ఎగురలేని గాలిపటాలు

అప్పట్లో
ఏదో పండుగ కాలం లో,
కనీసం ఎండాకాలం సెలవుల్లో
ఎవరో ఎగురవేస్తారు
రంగురంగుల గాలిపటాలు
ఎగిరే మబ్బుల్లా ఉంటాయి అవి!

అంతకు మించిన ఎత్తుకి ఎగరాలని
ఉవ్విళ్ళూరే ప్రాయం పరుగు పెట్టించేది
పసి హృదయం కూడా పటమైయేది కనుక...

బడికి వెళ్లి వచ్చేదారిలో
తుమ్మకంపల్లో,
చిటారు కొమ్మల్లో
గాలివానకు ఒరిగిన పిట్టల్లా
చిరుగు పట్టిన చీరల్లా
అవే గాలిపటాలు

వంతులు వేసుకుని
వెదుక్కుని, పైకెక్కి, పట్టుకుని
దారాలు, పుల్లలు తెంపుతూ
తెగిన పటాల తాలూకు కాగితపు ముక్కలు
ప్రశంసాపత్రాలుగా, బహుమతులుగా
ఇంటికి తేవటమే అసలు వేడుక!

చేతికి అందిన మబ్బుకొరకే పటాలు
తెగిపడాలనే అమాయకపు ఆశలు

ఇప్పుడూ
ఒకప్పుడు ఎగురవేసిన ఉల్లాసాలు
కాలపు కండె తెగితే పడిన పటాలుగా...
జ్ఞాపకాలకి చిక్కుకుని అనుభూతులు

మనసారా వెనక్కు జరిగి
వెదకకుండానే ఎదురయే
మమతని
పదిలంగా తాకివస్తే
కానుక అందిన భావన..
బాధ త్రుంచుకుని,
బెంగ పెంచుకుని
ఆశని పొదివి పట్టుకుంటే
పండుగ పూట సందడి వేళలు లోలోపల!

చిరిగినా, చెదిరినా
ఉనికి మారని కొన్ని క్షణాలు
ఇప్పుడిప్పుడే
ఎగురవేస్తున్నాను
రానున్న కాలాల్లో
చేతికి అందివస్తాయని...!

No comments:

Post a Comment