గాలి! చిరుగాలి నిను ఒకపరి చూడాలి.
ఈల వేస్తానని గోల చేస్తానని అంటావా?
అలాగే కానీ, ఆకతాయివని సరిపెట్టుకుంటా.
గాలి! వెచ్చని నిను ఒకమారు తాకాలి.
సుడిగాలినై చుట్టేస్తాను, గింగరాలు తిప్పేస్తానంటావా?
అలాగే కానీ, అచ్చెరువున మునిగిపోతా.
గాలి! పూల తోటకి నిన్నోసారి తోడ్కొనిపోవాలి.
పరిమళాలు దోచేస్తానంటావా, నాకు దూరంగా పారిపోతానంటావా?
అలాగే కానీ, సువాసనల జతపట్టి నీ చిరునామా పట్టేస్తా.
గాలి! కొలను ఒడ్డుకి నీకోసం రావాలి.
అలవోక అలల్లో, కలువ కులుకుల్లో దాగిపోతానంటావా?
అలాగే కానీ, ఆదమరిచి అక్కడే నిలిచిపోతా.
గాలి! హంసలదీవికి నీదరికి చేరాలి.
ఆకసానికి నిచ్చెనేసి, ప్రభంజనమై ఎగిసిపోతానంటావా?
అలాగే కానీ, తూరీగరెక్కనెక్కి నేనూ వచ్చేస్తా.
గాలి! వేణువూది నిను రాగాల అలంకరించాలి.
పాటవై, ప్రకృతి అందెల రవళైపోతానంటావా?
అలాగే కానీ, పరవశించిపోతా, ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా.
ఈ మధ్య రాసినవాటిలో ఇదే కొంచెం సులభంగా ఉంది. ( మిగిలిన వాటిని తక్కువ చెయ్యడం కాదు సుమా... )
ReplyDeleteఇక నా తుంటరి కొనసాగింపు ---
"గాలి, బుడగలోన దాగున్న గాలి నువ్వొకపరి నా బుగ్గపై ముద్దు పెట్టాలి
ముద్దు పెట్టి అంతలోనే బుడగను ఖాళీ చేసి స్వతంత్రమవుతానంటావా?
అలాగే కానీ, నీ ముద్దులో మునిగిపోయి మరో బుడగలో నిన్ను బందీ చేస్తా... "
----
ఈ తుంటరి కొనసాగింపు వ్యాఖ్యను తొలగించే హక్కులు మీవే....
ఆ బుడగలో గాలిని తీసే హక్కు ఎవరిది ?
మీరు,పరిమళంగారు, ఆత్రేయగారు అర్జునుడి బాణాల్లా(ప్రదీప్ గారి బ్లాగు పేరు కాదండోయ్)వేగంగా,అలవోకగా కవితా పుష్పబాణాలు సంధిస్తుంటే మేము కౌరవసేన మాదిరి అచ్చెరువై స్థాణువులమై నిలబడాల్సివస్తోంది. మీఅందరి కవితాశక్తికి హృదయపూర్వక అభినందనలు
ReplyDeleteఅదర గొట్టారు,చాలా బాగుంది
ReplyDeleteప్రదీప్, ఏమిటోనండి ఈ మాట తరుచుగా వినపడుతుంది. శైలిలోనా, శిల్పంలోనా, భాషలోనా ఆ సంక్లిష్టతో, అస్పష్టతో తావుచేసుంది అన్నది తెలియటం లేదు.
ReplyDeleteనిజానికి మీ తుంటరి పొడిగింపుతో ఈకవితకి సంపూర్ణత వచ్చింది, కాగల కార్యం గంధర్వులు తీర్చటమన్న రీతిలో మీ తీరు వరస కలిపి నా పని సులభం చేసారు. ఆపై విజయమోహన్ గారి వ్యాఖ్యకొక చిలిపినవ్వు కలిపేసారు. మీరు మీరే.
"ఆ బుడగలో గాలిని తీసే హక్కు ఎవరిది?" శ్లేష దాగినట్లుందేం ;) చూద్దాం ఆ పుణ్యం ఎవరు కట్టుకుని నాకు భాగ్యం కలుగచేస్తారో,హ హ హ్హా..
విజయమోహన్ గారు, అయ్యయ్యో ఎంత మాట, అందుదాగి మరింత సంభ్రమం కలిగించే అభినందన. నిజమేనండి మా బాణాలు తగలవు,తగిలినా సుతి మెత్తన, కవన కదన రంగం ఒకరి గెలుపు కోరదు మరొకరి నదుపు చేయాలనీ అనుకోదు. మీరంతా తోడ్పడితే ఈ రచనాపరంపర ముందుకు సాగుతుంది.
నేస్తం, మరేం ఇదేదో యుద్దం మాదిరిగానే వున్నాయండి మీ వ్యాఖ్యలూను.
అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
నా ఉద్దేశ్యంలో ఈ మధ్య మీరు రాసే వాటిలో భావాలు అర్ధం చేసుకోవదం కొంచెం కష్టమవుతోంది నాకు. మిగతా వారి సంగతి నాకు తెలియదు.
ReplyDelete---
"ఈ తుంటరి కొనసాగింపు వ్యాఖ్యను తొలగించే హక్కులు మీవే....
ఆ బుడగలో గాలిని తీసే హక్కు ఎవరిది ?"
మీకు నేను చెప్పాలా ఆ శ్లేషకర్ధమేమిటో. మొదటి వ్యాక్యంలోనే ఉంది దాని అర్ధం
ప్రయత్నించండి చూద్దాం
ఉష గారూ ! నిజానికి మీ భావోద్వేగాన్నీ , భాషాపరిజ్ఞానాన్ని అందుకోవటం నాకు కష్టతరమయ్యే చాలా సార్లు కామెంట్ రాయడానికి ధైర్యం చేయలేక పోయాను .అటువంటిది మీరు మనం ఒకేగూటి పక్షులం అనటం మీ నిరాడంబరతే కానీ మీతోనూ ,ఆత్రేయగారి వంటి వారి పక్కన నాపేరు సరికాదు .విజయ మోహన్ గారి అభిమానమే కాని ఆయన ఏ వస్తువునైనా కళారూపాలుగా తీర్చిదిద్దగల కళాకారులు .
ReplyDeleteసువాసనల జతపట్టి నీ చిరునామా పట్టేస్తా.
ReplyDeleteమంచి ఊహ
కవిత ఒక మాదిరిగా ఉంది. ఈ వాక్యం అద్భుతం - "ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా."
ReplyDeleteనా మనసులోని మాటకు భాషను వెదుకుతు౦డగా, ముళ్ళపూడి రమణగారి పద్ధతిలో కొత్తపాళీగారి వ్యాఖ్య కనిపి౦చి౦ది. నేనూ వారితో ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteకవిత ఒక మాదిరిగా ఉంది. నాకు నచ్చినది మాత్ర౦
ఆకసానికి నిచ్చెనేసి, ప్రభంజనమై ఎగిసిపోతానంటావా?
అలాగే కానీ, తూరీగరెక్కనెక్కి నేనూ వచ్చేస్తా.
ప్రదీప్, అర్థం కానివి నన్నడగండి లేదా ప్రయత్నించండి ;) ఇక మీ ప్రశ్న మరీను, ప్రయత్నించటం ఎందుకు, అంత స్పష్టంగా తెలుస్తుంటేను.
ReplyDeleteపరిమళం గారు, నా పట్ల మీ అభిప్రాయానికి సంతోషం. మీరు too modest విజయమోహన్ గారి కళాఖండాలు నాకూ చాలా అబ్బురం కలిగిస్తాయి.
బాబా గారు, బహుకాల దర్శనం. మరెంతో ముదావహం.
కొత్తపాళీ గారు, ఇది స్వచ్చంగా మీమార్కు వ్యాఖ్య. చానాళ్ళైంది కదా, ఓ చూపు వేస్తారని అనుకున్నా, అలాగే వచ్చారు. సంతోషమండి.
ఇక ఆనంద్, మీ పని సులువైపోయింది. copy and paste;) jk
మీ అందరూ తలో ముక్క పంచుకుని ఆస్వాదించినట్లే నాకు నచ్చిన పంక్తిది "సుడిగాలినై చుట్టేస్తాను, గింగరాలు తిప్పేస్తానంటావా?
అలాగే కానీ, అచ్చెరువున మునిగిపోతా."
ఇది మా IL లో బాగా అనుభవమైన గాలి తత్వం. :)
అందరికీ ధన్యవాదాలు.
ఉష గారూ..
ReplyDeleteచాలా బావుదండీ..
మీరు రాసేవి కాస్త కష్టపడి అర్ధం చేసుకోవాలి అనేది మీ కవితలకి ఎంత మాత్రమూ వంక కాదండీ..!
మీ ఊహలు, భావాలు అంత ఆలోచింపజేస్తాయి. అలా అలా మేం కూడా మీ ఊహల రెక్కలని ఆసరాగా చేసుకుని ఎగిరి ఎగిరి కాసేపు ప్రయాణించాక గానీ.. మీ కవితల్లోని మకరందం రుచి తెలీదన్న మాట.!
అదే మా అందరి ఉద్దేశ్యం కూడానూ..!
మీరు మాత్రం మా ఆలోచనా శక్తికి పదును పెట్టే మీ శైలిని మార్చకండి మరి..!
మధురవాణి, మీ వ్యాఖ్యతో ఈ టపాకి నిండుదనం వచ్చింది. మొన్ననే కాస్త తీరిక చిక్కి (అలా అనేకన్నా "తీరిక చేసుకుని" అంటే సబబు) అలా అలా ఇతరుల బ్లాగులు, నా పాత టపాలు మళ్ళీ చదువుకుని మిమ్మల్ని బాగా miss అయ్యాను అనిపించింది. అందులో ఈ టపాలో పాత మిత్రులు కొందరు తొంగి చూసేసరికి మీరు రాని లోటు మరీ అనిపించింది. చాల ఆనందంగావుంది మీరు వచ్చి ఉదయాన్నే అంత చక్కని వ్యాఖ్యతో నన్ను పూర్తి స్పృహలోకి తెచ్చేసారు. ప్రక్కనే కిటికిలోనుండి చూస్తే నా మిత్రురాలు "చినుకు చినుకు అందెలతో, చిట పట చిరు జల్లులతో ... వాన జాణ" ఆడుతోంది అచ్చంగా నా మదివోలే. తప్పకుండా మీఅందరకి నాపైన వున్న సదభిప్రాయాన్ని నిలిపే విధంగానే నా కవితలు వుంటానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి emotion తీవ్రంగా వుంటుంది, స్పష్టత వుండదు, కొన్నిసార్లు వున్న మాటలు చాలవు మరి కొన్నిసార్లు అనుభవాలు వూహల్లోకి దాడి చేసేస్తాయి, ఇలా కలగలుపుగా సాగే వూహల/భావాల పయనమే ఈ మరువపు చివురులకి ఆధారం.
ReplyDeleteమరోమరు అందరికి శతకోటి ధన్యవాదాలు!