీ తేడాలేదు, నీవెటువంటివాడివన్నది తెలిసిరావటంలేదు. అడిగినా చెప్పవు, అడగలేదేమనీ అనుకోవు. నీవు మరణదండన వేస్తే తృప్తిగా పోతాను, మారు ప్రశ్నలేమీ అడగనని ముందే మాటిస్తున్నాను.

ఎపుడూ అడుగుతుంటాను ఆలోకపువాడిని "వేర్వేరు రూపుల్లో వేలవేల పేరుల్లో తిరుగుతుంటావు కదా, తోడుగా ఎవరో ఒకర్ని వెంటేసుకు తిరుగుతావుగా, ఒకరు చాలరంటే, ఇద్దరు, లేదంటే పదారు వేల భామినులనీ కలేసుకుపోతావుగా, మరి నన్నొక్కత్తీనీ చేసి వదిలేసావేం" అని. నీ ఒడి చేరిపోతే ఇక వాడినెపుడూ ఆ ప్రశ్న అడగను.
ఎవరో అడిగారు నీ వెపుడు నా కడకు చేరావని, ఇంకా చేరలేదని చెప్పలేదు. అందుకే,


నాకు మాత్రం నీవు లేని నా గతమొంక
చూడటం దండుగే అనిపిస్తుంది,
శిలువేసిన శిధిలజీవి అగుపిస్తుంది.
పెచ్చులూడుతున్న గోడ గురుతుకొస్తుంది,
నేడు కూలనున్న మేడ అగుపిస్తుంది.
చింత నిన్న నుండి తిరిగొచ్చినా నను వదలదు.
పైపెచ్చు చితి నుండి లేచే పొగలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది .


నిదుర కూడా రాత్రంతా దాగుడుమూతలాడి,
నే దిగులుగా కూలపడ్డాక,
తనవారిని తిరిగి లేపుకోను ఖుషీగా పోతుంది.
పగలు కూడ పట్టలేవని ఈలవేసి చెప్తుంది.
దినమూ ఇదే నా వేతనం లేని వెర్రి చాకిరి.
బ్రతుకు కినుక నా పైనా? ఇక చాలించని తన పైనా?

నేనింకా నీ రాక కోసం వేచివున్నానని, నీవొచ్చే దారులు వెదుకుతున్నానని చెప్పాగా నీకు, ఇపుడూ


నేను వెదుక్కుంటున్నా ...
వెదుకులాటలోనే వున్నానని వుసూరుమంటూనేవున్నా
ఎందుకంటే ఎపుడూ వెదుక్కుంటునేవున్నా,
వెదికినవేవి నాకు దొరకవని గురుతుకీ రాదు మరి
వెదకాల్సినవింకేవీ లేవని ఆపేసిన క్షణం
మిగిలిన నన్ను నేను మళ్ళీ వెదుక్కోవాలని అనిపిస్తుంది,
నేను కనుక నాకు మళ్ళీ దొరికితే
ఈ సారి మాత్రం వెదకటాన్ని ఇంకెవరికైనా వీలునామా వ్రాసేయాలని.
వెతుక్కోవాల్సినవి మాత్రం వారు ఎంచుకోవాలని
నే వెతికినవేవీ ఈ లోకంలో ఇంకెక్కడా వుండవని
నా కెపుడోనే తెల్సిందని చెప్పటానికి మాత్రం మాటలు వెదుక్కుంటున్నా
ఆవి వినే మనిషి కొరకు మాత్రమే ఇపుడు వెదుక్కుంటున్నా

మరి చెస్తావా ఆ మాట నాకు, నే వెదుక్కున్నది నిన్నేనని?


నా మనసు వూటబావిని
పూడ్చి పెడదామని తలపెడితే
బావురుమంది, జల మీద జలగా
వేయిజల్లుల వరదగా ఉప్పొంగిపోయింది
బహుశా వేసవి దాటి వర్షాన్నీ దాటేసి
శరదృతువు లోగిలికి పారిపోయొచ్చినట్లుంది.
నివు నను చేరు సరికి నిను నా లోగిల్లో
సరిగంగ లాడించటానికి, నా తనువొక్కటి చాలదా,
నువు సేద తీరడానికి నా మనసు మందిరమీయనా?


భ్రమకి, భ్రాంతికి, తలపుకి వారధి ప్రేమ
వూహకి, వూపిరికి, వలపుకి, సారధీ ప్రేమే
వారధి కూలాక నదిలో పయనం
సారధి వీడాక బరిలో సమరం
సాగేనా చివరివరకు?
నీవు వేచావని నిలవదు నీ నేస్తం
నువు తలిచావనీ ఆగదు క్షణం
గరళాలు గుమ్మరించిన నిజం,
కాలం గేలిచేసిన గతం, తెలుపునా
కాలాన్ని గెలిచే వైనం?

నువ్వన్ని చెప్పకున్నా నీ నేస్తం ...


హొయలు ఒక పరి, వగలు తదుపరి
అన్నీ కలిసి కలల కావేరి
దిగుళ్ళ ద్రిగ్గుళ్ళే దీన దేవేరి
నిస్పృహలో స్పృహ తప్పిన నిండు గోదారి
చుక్కాని జారిన నట్టేటి నావంటి వయ్యారి
రేయి గుబుళ్ళలో తనువు త్రుళ్ళింతలో తుంటరి
తమకమద్దే వేకువల్లో తల్లడిల్లే ఒంటరి

వెరసి నీ

పిచ్చిది - తిరిగి తప్పిపోతే, నీకు తన వంటి గురుతులు చెపుదామని
ప్రేయసి - తను నీ తనువుపై కరిగి, నీ ప్రతిమగా తిరిగి రూపు దిద్దుకుందామని
ముద్ద బంతి - తన మెత్తదనం రేకుపై నువ్వద్దిన ముద్దుతో నీకు తెలుపుదామని
ముద్దరాలు - ముకుళించిన చేతుల్లో తన స్వామి రూపు ముద్రించుకుందామని
హృదయరాశి - తన ఎదలో నిను బందీ చేసి తనను విడుదల చేయను తాళం నీకే ఇద్దామని
నీ వెంటే వున్నది తథ్యం !!

నువు చెప్పినవిక చాలని
నేనెంతకని చెప్పను?
నీ ప్రక్కనుంటే చాలని
నిన్నెకడని వెతకను?
కంటి చెమ్మే కవితమొలకలపై,
నువు చిలరించేటి నీటిచిలుకు.


గుండె, గొంతు ఆర్తి పోతే మిగలవింక నీకు,
నే నీకు బందీగ వస్తానంటే నువు విడుదలకు సిద్దమౌతావేం?
నీ లోకం చాపిన చేతులు, తాకేను నా లోకపు తలుపులు,
కలిసిన మనసుల భావావేశం రేపటి కలలకి స్వాగత గీతం!
కరుణ, కవిత కలిసిన కాటుకతిలకం,
సమత, మమత విరిసిన వెన్నెల పుష్పం.
గుండె గనుల్లో బొగ్గంటి బాధల్ని
ముగ్గు రాళ్ళుచేసి దంచుదామంటే
రవ్వ పొడుల్లా కవిత వెలుగులు రువ్వుతున్నాయి