మావో మనియాద పడకే!

అయ్యో, ఇట్టనిద్రపోయానేంటి? అమ్మో బారెడు పొద్దెక్కిందే? నడాలి నడాలి మేకపిల్లల్లారా, పాక దాపుల్లో లేదు. నిన్ననంగా వచ్చాము, పాడు సూపు, చంద్రున్ని సూసి నిలుచున్నకడనే నిదరోబెట్టింది. తియ్యంగ కలలుగంట ఈడనే తొంగున్నా, పాడుకుంటా తొంగున్నా, ఏదబ్బ నే పాడిన పాట, ఆ గురుతుకొచ్చేసింది

గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు
ఆకసాన అదో అందం
రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా
హత్తుకున్న తీపి తలపులు ఎద వీడి వెళ్ళమన్నట్లు
పరవశాన మదిదీచందం

మావెంత
గుబులెత్తినాడో? గుండేపగిలేలా అరిసినాడో? అసలేమైనాడో, నా కోసమని మంచేమీనే తొంగునేవున్నాడేమో పిచ్చి నా మగడు. వేగిరం పోయి ఆడాకలి తీర్చాలి. పదవే తల్లీ నా మచ్చల మేక, నన్నొగ్గీసినావంటే మెకమో నిన్నేసుకపోతది.

ఇదేంటి దారికాచావ్ దొరా? బాబ్బాబు, పాలు కాసుకోవాల? మురిపాలు కూర్సుకోవాలా? మావ కడకు పరుగులెట్టాలా? సాల్లే నాకేటి పొద్దున్నే నీతోటి సరసం? మరి నే పోయొస్తా, కూసింత తప్పుకో. మాపటికి మళ్ళీ తీరిగ్గా వస్తేవస్తా [నా మావ నన్నింటికంపిస్తే], వూసులాడుకుందాం. ఇప్పటికి ఇదిగో నాకో సాయంసేత్తావా, మా మల్లి నడిగి గుప్పెడు బంతిపూలట్టుకొచ్చి ఇచ్చిపో సామే ;) మరదే అన్నీ ఆరాతీకూడదు, మొగుడూ పెల్లాల మధ్య మరి లచ్చుంటాయ్, అన్నీ ఎట్టాగేటి ఇప్పిసెప్పేది? సూసినడేం, మూల్లోనే మరం మొక్కేసా, మావకిష్టమని, తొక్కీసినావనుకో, మావ మనియాద పడతడు, నా మీద సెయ్యేయనంటడు. పాపం నీకెందుకని ఇద్గో ముందే చెప్పుంచుతున్నా మరి...



చదువరులకో గమనిక: వ్రాతల్లో మాండలికాన్నీ వెదక్కండేం. ఏదో పిల్లగాలికి తొణికిన చిలిపి వూహ మాత్రమే.

4 comments:

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. దార్ల గారు! మీకు కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా మరువపు వనానికి మీరు మళ్ళీ మళ్ళీ రావాలని మనవిచేసుకుంటున్నాను. క్రొత్త సంవత్సరం ఇలా క్రొత్త క్రొత్త మిత్రుల్ని పిలుచుకొచ్చి మరీ స్వాగతం పలికించుకోవటం నాకు బోలెడు సంబరంగా వుందండి :)

    ReplyDelete
  3. పాటని కూడా పూర్తిగా అదే మాండలికంలో వ్రాయవలసింది... ఇంకా అందవొఁచ్చేది! :)

    ReplyDelete
  4. ముందే చెప్పానుగాండీ, అంతగా ప్రవేశంలేని మాడలీకమిదని. కానీ ప్రయత్నించివుంటే కాస్త వచ్చేదేమో?

    ReplyDelete